Sunday, 19 July 2015

హిందూ ధర్మం - 167 (శిక్షా - 1)శిక్షా: ఇది వేదాంగాల్లో మొదటిది. ఇది అక్షరాలకు, వాటిని ఉఛ్ఛరించే విధానం, వేదాన్ని నేర్పే పద్ధతిని వివరించే శాస్త్రం. శబ్దానికి సంబంధిచిన శాస్త్రం. దీన్ని వేదానికి నాసిక (ముక్కు)గా చెప్తారు. ముక్కు ద్వారా మాత్రమే ఊపిరి తీసుకుంటుంది జీవరాశి. ఊపిరే జివులకు ప్రాణాధారం. వేదం మంత్రసూక్తముల సమాహారం. సరైన రీతిలో మంత్రోఛ్ఛారణయే వేదానికి ఆయువు.

సృష్టి ప్రారంభంలో తొలుత శబ్దమే ఉద్భవించింది. తొలిశబ్దం ఓంకారం. అదే ఇన్నిటిగా విస్తరించింది. అన్నీ దాన్నుంచే వచ్చాయి. దృశ్యాదృశ్య ప్రపంచం తర్వాత వచ్చింది. అందుకే ఋషులు శబ్దబ్రహ్మం అని శబ్దాన్ని బ్రహ్మంగా చెప్పారు. వేదాలు కూడా ఋషులకు స్వరబద్ధంగా లభించాయి. ఏదో పుస్తకంలో చూసి చదవడం కాదు, వేదంలో ప్రతి భాగానికి ఒక స్వరం ఉంది. దాని ప్రకారమే చదవాలి. 'నాకు ఒకటే శక్తి గురించి తెలుసు. అదే భగవన్నామం. నేను నీ దగ్గరకు వచ్చి తేలు అనగానే మీవు భయంతో గెంతుతావు. నేను లడ్డూ అనగానే నీ నోరు ఊరుతుంది. అదే నేను నిన్ను గాడిద అనృఏ నీకు కోపం వస్తుంది. కోపం ఎందుకు? నీకేమైనా నాలుగు కాళ్ళు వచ్చాయా? మామూలు పదలాకే అంత శక్తి ఉంటే ఇక భగవన్నామానికి ఎంత శక్తి ఉంటుంది' అంటారు స్వామి శివానంద సరస్వతీ. నామం భగవంతుని ఒకానొక లక్షణం గురించి చెప్తుంది. అటువంటి నామానికే అంత శక్తి ఉంటే ఇక వేదమంత్రాలకు ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి . వేదంలోని శబ్దాలకు చాలా శక్తి ఉంది. యస్య నిశ్వసితం వేదాః - భగవంతుని ఊపిరియే వేదం అని శాస్త్రమే చెప్పింది. నా ఊపిరి నుంచి నేను వేరుకానట్టే భగవంతుని ఊపిరి నుంచి ఆయన వేరు కాదు. మరి అంత గొప్ప శక్తి గల వేదాలను పరిరక్షించడం ఎలా? వాటి శక్తిని అట్లాగే కాపాడటం ఏలా? తప్పులు దొర్లకుండా రక్షించండం ఏట్లాగా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఋషులు అందించినదే శిక్షా శాస్త్రం. వేదం ఇవ్వబడిన సమయం నుంచి ద్వాపరయుగం వరకు అది ఎక్కడా రాయబడలేదు. గురువు నుంచి శిష్యునికి వారసత్వంగా ఒక గురుశిష్య పరంపరలో వచ్చింది. వస్తూనే ఉంది. మస్తకం నుంచి మస్తకానికి, పుస్తకం నుంచి పుస్తకానికి కాకుండా హృదయం నుంచి హృదయానికి అందుతూ వచ్చింది. విని నేర్చుకునే విద్య కనుకనే వేదానికి శృతి అని పేరు.

శబ్దానికి చాలా శక్తి ఉంది. వేదమంత్రాల విషయంలో అది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ శబ్దంతో మనిషికి ఉన్నతమైన అనుభూతులను కలిగించడం, వారి స్థితిని మెరుగుపరచడం, ప్రకృతిలోకి ఆ శబ్దతరంగాలను పంపి కావలసిన ప్రతిఫలాన్ని పొందడం, మనోభావాలను మార్చడం, దుష్టభావాలను నశింపజేయడం కూడా జరుగుతుంది. ఇంతకముందు మంత్రం గురించి, దానికి ఉండే ప్రీక్వెన్సీ గురించి చెప్పుకున్నాం. http://ecoganesha.blogspot.in/2014/12/118.html

ఇక్కడ ప్రీక్వెన్సీతో పాటు రెసోనెన్స్ సిద్ధాంతం కూడా పనిచేస్తుంది.

To be continued ...................

No comments:

Post a Comment