దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు నలుగురు మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజైకపాదుడు, అహిర్బుధ్యుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్ట పుత్రుడే మహా తపస్వియైన విశ్వరూప మహర్షి, రుద్ర నందనులైన హర, బహురూప, త్య్రంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి నామకులు ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులై మూడులోకాలకూ అధిపతులైనారు.
కశ్యపపత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు.
రోహిణి మున్నగు ఇరువదేడు నక్షత్రకన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులూ, సింహికయను కూతురూ పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్రాద, ప్రద, ప్రహ్లాద, సంప్రద నామకులైన పుత్రులు జనించి 'హ్లాదు’ లుగా ప్రసిద్ధి చెందారు; ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లా(హ్రా)దునికి ఆయుష్మాన్, శిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాదపుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి నూర్గురు కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు.
హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహా బలశాలులు.
దనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంబర, ఏక చక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాతవీరులు.
స్వర్భానుని కన్య సుప్రభ. వృష పర్వుని కూతురు శర్మిష్ఠ. అతనికింకా ఉపదానవి, హయశిర అను మరో ఇద్దరు శ్రేష్ఠకన్యలున్నారు.
No comments:
Post a Comment