Friday, 1 December 2023

శ్రీ గరుడ పురాణము (21)

 


దక్షప్రజాపతికి ప్రసూతి ద్వారా ఇరవై నలుగురు కూతుళ్ళు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకలైన పదముగ్గురు కన్యలను దక్షిణా పుత్రుడయిన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తరువాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను పేర్లు గల పదకొండుగురు కన్యలనూ దక్ష ప్రజాపతి క్రమంగా భృగుమహర్షి, పరమశివుడు, మరీచి, అంగిరా మహర్షి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వసిష్ఠుడు, అగ్ని, పితరుడు - అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు.


వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శ్రుతుడు, క్రియకు దండలయ, వినయులూ, బుద్ధికి బోధుడూ, లజ్జకు వినయుడూ, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమా, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారలు పుట్టారు. కామదేవునికి రతి పత్నికాగా వారికి హర్షుడుద్భవించాడు.


కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివునీ, సతినీ తప్ప ఇతర బంధువుల నందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలువకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్నీ తనకు జరిగిన అవమానాన్నీ తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణ త్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్ పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికీ దేవసేనానికీ తల్లియై లోకారాధ్య అయింది.


అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలియై పోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పినాక పాణి శంకరభగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువ వంశంలో పుట్టుమని శపించాడు.


(అధ్యాయం - 5)


No comments:

Post a Comment