తరువాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు, పడమటి ద్వారాలలో ఓం వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో 'ఓం సుదర్శనాయ నమః, ఓం సహస్రారాయనమః' అని ఉచ్ఛరిస్తూ వేయి అర్రలున్న సుదర్శన చక్రమును స్థాపించాలి. దక్షిణ ద్వారంలోనే ఓం శ్రియైనమః మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని వ్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓం లక్ష్మ్యై ననః అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి. తరువాత ఉత్తర దిశలో ఓం గదాయై నమః అంటూ గదనీ, కోణాలలో ఓం శంఖాయై నమః అంటూ శంఖాన్నీ న్యాసం చేయాలి.
పిమ్మట విష్ణుదేవునికి రెండు వైపులా ఆయుధాల నుంచాలి. దక్షిణం వైపు ధనుస్సు (శారంగము) నీ ఎడమ వైపు బాణములను అలాగే కుడి యెడమలలో కత్తినీ కవచాన్నీ వుంచాలి.
ఆపై సాధకుడు మండలమధ్యంలో దిశాభేదానుసారము తూర్పుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను వారి ఆయుధాలతో సహా స్థాపించాలి. అలాగే పైకి ఓం బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ ఓం అనంతాయ నమః అనే మంత్రం ద్వారా అనంతునీ వ్యాసం చేయాలి.
ఈ ప్రకారంగా అందరు దేవతల న్యాస, ధ్యాన, పూజనాలను చేస్తూ ఆయా దేవతల కెదురుగా వారి వారి ముద్రలను ప్రదర్శించాలి. అంజలి బద్ద ముద్ర మొదటి ముద్ర. దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి తొందరగా లభిస్తుంది. రెండవది వందినీ ముద్ర, మూడవదైన హృదయాసక్త ముద్రను ఎలా ప్రదర్శించాలంటే ఎడవు పిడికిటిలో కుడిబొటనవ్రేలిని బంధించి ఎడమ బొటన వేలిని పైకెత్తి గుండెకు తగల్చాలి. వ్యూహ పూజలో ఈ మూడిటినీ సాధారణ ముద్రలుగా పరిగణిస్తారు. రెండు చేతుల వేళ్ళనూ ఒకదానికొకటి తగిలించి వుంచి ఒక్కొక్క వ్రేలిని వదులుకుంటూ పోవడం ద్వారా ఎనిమిది ముద్రలు ఏర్పడతాయి.
రెండు చేతుల బొటనవ్రేళ్ళనూ వాటి మధ్యమ, అనామిక, చిటికెన వ్రేళ్ళకు తగిలించి క్రిందికి వంచి చూపే ముద్రను 'నరసింహ' ముద్ర అంటారు. కుడిచేతిపై ఎడమ చేతిని ఉత్తాన స్థితిలో పెట్టి ప్రతిమపై మెల్ల మెల్లగా తిప్పడాన్ని 'వారాహీ' ముద్ర అంటారు. ఆయా దేవుళ్ళకివి ప్రియమైన ముద్రలు. రెండు పిడికిళ్ళను బిగించి ఒకదానిపై నొకటిగా వుంచి ఒక్కొక్క వ్రేలినే మెలమెల్లగా విడిపించి మరల పిడికిళ్ళను బిగించడాన్ని 'అంగముద్ర అంటారు. పది దిక్కుల పాలకులకూ సాధకుడు ఈ విధంగా ముద్రలను చూపించాలి.
No comments:
Post a Comment