Tuesday 6 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 2



మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం |
మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||

ఓ మృత్తికా! నేను చేసిన పాపాలను, దుష్కృతాలను నశింపజేయి. నీవు బ్రహ్మ చేత సృష్టించబడ్డ దానవు, మరియు కశ్యప ప్రజాపతి చేత మంత్రపూతమై పవిత్రం చేయబడ్డావు. ఆయన పవిత్రం చేసిన మృత్తికను తిరిగి ఈ భూమంతా చల్లాడట.

ఈ మంత్రాల్లో ఎంతో అర్దం దాగి ఉంది. మట్టి పవిత్రత ఎంత గొప్పదంటే ఒకసారి పార్వతీ దేవి శివుడితో 'మీరు బంగారు, వెండి, ఇత్తడి మొదలైన అనేక లింగాల్లో అర్చించబడతారు కదా. మీకు ఏ లింగార్చన అంటే ఇష్టం?' అని అడిగింది. అప్పుడు శివుడు 'నాకు అన్నిటికంటే పార్ధివ లింగార్చన అంటే ఇష్టం' అని సమాధానం ఇస్తాడు. పార్ధివ లింగం అంటే మట్టితో చేసిన లింగం, దానికి మిగితా లోహాలతో చేసినవేవీ సాటి రావంటాడు. పార్ధివ లింగాన్ని అర్చిస్తే, కోరికలు తొందరగా నెరవేరుతాయని శాస్త్రంలో చెప్పబడింది. కానీ ఈ లింగాన్ని ఎప్పటికప్పుడు చేసి, పూజ ముగియగానే ఉద్వాసన చెప్పి, నిమజ్జనం చేయాలి. శివుడలా చెప్పడానికి మట్టి అందరికీ అందుబాటులో ఉండడం ఒక కారణమైతే, మట్టికున్న పవిత్రత రెండవ కారణం. అలా పరమశివుడే మట్టి పవిత్రతను చాటాడు.

ఒకసారి లింగ పురాణానికి వెళదాం - గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"

"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది అని సూతుడు సమాధానం చెప్తూ ఇంకా అనేక విషయాలను చెప్తాడు. (మహాగణపతి పురాణం(బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహరావు)

ముద్గల పురాణంలో గణేశ చతుర్థీ రోజున కేవలం మట్టి గణపతిని మాత్రమే పూజించాలని చెప్పబడింది. ఇతర లోహాలతో చేసిన గణపతులను అర్చించాలని అందులోలేదు. ఎందుకంటే ఆ తిధి నాడు వచ్చే గణపతి శక్తిని ఆకర్షించే శక్తి ఒక్క మట్టికే ఉంది. భగవంతుని దేనిలోకి ఆవహన చేస్తామో, అది పవిత్రమై ఉండాలని శాస్త్రము చెప్తున్నది. ఆ పవిత్రత మట్టికి ఉంది కనుక ఆ పర్వంలో మృత్తికా గణపతి పూజ. ఎన్నో విషయాలను చెప్పినా మన పురాణాలు, అరటి తొక్కలతో, చింతపిక్కలతో గణపతిని తయారు చేయమని చెప్పలేదు, ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా. ఏమి? వారికి తెలియదా? చింతపిక్కలతో, పూలరెక్కలతో, గాజుముక్కలతో విగ్రహాలు చేయచ్చని? అదికాదు సంగతి. అలా చేసినవి పవిత్రతను నిలుపుకోలేవు. ఆ దైవీ శక్తిని ఆకర్షించలేవు.

మనం ఏ పూజ చేసినా, నూతన కార్యం ప్రారంభించినా, ముందుగా పసుపు ముద్దతో గణపతిని చేసి, ఆ తర్వాత పని మొదలుపెడతాము. ఒకవేళ పసుపు గణపతిని కొలిచే వీలు లేని పరిస్థితి వస్తేనో? అప్పుడు మట్టిబెడ్డను తెచ్చి, అందులోకి గణపతి ఆవహన చేసి పూజించినా, అంతే సమానమైన ఫలితం వస్తుందని చెప్పారు.

గతభాగంలో మనం చెప్పుకున్న మంత్రం నిత్యం పఠించకపోయినా, యజ్ఞయాగాది క్రతువుల సమయంలో నదీస్నానం చేస్తారు. అప్పుడు కూడా నదిలోంచి మట్టిని తీసి, ఒంటికి రాసుకుని, శిరస్సును ధరించి, ఆ సూక్తాలు చదివి స్నానం చేస్తారు. పవిత్రత కోసం. అంటే ఇక్కడ మనకు ఏమి అర్దమవుతున్నది, మట్టి పవిత్రతకు చిహ్నం. మరి మనం మట్టిని పవిత్రంగా ఉంచుతున్నామా?

To be continued .........

No comments:

Post a Comment