Monday 12 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 7



ఇప్పటివరకు ఆరోగ్యపరంగా, మానసికంగా మనకూ మట్టికి సంబంధం చూశాం. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణం దర్శిద్దాము. ఈ శరీరంలో పంచభూతాలతో నిర్మితమైనట్టే, షట్చక్రాల్లో మూలాధారం నుంచి విశుద్ధి చక్రం వరకు క్రమంగా 5 చక్రాలు పృధ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశ తత్త్వాలను కలిగి ఉంటాయి. కుండలిని జాగృతి జరగాలన్నా, లేదా మనస్సు, శరీరం సమతుల్యంతో జీవించాలన్నా, ఈ తత్త్వాలు శుద్ధంగా ఉండాలి. ఇవి చెడిపోవడం వలన అనేక సమస్యలు వస్తాయి. జగ్గీవాసు దేవ్ అంటారు, అధికంగా మానవులంతా భౌతిక, మానసిక క్రియల వలలో ఇరుక్కుని ఉంటారు. వీటిని దాటి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మొదట మనమీ పంచభూతాలను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు భౌతిక, మానసిక స్థితులకు, నీ సహజ స్థితికి మధ్య తేడాను గమనించగలవు అని.

నిజానికి ఈ భూతశుద్ధి తంత్రశాస్త్రాల్లో చెప్పబడిన ప్రక్రియ. అయితే మన సనాతన ధర్మ జీవన విధానం ఎటువంటిదంటే అనేక ప్రక్రియలను మన జీవన విధానంలో భాగం చేశారు ఋషులు. మూలాధారం పృధ్వీ తత్త్వం. భూమికి దూరంగా జరిగితే శరీరంలో ఈ భూతం చెడిపోతుంది. అందువలన ఆధ్యాత్మిక ఉన్నతి అక్కడే ఆగిపోతుంది. అసలు మూలాధారమే ప్రారంభస్థానం. అక్కడి నుంచి కుండలిని జాగృతి జరగాలంటే పృధ్వీ భూతం శుద్ధి జరగాలి. అందుకోసం చెప్పుల్లేకుండా సారవంతమైన మట్టిలో నడవడం, మొక్కలకు పాదులు తీయడం, నీరు పెట్టడం, మట్టిలో పని చేయడం, పెద్ద పెద్ద వృక్షాలను స్పృశించడం, వాటి క్రింద కూర్చోవడం వంటివి రోజూ చేయాలి. అప్పుడే ఆ భూతశుద్ధి జరుగుతుంది. ఇలా ఒక్కో చక్రానికి, ఒక్కో భూతానికి సంబంధం ఉంటుంది. వాటికి దగ్గరగా బ్రతక్కపోతే, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. అందుకే నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితిలో ఒకమాట అన్నాడు - యోగా ప్రజలను ప్రకృతికి దగ్గర చేస్తుందని. దాని అర్దమిదే. ఈ శరీరం పంచభూతాలతో ఏర్పడిందని, వాటికి దూరంగా అసహజంగా బ్రతికితే ఇవి చెడిపోతాయనే స్పృహ కలిగి ఉండాలి.

అయితే కేవలం దగ్గరగా జరిగితే సరిపోదు. బయట ఉన్న పంచభూతాలను కూడా శుద్ధంగా ఉంచాలి, కాలుష్యం చేయకూడదు. యత్పిండాండే తత్బ్రహ్మాండే అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. పిండాండంలో ఉన్నదేదో, అదే బ్రాహ్మాండంలో కూడా ఉన్నది అని. బయట ఉన్న బ్రహ్మాండాన్ని కలుషితం చేస్తే, ఈ పిండాండం (శరీరం) కూడా కలుషితమవుతుంది. నేలలో ప్లాస్టిక్ కవర్లు పడేయడం, మొక్కలను, అడవులను నరికేసి నేలకోతకు కారణమవ్వడం, మట్టిలో హానికారక రసయానలు కలపడం, భూసార క్షీణతకు కారణమవ్వడం, ప్రకృతి వ్యవస్థ దెబ్బతినేలా మట్టిని, ఇసుకను తవ్వి తరలించేవారికి, కొండలను మైనింగ్ పేరుతో పెద్ద పెద్ద బాంబులు పెట్టే పేల్చేచారికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండనే ఉందడు. అది శూన్యం. వాళ్ళకు భక్తి ఉండచ్చు కాక, కానీ ఆధ్యాత్మికంగా వారు ఎదగడమన్నది ఉండనే ఉండదు. ఎందుకంటే ఈ భగవంతుని శివుడిగా పూజిస్తే, ఈ భూమి పార్వతి. సర్వేశ్వరునిగా నారాయణుని ఆరాధిస్తే, కనిపించే ఈ జగత్తు భూ, నీలా, లక్ష్మీ దేవి. శక్తికి అపచారం చేసి, బ్రహ్మాన్ని చేరుకోవాలనుకోవడం కల. మిగితా భూతాలను కూడా కలుషితం చేస్తే ఇలానే ఫలితాలు ఉంటాయి. అందుకే ప్రకృతిని ప్రేమించేవారికి (మన దేశంలో హోలీకి, వినాయకచవితికి, దీపావళికి మాత్రమే నిద్రలేచే కుహనా పర్యావరణ వేత్తల గురించి కాదు చెప్పేది) ఆధ్యాత్మికత త్వరగా వంటబడుతుంది. ఎందుకంటే వారే ప్రక్రియ చేయకుండానే వారిలో పంచభూతాలు శుద్ధి జరిగి ఉంటాయి. ఇది పాశ్చాత్యుల్లో కనిపిస్తుంది. వారి మతం వేరైనా, అందులో ప్రకృతిని దోచుకోమని స్వయంగా చర్చియే చెప్పినా, అక్కడి ప్రజలు పృకృతిని కాలుష్యరహితంగా ఉంచుతున్నారు. అందుకే వారు సనాతన ధర్మంలోకి వచ్చి, ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులను పొందుతున్నారు. విదేశీయుల్లో హిందువులుగా మారిన వారిలో 99% మంది ప్రకృతి ప్రేమికులే.  మనకు భక్తి ఉంది, కానీ వారికి భక్తితో పాటు ఆధ్యాత్మిక అనుభూతులు కూడా మెండుగా ఉన్నాయి. దానికి కారణమిదే. కాబట్టి మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, ప్రకృతికి దగ్గరగా బ్రతకాలి. అందుకే ఋష్యాశ్రమాలన్నీ ప్రకృతి మధ్యనే ఉంటాయి, ప్రకృతిని రక్షిస్తూ, పర్యావరణ హితంగా ఉంటాయి. మానవుడు ఈ ప్రకృతిలో అంతర్భాగమే కాని దాన్ని అనుభవించడానికి పుట్టినవాడు కాదు, దానికి అతీతుడూ కాదు.

To be continued ..........

No comments:

Post a Comment