Monday 25 December 2023

శ్రీ గరుడ పురాణము (44)

 


(ఈ స్తోత్రంలో యజ్ఞశూకర శబ్దం వాడబడింది. వామన పురాణం 17వ అధ్యాయంలో కూడ ఇదే పదం వరాహస్వామిపరంగా వాడబడింది. విశాలాక్షశబ్దం గరుడవంశ విశేషమని శబ్దకల్పద్రుమంలో కనిపిస్తోంది. అలాగే ఆకూపారమనగా మేదినీకోశం ప్రకారం కూర్మావతారం)


పరమశివా! ప్రాచీన కాలంలో సర్వ ప్రథమముగా నేనీ విష్ణు పంజర నామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయని దేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై అమరులనే ఒక ఆట ఆడించి గెలిచి నిలిచిన మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షస వీరులను నిర్మూలించగలిగింది. దీనిని అనగా ఈ విష్ణు పంజర నామక స్తుతిని మంత్రం వలె శ్రద్ధాభక్తులతో జపించు మానవులు జీవితంలో ప్రతి దశలోనూ విజయాన్నే పొందుతారు.


* పంజరమనగా “రక్షించునది' అని అర్ధము. విష్ణువను పేరు గల రక్షకుడు మనం ఈ స్తోత్రం చేస్తే మనను రక్షిస్తాడు.


(అధ్యాయం - 13)


ధ్యాన - యోగవర్ణన


పరమేశ్వరా! భోగాన్నీ మోక్షాన్నీ ఇచ్చే శక్తి యోగానికుంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికీ ధ్యానానికీ గమ్యమైనవాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్త్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. ఇలా :


'నేను విష్ణువును. నేనే అందరికీ ఈశ్వరుడను. నేనే అనంతుడను. *షడూర్మ రహితుడను నేనే. నేను వాసుదేవుడను. నేనే జగన్నాథుడను. బ్రహ్మరూపమూ నాదే. సమస్త ప్రాణుల శరీరాలలోనుండు ఆత్మనూ, సర్వదేహ విముక్తుడైన పరమాత్మనూ నేనే.


* * 'షడూర్మ - శోకమోహొ జరా మృత్యూ క్షుత్పిపాసే షడూర్మయః - అని శబ్ద కల్పద్రుమంలో చెప్పబడింది. శోకం, మోహం, ముసలితనం, మరణం, ఆకలి, దప్పిక అనే ఆరు ఊర్ములు మనిషిని బాధిస్తాయి. యోగిని బాధించలేవు.


No comments:

Post a Comment