Wednesday 13 December 2023

శ్రీ గరుడ పురాణము (33)

 


* సమస్త శరీరాన్నీ రక్షిస్తూ, ప్రతి భక్తుని చుట్టూ ఒక ఆవరక శక్తి వుంటుంది. దాన్ని 'అస్త్ర' అంటారు. న్యాసం చేసినపుడు ఈ శక్తిని రెండు చేతులలో కల్పన చేసుకోవాలి.

తరువాత ఒక మండలాన్ని నిర్మించి నాలుగు రంగులు అద్ది గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి. దానికి అరవై నాలుగు రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒక వైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలనూ విష్ణుపూజలో వలెనే స్థాపించాలి. హవనమూ చేయాలి. తరువాత


ఓం ఘం టం డం హం శ్రీ మహాలక్ష్మ్యై నమః 

అనే మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి.


అటు పిమ్మట సాధకుడు- 'ఓం సౌం సరస్వత్యై నమః ।' ఓంహ్రీం సౌం సరస్వత్యై నమః | 'ఓం హ్రీం వద వద వాగ్వాదిని స్వాహాః' ఓం హ్రీం సరస్వత్యై నమః ' అను మంత్రాలనుచ్చరించి సరస్వతీ దేవికి నమస్కరించాలి.


(అధ్యాయాలు 6-10)


నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం


“పరంధామా! నవ వ్యూహార్చన విధిని గూర్చి తెలుసుకొనగోరుతున్నాము” అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు.


“మహా పురుషులారా! ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గూర్చి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను.


సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక, నాభి, హృదయతత్త్వములను ఆకాశనామకతత్వంలో ప్రవేశింపజేయాలి. తరువాత 'రం' అనే అగ్ని బీజ మంత్రంతో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తరువాత 'యం' అనే వాయు బీజమంత్రంతో సంపూర్ణ శరీరాన్ని లయింపజేస్తున్న భావన చేయాలి. తరువాత 'లం' అనే బీజమంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేస్తున్నట్లు భావించుకోవాలి. అటుపిమ్మట 'వం' అనే బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతాన్ని ధ్యానిస్తూ 'పీతాంబరధారియు చతుర్భుజుడునునగు శ్రీహరిని నేనే' అని భావించుకుంటూ ఆత్మతత్త్వ ధ్యానంలో నిమగ్నం కావాలి.


No comments:

Post a Comment