Tuesday, 12 December 2023

శ్రీ గరుడ పురాణము (32)

 


విద్వాంసుడైన దేశికుడు అన్నిటికన్న ముందు భగవంతుని ధ్యానించాలి. తరువాత వాయవ్యం వైపు తిరిగి 'యం' అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి 'రం' అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారుణీ దిశగా తిరిగి 'వం' అనే బీజ మంత్రం ద్వారా హృదయస్థితినీ ధర్మాభిరుచినీ విచారించుకోవాలి. తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానమనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అపుడు ఓంకారాన్ని జపిస్తూ వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్త్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తరువాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడవుతాడు.


మండలాదికములను నిర్మించుకోవడం సాధ్యం కానపుడు సాధకుడు తన మానస మండలాన్ని తానే కల్పించుకొని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చును. శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలుంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానసమండలానికి కూడ నాలుగు ద్వారాలుంటాయి. చేతిని పద్మంగానూ, వ్రేళ్ళనుపద్మపత్రాలుగానూ, హస్తమధ్యాన్ని కర్ణిక గానూ, గోళ్లను కేసరాలుగానూ భావించుకొనే సాధకుడు తన హస్తరూపియైన కమలంలోనే సూర్య, చంద్ర, ఇంద్ర, అగ్ని, యమాది పరివేష్టితుడైన శ్రీహరిని కల్పించుకొని పూజించుకోవచ్చును.


ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణువుంటాడు కాబట్టి ఆ హస్త స్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలూ, అజ్ఞానమూ కూడా పటాపంచలై పోతాయి. అపుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో బాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో గొనిపోవాలి.


శక్తిస్వరూపులైన ఓ శివాదిదేవతలారా! ఇక శ్రీలక్ష్మీ సిద్ధిప్రాప్తి విధివిధానాలు చూద్దాం. దీనిని స్థండిలాదులపై చేస్తారు. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మింపబడి చదును చేయబడి పవిత్రీకరింపడిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలమంటారు.


ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమః అని జపించి శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం శ్రః 


అనే బీజాక్షరాలను మంత్రానికి జోడిస్తూ క్రమంగా హృదయ, శిర, శిఖ, కవచ, నేత్ర, అస్త్రాలలో ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకోవాలి.


ఓం శ్రాం హృదయాయ నమః |

ఓం శ్రీం శిరసే స్వాహా । 

ఓం శ్రూం శిఖాయై వషట్ | 

ఓం శ్రైం కవచాయ హుం | 

ఓం శ్రౌం నేత్రత్రయాయ వౌషట్ | 

ఓం శ్రః *అస్త్రాయ ఫట్ |


సాధనారతుడైన భక్తుడు అంగన్యాసం తరువాత శ్రీమహాలక్ష్మిని పూజించాలి. 


No comments:

Post a Comment