Sunday, 16 August 2015

హిందూ ధర్మం - 171 (శిక్షా - 5)


సహజక్రమాన్ని అనుసరించని 8 రకాల కలయికలను కూడా అందించారు మహర్షులు. వీటిని వికృతి అన్నారు.
జటామాలా శిఖా రేఖా ధ్వజో దణ్డొ రథోఘనః |
ఇత్యాష్టా వికృతయః ప్రోక్తాః క్రమపూర్వా మహర్షిభిః||

జటా, మాలా, శిఖా, రేఖా, ధ్వజా, దండ, రథ, ఘనా అనేవి అష్ట వికృతులు. వీటిన్నటిలో జటా, ఘనాలు మాత్రమే దక్షిణ భారతదేశంలో కృష్ణయజుర్వేద శాఖలో ప్రముఖంగా ఉన్నాయి. ఉత్తరభారతదేశం, ముఖ్యంగా బెనారస్‌లో శుక్ల యజుర్వేద శాఖలకు చెందిన అష్టవికృతులు ఉన్నాయని చెప్తారు. కానీ చరిత్ర గమనిస్తే, దుష్ట జీహాదీల దండయాత్రల్లో వైదికసంప్రదాయం ఎన్నో కష్టాలు పడింది. తరతరాలుగా వస్తున్న వైదిక గురుకులాలను ధ్వంసం చేసి, అందులో విద్యార్ధులను, గురువులను క్రూరంగా చంపారు అప్పటి ఇస్లాం విద్వంసకారులు. ఈ దాడులతో ఉత్తరభారతదేశంలో వేదానికి చెందిన అనేక విద్యలు చాలావరకు సమూలంగా నాశనం చేశారు. దక్షిణభారతదేశంలోని అతి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైదిక పరంపర కొనసాగుతూ వచ్చింది. అది కూడా పైన చెప్పిన పద్ధతుల్లో ఒకటి, లేదా రెండు పద్ధతులు మాత్రమే మిగిలాయి. ఆంగ్లేయులైతే మరీ దారుణం. క్రైస్తవవ్యాప్తి కోసం స్వరంతో వేదం పలికే పండితుల స్వరపేటికల్లోకి మండుతున్న ఇనుపచువ్వలు గుచ్చి, ధర్మంపై తమ వ్యతిరేకతను చాటుకున్నారు. జీహాదీల దాడులను సైతం తట్టుకుని నిలబడ్డ అనేక వైదిక గురుకులాలను సమూలంగా తుడిచివేశారు. దాని కోసం చట్టాలు కూడా చేసి, తమ అక్రమాలను, దారుణాలను చట్టబద్ధంగా చేసే యత్నం చేశారు.

జటా పాఠం

ఒకే వరుస క్రమంలో 6 పదాలుంటే జటా పాఠంలో a-b-b-a-a-b;  b-c-c-b-b-c; c-d-d-c-c-d; d-e-e-d-d-e; e-e-f-f-e; ................. ఇలా చదువుతారు. ఆ పాఠాన్ని గమనిస్తే, ముందుకు-వెనక్కు-ముందుకు పదాల క్రమం ఉంటుంది. స్త్రీలు తమ జడను అల్లుకున్న విధంగా ఉంటుంది కనుక ఈ పాఠాన్ని జటాపాఠం అన్నారు.

ఇది జటాపాఠం :
ఓషధయః సం సం ఓషధయః ఓషధయః సం |
సం వదంతే వదంతే సం సం వదంతే |    
వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన |
సోమేన సహ సహ సోమేన సోమేన సహ |
సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా |
రాజ్ఞేతి రాజ్ఞా ||

మాలా పాఠాలు రెండు రకాలు 1) క్రమ మాల, 2)పుష్పమాల. ఇవి క్రమపాఠాన్ని పోలి రెండు పదాలను కలుపుతూ ఉంటాయి. శిఖా పద్ధతి జటా పద్ధతికి దగ్గరగా ఉన్నా, శిఖలో రెండు పదాలకు బదులు మూడు పదాలను కలిపి, ముందుకి-వెనక్కి చదువుతారు. రేఖా, ధ్వజ, దండ, రథ పాఠాలా పారాయణ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. రథాలో కూడా ద్విపాద, త్రిపాద, చతుష్పాద అని 3 రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో ద్విపాద, చతుష్పాద పద్ధతులు ఈ రోజు విరివిగా ఉపయోగిస్తున్నారు.

అన్నిటిలోకి ప్రముఖమైనది, అత్యంత కష్టమైంది, మంచి ప్రాముఖ్యం సంతరించుకున్న పద్ధతి ఘనాపాఠం.ఈ విద్యలో ప్రావీణ్యం పొందినవారిని ఘనాపాఠీ అంటారు. ఇక్కడ పదక్రమం గంట ఆకారాన్ని సంతరించుకుంటుంది.

ఉదాహరణకు, a-b-c-d-e-f అనేవి పదసమూహం అనుకుంటే ఘనాపాఠంలో a-b-b-a-a-b-c-c-b-a-a-b-c; b-c-c-b-b-c-d-d-c-b-b-d అని చదువుతారు.

ఓషధయః సం సం ఓషధయః ఓషధయః సం వదంతే
వదంతే సం ఓషధయః ఓషధయః సం వదంతే |
సం వదంతే వదంతే సం సం వదంతే సోమేన
సోమేన వదంతే సం సం వదంతే సోమేన |
వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సహ
సహ సోమేన వదంతే వదంతే సోమేన సహ|
సోమేన సహ సహ సోమేన సోమేన సహ రాజ్ఞా
సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా |
రాజ్ఞేతి రాజ్ఞా ||

పైన గమనిస్తే, సంహితలో 6 పదాలుంటే, ఘనాపాఠంలో అవి 60 పదాలుగా మారాయి. అనగా పదిరెట్లు పెరిగాయి. దీని బట్టే అర్దం చేసుకోవచ్చు, పెద్దపెద్ద మత్రాలను ఉచ్చరించడం ఎంత కష్టమో!! దీని ఆధారంగా ఘనాపాఠికి వేదం యందు ఎంత ప్రేమ ఉందో, దాన్ని కాపాడాలన్న పట్టుదల ఎంతగా ఉందో, ఆయన ఏదో మౌఖికంగా కాకుండా హృదయంతో నేర్చుకుని, ఘనక్రమం తప్పకుండా చదువుతున్నారో అర్దం చేసుకోవచ్చు.

ఘనాపాఠం గురించి అవగాహన కోసం శృంగేరి పీఠంలో రుద్రాభిషేక సమయంలో ఘనాపాఠీలు చదివిన రుద్రఘనాపాఠం ఈ లింక్‌లో వినవచ్చు. ఘనాపాఠం వినడం కూడా ఎంతో శాంతిని ఇస్తుంది.

https://www.youtube.com/watch?v=XiB3-uIkuPw



To be continued ................

No comments:

Post a Comment