Thursday 14 December 2023

శ్రీ గరుడ పురాణము (34)

 

తరువాత శరీరంలో, చేతుల్లో మూడు ప్రకారాల మంత్రన్యాసం చేయాలి. ముందు పన్నెండక్షరాల బీజమంత్రంతో, తరువాత మరో మంత్రంతో, న్యాసం, షడంగన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్ నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్ఠంతో ప్రారంభించి మధ్య వేలి దాకా న్యాసం చేసి మరల ఆ మధ్య వేలిపైనే రెండు బీజమంత్రాలతో న్యాసం చేసి మరల శరీర విభిన్నంగాలపై న్యాసం చేయాలి. క్రమంగా గుండె తల, పిలక, టెంకి, మోము, కనులు, కడుపు, వీపు, అంగన్యాసం చేస్తూ రెండు భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్ళలోన కూడా న్యాసం చేయాలి. (చేతుల తరువాత మోకాళ్ళు)


తరువాత రెండు చేతులనూ కమలాకారంలో పెట్టుకొని దాని మధ్య భాగంలో బొటన వ్రేళ్ళను కలిపి నిలపాలి. ఈ ముద్రలోనే కొంతసేపుండి పరమతత్త్వ స్వరూపుడు, అనామయుడు, సర్వేశ్వరుడు, భగవానుడునగు నారాయణ చింతనం గావించాలి.


తరువాత ఇవే బీజమంత్రాలతో క్రమంగా చూపుడు వేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో న్యాసం చేసి యథాక్రమంగా తల, కనులు, మోము, గొంతు, గుండె, బొడ్డు. వెనుక భాగము, రెండు మోకాళ్ళు, కాళ్ళలో కూడా న్యాసం చేయాలి.


బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసం చేయాలి. బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా అయిదు బీజమంత్రాలతో న్యాసం చేయాలి. ఏ అంగానికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నపుడు మననం చేయాలి.


తరువాత సాధకుడు అవే బీజ మంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకొని పూజన క్రియ నారంభించాలి. ముందుగా ఏకాగ్రచిత్తంలో తన హృదయంలో యోగ పీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశలలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాసం చేయాలి ఇలా :


అగ్ని కోణంలో            ఓం ధర్మాయ నమః


నైరృత్య కోణంలో          ఓం జ్ఞానాయ నమః


వాయు కోణంలో          ఓం వైరాగ్యాయ నమః


ఈశాన కోణంలో          ఓం ఐశ్వర్యాయ నమః


తూర్పు దిక్కులో          ఓం అధర్మాయ నమః


దక్షిణ దిక్కులో           ఓం అజ్ఞానాయ నమః


పడమటి దిక్కులో         ఓం అవైరాగ్యాయ నమః


ఉత్తర దిక్కులో           ఓం అనైశ్వర్యాయ నమః



అని అంటూ న్యాసం చేయాలి.


No comments:

Post a Comment