Saturday 17 June 2017

పార్వతీ మాత చాటిన మొక్క వైభవం - మత్స్యపురాణం నుంచి చిన్న కథ



దశపుత్రసమో ద్రుమః  

గణపతిని తన దేహపు మట్టి నుంచి ప్రాణం పోసి, ఆయన్ను గణాలకు అధిపతిని చేసిన తర్వాత, పార్వతీ మాత మరొక పుత్రుడు కావాలని సంకల్పించుకుంది. ఎంతో గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న పార్వతీ మాత, ఒక చిన్న ఆశోక చిన్న మొక్కను నాటి, దాన్ని సొంత బిడ్డవలే సుకుమారంగా పెంచసాగింది. (మానవులకు ఆదర్శంగా నిలవడం కోసం). ఆ సమయంలో ఒకానొక రోజు దేవగురువైన బృహస్పతి, ఇంద్రుడు మొదలైన ఇతర దేవీదేవతలతో పార్వతీ మాత వద్దకు వచ్చారు. దేవర్షులు అమ్మవారితో 'దేవి! దయ చేసి చెప్పండి. ఓ భవానీ, మీరు సమస్త సృష్టి యొక్క క్షేమం కోసం అవతరించారు. ప్రపంచంలో చాలామంది పుత్రులను, పౌత్రులను (మనవళ్ళను) పొందడానికి ఇష్టపడతారు. పుత్ర సంతానం లేని చాలామంది (పుత్రుల కోసం) తపస్సు చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మర్యాదను (కట్టుపాటును) లోకానికి చూపారు. కాబట్టి దేవీ, చెట్టును పుత్రుడిగా భావించడం వలన వ్యక్తికి కలిగే ఫలం ఏమిటి:' అప్పుడు ఆనందంతో నిండియున్న పార్వతీమాత మంగళకరమైన ఈ పదాలను పలికింది.

నీటి లభ్యత లేని చోట కూపము (బావి) తవ్వించిన సద్భుద్దిమంతుడు, ఆ పుణ్యఫలం కారణంగా ఆ బావిలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో, అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. అలాగే వాపి (కొలను) తవ్వించడం 10 బావులు తవ్వించినదానికి సమానమైన పుణ్యం వస్తుంది. అదే చెరువు/ తటాకం తవ్వించడం వలన 10 కొలనులు తవ్వించిన పుణ్యానికి సమానమైన పుణ్యం వస్తుంది. ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటించేవాడు, పితృదేవతలకు వారి మరణానతరం తర్పణాదులు వదిలేవాడు, దేశానికి, ప్రపంచానికి, సమస్త లోకాలకు మేలు చేసే ఒక సత్పుత్రుడిని కనడం/ పెంచడం 10 చెరువులు తవ్వించినదానికి సమానమైన పుణ్యఫలాన్నిస్తుంది. అంటే కేవలం పుత్రులు ఉంటే సరిపోదు, వారు లోకానికి మేలు చేసేవారు కావాలి. అప్పుడు అతడు చేసే పుణ్యకర్మ పితృదేవతలను సైతం ఉద్ధరిస్తుంది. అదే ఒక చెట్టును నాటి, పోషించడం వలన 10 మంది ప్రయోజకులు, లోకానికి క్షేమం చేకూర్చేవారైన సత్పుత్రులను అందించిన పుణ్యఫలానికి సమానమైన పుణ్యం వస్తుంది. ఎందుకంటే చెట్టు జీవరాశికి ఎంతో మేలు చేస్తుంది. తన సమస్త జీవితాన్ని పరుల కోసమే వెచ్చిస్తుంది. తనకంటూ ఏదీ అట్టిపెట్టుకోదు. అందుకే లోకక్షేమం కోసం, ఇతరులు ఈ మార్గంలో నడవడానికి ప్రేరణగా నేనే ఈ మర్యాదను స్థాపించాను.  (In brief, 10 బావులు ఒక కొలనుకు సమానం. 10 కొలనులు 1 చెరువుకు సమానం. 10 చెరువులు 1 పుత్రునకు సమానం. 10 సత్పుత్రులు ఒక చెట్టుకు సమానం. అందుకే నేను మొక్కలు నాటి మానవుల కోసం గొప్ప మర్యాదను స్థాపించాను.)

మత్స్య పురాణం 154.506- 154.512 (దేవర్షులు - పార్వతి దేవి సంవాదం).

మాములుగా చెప్తే ఎలాగో నాటరు, కనీసం అమ్మవారు చెప్పిందనైనా మొక్కలు నాటండి. వాటిని పెంచి పోషించండి.  మగపిల్లలు లేరన్న చింతవద్దు, మొక్క నాటితే అది 10 మంది మగపిల్లలకు సమానం. ఎన్ని మొక్కలు నాటితే అంత పుణ్యం.

No comments:

Post a Comment