Sunday, 23 August 2015

హిందూ ధర్మం - 172 (శిక్షా - 6)

ఇది కేవలం వేదాన్ని రక్షించడానికే కాదు, వేదపఠనం ద్వారా వచ్చే ఫలితాన్ని ద్విగుణీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది.
సంహితాపాఠమాత్రేన యత్ఫలం ప్రోచ్యతే బుదైః
పదాతు ద్విగుణం విద్యాత్ క్రమేతుచ చతుర్గుణం
వర్ణక్రమే శతగుణం జఠాయంతు సహస్రకం

అంటూ సంహితాపాఠంలో చదివితే వచ్చే ఫలితానికి రెండు రెట్ల ఫలితం పదపాఠం వలన, క్రమపాఠం వలన నాలుగు రెట్ల ఫలితం, వర్ణక్రమం వలన వందరెట్ల ఫలితం, జఠాపాఠం వలన సహస్రరెట్ల ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తున్నది.

ఒక్కసారి చేసిన ఘనాపాఠం, 13 సార్లు చేసే వేద పారాయణకు సమానం. మరియు అత్యంత ఫలప్రదం. ఘణాపాఠంలో మొదటి పదం, ఆఖరి పదం తప్పించి అన్ని పదాలు 13 సార్లు వస్తాయి.

ఈ విధంగా మొత్తం 153,826 పదాలున్న ఋగ్వేదాన్ని, 109287 పదాలున్న యజుర్వేదాన్ని అనేక కలియికలు, పాఠక్రమాలతో జత చేసి, వాటి మధ్య మంత్రాలను బిగించి, కొత్త పదాలు చేరకుండా, ఉన్నవి కోల్పోకుండా, భగవద్వాణి అయిన వేదాన్ని అట్లాగే రక్షిస్తూ, తరతరాలుగా వస్తోంది సనాతనసంస్కృతి. ఇదే ఈ సంస్కృతి గొప్పతనం, శిక్షాశాస్త్రం గొప్పతనం.

సనాతనధర్మానికి మూలస్థంభం వేదం. అది స్వచ్ఛంగా ఉంటేనే, ధర్మం స్థిరంగా ఉంటుంది. వేదం అనేది గ్రంధం కాదు, వేదమంత్రాలను గ్రంధాల్లో నిక్షిప్తం చేయడం గత 5,000 ఏళ్ళ క్రితమే మొదలైంది. వేదాన్ని పుస్తకాల్లో ముద్రించినా, అది పెద్దగా ప్రయోజనకారికాదు. వేదానికి స్వరం ప్రధానం. చదివే వ్యక్తి యొక్క సంస్కారం, మానసికస్థితి, శౌచం ప్రధానం.

ప్రపంచంలో వేదం, కొన్ని హిందూ ధార్మిక గ్రంధాలు తప్ప మిగిలిన అన్ని మతగ్రంధాలు మార్పులకు, చేర్పులకు లోనయ్యాయి. ఆయా సంస్కృతులే స్వార్ధప్రయోజనాల కోసం ధార్మికగ్రంధాల్లో అనేక విషయాలు చొప్పించారు. బైబిల్ అయితే ప్రతి ఏటా ఏదో ఒక మార్పుకు నోచుకుంటుంది. బైబిల్ అనేది దైవగ్రంధం, క్రైస్తవులకు పవిత్రగ్రంధమని ఆ మతస్థుల నమ్మకం. కానీ చరిత్ర గమనిస్తే, ప్రతి శతాబ్దంలో బైబిల్‌లో ఎన్నో కొత్తవిషయాలు ముద్రితమవుతున్నాయి, వారికి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్న విషయాలు, ఆధునిక పరిశోధనల్లో అబద్దమని తేలిన అనేక విషయాలు తీసివేయబడుతున్నాయి. అదేమీ ప్రపంచనాగరికతతో కలిసి పయనించేందుకు జరిగే మార్పులు చేర్పులు కావు. తమ గ్రంధం ఇంత అసంబద్ధంగా ఉందని ప్రపంచానికి తెలిస్తే, ఇక ఆ మాతంలోకి మార్పిడులు చేయడం కష్టమని, ఉన్నవాళ్ళు కూడా మతాన్ని విడిచిపెడతారని భయం. మాకు తెల్సిన ఒక వ్యక్తి దగ్గర గత 50 ఏళ్ళ ప్రతి ఏటా ముద్రితమవుతున్న బైబిల్ గ్రంధాలు ఉన్నాయి. వాటిని చూస్తే అర్దమవుతుంది, ప్రతి ఏటా దాన్లో ఎన్ని మార్పులు చేస్తున్నారో.

వేదం శాశ్వతమైనది, సత్యాలతో కూడుకున్నది. అటువంటి వేదం కాలానికనుగుణంగా మార్చవలసిన పనిలేదని గర్వంగా చెప్పుకోగలిగినవారు హిందువులు మాత్రమే. తమ ధర్మానికి పునాది అయిన వేదంలో మార్పులు చేయటం సాధ్యపడదని గర్వంగా ప్రపంచం ముందు చెప్పగలిగినవాడు ఒక్క హిందువు మాత్రమే.

To be continued ..............

No comments:

Post a Comment