Sunday 24 December 2023

శ్రీ గరుడ పురాణము (42)



ఈ విధంగా విష్ణుదేవుని స్తుతించి అప్పుడు హవనం చేయాలి. తరువాత మహా పురుష విద్యానామక మంత్రాన్ని పద్ధతి ప్రకారం నూటయెనిమిది మార్లు జపించాలి. తదనంతరం జితంతేనతో మొదలగు మహాపురుష విద్యాస్తోత్రాన్ని జప, అర్ఘ్యముల తరువాత పఠించి నారాయణునికి పలుమార్లు ప్రణామం చేయాలి.


తరువాత అగ్నిదేవుని స్థాపించి పూజించి హవనం చేయాలి. విష్ణు దేవునికీ, అచ్యుతాది ఆంగిక దేవతలకీ బీజాక్షర యుక్త మంత్రాలతో ఆహుతులివ్వాలి. మనస్సులోనే సాంగోపాంగంగా బ్రహ్మదేవునీ ఇతర దేవతలనూ పూజించుకొని వారందరినీ మండలంలో స్థాపించాలి. అప్పుడు వాసుదేవ మంత్రంతో నూట యెనిమిది ఆహుతులివ్వాలి. తరువాత సంకర్షణాది ఆరుగురు అంగదేవతలకు మూడేసి ఆహుతులనూ, దిక్పాలకులకొక్కొక్క ఆహుతినీ ప్రదానం చేయాలి. హవనం పూర్తయినాక ఏకాగ్ర చిత్తంతో పూర్ణాహుతి నివ్వాలి.


తరువాత మన మనోవాక్కాయ కర్మలకు అతీతుడైన పరమాత్మతో సాధకుడు ఆత్మను లీనం చేస్తున్నట్లుగా భావించుకొని దేవతలందరికీ ఈ మంత్రం ద్వారా వీడ్కోలు చెప్పాలి.


గచ్ఛ గచ్ఛ పరంస్థానం యత్రదేవో నిరంజనః ।

గచ్ఛంతు దేవతాః సర్వాః స్వస్థానస్థితహేతవే ॥


దేవతలారా! సుదర్శన, శ్రీహరి, అచ్యుత, త్రివిక్రమ, చతుర్భుజ, వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, పురుష - ఈ దేవ సమూహాన్నే నవవ్యూహమంటారు. పరమాత్మను కలుపుకుంటే దశాత్మకమవుతుంది. అలాకాకుండా అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే ఇదే ఏకాదశ వ్యూహమవుతుంది. నవవ్యూహానికి పరమతత్త్వాన్నీ, అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే అది ద్వాదశాత్మక వ్యూహంగా చెప్పబడుతుంది.


చక్రాంకిత మంత్రాలను చదివి వాటిని అనగా చక్రరూపాలను ఈ విధంగా బీజాక్షరాలతో పూజించాలి.


ఓం చక్రాయ స్వాహా |

ఓం విచక్రాయ స్వాహా |

ఓం సుచక్రాయ స్వాహా ।

ఓం మహాచక్రాయ స్వాహా |

ఓం అసురాంత కృత్ హుం ఫట్ |

ఓం హుం సహస్రార హుం ఫట్ |


గృహాన్ని సంరక్షించే పై మంత్రాలతో చేసే పూజకు 'ద్వారకా చక్రపూజ' అని పేరు. ఇది సర్వమంగళదాయిని"


(అధ్యాయం -12)

No comments:

Post a Comment