Thursday 15 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 8



పంచభూతాలకు శక్తులున్నాయని మన శాస్త్రకారుల మాట. నీటికి మన భావాలను గ్రహించి, దానికి అనుగుణంగా మారే లక్షణం ఉంది. దీన్ని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిరూపించారు. అలాగే భూమికి, వాయువుకు, ఆకాశానికి, అనలానికి కూడా కొన్ని శక్తులున్నాయి. మహాపురుషులు, అవతారమూర్తులు తపస్సు చేసిన ప్రదేశాలు, నివాసం ఉన్న ప్రదేశాల్లో అక్కడి పంచభూతాల్లో వారి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. బృందావనాన్ని దర్శించిన కొందరు పరమభక్తులు, యోగులు అక్కడి వాయు మండలంలో ఇప్పటికి నిక్షిప్తమై ఉన్న శ్రీ కృష్ణుని వేణునాదాన్ని విని పరవశిస్తారు. ఇలా అనేక ఉదాహరణలున్నాయి, కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం శృంగేరి. అక్కడికి శంక్రులు వెళ్ళేసరికి ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే, పాము పడగపట్టి నీడ ఇస్తుంది. అలాగే విద్యారణ్యులు విజయనగరం వెళ్ళినప్పుడు కుందేళ్ళు వేటకుక్కలను తరమడం చూసి, అక్కడే నగరానికి పునాది వేస్తారు. అది అక్కడి మహత్యం. మహాత్యం అంతా ఆ ప్రదేశంలో ఉన్న పంచభూతాల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి వలన వస్తుంది. పుణ్యక్షేత్రం అంటే కూడా అంతే. క్షేత్రం వేరు, అక్కడి ఆలయంలో ఉన్న మూర్తి వేరు కాదు. తిరుమల వెళ్ళడం అంటే, ఆనందనిలయంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరుని మూర్తి ఒక్కటే కాదు, ఆ కొండ, ఆ గాలి, ఆ నడకదారి ........... సర్వమూ గోవిందుడే. ఆ కొండ మీద చెత్త వేస్తే, గోవిందుడి మీద వేసినట్లే. హరిద్వార్, ఋషికేశ్, కైలాస మానస సరోవరం వంటి ప్రదేశాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అవి తపోభూములు. అక్కడున్న ఆలయంలో భగవంతునికి అపచారం చేస్తేనే పాపం కాదు, ఆ ప్రదేశంలో చేయకూడని పనులు చేసినా, దాన్ని కలుషితం చేసినా, ఈర్ష్యా, అసూయ, ద్వేషం మొదలైన దుర్భావాలకు లోనయినా, అది అపచారమే. అది ఆ ప్రదేశంలో ఉన్న పంచభూతాల్లోకి చెడు సంకేతాలను పంపుతుంది.

అలాగే మట్టికి కూడా తనలో కొంత శక్తిని నిక్షిప్తం చేసుకునే శక్తి ఉంది. ఇది మనకు వినాయకచవితిలో కనిపిస్తుంది. వినాయక చవితికి మృత్తికతో చేసిన గణపతిని పూజించిన తర్వాత, దాన్ని నిమజ్జనం పేరున జలములలో కలిపేస్తాము. ఏ మట్టి ప్రతిమలోనికైతే మనం గణపతిని ఆవాహన చేసి, అర్చించి, తిరిగి యధాస్థానానికి పంపామో, ఆ ప్రతిమ ఆ తర్వాత కూడా దైవీశక్తిని, మంత్రశక్తిని తనలో నిక్షింప్తం చేసుకుని ఉంటుంది. అందుకే దాన్ని ఎక్కడపడితే అక్కడ పడవేయరు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రవహించే నీటిలో కలుపుతారు. దాని వలన ఆ మట్టి, దానితో పాటున్న మంత్ర/ దైవ శక్తి నీటిలో కలుస్తుంది, ఆ శక్తిని నీరు గ్రహిస్తుంది. ఆ జలములు ఎంత దూరం ప్రవహిస్తాయో, అంతదూరం ఈ శక్తి వ్యాపిస్తూ వెళుతుంది. సూర్యరశ్మికి ఆ నీరు ఆవిరై అక్కడి ప్రదేశాన్ని పవిత్రం చేస్తుంది, వర్షం కురిసినప్పుడు, ఆ జలములతో పాటే ఆ శక్తి భూమికి దిగి ఈ భూమిని పవిత్రం చేస్తుంది, పంటల ద్వారా ఆహారంలోకి చేరి, మనస్సులను పవిత్రం చేస్తుంది. అందుకే మన ధర్మంలో కొన్ని క్రతువుల తర్వాత నీటిలో విగ్రహాలను విసర్జిస్తారు. పూజ చేసిన వారికే కాదు, సమస్త భూమండలానికి ఆ ఫలితం అందుగాకా! అందరూ పవితులు అవుదురు గాకా! అన్నదే మన ధర్మ ఆదర్శం. లోకాసమస్తా సుఖినోభవంతు అన్న మంత్రానికి ఇది నిదర్శన పూర్వక ఉదాహరణ.

ఇలా ఇప్పటికి ఎన్నోసార్లు ఎందరో ఈ భూమండలాన్ని పవిత్రం చేశారు. నదీనదాలు, అడవుల మొదలు సమస్త ప్రకృతిలో, మానవులలో శాంతి కొరకు ఇలాంటివి చేసి, ఆ శక్తిని ప్రవేశపెట్టారు. కనుక అన్నిటియందు దైవశక్తి ఉంది, ఇవన్నీ ఒకనాడు నా పూర్వీకుల చేత పవిత్రం చేయబడ్డవే అనే భావనతో నేను వాటిని కలుషితం చేయను, ఇదంతా బ్రహ్మ మయమే అనేవాడే నిజమైన హైందవుడు.

మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||

To be continued ..............

No comments:

Post a Comment