Saturday 2 November 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 22 వ భాగము

దత్తస్వరూపులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు 


నిజమైన గురువు యొక్క లక్షణాలు
నిజమైన గురువు యొక్క లక్షణాలు ఇవిగో. మీరు గనక ఈ లక్షణాలను ఏ వ్యక్తి లో చూసినా, ఆ వెంటనే అతడిని మీ గురువుగా అంగీకరించండి. సద్గురువు అనేవాడు బ్రహ్మనిష్ఠ మరియు బ్రహ్మశ్రోత్రియుడై ఉంటాడు. అతనికి ఆత్మ మరియు వేదాల గురించి పూర్తి జ్ఞానము ఉంటుంది. అతడు సాధకుల సందేహాలను నిర్మూలిస్తారు. అతనికి సమదృష్టి మరియు మనస్సంయమనం ఉంటుంది. అతడు రాగద్వేషాలు, హర్షశోకాలు, అహంకారము, కోపము, లౌల్యము, దురాశ, మోహము, పొగరు మొదలైన గుణాల నుంచి విముక్తుడై ఉంటాడు. అతడు దయాసముద్రుడు. అతని యొక్క సన్నిధిలోనే మనకు శాంతి లభిస్తుంది మరియు మనసు ఉన్నతమైన స్థాయికి వెళుతుంది. కేవలం ఆయన యొక్క సన్నిధిలో ఉండడం చేతనే సాధకుల యొక్క సకల సందేహాలు నివృత్తి అవుతాయి. అతడు ఎవరి నుంచి ఏమీ ఆశించడు. అతడు ఎంతో ఉన్నతమైన, గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అతడు ఎల్లప్పుడు బ్రహ్మానందంతో నిన్డి ఉంటాడు. అతడు నిజమైన సాధకుల కోసం వెతుకుతూ ఉంటాడు.

గురువు యొక్క పాదపద్మాలకు నమస్కారములు! నేను నిజమైన గురువు యందు పూర్తి విశ్వాసం ఉంచుతాను.గురువు పట్ల నాకు ఎంతో గొప్ప ఆదరము మరియు గౌరవము ఉన్నాయి. ఆయన యొక్క పాదపద్మాలను ఎల్లవేళలా సేవించడానికి నా హృదయం తపిస్తుంది. మనస్సు యొక్క దుష్పరిణామాలను తొలగించడంలో గురుసేవ కంటే మరేది శక్తివంతమైనది కాదని నేను నమ్ముతాను. ఈ సంసారమనే సాగరం నుంచి అమృతతత్త్వమనే అవతలి ఒడ్డుకి తీసుకువెళ్ళే సురక్షితమైన నౌక గురువు సన్నిధి అని నేను పూర్తిగా నమ్ముతాను.

గురుత్వము పేరుతో వ్యాపారం

కానీ నేను గురుత్వాన్ని వ్యాపారంగా చేయడాన్ని మెచ్చుకొను, నాకు నచ్చదు. ఎవరైతే మూర్ఖులు గురువులుగా ఆచార్యులుగా ప్రదర్శించుకుంటూ, శిష్యులను తయారు చేసుకుంటూ, ధనము పోగు చేస్తారో అటువంటి వారిని చూసి నేను ఎంతగానో అసహ్యించుకుంటాను, అవమానంగా తలుస్తాను. మీరు ఈ విషయంలో నాతో అంగీకరిస్తారు. ఇందులో రెండవ అభిప్రాయానికి తావులేదు. వారు సమాజానికి పట్టిన చీడ పురుగులు. గురుత్వం అనేది ఈనాడు వ్యాపారంగా మారిపోయింది. దీనిని భారతదేశపు భూమి నుంచి పూర్తిగా నిర్మూలించాలి. ఇది భారత ప్రజానీకానికి ఎంతో నష్టాన్ని మరియు హానిని కలిగిస్తోంది. పాశ్చాత్యులు మరియు ఇతర దేశస్థులు మనస్సులలో ఎంతో చెడు ముద్రను సృష్టిస్తోంది. ఈ గురుత్వమనే వ్యాపారం వలన భారత దేశము తన యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని కోల్పోతోంది. అతి త్వరగా భయంకరమైన ఈ వ్యాధిని త్రుంచి వేసి వేళ్ళతో సహా పెకిలించి వేయడానికి తీవ్రమైన చర్యలు చేపట్టాలి. దీని నిర్మూలించడంలో ఏ అవకాశాన్ని వదలకూడదు. అది ఈ ఈనాడు ఎంతో భయంకరమైన రూపాన్ని సంతరించుకుంది. అది ఎంతో త్వరగా అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. చాలా సులభంగా, మర్యాదగల జీవనాన్ని గడపడానికి ఎంతోమంది ఈ గురుత్వం అనే వ్యాపారాన్ని తీసుకున్నారు. కుహనా గురువుల వలన ఎంతో మంది అమాయకమైన స్త్రీలు మరియు పురుషులు దోచుకోబడ్డారు. ఎంత సిగ్గుచేటు!

ఎందరో గురువులు అంతటా తిరుగుతారు. ఎన్నో చోట్ల ఉపన్యాసాలు ఇచ్చి ప్రవచనాలు చెబుతారు. బ్రహ్మ సూత్రాలు మరియు గీత అర్ధం చేసుకున్నా, వారు జ్ఞానశూన్యులు మరియు ధ్యానం గురించి అవగాహన లేదు. వారు సులభంగా ఆగ్రహానికి గురి అవుతారు. వారి యొక్క అభిమాని ఎంతో మృదువైనది. వారిలో దివ్య గుణాలు మరియు సాధుత్వం లేదు. వారికి సేవా భావం లేదు. వారు సేవ, కీర్తనలు మొదలైన వాటి గురించి చెడుగా మాట్లాడుతారు. వారు జనుల చెయ్యి పట్టుకొని దగ్గరకు పిలుస్తారు. వారి వెనుక భాగంలో చేతులు వేసి, వారిని దీవిస్తారు. కానీ వారు కనీసం ఒక్కడిని కూడా మోక్షానికి పంపలేకపోతున్నారు.

ఒక వ్యక్తి కొన్ని సిద్ధులను ప్రదర్శిస్తే జనులు అతడిని గురువుగా తీసుకుంటారు. ఇది ఎంతో ఘోరమైన తప్పిదము. ఇది అంత సులభంగా నమ్మే విషయం కాదు. ఇటువంటివారు దొంగ యోగుల వలన సులభంగా మోసపోతారు. వారు బుద్ధిమరియు విచక్షణాధికారాన్ని ఉపయోగించాలి. వారు గురువులుగా భావించే వ్యక్తుల గురించి ఏదైనా ఒక నిర్ణయానికి ముందు, ఆ గురువుల మార్గము, అలవాట్లు, స్వభావము, నడవడిక, వృత్తి, ప్రకృతి మొదలైనవి, క్షుణ్ణంగా పరిశీలించి; గ్రంథముల పట్ల, శాస్త్రముల పట్ల అతని జ్ఞ్ఞాన్ని, పరీక్షించాలి.

అటువంటి మేకవన్నె పులిలు, ఎవరైతే మన దేశ ప్రజలను తప్పు ద్రోవ పట్టించి, దోచుకునే ప్రయత్నం చేస్తారో, వారిని ఆశ్రయించడం కంటే కృష్ణుడు, రాముడు శివుడు, లేదా నీ హృదయంలో ఉన్న భగవంతుడిని గురువుగా భావించి, ఆయన యొక్క మంత్రాన్ని మననం చేయడం ఉత్తమము.

ప్రసిద్ధమైన, మహత్తరమైన భారతదేసంలో శ్రీ శంకరులు, దత్తాత్రేయులు వంటి నిజమైన గురువులు అంతటా వ్యాపించి ఉండుగాక! కుహనా గురువులు మరియు వ్యాపారపరమైన గురుత్వం అనే భయంకరమైన శాపం నుంచి భారతమాత సంపూర్తిగా స్వేచ్ఛను పొందుగాక! సనాతన ధర్మం యొక్క విశ్వజనీయమైన సూత్రాలు ప్రపంచమంతా తేజరిల్లు గాక! వివిధ మత శాఖలు మరియు మత వర్గాలను మధ్య ఐకమత్యం ఏర్పరచడంలో ఆధ్యాత్మికవేత్తలు తమకు సాధ్యమైన అన్ని ప్రయత్నములు చేయుదురుగాక! వారు కొత్త శాఖలను ఏర్పాటు చేయకుండా ఉండుదురుగాక! వర్గపరమైన బేధములు మరియు గొడవలు ఎల్లప్పటికీ నశించిపోవు గాక! ఋషులు, ద్రష్టలు, యోగులు, భక్తులు మరియు సన్యాసులు త్యాగము, సన్యాసం మరియు ఆత్మసాక్షాత్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆధ్యాత్మిక దేశమైనా ఈ భూమి యొక్క గొప్ప కీర్తి ప్రతిష్టలను నిలబెట్టుదురుగాక! ప్రపంచమంతా ఐకమత్యం, శాంతి మరియు సామరస్యం వర్ధిల్లుగాక! గురువుల యొక్క ఆశీర్వచనాలు మనందరిపై ఉండుగాక! ఆధ్యాత్మిక పథంలో వారు మనల్ని మార్గదర్శనం చేయుదురుగాక!

ఏడవ అధ్యాయము సమాప్తము 

No comments:

Post a Comment