Saturday, 16 December 2023

శ్రీ గరుడ పురాణము (35)



సాధకుడీ విధంగా న్యాసవిధులతో ఆచ్ఛాదింపబడిన తన శరీరాన్ని ఆరాధన పీఠంగానూ తనను తాను దాని స్వరూపంగానూ భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితుని చేసుకోవాలి. తరువాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి.


తరువాత ఋగ్వేదాదులలోని మంత్రాలతో సూర్య, చంద్ర, అగ్న్యాదులను ధ్యానించుకోవాలి. తరువాత అష్టదళకమలంపై ఎనిమిది దెసలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై వుండు విమలాది శక్తులను విన్యస్తం చేసి తొమ్మిదవ శక్తిని కర్ణికపై స్థాపించాలి.


వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విధ్యుక్తంగా పూజ చేయాలి. తరువాత మరల మనస్సు ద్వారా విష్ణుభగవానుని అంగసహితంగా ఆవాహనం చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్ఠించాలి. అపుడు తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలో నున్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చేయాలి. కమలము యొక్క మధ్య భాగంలోనూ కోణాల పైననూ ఈ క్రింది విధంగా అస్త్రమంత్ర న్యాసాన్ని గావించాలి.


తూర్పువైపు దళంలో  హృదయాయ నమః

దక్షిణం వైపు దళంలో  శిరసే స్వాహా

పశ్చిమం వైపు దళంలో   శిఖాయై వషట్

ఉత్తరం వైపు దళంలో    కవచాయ హుం

మధ్యంలో   నేత్రత్రయాయవైషట్

కోణంలో   అస్త్రాయఫట్ 


అంటూ న్యాసం చేయాలి,


No comments:

Post a Comment