Friday, 31 March 2023

శ్రీదత్త పురాణము (95)

 


విరాగి, జ్ఞాని అనేవి కూడా పూర్ణ అర్ధంలో ఒక్కటే. ఈ విరాగి ప్రారబ్దాలను అనుభవిస్తూ, నిష్కామర్మ కర్మలు చేస్తూ క్రమంగా ముక్తిపొందుతాడు. అతడికి మరింక పునర్జన్మ లేదు. సకామంగా కర్మల్ని ఆచరిస్తే అనుభవించటానికి మళ్ళీ, మళ్ళీ పుట్టవలసిందే. ఫలానుభవం ఆశిస్తే కర్మలు నశింపవు. అందుకనే ఈ కర్మబంధాలు జన్మపరంపరను కలిగిస్తాయి. నిష్కామ కర్మాచరణమొక్కటే దీనికి తరుణోపాయం. అప్పుడు కర్మబంధాలు ఉండవు. 


జన్మ పరంపరలు ఉండవు. ఇది జన్మరాహిత్యప్రదమైన జ్ఞానమార్గం. ఇక యోగమార్గం చెబుతాను శ్రద్ధగా విను.


యోగమార్గంలో ప్రయాణించాలి అంటే ముందుగా మనస్సునూ ఇంద్రియాలను జయించాలి. ఇది అంత తేలిక కాదు. దృఢ నిశ్చయం తీవ్ర ప్రయత్నం నిరంతర సాధన ఉండాలి. ముందుగా ప్రాణాయామాన్ని అభ్యసించాలి. దీనితో శరీరంలోని కఫాది దోషాలన్నీ నశిస్తాయి. రెండవది - ధారణ - దీని వల్ల మనస్సులోని కిల్బిషాలన్నీ తొలగిపోతాయి. దాని తర్వాత ప్రత్యాహారం దీనితో ఇంద్రియ సంసర్గ దోషాలన్నీ నశిస్తాయి. ధ్యానం మూడవది. ఇది అనీశ్వర గుణాలను తొలగిస్తుంది. అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. రాగి, బంగారంలాంటి లోహాలను కొలిమిలో కాలిస్తే వాటిలోని దోషాలు పోయి శుద్ధి అయినట్లు ఈ ప్రాణాయామం వల్ల ఇంద్రియాలు పరిశుభ్రమవుతాయి. ప్రాణాయామము అంటే ప్రాణాపాన నిరోధం. ఇది లఘువు - మధ్యమం - ఉత్తమం అని మూడు విధాలు. ఇక్కడ కాలప్రమాణం గురించి నీవు తెలుసుకోవాలి. ఇక లఘువును ఉచ్ఛరించటానికి పట్టేకాలాన్ని లేదా కనురెప్ప మూసి తెరవటానికి పట్టే కాలాన్ని ఒక "మాత్ర" - అంటారు. పన్నెండు మాత్రల సేపు ప్రాణవాయువును నిరోధిస్తే దాన్ని లఘు ప్రాణాయామం అంటారు. దీని వల్ల స్వేదదోషం నశిస్తుంది. ఇరవై నాలుగు మాత్రలకాలం చేస్తే దాన్ని మధ్యమప్రాణాయామం అంటారు. దీనివల్ల వణుకు రోగం తగ్గుతుంది. ముప్పది ఆరు మాత్రలకాలం ప్రాణాయామం చేస్తే దాన్ని ఉత్తమం అంటారు. దీనితో విషాదదోషం అంతరిస్తుంది. ప్రాణవాయువును ఇంతంతసేపు నిరోధించటం సాధ్యమా అని విస్తుపోవద్దు. మహా మహా క్రూర జంతువులే మనిషికి మచ్చిక అవుతున్నాయి. చెప్పినట్టు వింటున్నాయి. అలాగే సాధన వల్ల ప్రాణవాయువు, మహాయోగికి చెప్పుచేతల్లో వుంటుంది. ప్రారంభంలో మావటివాడులాగా దానికి మనం లొంగి వుంటాం. ఆపైన ఆ ఏనుగు మనకు లొంగివస్తుంది.


Thursday, 30 March 2023

శ్రీదత్త పురాణము (94)

 


సంసార మహాయాత్రలో అలిసిపోయి భ్రాంతచిత్తులై దీని నీడకు చేరినవారికి సుఖమనేది ఎలా లభిస్తుంది చెప్పు? సత్సంగం అనే రాయి మీద బాగా పదును బెట్టిన జ్ఞానఖడ్గంతో ఈ మమతా మహాతరువుని నరికి వెయ్యగలిగిన వారికి ఆత్మమార్గం కనిపిస్తుంది. వారు ఆ దారిన ప్రయాణించి శాంతమూ నీరజస్కమూ నిష్కంటకమూ అయిన బ్రహ్మవనాన్ని చేరుకుంటారు. అప్పుడు అక్కడ పునరావృత్తి వర్జితమైన నివృత్తిని పరాప్రజ్ఞను అందుకుంటారు. పంచభూతాలతో పంచేద్రియాలతో నిర్మితమైన ఈ స్థూలశరీరం నువ్వు కావు. నేనూ కాను, పంచతన్మాత్రికాధికంతో ఏర్పడిన సూక్ష్మశరీరం నువ్వు కావు, నేను కాను.


రాజా! గుణాత్మకమూ సంఘాత రూపమూ అయిన ఈ దేహంతో ప్రధానుణ్ని దర్శించగలుగుతున్నావా?


మేడిపండు, మశకమూ, నీరు, చేప, నిషీకమూ ముంజుగడ్డి (ధర్భ) వీటి సంబంధం లాంటిదే క్షేత్ర ఆత్మల సంబంధం.


వీటి లోతును తెలుసుకున్నావు సంతోషం.


అలర్కుడికి దుఃఖం తొలగిపోయింది. కానీ మళ్ళీ అదే విషయాలు - రాజ్యమూ . రాజభోగాలూ ఆక్రమణలూ యుద్ధాలూ జ్ఞాపకం వస్తున్నాయి. దుఃఖం తొలగినట్టే తొలగి మళ్ళీ వచ్చి ఆవరిస్తోంది. శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. దత్తాత్రేయుల వారిని ప్రశ్నించాడు.


దత్తదేవా! నీ దయ వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. ప్రకృతి-పురుష వివేకం కలిగింది. నేను అంటే ఏమిటో తెలిసింది. దుఃఖం అంతరించింది. కానీ ఈ స్థితి స్థిరంగా ఉండేట్టు కనిపించటం లేదు. మళ్ళీ అజ్ఞానం ఆవరించి దుఃఖానుభవం తొంగి చూస్తోంది. దుఃఖరహితస్థితిని స్థిరపరచుకొనే ఉపాయం చెప్పు. ప్రకృతి బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవటం ఎలాగో ఉపదేశించు. పునర్భవం లేకుండా నిర్గుణ పరబ్రహ్మంతో శాశ్వతంగా ఐక్యం మార్గం పొందే చూపించు. నువ్వు తప్ప నాకు శరణ్యులు లేదు. అనుగ్రహించు. అలర్కుడి ప్రార్థనను దత్తుడు మన్నించాడు. అతడిలో భక్తినీ, ఆర్తిని గుర్తించి అతి రహస్యమైన యోగవిద్యను ఇలా ఉపదేశించాడు.


అలర్క నృపాలా! నీ జిజ్ఞాసకు ఆనందించి ఈ రహస్య విద్యను ఉపదేశిస్తున్నాను. శ్రద్ధగా గ్రహించు. ప్రకృతి పురుషులు వేరు వేరని తెలుసుకున్నావు గదా! పురుషుడు ఆ ప్రకృతి గుణాలతో కలిసిపోకుండా బ్రహ్మపదార్థంతో కలవటమే ముక్తి అంటే.

ఈ శరీరం తుచ్చమూ, నశ్వరమూ అయినా, ఇది పూర్తిగా తిరస్కరింపతగినది, త్యజింపదగినది కాదు. దీని వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధర్మసాధనకు, కర్మసాధనకు మూలం ఇదే. ఈ శరీరంతోనే స్థిరమైన వివేకాన్ని సంపాదించుకోవాలి. అవివేకం వల్ల మమకారం, మమకారం వల్ల సంగం, సంగం వల్ల దుఃఖం కలుగుతున్నాయి. కనుక సంగాన్ని వదులుకోవాలి. అప్పుడే యోగసిద్ధి కలుగుతుంది. అదే ముక్తి అంటే. వీటిని తొలగించుకుంటూ వెళ్తూ సంగం వదిలించుకుంటే మమకారం నశిస్తుంది. మమకారం నశిస్తే వైరాగ్యం ఉదయిస్తుంది. ఇది ఉదయించగానే సృష్టిలో ఉన్న సమస్త పదార్థాలలో దోషాలు కనిపిస్తాయి. దోషాలు కనిపించినపుడు ఆ పదార్థాల మీద అనురాగం కలుగుతుందా? కలుగదు. అందుచేతనే జ్ఞానికి ఉన్న చోటనే ఇల్లు. తిన్నదే భోజనం. దేని మీద మమకారం ఉండదు. అభిలాష ఉండదు. ఈ కొంచెం (దినుసు) వైరాగ్యాన్నే జ్ఞానం అంటారు. ఇదే మోక్ష సాధనం. తక్కినదంతా అజ్ఞానం. జ్ఞానము, వైరాగ్యము పరస్పర పోషకాలు. 

Wednesday, 29 March 2023

శ్రీదత్త పురాణము (93)

 


అలర్కుడికి జ్ఞానోదయమయ్యింది. చిటికెలో దుఃఖం తొలగిపోయింది. దత్తాత్రేయులవారికి మళ్ళీ సాష్టాంగపడ్డాడు. సవినయంగా విన్నవించాడు. దత్తదేవా సమదృష్టితో ఆలోచించాను. తెలిసిపోయింది నాకు దుఃఖమన్నదే లేదు. అజ్ఞానం వల్ల ఇంతకాలమూ దుఃఖార్లవంతో త్రెళ్ళుతున్నాను. ఇప్పుడు తేలికపడ్డాను. దుఃఖకారణం తెలిసిపోయింది. 

మమకారమొక్కటే దుఃఖహేతువు. ఏకైక హేతువు. ఏయే వస్తువుల పట్ల మమత్వం పెంచుకుంటామో అదల్లా చివరికి దుఃఖమే మిగులుస్తుంది. ఒక పిల్లి మన పెంపుడుకోడిని చంపేస్తే మనకు దుఃఖం వస్తుంది. అదే పిల్లి ఏ ఎలకనో, పిచికనో భక్షిస్తే, మనకేమీ అనిపించదు. దానికి కారణం? కోడిని పెంచి దాని మీద మమకారం పెంచుకోవటం, ఎలుక మీదా, పిచుక మీదా అలా పెంచుకోకపోవటం.


నేను ప్రకృతి కంటే పరుణ్ని. కనుక నేను సుఖినీ కాదు. దుఃఖినీ కాదు. పంచభూతాల చేతనే పంచభూతాలకూ సుఖదుఃఖాలు కలుగుతున్నాయి. వాటికి అతీతుడనైన నాకు అవి రెండు లేవు. ఈ మాటలకు దత్తాత్రేయుడు సంతోషించాడు. అలర్కభూపతీ, నువ్వున్నది ముమ్మాటికీ సత్యం. “మమ" అనేది దుఃఖానికి మూలం. “న మమ" అనేది పరమసుఖానికి హేతువు.


నేను వేసిన ఒక చిన్నప్రశ్నతోనే నీకు ఇంతటి జ్ఞానం ఉదయించింది. క్షణంతో మమకారాన్ని దూదిపింజలా ఎగరగొట్టగలిగావు. ఇంక నీకు నేను ఉపదేశించవలసింది ఏముంది? నీ దుఃఖాన్ని నువ్వే తొలగించుకున్నావు. మహారాజా! మానవుల మనస్సుల్లో ఒక మహాతరువుంది. దానికి 'అహమ్' అనేది బీజం. "మమ" అనేది కాండం. ఇల్లు వాకిలీ పొలమూ పుట్రా అన్నవి శాఖోపశాఖలు. భార్యాపుత్రాదులు చిగుళ్ళు. ధనధాన్యాలు ఆకులు. అన్ని ఋతువుల్లోనూ వాకిలీ ఎళ్ళవేళలా ఎదిగే వృక్షమిది. పాపపుణ్యాలు దీని పువ్వులు. విచికిత్సలు తుమ్మెదలు. సుఖదుఃఖాలు దీని ఫలాలు, మోక్షమార్గానికి అడ్డంగా ఎదిగే మహావృక్షమిది. మూఢులు దీని నీడకు చేరతారు. దీన్ని పెంచి పోషిస్తారు.


Tuesday, 28 March 2023

శ్రీదత్త పురాణము (92)

 


అలర్కుడికి దత్తుడు ఉపదేశించిన యోగమార్గం దర్శనం -


దత్తాత్రేయుడు కరుణించాడు. రాజా! నీ దుఃఖాన్ని ఇప్పుడే తొలగిస్తాను. నిజం చెప్పు. నీకసలు ఈ దుఃఖం ఎందువల్ల కలిగింది? నువ్వు ఎవరివి? ఈ దుఃఖం ఎవరిది? 'నువ్వు' అంటే ఈ అవయవాలా? వీటి సంపుటియైన దేహమా? లేక అందులో దాగి ఉన్న ఆత్మయా? వీటిలో ఏది నువ్వు? ఈ దుఃఖం ఎవరిది? ఇది కొంచెం ఆలోచించి చెప్పు, దుఃఖం ఎవరిదో దుఃఖకారణమేమిటో, దుఃఖం ఎక్కడ ఉన్నదో తెలిశాక దాన్ని తొలగించటం ఏ పాటి చిటికెలో పని.


అలర్కుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే నేనెవణ్ని? నేను అంటే అవయవాలా? దేహమా? ఇవి రెండూ జడపదార్థాలుగదా! అవి "నేను" అని ఎలా అనుకుంటాము? అలా అనుకునేదేదో తెలిస్తే అదే దుఃఖానికి స్థానమవుతుంది. నేను అంటే శరీరం కాదు. అది పంచభూతాలతో నిర్మితమయ్యింది. కనుక నేను అనేది పంచభూతాలలో ఏ ఒక్కటీకాదు. మొత్తం వీటి కలయిక అయిన ఈ దేహాన్ని నేనుగా భ్రమపడుతున్నాను. ఈ భ్రాంతి వల్లనే సుఖదుఃఖాలు రెండూ కలుగుతున్నాయి. దీనికి సంభవించే సుఖదుఃఖాలకూ, ఈ దేహానికి అతీతుడనైన నాకూ ఏమిటి సంబంధం? నేను నవ్వడమేమిటి. నేను ఎడ్వడమేమిటి? నేను నిరంజనుణ్ని, నేను నిస్సంగుణ్ని. నేను నిత్యుణ్ని. నేను నిర్మలుణ్ని. ఎక్కువలూ, తక్కువలూ, పడటాలూ, లేవడాలు నాకు లేవు. మరి నాకు దుఃఖమేమిటి సుఖమేమిటి? ఏదీ లేదు.


ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలూ, ఐదు ప్రాణాలు, మనస్సు, అహంకారమూ అనే ఈ పదిహేడు తత్వాలతో కూడిన సూక్ష్మశరీరం ఒకటి ఉంది. ఈ రెండింటికి అతీతంగా నిలబడి వాటిని విడివిడిగా చూడగల్గుతున్న నాకు సుఖమేమిటి? దుఃఖమేమిటి? అంతా వట్టి భ్రాంతిగాక.


సుఖదుఃఖాలకు ఉనికి పట్టు మనస్సు. కనుక అవిదానివే తప్ప నావికాదు. నాకు వాటితో ఏ సంబంధమూ లేదు. నేను మనస్సును కాదుగదా! బుద్ధినీకాను. అహంకారమునూ కాను. స్థూలసూక్ష్మ శరీరాలు రెండూ కాను. వీటికి అతీతుణ్ని, వీటికన్నా విలక్షణుణ్ని. నాకు అత్యంత సమీపంలో ఉండి భ్రాంతి మూలకమే అయినప్పటికీ ఏదో కొంత సంబంధమే ఉన్న ఈ శరీరమే నేను కానప్పుడు, దీనికున్న అంతర్బహిరవయవాలలో ఏదీ నేను కానప్పుడు, ఎక్కడో దూరంగా ఏ సంబంధమ లేకుండా ఉన్న చతురంగ బలాలూ, కోశాగారాలూ, అంతఃపురాలూ, సింహాసనాలు - ఇవి "నేను" ఎలా అవుతాయి? వాటికీ నాకు సంబంధం ఏమిటి? అంతా భ్రమ. నాకు ఏమీ లేవు. రాజ్యం లేదు. కోశం లేదు. శత్రువు లేడు. మిత్రుడు లేడు. ఒక్కటే ఆకాశం అనేక పాత్రలలో విభిన్న రూపాలతో కన్పిస్తున్నట్టు ఒక్కటే ఆత్మ-ఉపాధి భేదాలను బట్టి అనేకంగా కనబడుతోంది. ఆలోచించి చూస్తే అందరిలోనూ ఉన్నది ఒక్కటే ఆత్మ, సుబాహువులో, కాశీపతిలో, ఈ ఆలర్కుడిలో ఉన్న 'నేను' అనబడే పదార్థం ఒక్కటే. మరి మేము ముగ్గురం విభిన్నులం ఎలా అవుతాం? ఉపాధులు వేరు. ఆ ఉపాధి 'నేను' కాదు. నేనైనది ముగ్గురిలోనూ ఒక్కటే. అంచేత మాకు శత్రుత్వమేమిటి? మిత్రత్వమేమిటి? అంతా ఒక్కటే ఆత్మ! పరమాత్మ! లేదు. 


Monday, 27 March 2023

శ్రీదత్త పురాణము (91)


 

సుబాహువు వెంటనే కాశీరాజును కలుసుకున్నాడు. మదాలసాకువల యశ్వులకు మేము నలుగురు పుత్రులం. పై ముగ్గుర్నీ కాదని నాల్గవవాడు అలర్కుడు రాజ్యం కాజేశాడని ఇది అన్యాయం కనుక నువ్వు దండెత్తి అతణ్ని ఓడించి రాజ్యద్రుష్ణుడ్ని చేసి తమ రాజ్యం తమకు అప్పగించమని వేడుకున్నాడు. కాశీరాజు ముందే దండయాత్రకు అంగీకరించలేదు. ముందుగా యోగ్యుడైన దూతను పంపాడు. సహజంగానే అలర్కుడు అహంకారంతో కాశీరాజు ప్రతిపాదనను తిరస్కరించాడు. సుబాహువునే స్వయంగా వచ్చి అర్థించమనండి మంచిగా అడిగితే ఇస్తాను. అంతేగానీ శత్రువులను ఆశ్రయించి ఇలా దూతలను పంపిస్తే మాత్రం బెదిరింపులకు లొంగను అని సమాధానం పంపాడు. సుబాహువు తన అభిమానం దెబ్బతిన్నట్లుగా నటించాడు. కాశీరాజును మాటలతో ఎగత్రోశాడు. మీరు పంపిన సందేశాన్ని తిరస్కరించటం అంటే మిమ్మల్ని తిరస్కరించటమే సమర్థుడైన క్షత్రియుడు తిరస్కారాలను భరిస్తాడా?


వెళ్ళి యాచిస్తాడా? ఇంకదండోపాయ మొక్కటే మార్గం అన్నాడు. కాశీరాజు అవునని సర్వసేనాసమేతుడై అలర్కుడిపై దండెత్తాడు. గిరిదుర్గాలను, వనదుర్గాలను ఆక్రమించుకుని ఆటవికరాజులను లోబరుచుకుని అలర్కుడి సామంతులను తొలగించి తన వారికి అప్పగించి ఇలా ఒక పథకం ప్రకారం అలర్కుడి రాజ్యాన్ని అన్నివైపుల నుండీ ఆక్రమించాడు కాశీరాజు. అలర్కుడి యొక్క ప్రతిఘటనలు, ప్రయత్నాలు ఫలించలేదు. దైవమే అనుకూలించనప్పుడు అన్నీ ఎదురుదెబ్బలే. అన్ని అపజయాలే. వృధాగా అహంకరించటం తప్ప మానవమాత్రుడు ఏ పాటి. అలర్కుడిలో భరింపరాని విషాదం అలుముకుంది. అలనాడు తల్లి ఇచ్చిన ఉంగరం గుర్తుకు వచ్చింది. భరింపరాని దుఃఖం కలిగినప్పుడు అది తెరిచి అందులో వున్న శాసనాన్ని చదవమంది తల్లి మదాలస. త్వరత్వరగా స్నానం చేసి శుచిగా ఆ వుంగరం విప్పిచూశాడు. అందులో చిన్న బంగారురేకు వుంది. మెల్లగా పైకితీశాడు. కళ్ళకి అద్దుకున్నాడు. ఆ రేకు మీద సన్నటి అక్షరాల్లో రెండు శ్లోకాలు వున్నాయి.


1.శ్లో: సంగసర్వాత్మనా త్యాజ్య: సుచేత్ త్యక్తుం న శక్యతే || 

స సబ్దిసృహ కర్తవ్యః సద్భిస్సంగోః స భేషజమ్ |


2.శ్లో: కామస్సర్వాత్మనా హేయః హాతుం చేత్ శక్యతే న సః॥ 

ముముక్షాం ప్రతి కర్తవ్యో సాపై తస్యాసి భీషణమ్ | 

విడువవలయు విడువవలయు సంగమ్ము విడువవలయు 

విడువలేని ఎడల వలయు సత్సంగ మొనరింపవలయు 

సతనము సంగ రోగౌషధము సత్సంగ మిలలో-

విడువవలయు విడువవలయు కామమ్ము విడువవలయు

విడువలేని ఎడల మోక్షకామమునెప్పుడు కోరవలయు

కామరోగౌషధమ్ము మోక్షకామమ్ము ఇలలో.


దేనితోనూ సంగం పనికిరాదు. దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. విడవడం సాధ్యం కాకపోతే దాన్ని సత్సంగంగా మలుచుకోవాలి. సజ్జనులతో సాంగత్యం పెంచుకుంటే అదే సంగవిముక్తికి మహాఔషధం. అలాగే కామమనేది అన్ని విధాల ప్రమాదకరమైనది. దాన్ని కూడా వదిలించుకోవాలి. అది శక్యంకాకపోతే దాన్ని మోక్షం వైపుకి మళ్ళించాలి. ముక్తి కాముకుడు కావాలి. కామత్యాగానికి ఇదొక్కటే సరియైన మందు. ఈ రెండు శ్లోకాలు పదాలు పదే పదే ఉచ్ఛరించాడు. భావం హృదయానికెక్కింది. ముక్తికామమే ఉత్తమోమమని విశ్చయించుకున్నాడు. దాన్ని సాధించాలంటే సత్సంగం. మొదటి మెట్టు అని గ్రహించాడు. సాధు సజ్జనుల కోసం ఆలోచించాడు. దత్తాత్రేయుడు గుర్తుకి వచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సహ్యాద్రికి బయలుదేరాడు. దత్తుణ్ని దర్శించాడు. పాదాలపై బడి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా నిన్ను శరణు వేడుతున్నాను. నీవేదిక్కు కరుణించు. దుఃఖార్తుడనై వచ్చాను. దయచేసి నా దుఃఖం తొలగించు - అని దీనాతిదీనంగా ప్రార్థించాడు.


Sunday, 26 March 2023

శ్రీదత్త పురాణము (90)



తనకు చేదోడు వాదోడుగా నిలుస్తూ సహకరిస్తున్న వేళ అలర్కుడి బుద్ధి కుశలతనూ, ధర్మ నిష్టనూ, కార్య నిర్వహణ దక్షతనూ గ్రహించి సంతృప్తి చెందాడు. రాజ్యభారం కొడుకు భుజాల మీద పెట్టవచ్చునని నిశ్చయించుకొని ఒక మంచి సుముహుర్తాన రాజ్య పట్టాభిషేకం జరిపించాడు. సింహాసనం అప్పగించాడు. మదాలసా సమేతుడై తాను వానప్రస్థానికి బయలుదేరాడు. మదాలస అలర్కుడ్ని ప్రేమగా దగ్గరకు తీసికొని మృదువుగా చివరి మాటగా కామోపభోగ ప్రక్షాళనకరమైన హితవు చెప్పింది. నాయనా నీవు గృహస్థ ధర్మంలో వున్నావు. రాజ్యభారాన్ని భుజాల మీదకు ఎత్తుకున్నావు. ఇవి రెండూ దుఃఖహేతువులే. మమకారాలకు బానిసయైన గృహస్థు తనకు తానే దుఃఖం కొనితెచ్చుకుంటున్నాడు. అందుచేత నీకు ఎప్పుడైనా భరింపలేని దుఃఖం కలిగితే అప్పుడు మాత్రమే, ఇదిగో నేను ఇస్తున్న ఈ ఉంగరం ముద్రను విప్పి అందులో బంగారు రేకు మీద సూక్ష్మాక్షరాలలో వున్న శాసనాన్ని చదువు అని చెప్పి ఉంగరాన్ని ఒక చిన్న బంగారు పెట్టెలో భద్రపరచి అందించింది.


శుభంభవతు! కళ్యాణమస్తు! అని అలర్కుణ్ని ఆశీర్వదించి మదాలసా కువలయాశ్వులు నిర్మలంగా అడవులకు వెళ్ళిపోయారు. రాజ్యపాలన బాధ్యత స్వీకరించిన అలర్కుడు వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాడు. భోగ భాగ్యాలు అనుభవిస్తూనే తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటా ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణలు చేస్తూ ధర్మబద్ధంగా శిక్షలు అమలు జరుపుతూ వున్నాడు. అనేకానేక యజ్ఞయాగాదులు నిర్వహించి ఆత్మసంతృప్తినీ అఖండ కీర్తిని సంపాదించాడు. ఆత్మజ్ఞానియై ధర్మంతో అర్ధాన్ని, అర్ధంతో ధర్మాన్ని పెంపొందించుకున్నాడు. ఈ రెండింటికీ మించిన విషయసుఖాలును అనుభవించాడు.


ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలన కొనసాగించినా రాజభోగాలు అనుభవించినా అలర్కుడికి తనివితీరడం లేదు. భోగాసక్తుడై వెంపర్లాడుతున్నాడే తప్ప వైరాగ్య భావనలు రావటం లేదు. రాజ్యాన్ని పుత్రులకు అప్పజెప్పి తామ తండ్రిలాగే అడవులకు పోదాం ఆముష్మికం గురించి ఆలోచిద్దాం ముక్కు మూసుకొని కాసేపు తపస్సు చేసుకొందాం. ఇలాంటి చింతనలే కలుగడం లేదు. అన్నగారైన సుభాహువు అలర్కుడి పరిస్థితి గమనించాడు. ఇతణ్ని నివృత్తి మార్గంలోకి మళ్ళించటం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి కష్టాలలోకి నెడితే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ఈ పని చేయాలనుకుంటే ఇతడి శత్రువులను ఆశ్రయించాలి. ఇరుగుపొరుగు రాజ్యాలు సహజశత్రువులు. అందువలన కాశీరాజును ఆశ్రయిస్తాను.


Saturday, 25 March 2023

శ్రీదత్త పురాణము (89)



ఈ రకమైన జోలలతో, బోధలతో బిడ్డల్ని పెంచింది. మొదటి ముగ్గురూ విరాగులై సామ్రాజ్యాన్ని సంసారాన్ని తృణీకరించి మునివృత్తిని స్వీకరించి అడవులకు వెళ్ళిపోయారు. తండ్రిగానీ రాజ గురువులుగానీ చేసిన ఏ ఉపదేశమూ వారి చెవికెక్కలేదు. బ్రహ్మవాదినియైన కన్నతల్లి చెప్పినదే వారికి వేదమయ్యింది. అదే రుచించింది. బ్రహ్మజ్ఞానులై వెళ్ళిపోయారు. కువలయాశ్వుడికి దిగులు పట్టుకుంది. నాల్గవవాడినైనా దక్కించుకోకపోతే సింహాసనమే కాదు వంశమే నిలబడదని గ్రహించాడు. అలర్కుడికి వైరాగ్య గీతాలు జోలలు పాడకుండా కట్టడిచేశాడు. నువ్వు నిజంగా పతివ్రతవే అయితే నా మాటజవదాటకూడదు. అలర్కుడికి జీవితంపట్ల రుచి కలిగించు. అనుకూల చింతననూ కలిగించు. నివృత్తి మార్గం కాదు. ప్రవృత్తి మార్గం బోధించు. సమర్థుడిగా, సద్గుణ సంపన్నుడిగా, సౌశీల్యం కలవానిగా మహావీరుడుగా, పరిపాలనా దక్షకుడిగా తీర్చిదిద్దు. ప్రయోజకుణ్ని చెయ్యి. దీనికి కావలసినవి అన్ని నూరిపొయ్యి. అటువంటి బుద్ధి పాటవాలను కలిగించు. ఇదేదో నావంశాన్ని నిలబట్టుకోవడానికో నా రాజ్యాన్ని కాపాడుకోవటానికో చెబుతున్న మాట కాదు.


ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు, అందరూ బ్రహ్మజ్ఞానులైపోయి నివృత్తి మార్గం వైపే ప్రయాణం చేస్తే కాంతాకవకాలను పరిత్యజిస్తే మరి గృహస్థాశ్రమం ఏమైపోవాలి? అదే లేకపోతే పితృదేవతలకి పిండ ప్రదానం చేసేదెవరు.? పితృదేవతల ఆత్మ సంతృప్తి చెందేలాగ బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమవాసులందరికీ పోషకుడు కదా గృహస్థు. దేవతలకూ అతిధులకూ పశుపక్ష్యాది జంతుమూలాలన్నింటికీ అన్నోదకాలు అందించేది గృహస్థులే కదా! ప్రజాతంతువు అవిచ్ఛిన్నంగా కొనసాగాలంటే, గృహస్థాశ్రమమే కదా మూల కందం. అందుచేత ఓ సాధ్వీమణీ! బ్రహ్మవాదినీ! ఈయన నాలుగో బిడ్డకు ఐహికా ముష్మిక జ్ఞానాలు రెండూ సరి సమానంగా భోదించు. సత్కర్మాచరణపట్ల గురి కుదుర్చు.


కువలయాశ్వుడి కోరిక ఆ పతివ్రత మదాలస అంగీకరించింది. ఆనాటి నుండి అలర్కుడికి సర్వధర్మాలను ఉపదేశించింది. రాజనీతిలో తీర్చి దిద్దింది. యుద్ధ విద్యల్లో పారంగతుణ్ని చేసింది. ధర్మాధర్మ వివేకం కలిగించింది. ప్రవృత్తి - నివృత్తుల సమ్మేళనం నేర్పింది. వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధకల్పం యజ్ఞదాన విధులూ ప్రజారంజక పరిపాలనం ఇలాగ ప్రవృత్తి మార్గం నేర్పింది. అలర్కుడు అన్ని విధాలా ప్రయోజకుడు అయ్యాడు తల్లిని మించినదైవమే కాదు. గురువుకూడా లేడు. కువలయాశ్వుడు కుమారుణ్ని చూసి సంబరపడి గర్వించాడు.


Friday, 24 March 2023

శ్రీదత్త పురాణము (88)

 


కువలయాశ్వుడు మరింక మాట్లాడలేదు. గంభీర వదనంతో ఇంతటి తాత్విక తార్కిక దృష్టివున్న ఈ మదాలస ఆనాడు నా మరణ వార్త వినగానే ప్రాణాలు ఎందుకు వదిలేసిందో అనుకుంటూ భారంగా కదిలాడు.


మదాలస తన బిడ్డల్ని పెంచడంలో కూడా ఇదే తత్వదృష్టితో పెంచింది. పెద్దవాణ్ని ఉయ్యాల్లో వేసినప్పట్నుంచీ వైరాగ్యగీతాలు జోలపాడింది. బిడ్డా ఎందుకు రోదిస్తావు నామ రూపాలు లేని శుద్ధాత్ముడవు. నీకు విక్రాంతుడు అని ఈ పేరు ఎలా పెట్టారనా? పంచ భూతాలతో ఏర్పడిన ఈ శరీరానికి ఏ శబ్దం అన్వయిస్తుందనా? ఎవడు ప్రభువనా? ఎందుకు ఏడుస్తున్నావు?


ఒక భూతం నుండి మరొక భూతం అభివృద్ధి చెందినట్లే ఈ శరీరం కూడా అన్నపానాదులతో ఎదుగుతుంది. వాటి వల్లనే క్షీణిస్తుంది. వృద్ధి క్షయాలకు సాక్షిగా నిలిచే నీవు ఆత్మవు. నిజానికి బిడ్డా నీకు హానివృద్ధులు లేవు. ఈ శరీరం నీకు తొడుగులాంటిది. ఇందులో నీవు బందీవి. చావు పుట్టుకల చక్రంలో తగుల్కొని అస్వతంత్రునిగా తిరుగుతూంటావు. తల్లితండ్రులనీ, బంధుమిత్రులనీ, నాదనీ, నీదనీ, అహంకార మమకారాలతో బంధనాలు ఏర్పరచుకుంటావు ఎందుకురా నాయనా ఇదంతా. అజ్ఞానకృతమైన ఈ అహంకారాలను విడిచి పెట్టు. కర్మలూ కర్మ బంధాలూ అన్నీ పటాపంచలవుతాయి. అదే నిజమైన తెలివి. దుఃఖాలు తొలగించుకోవాలనీ సుఖాలను కలిగించుకోవాలనీ అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇది అవివేకం. నీకు దుఃఖాలు వద్దు సుఖాలు వద్దు. రెండింటినీ వదిలించుకోవడమే నిజమైన వివేకం. నిజమైన జ్ఞానం. ఇది అలవరచుకో కుమారా.


ఈ సృష్టిలో కామపురుషార్థానికి లొగంని వాడు లేడు గదా. నారీమణి అంటేనే నరకానికి మారు పేరు. తనలాగే - పుట్టి తనలాగే పెరిగిన వనితలో అదనంగా ఏమి ఆకర్షణవున్నదో చెప్పగలడా? మలమూత్రాలకి నిలయమైన సుఖాన్ని కలిగిస్తాయి అనుకోవడం మూఢత్వంకదూ. పోనీ సౌందర్యరాశి అని కులుకుతున్న నీ శరీరంగానీ నీ తరుణీమణి శరీరంగాని శాశ్వతంగా నిలుస్తాయా? ఎదుగుదల అంతా పతనాభిముఖంగానే. యవ్వనం వ్రాహంలా పారిపోగానే వార్ధక్యం ఆవరించి నీ శరీరం నీకే అసహ్యమవుతుంది. ప్రేయసిపై ఏవగింపు కలుగుతుందే. ఆకర్షణలు కళ్ళముందే కరిగిపోతున్నా ఎన్ని తరాలు గడిచినా గుర్తించరేమి? అనిత్యానిశరీరాణి అన్నారు. అందువల్ల శరీరాన్ని నమ్ము కోవడమేమిటి? దీని మీద మమకారం పెంచుకోవడం ఏమిటి? ఎంతపిచ్చి? ఎంతవెర్రి? కుమారా నువ్వు మాత్రం నిత్యమూ సత్యమూ శివమూ సుందరమూ అయిన పరతత్వాన్ని నమ్ముకో, సుఖదుఃఖాలకు అతీతంగా జీవన్ముక్తుడవై వర్ధిల్లు.


Thursday, 23 March 2023

శ్రీదత్త పురాణము (87)

 


అప్పుడు మదాలస ప్రాణవల్లభా పేర్లు నచ్చడం నచ్చకపోవడమూ కాదు. నా నవ్వుకు కారణం వేరే వుంది. అది తరువాత చెబుతాను. ముందు ఈ బిడ్డడికి అలర్కుడు అని నామకరణం చేయండి వీడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు - అంది. కువలయాశ్వుడు అలాగే చేసాడు. విక్రాంతుడు, సుబాహువు, శత్రుమర్ధనుడు, అలర్కుడు నలుగురు బిడ్డలు దిన దిన ప్రవర్ధమానం అవుతున్నారు. 


సుమతి తన తండ్రికి చెప్తున్న వృత్తాంత్తాన్ని వేదధర్ముడు దీపకునితో చెబుతున్నాడు. శ్రద్ధగా వింటున్న దీపకుడి కుతూహలం పెరిగింది. గురుదేవా అనంతర కధ ఏమిటి? మదాలస ఎందుకు నవ్వింది? అందులో ఏదో అంతరార్ధం ఉండి వుంటుంది. ఆమె యోగ మాత మహాయోగినికదా. పైగా సరస్వతీ మహాదేవుల వరప్రభావంవల్ల పునర్జన్మించినదాయె. గురుదేవా ఇవన్నీ ఆసక్తి కలిగిస్తున్న అంశాలే. ఆ తండ్రీ కొడుకుల సంభాషణగా సాగిన అనంతర కధను త్వరత్వరగా చెప్పండి కధలో గొప్ప పట్టువుంది. మీరు చెబుతూంటే అది మరింతగా రక్తి కట్టి కుతూహలంతో వూపేస్తోంది అన్నాడు. వేదధర్ముడు సరే నని తండ్రీ కొడుకుల సంభాషణని యధాతధంగా వివరిస్తున్నాడు.


ఒకనాడు కువలయాశ్వుడు ప్రాణప్రియా మదాలసా! ఇంతకీ నా సందేహం నీవు తీర్చలేదు. బిడ్డలకి నానుకరణం చేసినప్పుడల్లా నీవు నవ్వేపు. ఎందుకు? ఆ పేర్లు నచ్చలేదందామా అంటే అవి చాల చక్కటి పేర్లు, పోనీ నవ్వు నాలుగోవాడికి పెట్టిన పేరు ఏమన్నా గొప్పదా? అందులో విపరీత అర్ధాలువున్నాయా? ఏమీలేదు. అలర్క శబ్దానికి పిచ్చి కుక్క అని అర్ధం. అంతగా హేళన చేసి నువ్వు పెట్టిన పేరు గొప్పగా వుందా? అసలు నీవు ఎందుకు నవ్వావో చెప్పు. యోగవిద్యా రహస్యాలు తెలిసిన దానివి. బిడ్డల భవిష్యత్తు వూహించి నవ్వావా? ఏమిటి? అడిగాడు. తన నవ్వును అవహేళనగా భావించి భర్త ఇలా నిగ్గదీస్తుంటే మదాలస కంగారుపడింది. సమాధానం చెప్పకపోతే భర్త మనసు నొచ్చుకుంటుంది అని గ్రహించి నాధా! నిన్ను కించపరచాలని నవ్వలేదు. బిడ్డల భవిష్యత్తు దర్శించినవ్వలేదు. కొంచెం ఆలోచిస్తే నేనెందుకు నవ్వానో మీకే తెలుస్తుంది. పెద్దవాడికి విక్రాంతుడు అనే పేరు పెట్టారు. క్రాంతి అంటే గతి అని అర్ధం. ఈ పేరు దేహానికి పెట్టినట్లా? ఆత్మకి పెట్టినట్లా? దేహమైతే జడ పదార్ధం కనుక కదలలేదు. మరి దేహానికి క్రాంతి అనే పేరు ఎలాకుదురుతుంది.? ఆత్మ అనేది సర్వవ్యాపకం అంతటా వ్యాపించి ఉన్న దానికి ఇంక కదలడం ఎలా కుదురుతుంది.? కాబట్టి విక్రాంతుడు అనే పేరు ఇటు దేహానికి ఆత్మకి కుదిరేదికాదు. ఇలాంటి పేరు పెట్టారేమిటి అని నవ్వు వచ్చింది. రెండో వాడికి సుబాహువు అని పేరు పెట్టారు. మంచి ధృఢమైన బాహువులు కలవాడు అని అర్ధం. ఆత్మ పదార్ధం నిరవయం (అవయములు లేనిది) కాబట్టి దానికి ఈ పేరు అన్వయించదు. జడమైన శరీరానికి బాహువులుండి ప్రయోజనంలేదు. అందుచేత ఈ పేరూ నాకు నవ్వు రప్పించింది. మూడో వాణ్ని శత్రుమర్ధనుడు అన్నారు అవునా? ఇక్కడా నాకు అవే సందేహాలు. అనశ్వరమైన ఆత్మ పదార్ధం సర్వవ్యాపి. అంతటా తానే. దానికి శత్రువులూ లేరు మిత్రులూ లేరు. మరి ఎవరి శత్రువులని మర్ధిస్తుంది? సమాధానం వున్నదా? అదీగాక అహంకార కల్పితాలైన క్రోధాదిభావాలు స్వపరభేదాలు దానికెక్కడివి? జడమైన శరీరానికి మర్దనం పొసగదు. అందుచేత ఈ పేరు కూడా నవ్వురప్పించింది. ఎవరు ఎవరికి ఏ పేరు పెట్టినా ఈ తగవుతప్పదు. సార్థకనామధేయ అసంభవం. కానీ లోకం వ్యవహారం సాగాలి కనుక అందుకని ఏదో ఒక పేరు పెట్టాలి. ఎంతో అందమైన పేరు పెట్టామని మురిసిపోవడం అదొకవెర్రి, పిచ్చీ. అందుకని అర్ధం పర్ధం లేకుండా ఆలోచించకుండా అలర్కుడన్నాను. మీరు పెట్టినవీ పేర్లే నేను పెట్టిందీ పేరే. వ్యవహారం కోసం ఏదో ఒక పేరు అంతే.


Wednesday, 22 March 2023

శ్రీదత్త పురాణము (86)

 


మదాలసా కువలయాశ్వులు ఇష్టాపభోగాలు అనుభవిస్తూ కేళీ విలాసాలతో తేలియాడుతున్నారు. నెల ఒక రోజుగా కాలం పరుగులు తీస్తోంది. శత్రుజిన్మహారాజుకు వృద్ధాప్యం సంభవించి ఒకనాటి సాయంకాలం కన్ను మూశారు. అంతఃపురంలో హాహాకారాలు మిన్ను ముట్టాయి. రాజ్యమంతటా విషాద వాతావరణం అలుముకుంది. ప్రతి పౌరుడి కన్నూ ఏకధారగా కన్నీరు కారింది. ఎందరు విలపిస్తేనేమి ఎంతగా పిలిస్తేనేమి? ఏదీ ఆగదు కదా! యధా విధిగా ఉత్తరక్రియలు శ్రద్ధతో జరిపాడు. కువలయాశ్వుడు తదనంతరం పట్టాభిశక్తుడై పరిపాలనా భాధ్యతలు స్వీకరించాడు. ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ వున్నాడు.


దేవతలు కరుణించి మదాలస గర్భంధరించింది. చెంపకు చారెడు కన్నులతో మగబిడ్డ జన్మించాడు. కువలాయాశ్వుడు సంబరపడి రాజ్యమంతటా ఉత్సవం జరిపించాడు. పుట్టిన బిడ్డకి జాతకర్మాదులన్నీ జరిపించి విక్రాంతుడు అని నామకరణం చేసారు. రాజోద్యోగులు, బంధుమిత్రులు అందరూ సంతోషించారు. ఆ సమయంలో మదాలస మాత్రం ఆదోలా నవ్వింది. విక్రాంతుడు శుక్లపక్షంలో చంద్రుడులా ఎదుగుతున్నాడు. రెండేళ్ళ గడిచాయి.


మదాలస మళ్ళీ గర్భం ధరించి నవమాసాలు మోసి పండంటి బిడ్డను ప్రసవించింది. మళ్ళీ మగబిడ్డే కువలయాశ్వుడు ఆనందించి జాత కర్మాదులన్నీ జరిపించి రాజ్యం అంతా ఉత్సవములు జరిపించాడు. ఈసారి బిడ్డడికి సుబాహువు అని నామకరణం చేసాడు. మదాలస మళ్ళీ ఎప్పటి లాగానే అదోలా నవ్వింది. కాలం గడుస్తోంది. మళ్ళీ కొంతకాలానికి మదాలస గర్భం ధరించి నెలలు నిండగానే మూడవసారి కూడా మగబిడ్డనే ప్రసవించింది. ఈ సారి బిడ్డడికి శత్రుమర్ధనుడు అని నామకరణం చేసారు. మదాలస మళ్ళీ ఎప్పటిలాగే నవ్వింది. కాకపోతే ఈసారి బిగ్గరగా నవ్వింది. కువలయాశ్వుడికి సందేహం వచ్చింది. ఎందుకు నవ్వావు? అడిగాడు. అందుకామె బదులు చెప్పలేదు. కొంతకాలానికి నాలుగో బిడ్డ కూడా కలిగాడు. ఈ నామకరణం చెయ్యిబోతూ కువలయాశ్వుడు, మదాలసా! ముగ్గురు బిడ్డలకి నేనే పేర్లు పెట్టాను. అప్పుడల్లా నవ్వు నవ్వావు. కారణం చెప్పావు కాదు. ఇప్పుడైనా చెప్పు బహుశ నేను పెట్టిన పేర్లు నీకు నచ్చలేదేమో అందుచేత ఈ బిడ్డడికి నువ్వే పేరు పెట్టు- అన్నాడు.

Tuesday, 21 March 2023

శ్రీదత్త పురాణము (85)

 

నాయనా ఋతధ్వజా! ఇది మాయా మదాలస నీవు ముట్టుకుంటే మాయమవుతుంది. ఇలాగే దూరంగా నిలబడి చూసి ఆనందించు. ఇప్పటికి ఇంతే అన్నాడు. ఇంకా ఆ మాటలు పూర్తికాక ముందే ఋతధ్వజుడు మూర్చపోయాడు. మదాలస అయోమయంతో నాగరాజు వైపు చూసింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతూ ఋతధ్వజుని కలత దీర్చాడు నాగరాజు. తాను తన బిడ్డల కోరికపై మదాలస గురించి తపస్సు చెయ్యడం సరస్వతీ, మహాదేవుల ప్రసాదంగా ఆమె పునరుజ్జీవించడం అంతా వివరించి, మదాలసా ఋతధ్వజులను ఒకరికొకర్ని అప్పగించాడు. దంపతులు ఒకేసారి సాష్టాంగపడ్డారు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని ఆశీర్వదించాడు నాగరాజు. ప్రియ మిత్రులు నాగకుమారులిద్దరూ ఆనందభాష్పాలతో పులకించిపోతూ తప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. మల్లె మొగ్గలూ ముత్యాలు కలిపి దోసిళ్ళ కొద్దీ ఆ నవదంపతుల మీద గుమ్మరించారు. మదాలసా ఋతధ్వజులు ఆ రోజు అక్కడే వుండి అమృతమయమైన విందులు ఆరగించి విశ్రమించారు. మరునాడు అందరి వద్దా సెలవు తీసికొని కువలయశ్వాన్ని స్మరించాడు. అది వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. నాగరాజు ఆశీర్వదించాడు. అప్పుడప్పుడూ వస్తూవుండండి. ప్రియ మిత్రులు ఇక్కడవున్నారన్న మాట మర్చిపోవద్దు అన్నారు. నాగ కుమారుల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


మిత్రమా నీ చిరకాల వాంఛ నెరవేరింది. సంతోషమే. కానీ రేపటి నుండి మన ఆటపాటలు వుండవు కదా పోనీలే మీ పిల్లల్ని ఆడించడానికి వస్తుంటాము. జ్ఞాపకం పెట్టుకొని పిలవండి. వెళ్ళిరండి - అంటూ ఇంక అక్కడ వుండలేక లోపలికి వెళ్ళిపోయారు. ఋతధ్వజానికీ దిగులుగానే వుంది. కానీ ప్రియ మదాలస మరల లభించడంతో ఆనందంగా మనస్సు రాజధానివైపు పరుగులు తీస్తోంది. నాగరాజుకి మరొక్కసారి నమస్కరించి బయలుదేరారు మదాలసా ఋధ్వజులు.


కువలయాశ్వం మీద ఆకాశమార్గాన వస్తున్న మదాలసా రాజకుమారులను చూసి ప్రజలంతా ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోయారు. చనిపోయాడనుకున్న రాకుమారుడు తిరిగి రావడం. ఆశ్చర్యం అయితే తమ కన్నుల ఎదుటే ప్రాణాలు వదిలిన మదాలస పునర్జీవితమై రావడం ఈనాటి ఆశ్చర్యం. ఏమైతేనేమి కథ సుఖాంతం అయ్యింది. దేవతలు దయతలిచారు. అంతే చాలు అని ప్రజలు జయజయధ్వానాలు చేసారు. కోలాహలం ఏమిటి? అని రాజదంపతులు రాజప్రసాదం వెలుపలికి వచ్చి చూసారు. ఎట్ట ఎదుట కువలయాశ్వం మీద కొడుకు కోడలు. కలా? నిజమా? అనుకొనే లోపలే దంపతులు అశ్వందిగి వచ్చి పాదాభివందనం జేసారు. కొడుకును తండ్రీ, కోడల్ని తల్లీ కౌగలించుకొని ఆనంద భాష్పాలలో మునిగారు. అందరు తేరుకున్నాక జరిగిందంతా పూసగ్రుచ్చినట్లుగా వివరించాడు ఋతధ్వజుడు. రాజు గారు రాజ్యంలో పెద్ద ఉత్సవం జరిపించారు. సకల దేవతలకు ఆరగింపులు జరిపారు. భూరి, దక్షిణలతో అందర్నీ ఆనందపరిచారు.


Monday, 20 March 2023

శ్రీదత్త పురాణము (84)



ఋతధ్వజుడు ఆసనం దిగి నాగరాజుకి పాదాభివందనం చేసాడు. నాగవల్లభా దైవానుగ్రహంవల్ల మీవంటి పెద్దల ఆశీస్సులవల్లా నాకు ఏలోటు లేదు. మా ఇంట సకల సంపదలు సమృద్ధిగా వున్నాయి. అందువల్ల నేను కోరుకోవలసింది ఏమిలేదు. అయినా మీ సంతృప్తికోసం అడుగుతున్నాను. నా బుద్ధిలో ఎప్పుడూ అధర్మ చింతన కలుగకుండా మీ పట్లా, తల్లితండ్రులపట్లా, గురువుల పట్ల నాకిలాగే ప్రగాఢమైన భక్తి ఎల్లప్పుడూ వుండాలి. ఈ వరాలు ఇవ్వండి చాలు అన్నాడు. రాకుమారా, నీ సంస్కారం గొప్పది. చాలా ముచ్చటగావున్నది. నిన్ను చూస్తుంటే నువ్వు అడిగినవి నీ దగ్గర వుండనే వున్నాయి. అవి ఎల్లప్పుడూ వుంటాయి. ఇందులో నేనిచ్చేదేముంది నీవు పుచ్చుకొనేదేముంది. అందుచేత బాగా ఆలోచించుకొని నీకు అత్యంత ప్రియమైన దేదో అదికోరుకో మొహమాట పడకు. అది ఎంతటి దుర్లభమైనా ఫరవాలేదు కోరుకో తీరుస్తాను సంశయించకు సుమా! నా మాట సత్యం అన్నాడు నాగరాజు.


ఋతధ్వజుడు నవ్వుతూ నాగ కుమారులవైపు చూసాడు. వారిద్దరు తండ్రి పాదాలకు నమస్కరించి తమ మిత్రుడు ఋతధ్వజునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదో, ఏది అడగడానికి సందేహిస్తున్నాడో వారికి తెలుసు కనుక అది చెల్లించమని మిత్రుడి పక్షాన అడిగారు. నాగరాజు చిరునవ్వులు చింది రాకుమారా! నాయనా! కాల ధర్మం చెందిన వారిని బ్రతికించి అదే శరీరంతో తీసుకు రావడం అసాధ్యం. అది దేవతలకైన కష్టసాధ్యం. కానీ నీ కోరిక తీర్చడం నా విధి. కనుక మదాలసను నీకు చూపుతాను. కేవలం చూసి సంతోషించి వూరుకోగలవా?


నాగరాజా! మాయా మదాలస అయినా సరే ఒక్క సారి నాకు చూపించి పుణ్యం కట్టుకోండి. ఇదొక్కటే నా కోరిక అంటూ మరలా పాదాభివందనం చేసాడు ఋతధ్వజుడు. నాగరాజు లేవనెత్తి ప్రేమగా వీపు నిమురుతూ చేయి పట్టుకొని నడిపించుకుంటూ రహస్య స్థావరం దగ్గరకి తీసికెళ్ళి మదాలసను చూపించాడు. ఋతధ్వజుడు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ప్రియా అంటూ ఆమెను అందుకోడానికి వెళ్ళబోయాడు. నాగరాజు పట్టుకొన్న చెయ్యిని వదలలేదు.


Sunday, 19 March 2023

శ్రీదత్త పురాణము (83)

 


మిత్రమా, సంతోషం నువ్వు వస్తానని అన్నావు అంతే చాలు. మేము దగ్గరుండి తీసికెళ్తాం. మా ఇల్లు దగ్గరంటే దగరే. దూరమంటే దూరమే. కువలయాశ్వన్ని పిలవవలసిన అవసరం లేదు. గౌతమీ నది దారిలో వెళ్ళాలి. అన్ని దగ్గరే. దూరమంటే దూరమే. కువలయాశ్వన్ని పిలవవలసిన అవసరం లేదు. గౌతమీ నది దారిలో ముగ్గురూ బయలు దేరారు. గౌతమీ నది చేరుకున్నారు. మిత్రమా ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం పవిత్ర నదికి 'వెళ్ళాలి. అని ఆచమించి సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం మన విధి. నువ్వు నదిలో దిగి దోసిట నీళ్ళు పట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మనం మా ఇంటి దగ్గర వుంటాం. నిజం నువ్వే చూస్తావుగా అన్నారు. అన్నట్లుగానే ఋతద్వజుడు కళ్ళు మూసి తెరిచే సరికి నాగలోకంలో వున్నారు. తన మిత్రులు బ్రాహ్మణ కుమారులిప్పుడు సర్పశిరస్సులతో నాగకుమారులయ్యారు. ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ఋతధ్వజుడు.


చెలికాడా! క్షమించు మేం బ్రాహ్మణ కుమారులం కాదు. నాగరాజు కుమారులం. ఇది నాగలోకం నీతో స్నేహాన్ని వదులుకోలేక నిజం చెబితే నువ్వు మాతో స్నేహం చెయ్యవని తలచి ఇంతకాలం బ్రాహ్మణ కుమారులుగా గడిపాం. ఇది మా ఆనందం కోసం చేసిందే తప్ప నిన్ను మోసగించాలని మాత్రం కాదు. ఐనా స్నేహధర్మానికి విరుద్ధంగా నీ నుండి ఈ ఒక విషయాన్ని దాచాం కనుక క్షంతవ్యులం అన్నారు. ఋతధ్వజుడు ప్రేమగా మిత్రులారా అంతమాట లెందుకు, ఫరవాలేదు. మీ ఆనందంకోసం అయినా నాకూ ఆనందం పంచారు గనుక ఇందులో క్షమార్పణల ప్రసక్తి లేదు. మన స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష. అది సరే గాని నడవండి మీ నాగలోక అందాలన్ని నాకు చూపించండి అన్నాడు.


ముగ్గురూకలసి నాగలోక ప్రధాన వీధులన్నీ తిరిగారు. ఋతధ్వజుడు అక్కడి సిరిసంపదలకు మురిసిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నాగకుమారులు ఋతర్వజుణ్ని తమ ఇంటికి తీసికొచ్చారు. తండ్రికి పరిచయం చేసారు. ఋతధ్వజుడు వినయవిధేయతలతో సాష్టాంగ నమస్కారం చేసాడు. అశ్వతరుడు ఋతధ్వజుడ్ని ఆనందంతో ప్రేమగా లేవనెత్తి కౌగలించుకొని శిరస్సు నిమురుతూ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయనా మా పిల్లలు రోజు చెప్తుంటారు నీ గురించి, నీ గుణగణాలు, నీ సౌహార్థం, నీ మంచి మనస్సు, నీ గాంభీర్యం, నీ ప్రతిజ్ఞ, నీ సౌశీల్యం నీ పరాక్రమం అన్నీ విన్నాను. ఎప్పటి నుండో నిన్ను చూడాలని ఇప్పటికి ఇలా పొసగింది. రా ఇలా వచ్చి ఈ ఆసనంపై కూర్చో. ఈ రోజు మాకు పండగ, మా ప్రియమైన అతిధివి. రాక రాక మొదటిసారిగా వచ్చావు. తగ్గ మర్యాదలు చెయ్యనీ. దయచేసి దేనికీ అడ్డు చెప్పకు. ఇవి నేను ప్రేమతో చేస్తున్నవి. కాదనడానికి వీలు లేదు. స్వీకరించవలసిందే అశ్వతరుడు ఇలా మాట్లాడుతూనే ఋతధ్వజున్ని సముచితాసనంపై కూర్చుండబెట్టి గంధమాల్యాదులు అలంకరించి రత్నఖచిత నానావిధ స్వర్ణ భూషణాలు ధరింపజేసాడు. నూతన పట్టు వస్త్రాలు అందించాడు. నాయనా ఇపుడు నాకు చాలా తృప్తిగా వుంది నీకేమైనా వరమివ్వాలని అనుకుంటున్నాను. ఏమికావాలో ఇష్టమైనది కోరుకో అన్నాడు.


Saturday, 18 March 2023

శ్రీదత్త పురాణము (82)

 


నాగరాజా! మీరు నాకు ఆభరణములు. అందుకని మీరు అంటేనే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఈ కోరికతో అది రెట్టింపు అయ్యింది. కువలయాశ్వుడి సౌఖ్యం కోసం మీరు వరమడుగుతున్నారు. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మదాలస నీ ఇంట కూతురై పునర్భవం పొందుతుంది. దీనికి నీవు చేయవలసిన పని ఒకటుంది. నీ యింట జరిగే పితృతిధినాడు మధ్యమ పిండాన్ని నువ్వు భుజించాలి. మదాలసను తలుచుకుంటూ భుజించాలి. పితృ పూజ చెయ్యాలి. ఆ క్షణంలోనే మదాలస యధాతధంగా అంటే మరణించినప్పటి వయోరూప గుణాలతో ఆవిర్భవిస్తుంది.


కంబలాశ్వతరులను ఆశీర్వదించి కాలకంఠుడు అదృశ్యమయ్యాడు. సోదరులిద్దరూ సంతోషంగా పాతాళానికి తిరిగి వెళ్ళారు. పితృతిధి వచ్చింది. ఈ సారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రాద్ధ విధులు నిర్వహించారు. మధ్యమ పిండాన్ని శివుడి ఆజ్ఞ ప్రకారం మదాలసను స్మరిస్తూ అశ్వతరుడు భుజించాడు. చిన్నగా నిట్టూర్పు విడిచాడు. అదే సమయంలో అతడి మధ్యమ ఫణాగ్రభాగం నుండి మదాలస సద్యోయౌవనంతో ఆవిర్భవించింది. ఈ విషయాన్ని రహస్యంగా వుంచాలని సోదరులిద్దరూ నిర్ణయించుకున్నారు.


తనకు విశ్వాస పాత్రమైన ఇద్దరు నాగకన్యలను పిలచి మదాలసకు తోడు ఇచ్చి రహస్య స్థావరంలో విడిది ఏర్పాటు చేసారు.


ఋతుధ్వజునికి బహుకరించడం కోసం మదాలసను పునరుజ్జీవితురాలిని చేస్తానని తపస్సుకు వెళ్ళిన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప తెచ్చిందేమీ కనిపించలేదు నాగకుమారులకి ఏమయ్యిందని అడిగే ధైర్యంలేక మిన్న కుండపోయారు. ఎప్పటిలాగే బ్రాహ్మణ బాలుర రూపాలు ధరించి భూలోకానికి వెళ్ళి ఋతుధ్వజుడితో ఆడుతూ వున్నారు. ఒక రోజు నాగరాజు తన బిడ్డలిద్దరిని దగ్గరికి పిలచి చెరొక తొడపై కూర్చోపెట్టుకొని ఇలా అన్నాడు. మీరిద్దరూ భూలోకినికెళ్ళి ఋతుధ్వజునితో క్రీడిస్తూవున్నారు. బాగానే ఉంది. ఒక్కసారి అయినా అతన్ని మన లోకానికి తీసుకురాలేదేమి. ఇదేనా స్నేహమంటే! అతడికి మీరు ఏదో ప్రత్యుపకారం చెయ్యాలని అనుకున్నారు. మళ్ళీ ఆ మాటే అడగలేదు. ఏ లోకంలోనైనా ప్రయాణం చేసే కువలయాశ్వం అతని దగ్గరవుంది అన్నారు గదా దాన్ని ఎక్కి రమ్మనండి. నా ఆహ్వానంగా చెప్పండి అన్నాడు నాగరాజు.


నాగ కుమారులు సంబరపడ్డారు. తండ్రి ఎందుకో చెప్పడంలేదు కానీ ఏదో కధవుంది అని ఊహించారు. వెంటనే బయలుదేరి భూలోకం చేరుకున్నారు. బ్రాహ్మణ బాలకులుగా మారిపోయారు. ఋతుధ్వజుణ్ని కలుసుకున్నారు. కాసేపు ఆట పాటలు అయ్యాయి. మిత్రమా మనం ఇన్నాళ్ళు కలసి మెలసి తిరిగాం నువ్వు మాత్రం ఒక్కసారి అయినా మా యింటికి రాలేదు. రమ్మని పిలవందే రాకుమారుడివి ఎలా వస్తావు? పిలవనితప్పు మాదే. మా తండ్రిగారు ప్రత్యేకంగా చెప్పమన్నారు. వారు నిన్ను చూడాలంటున్నారు. నీ రాచమర్యాదలకు భంగం కలగదు అనుకుంటే మా ఆహ్వానం మన్నించు. మా ఇంటిని ఒకసారి దర్శించు. అని బ్రాహ్మణ బాలురు పలుకుతూ వుంటే ఋతధ్వజుడు ఎంతో ఆనందించి సంబరపడ్డాడు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే పెడదాం పదండి. మిత్రుల ఇళ్ళకు వెళ్ళడానికి రాచమర్యాదలు ఎందుకు? మీ తండ్రిగారు రమ్మన్నారు అన్నారుగదా వారికి నా మీద ప్రేమ కలుగడం నిజంగా నా అదృష్టం. వారిని దర్శించి ఆశీస్సులు పొందుతాను. పెద్దల ఆశీస్సులు ఆమోఘంగా పనిచేస్తాయి. నడవండి వెళదాం మీ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. దూరమా దగ్గరా? నడిచి వెడదామా! లేదా కువలయాశ్వాన్ని పిలవనా? అని అడుగుతూంటే ఋతధ్వజుడి అంగీకారానికి మురిసిపోయారు నాగ కుమారులు.

Friday, 17 March 2023

శ్రీదత్త పురాణము (81)



అశ్వతరుడు చేసిన ఈ స్తోత్రానికి వాగ్దేవి ప్రసన్నురాలయింది. ప్రత్యక్షమయ్యింది. తానుగా పలికింది. నాగరాజా నీ తపస్సుకి సంతోషించాను నీ స్తోత్రం నన్నెంతగానో మురిపింపజేసింది. ఏమి వరం కావాలో కోరుకో నీ ఇష్టం వెంటనే నీ అనుగ్రహిస్తాను అంది.


విష్ణు జిహ్వాస్వరూపిణీ! సరస్వతీ! ధన్యుణ్ని తల్లీ! నీ అనుగ్రహాన్ని మించిన బలం మరొకటి లేదు. సంగీత రూపంగా అనుగ్రహాన్ని వర్షించు. నాకూ నా సోదరుడు కంబలుడికీ సంగీత స్వర సంపదను సమగ్రంగా ప్రసాదించు. ఆ శాస్త్రంలోని లోతులూ రహస్యాలూ అన్నీ మాకు కటాక్షించు.


అశ్వతరా నీ కోరికకు సంతసించాను. నీకు, కంబలునికీ సంగీత శాస్త్రం అంతా ప్రసాదిస్తున్నాను. స్వీకరించండి. ముల్లోకాల్లో మీకు సాటి వచ్చే సంగీత విద్వాంసుడు లేడు. ఉండడు. ఈ క్షణం నుండీ మీదే అగ్రపీఠం, నువ్వు చేసిన స్తోత్రంలో నా రూపాన్ని గుణాలను అద్భుతంగా వర్ణించావు. చాలా సంతోష పడుతున్నాను. దీన్ని భక్తితో తెల్లవారు జామునే పఠించిన వారికి అభీష్టాలన్నీ తీరతాయి. విద్య, తేజస్సు, ధనం, ధాన్యం పశుగేహ సుతాది సమృద్ధి అన్నీ సిద్ధిస్తాయి. ఇది నా ఆశీస్సులు అని పలికి ఆ సప్తజిహ్వ సరస్వతీ దేవి అంతర్ధానం చెందింది.


కంబలాశ్వతరులిద్దరూ గాంధర్వ విద్యాధురీణులు అయ్యారు. హిమాలయాల నుండి సరాసరి కైలాసానికి వెళ్ళారు. తమ దివ్య సంగీత విద్యతో పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు. తంత్రీలయ సమన్వితంగా సప్తవిధ గీతాలతో కీర్తించారు. త్రిసంధ్యలలోనే కాదు అర్ధ రాత్రి కూడా ఆ త్రినేత్రుణ్ని ఆరాధించారు. ఉబ్బులింగడు అన్న మాటేగానీ ఒక పట్టాన కైలాసం దిగిరాలేదు. చాలా సంవత్సరాలు గడచిపోయాయి. సోదరులలో భక్తి, నిష్టాపట్టుదల, మరింతగా వృద్ధి చెందాయి. షట్కాలాలలో సంగీతంతో శివార్చన చేస్తున్నారు. అప్పటికి పరాత్పరుడికి అనుగ్రహం కలిగింది. ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోండి అన్నాడు.


సర్పభూషితాంగా! కందర్ప దర్పభంగా ఇంత కాలానికి కటాక్షించావా తండ్రీ! సరస్వతీదేవి ప్రసాదించిన సంగీత విద్య చరితార్ధమయ్యింది. అష్ట మూర్తి పశుపతి మా ఇద్దరిదీ ఒకే కోరిక కువలయాశ్వుడి ధర్మపత్ని మదాలస రాక్షస మాయకు లోనై ప్రాణాలు విడిచింది. అదే వయస్సుతో అదే మదాలసను నాకు బిడ్డగా అనుగ్రహించు. జాతి స్మరురాలై మునుపటిలాగానే శాంతికి సహనానికి పెట్టింది పేరై బ్రహ్మ విద్యా పరాయణురాలై యోగినిగా యోగమాతగా విరాజిల్లేట్లు కరుణించు. 


Thursday, 16 March 2023

శ్రీదత్త పురాణము (80)

 


అశ్వతర కృత సరస్వతీ స్తుతి


జగద్ధాత్రీ! మహాదేవీ! వేదజననీ! సరస్వతీ! మోక్షాదికమని చెప్పబడుతున్న ఏ అసత్తు కలదో దానికి ఆశ్రయ భూతులు అయిన అసత్తులు వున్నారో అవి అన్ని చిద్రూపిణి, నాదరూపిణి అయిన నీలో సంయోగ సంబంధంతో ప్రకాశిస్తున్నారు. అందుచేతనే నీవు పరాత్పర రూపమైన అక్షర పరబ్రహ్మవు. దారువులో అగ్ని దాగివున్నట్లు, పంచ భూతాలలో పరమాణువులు వున్నట్లూ ఈ కారణ రూప పరబ్రహ్మలో కార్యరూపమైన జగత్తులో నువ్వు లీనమై ఉన్నావు. చరాచర జగత్తు అంతా ఓంకారంలో ఇమిడివుంది. అది ఆకార ఉకార మకారాత్మకం. సృష్టిలో ఇదీ త్రిపుటి. సర్వత్రా కన్పిస్తోంది. అందుచేత ఇందులో అది వుంది ఇది లేదు అనడానికి వీలులేదు. అన్నీ ప్రణవంలోనే వున్నాయి. మూడు లోకాలు, ముగ్గురు దేవతలు. మూడు వేదవిద్యలు, వహ్నలు మూడు, జ్యోతిస్సులు మూడు, బ్రాహ్మణాది వర్గాలు మూడు, ధర్మార్ధకామాలు మూడు, గుణాలు మూడు, శబ్దాలు మూడు, రాగద్వేషాలోభాది దోషాలు మూడు, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు మూడు, కాలాలు మూడు, అవస్థ (జాగ్రతోస్వప్న సుషుప్తి)లు మూడు, పితృపితామహ ప్రపితామహులు ముగ్గురు. దివనిశా సంధ్యలు మూడు, దేవ పితృ మనుస్య జాతులు మూడు. ఇలా విశ్వమంతా త్రిపుటీ మయమే. అందుకే ప్రణవంలోనే అన్నీ వున్నాయని పెద్దలు చెబుతున్నారు. ఇలాంటి ఓంకారమే నీవు అని తెలుసుకున్న వారు ముక్తులు, అన్య మార్గానుకూలురు అముక్తులు.


ఓంకార రూపిణీ! కర్మఠులు ఏ మాత్రం ఉచ్ఛరించాలన్నా నిన్ను జపించవలసిందే, అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఉక్థ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం- అప్తోర్యామం అనేవి శ్రోతసాంప్రదాయంలోని సప్త సోమ యజ్ఞ సంస్థలు అగ్న్యాధానం, అగ్నిహోత్రం దర్శపూర్ణమాసలు- చాతుర్మాస్యాలు, ఆగ్రయణం, నిరూఢపశుబంధం, సాత్రామణి అనేవి స్మార్తపద్ధతిలోని సప్తపాక యజ్ఞ సంస్థలు. ఇవన్నీ బ్రహ్మవాదులచేత ఓంకృతి పూర్వకంగానే నిర్వహింపబడుతున్నాయి.


అమ్మా వాగ్దేవీ! అర్ధమాత్రా స్థితమైన నీ పరరూపం అందరికీ సులభసాధ్యం కాదు. అది అవికారి, ఆక్రియం, దివ్యం, పరిణామవివర్జితం కాబట్టి నీ రూపం వాక్కులకు అందనిది. వాగింద్రియాలకు చిక్కనిది. నీ రూపం ఒకొక్కప్పుడు అనేకం ఒకొక్కప్పుడు ఏకం, సూర్యచంద్రుల కాంతి నీ స్వరూపమే. నీవు విశ్వరూపవు. విశ్వాకాశానివి, విశ్వాత్మవు. పరమేశ్వరివి. వేదాలు, వేదాంగాలు, సాంఖ్యాది యోగాలు నిన్ను ఆది మధ్యాంతరహితవని బోధిస్తున్నాయి. కార్యకారణ రహీతవనీ నిర్గుణ పరబ్రహ్మవని కీర్తిస్తున్నాయి. సమిధలో అగ్ని వున్నట్లు ఈ ధీవృత్తిలో నువ్వు సర్వత్రా వ్యాపించి ఉంటావట. నువ్వు అనాఖ్యవు, షడ్గుణాఖ్యవు, బహ్వాఖ్యవు, త్రిగుణాశ్రయవు కాబట్టి చైతన్య శక్తి మంతాలయిన పదార్ధాలన్నింటిలో నీ మహా మహానంద స్వరూపం భక్తి యోగులకు దర్శనమిస్తూ వుంటుంది. సకలము, నిష్కలము అయిన జగత్తునందంతటా నువ్వే వ్యాపించియున్నావు. అద్వైతబ్రహ్మం, ద్వైతబ్రహ్మం, నిత్య పదార్థాలు అనిత్య పదార్థాలూ, స్థూల, సూక్ష్మ, సూక్ష్మాతి సూక్ష్మ పదార్థాలు భూమి మీదనూ అంతరిక్షంలోనూ, అంతరాళంలోనూ, ఇతరత్రా ఉన్న సకల పదార్థాలూ అవి మూర్తలు కావచ్చు, అమూర్తలు కావచ్చు, పంచభూతాలు కావచ్చు వాటిలో ఒక్కొక్కటే కావచ్చు - సమస్తాన్నీ స్వరవ్యంజన రూపిణి అయిన నీమహిమచేతనే గుర్తించగలుగుతున్నాం.


Wednesday, 15 March 2023

శ్రీదత్త పురాణము (79)


 

ఋతధ్వజుడు ఈ వార్త విని అవాక్కయ్యాడు. విషయం అర్ధం అయ్యింది. మనస్సు కుతకుతలాడింది. కువలయాశ్వాన్ని ఎక్కి యమునా తీరానికి వెళ్ళాడు. అక్కడ ఇంతకు ముందు కనిపించిన ఆశ్రమంగాని, పర్ణశాలలు గానీ, చిత్ర విచిత్ర రూపాల స్వాగత తోరణాలు గాని ఏ ఒక్కటీ ఆనవాలుకైనా లేవు. అన్ని పిచ్చిమొక్కలు - పాదలతో ఆ ప్రదేశం నిండివుంది. ఇది కచ్చితంగా రాక్షసుల కుట్ర. పాతాళ కేతువును సంహరించినందుకు వాడి సోదరుడు తాళకేతువు ఇలా కుట్ర పన్ని కసితీర్చుకున్నాడన్నమాట. అలనాటి యుద్ధంలో వాణ్ని కూడా సంహరించివుంటె సరిపోయేది. పారిపోయి పిరికిపంద ఇలా దొంగదెబ్బ తీసాడు. నా ప్రియ మదాలసను పొట్టన బెట్టుకున్నాడు. నాకు కడలేని దుఃఖం మిగిల్చాడు. సరే ఇప్పుడేమి విచారించి ఏమి లాభం కనిపించని శత్రువు మీద కసితీర్చుకొనేదెలాగ? కనిపించని లోకాలకు వెళ్ళిపోయిన ప్రాణ ప్రియపట్ల ఋణం తీర్చుకొనేదెలాగ? ఇవే ఆలోచనలతో క్షణంలో రాజధానికి తిరిగి వచ్చాడు. ఏ రాక్షసుడు ఈ మోసం చేసాడో తండ్రికి వివరించాడు. యాగరక్షణకు వెళ్ళినందుకు, ముని వాటికలకు రాష్ట్రు పీడ తొలగించినందుకు శ్రీరామచంద్రుడికి దక్కిందేమిటి? రాక్షసాగ్రహం సీతాపహరణం. తండ్రీ నాకు అదే జరిగింది. గాలవ ముని వెంట పంపుతూ నాకు మీరు ఆ పోలిక కూడా తెచ్చారు. నిజమే అప్పుడు మీరు దశరధులయ్యారు. ఇప్పుడు నేను భార్యావియోగినయ్యాము. దుఃఖంలో శ్రీరామచంద్రుణ్ని అయ్యాను. ఆ శ్రీరామప్రభువులాగే నేనూ దీక్షను స్వీకరిస్తున్నాను. ఏక పత్నీ వ్రతదీక్ష. తండ్రీ ఈజన్మలోగానీ మరొక జన్మలో గాని నాకు భార్యంటూ ఏర్పడితే అది మదాలస మాత్రమే అవుతుంది. ఇంకెవరినీ చేపట్టను. నన్ను వలచి ఎక్కడో గంధర్వలోకం నుంచి వచ్చి నాకు దాంపత్య జీవన మాధుర్యాలు పంచిన ప్రాణసఖి మదాలస కోసం ఎన్ని జన్మలైనా నిరీక్షిస్తాను. ఋణం తీర్చుకుంటాను అన్నాడు ఋతధ్వజుడు. ఇలా భీషణ ప్రతిజ్ఞ చేసి ఆనాటి నుండి తన యౌవనాన్ని పరిత్యజించి అన్నెంపున్నెం ఎరుగని బాల్యంలోనే గడుపుతూవున్నాడు. మా వయస్సు పిల్లలతో తాను ఒకడుగా కలిసిపోయి ఆటపాటలతో క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తున్నాడు. తండ్రీ నాగరాజా ఇదీ మా మిత్రుడికి జరిగిన అన్యాయం, తాళకేతువు చేసిన మోసం. దీనికేమైనా విరుగుడు ఆలోచించి మా ప్రాణమిత్రుడి దిగులు తొలగించగలిగితే అది మనమివ్వదగిన సరియైన బహుమానం అవుతుంది. అప్పుడు మేము స్నేహ ఋణం తీర్చుకొన్నవాళ్ళం కాగలుగుతాము.


పుత్రులిద్దరూ ఏక కంఠంగా బ్రతిమాలుకున్నారు. నాగరాజు అశ్వతరుడు క్షణం ఆలోచించాడు. తనయుల్లారా మీరింతగా చెబుతున్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేద్దాం. పరోపకారం కన్నా పరమ ధర్మం ఏముంది. ప్రయత్నం చేద్దాం ఫలప్రదాత ఆ దైవం ఉండనే వున్నాడు. ధైర్యేలక్ష్మీః ప్రశీదతి అన్నారు పెద్దలు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇలాంటివి నెరవేరాలంటే తపస్సాక్కటే సాధనం. మీ మిత్రుడికోసం సరస్వతీదేవిని ఆరాధిస్తాను. ఆమె తప్పక అనుగ్రహిస్తుంది అంటూ అశ్వతరుడు ఆ క్షణంలోనే తపస్సుకు బయల్దేరి సరాసరి హిమాలయాలకు చేరుకున్నాడు. ఒక గిరిశిఖరం పై స్థిరచిత్తంతో యమ నియమాలతో తపస్సుకి కూర్చున్నాడు. సర్వార్ధ ప్రకాశికయైన వాగ్దేవిని (సరస్వతిని) త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు. ఇలా స్తుతించాడు.


Tuesday, 14 March 2023

శ్రీదత్త పురాణము (78)

 


ఋతధ్వజుడి తల్లితండ్రులు ఈ పిడుగులాంటి దుర్వార్తను తట్టుకోలేక మూర్చపోయారు. మదాలస అయితే ప్రాణాలనే వదిలేసింది. కాసేపటికి తెలివి వచ్చిన అత్తమామలుకి ఈ వార్త మరొక అశనిపాతమయ్యింది. రాజధానిలో విషాద వాతావరణం అలుముకుంది. రాజధానిలో మాయమైన కపట మహర్షి తాళకేతువు మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షమైనాడు. తన రాక కొరకు ఎదురుచూస్తున్న ఋతధ్వజుడ్ని మృదువుగా కౌగలించుకొని చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయనా రాకుమారా నన్ను కృతార్ధుణ్ణి చేసావు. చాలా సంతోషం. నేను చెయ్యాలని అనుకున్న వన్నీ చేసేశాను. నీకు ఆశీస్సులు కూడా ఇచ్చేశాను. కనుక నువ్వు ఇంక నీ రాజ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు. ఋతధ్వజుడు మాయా మహర్షికి మరో మారు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసికొని తన కువలయాశ్వం అధిరోహించి రాజధానికి చేరుకున్నాడు. తనను చూసిన పౌరులందరూ గుసగుసలాడుకుంటూ నివ్వెరపోయి చూస్తున్నారు. పోనీలే బ్రతికేవున్నాడు. ప్రాణాలతో తిరిగివచ్చాడు అదృష్టవంతులం చిరంజీవ చిరంజీవ అంటూ వున్నారు. రాకుమారుడు ఇది ఏమిటో ఎందుకిలా వారు అంటున్నారో అర్థంకాలేదు రాజమందిరం చేరుకున్నాడు. దాసదాసీజనం ద్వారపాలకులు అందరూ విస్తుపోయారు. అందరూ గొణుక్కుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో దీవిస్తున్నారు. తల్లితండ్రులూ ఆశ్చర్యపోయి అవాక్కయి అలాగే చూస్తూవుండిపోయారు. పాదాభివందనం చేసిన తనను తండ్రి ఆనందభాష్పాలు రాలుస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆప్యాయంగా ప్రేమతో కౌగలించుకున్నాడు. నాయనా మనం అదృష్టవంతులం నువ్వు జీవించేవున్నావు చాలు అంటూ ప్రేమగా శిరస్సు నిమిరాడు. తల్లి కూడా అలాగే దుఃఖం ఆనందం కలగలపి అవును అవును అంటూ ప్రేమగా వీపు నిమిరింది.


ఋతధ్వజుడు తండ్రితో - తండ్రీ ఏమిటి ఇందతా? ఏమయ్యింది మీకు? నేను బాగానే వున్నాను. నీ ఆజ్ఞప్రకారం యమునా తీరంలోని ఆశ్రమాలకి వెళ్ళాను. మునుల్ని సందర్శించాను. ఆశీస్సులు అందుకున్నాను. ఒక మహర్షి అడిగితే నా కంఠంలోని రత్నహారం బహుకరించాను. సంపూర్ణ ఆశీస్సులు అందుకొని హాయిగా తిరిగివచ్చాను. ఇంతకీ ఏదీ నా ప్రాణ ప్రియ మదాలస కనిపించడంలేదు? ఎక్కడికెళ్ళింది? అన్నాడు. కొడుకుకి ఏం సమాధానం చెప్పాలో ఆ దుర్వార్తను ఎలా అందించాలో అర్ధంకాలేదు. నాయనా అన్యాయం జరిగిపోయింది. ఎవడో కపట ఋషి అన్యాయంగా మోసం చేసాడు. నీ కంఠ హారం తెచ్చియిచ్చి నిన్ను రాక్షసుడెవడో హత్య చేసాడని నమ్మపలికాడు. తట్టుకోలేక మూర్ఛపోయాం మేము. నీ భార్య ప్రియ మదాలస ఆ మాటలు నమ్మి ప్రాణాలు వదిలేసింది. నువ్వు తిరిగి రానిలోకాలకు వెళ్ళి పోయావుగదా అని నేనే ఈ పాపిష్టిచేతులతో కోడలికి ఉత్తరక్రియలు జరిపించాను. ఇదిగో ఋషిఇచ్చిన కంఠహారం అంటూ హారాన్ని అందించాడు తండ్రి శత్రుజిన్మహారాజు.


Monday, 13 March 2023

శ్రీదత్త పురాణము (77)



అప్పుడా మహర్షి నాయనా రాకుమారా! తండ్రికి తగిన తనయుడవు నీవు. చాలా సంతోషంగావుంది. అడవిలో కందమూల ఫలాదులు తింటూ జీవించేవాళ్ళం అడవిలో మాకు ఎలాంటి బాధలు లేవు హాయిగా మా జపాలు మా తపస్సులు చేసుకుంటున్నాం అయినా అడివిలోకి వచ్చి మా క్షేమ సమాచారములు కనుక్కొనే పాలకులు వుండడం మా అదృష్టం. అయితే నా కన్నుల్లో దాగిన కలవర పాటును నీవు గ్రహించావు. దానికి కారణం వుంది. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. అది ముగింపుకొచ్చింది. ఇప్పుడు భూరిదక్షిణలు సమకూర్చుకోవాలి. ఎలాగా అనే దిగులు. బహుశ అదే నా కన్నుల్లో నీకు కనిపించివుంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ మెడలో ధగధగలాడుతున్న రత్న హారాన్ని ఇచ్చి వెళ్ళు అన్నాడు. ఆ మహర్షి అడగడమేమిటి రాకుమారుడు ఇవ్వడం తక్షణం జరిగిపోయాయి. అప్పుడా మహర్షి రాకుమారా నీ దాతృత్వం నన్ను మురిపిస్తోంది. సంతోషం. ఇక్కడేవుండు. నేనొకసారి యమునానదికి వెళ్ళి జలాధి దేవతను అర్చించి ఇప్పుడే వస్తాను. నీకు ఆశీస్సులిస్తాను. అవి అందుకొని వెడుదువుగాని అంటూ ఆ మహర్షి త్వరత్వరగా నదివైపుకి వెళ్ళాడు.


పిచ్చివాడు నన్ను నిజంగానే మహర్షి అనుకుంటున్నాడు. ఇది నిజంగానే ఆశ్రమం అనుకొంటున్నాడు. కన్నుల్లో కలవరపాటుని గుర్తించాడు కానీ నన్ను తాళకేతువుగా గుర్తించలేకపోయాడు. నా అన్న పాతాళ కేతువును సంహరించిన ఈ దుష్టుడికి తగిన ప్రతీకారం చేస్తాను. నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను అనుకున్నాడు దొంగ మహర్షి ఋతధ్వజుడు. చేతికి చిక్కాడన్న సంబరంతో తాళకేతువు యమునా నదిలోకి దిగాడు. తన మాయాశక్తితో అదృశ్యమై వెళ్ళి శత్రుజిన్మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు.


భార్యతో, కోడలి కూర్చుని ఆ మహారాజు ఏదో వినోదం తిలకిస్తున్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన మహర్షిని చూసి ఆశ్చర్యంతో అందరూ లేచి నిలబడ్డారు. పరిచారకులు అర్ఘ్యపాద్యాదులు సమకూర్చారు. అతిధి మర్యాదలు జరిపారు. మహారాజా నాకు నోరు రావడంలేదు. ఇంతటి అప్రియమైన వార్తను నీకు అందించవలసిన దుఃస్థితి నా నొసటరాశాడు భగవంతుడు. ఇదిగో కంఠహారం మీ కుమారుడిది. ఎవడో మాయావిరాక్షసుడు ఋతధ్వజున్ని పొట్టన బెట్టుకున్నాడు. కువలయాశ్వాన్ని అపహరించుకుపోయాడు. మా ఆశ్రమానికి చేరువలోనే ఈ ఘోరం జరిగింది. ఆశ్రమ వాసులందరూ కలసి రాకుమారుని పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ రత్నహారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పి రమ్మని నన్ను పంపించారు మా ఆశ్రమవాసులందరూ. నా తపశ్శక్తిని ధారపోసి వాయువేగను నోవేగములతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. మహారాజా ఆనిత్యాని శరీరాణి ఉన్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు అన్నారు. నీకు తెలియనివి కావు. తాపసులం మమ్మల్నే ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ఇక కన్నవారి సంగతి కట్టుకున్న వారి సంగతి వేరే చెప్పాలా? గుండె దిటవు చేసుకోండి. చిన్నపిల్ల మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగంగానూ మాయమయ్యాడు.


Sunday, 12 March 2023

శ్రీదత్త పురాణము (76)

 

మదాలసను తన దివ్యాశ్యం మీద ఎక్కించుకొని భూలోకానికి బయలు దేరపోతున్నాడు కువలయాశ్వుడు. సరిగ్గా అదే సమయానికి పాతాళకేతువు సైన్యంతో వచ్చిపడ్డాడు. జాగ్రత్తగా కూర్చోమని మదాలసను హెచ్చరించి కువలయాశ్వుడు ధనుష్టంకారం చేశాడు. ఆ దివ్యాస్త్రం మీద అనూహ్యమైన వేగంతో అనుహ్యమైన దారుల్లో మెరుపుతీగలా తిరుగుతూ మొత్తం దైత్యమహాసైన్యాన్ని అవలీలగా సంహరించాడు. పాతాళకేతువును ఖండించి విజయశంఖం పూరించాడు. తాళకేతువు తన అనుచరులు మరికొంతమందితో పలాయనం చిత్తగించాడు.


మదాలసా సహితుడై కువలయాశ్వుడు భూలోకానికి వచ్చి గాలవమహర్షికి నమస్కరించి పాతాళకేతు వధను వివరించి ఆశీస్సులు అందుకొని తన రాజధానికి వెళ్ళిపోయాడు. కువలయాశ్వానికి తగిన విడిది ఏర్పాటు చేయించాడు. తల్లిదండ్రులకు ఆ నవ దంపతులు పాదాభివందనం చేసి, దీవెనలు అందుకొని, అంతఃపురంలో ప్రవేశించారు. రాజభోగాలు అనుభవిస్తూ శృంగార క్రీడా విలాస వినోదాలతో మురిసిపోతున్నారు.


తాళ కేతువు కుతంత్రం


కొడుకూ కోడళ్ళ అనుకూల దాంపత్యాన్ని చూసి సంబరపడి పోతున్న శత్రుజిన్మహారాజు ఒకరోజు కొడుకును చేరబిలచి ఇలా అన్నాడు. నాయనా కుమారా అప్పుడప్పుడు సాయంకాలం వేళల్లో అయినా ముని వాటికల వైపుకి వెళ్ళి ఆశ్రమవాసుల క్షేమ సమాచారములు తెలుసుకొని వస్తూవుండు. వారి కుశలమే మన కుశలం. వారి దీవెనలే మనకు శ్రీరామరక్ష. ఇది మన రాజ ధర్మం కూడా అని మృదువుగా ఉపదేశించాడు. ఋతుధ్వజుడు అంగీకరించి మరునాటి సాయంకాలం కువలయాశ్వాన్ని అధిరోహించి పవిత్ర యమునాతీరంలోని అడవిలోకి వెళ్ళాడు. అక్కడొక దివ్యమైన ఆశ్రమం కనిపించింది. చిత్ర విచిత్ర విరాజితమైన పర్ణశాలలు కనిపించాయి. ఒక్కొక్క పర్ణశాలలో నేల కూడ ఒక్కొక్క రంగులో వుంది. ఆ పర్ణశాలల చుట్టూతా తీర్చిదిద్దబడిన అందమైన ఉద్యానవనములు. ఆ వనాలలో వివిధ రూపాల్లో ఉన్న పొదరిల్లులు. కొన్ని దేవతామూర్తుల రూపాల్లో, కొన్ని రధాకారాలలో కొన్ని గజాశ్వాది జంతువుల ఆకృతిలో కొన్ని వివిధ పక్షి జాతుల రూపాలలో ఉన్నాయి. వివిధ కంఠ స్వరాలతో పలకరిస్తున్న పక్షులు జంతువులు కనీ వినీ ఎరుగని పువ్వులు, ఫలాలు. ఆశ్చర్యచకితుడై ఋతధ్వజుడు ఆశ్రమం అంతటా తిరిగాడు. తను ఏ ప్రక్కకు వెళ్ళినా పచ్చని స్వాగత తోరణాలు అప్పుడే తనకోసమే కట్టినట్లుగా వున్నాయి. ఋతధ్వజుని ఆనందానికి అంతులేకుండా పోయింది. పర్ణశాలల నుండి మెల్లగా పెల్లుబికి వస్తున్న హోమధూపం, బూడిద వర్ణంలో వినువీధికి ప్రయాణం చేస్తుంది. పెద్ద వృక్షవాటికల క్రింద వేదపనసలకు సంతచెప్పుకుంటున్న శిష్యబృందాలు. ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురు చూస్తూవున్నట్లుగా అర్ఘ్యపాత్రతో కనిపించాడు. ఆ మహర్షి ముఖంలో తేజస్సు కన్పిస్తోంది, కానీ కన్నుల్లో ప్రశాంతి కనబడటం లేదు. ఆ మహర్షి ఏదో కలత చెంది కలవరపడుతున్నట్లు అనిపించింది. ఋతధ్వజుడు దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. మహర్షి సాదరంగా ఆత్మీయంగా దారితీసాడు. మహర్షీ తమరెవరు? మీ చూపుల్లో ఏదో కలవరపాటు కన్పిస్తోంది నిజమో అది నా భ్రాంతియో. మీ ఆశ్రమానికి ఏ రాక్షసుల పీడలు లేవుగదా క్రూరమృగాల బెడద కూడా లేదు కదా. ఫలం, పుష్పం సమిధలు, జలం ఇవన్ని మీకు సమృద్ధిగా లభిస్తున్నాయా? మా తండ్రిగారు శత్రుజిన్మహారాజు మిమ్మల్ని దర్శించి కుశల వార్తలు తెలుసుకొని రమ్మన్నారు అన్నాడు.


Saturday, 11 March 2023

శ్రీదత్త పురాణము (75)

 


కుండలా! నీ వంటున్న ప్రతి మాటా నాకూ సమ్మతమే. నా మనస్సులో మెదలుతున్న వూహలనే నువ్వు పలుకుతున్నావు. కానీ నాదొక చిన్న అభ్యంతరం. మీరు గంధర్వులు. గాంధర్వ వివాహం మీకు శోభిస్తుంది. మేము మానవులం. సమంత్రకంగానే మాకు వివాహం జరగాలి. అదీగాక నేనింకా తండ్రిచాటు బిడ్డను. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం జరుపుకోవడం నాకంతగా నచ్చదు. ప్రస్తుతం గాలవమహర్షి అధీనంలో ఆశ్రమ రక్షకుడుగా ఉన్నాను. కాబట్టి వారి అనుమతి కూడా అవసరం.


కువలయాశ్వా! మదాలసను వివాహమాడటం ఇష్టమేనన్నావు. అది చాలు. మిగతా అభ్యంతరాలు నేను తీరుస్తాను. కులగురువులు పితృసమానులని శాస్త్రం చెబుతోంది. నా యోగశక్తితో మీ కుల గురువులు తుందిల మహర్షిని ఇక్కడికి రప్పిస్తాను. వారు మీ కులాచారం ప్రకారం సమంత్రకంగా వివాహం జరిపిస్తారు. దీనితో నీ అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి.


ఋతుధ్వజుడు అంగీకరించాడు. కుండల తన యోగ మాయా శక్తితో తుందిల మహర్షిని ఆహ్వానించింది.


వారు వివాహానికి అవసరమైన వస్తుసామగ్రితో విచ్చేశారు. సమంత్రకంగా మదాలసా ఋతుద్వజులకు అగ్నిసాక్షిగా వివాహం జరిపించారు, దక్షిణ తాంబూలాదులు స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కుండల కూడా నవదంపతులను దీవించి తన గంధర్వ లోకానికి తాను వెళ్ళిపోయింది.


పంది రూపంలో పారిపోయివచ్చిన పాతాళకేతువు తన సోదరుడు తాళకేతువుతో మంతనాలు జరిపి రాక్షస మహాసైన్యాన్ని సమకూర్చుకుని తాను మదాలసను బంధించి ఉంచిన సౌధం దగ్గరకి వచ్చాడు. తనను వెన్నంటి తరుముకంటూ వచ్చిన కువలయాశ్వుడు అక్కడే గదా ఆగిపోయాడు. ఒంటరిగా దొరుకుతాడు. సైన్యంతో చుట్టుముట్టి మట్టు పెడదామని ఆశించి వచ్చాడు.


Friday, 10 March 2023

శ్రీదత్త పురాణము (74)



సింహద్వారం దగ్గర నీ ప్రశ్నలకు నేను బదులు పలుకలేదు. క్షమించు. నురుగులు కక్కుతూ పంది రూపంలో పారిపోయివస్తున్న పాతాళకేతువును చూశాను. వాడి డొక్కలో నాటుకున్న బాణం చూశాను. కామధేనువు నిన్న చెప్పిన మాటలు ఈ రోజే నిజమైపోతున్నయా అనే సంబరంతో ఈ శుభవార్తను మదాలసకు చెప్పాలనే ఉత్కంఠతో మెట్ల వెంట సౌధాగ్రం మీదకి పరుగులు తీశాను. నిన్నూ నీ ప్రశ్నలనూ పట్టించుకోలేదు. అవును, నేను మెట్లు ఎక్కివచ్చేలోగానే నువ్వు సౌధాగ్రం చేరుకున్నావే. అంత వేగంగా ప్రయాణించే శక్తి నీకు ఎలా వచ్చింది. మానవ మాత్రుణ్ణి అంటున్నావు. ఇది ఎలా సాధ్యం? ఆకాశయానం వాయువేగం ఈ సౌందర్యం ఈ రూపసౌష్టవం- ఇవన్నీ అతిమానుషమైన విషయాలే. దయచేసి నిజం చెప్పు. ఆ పందిగాణ్ని నువ్వే తరుముకుంటూ వచ్చావా? లేకపోతే, కాక తాళీయంగా జరిగిందా?


కుండలా! నీ సందేహం సమంజసమే. గాలవ మహర్షి ఆశ్రమంలో అలజడి సృష్టిస్తున్న పందిని నేనే తరుముకుంటూ వచ్చాను. నా బాణం దెబ్బ తగిలినా వాడు ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. గాలవ మహర్షికి సూర్యదేవుడు బహుకరించిన దివ్యాశ్వాన్ని అధిరోహించడంవల్ల నాకు వాయువేగ మనోవేగాలు పాఠ్యపడ్డాయి. దీన్ని అధిరోహిస్తే పాతాళానికేమిటి పూర్వలోకాలకేమిటి ఎక్కడికైనా క్షణంలో చేరుకోవచ్చు. బహుశ నీకు నీ రాకుమారికి సందేహాలన్నీ తీరిపోయాయనుకుంటాను. నేను మానవ మాత్రుణే, ముమ్మాటికీ రాకుమారుణ్ని. మా తండ్రిపేరు శత్రజిన్మహారాజు.


నన్ను ఋతుర్వజుడంటారు. ఈ గుర్రం పేరు కువలయాశ్వం. అందుచేత నన్ను కూడా కువలయాశ్వుడన్నారు ఆశ్రమవాసులు కొందరు.


ఉన్నట్టుండి మదాలస బుగ్గలు ఎరుపెక్కాయి. కన్నులు చెమరించాయి. కన్నుల్లో చూపుల్లో ఒక బెదురు తొంగిచూసింది. ప్రథమ సందర్శనంలో అంకురించిన అభిలాష ఇప్పుడు పల్లవించింది. అతడి ఎదుట నిలబడలేక పోతోంది. అలాగని వెళ్ళిపోనూ లేకపోతోంది. ఈ అవస్థను గుర్తించింది కుండల. రాకుమారుడివైపు చూసి సాభిప్రాయంగా నవ్వింది.


రాకుమారా! కామధేనువు చెప్పిన మానవ మహావీరుడవు నువ్వే. నీ చేతిలో పాతాళకేతువు సంహరింపబడతాడు మా మదాలస తపస్సులు ఫలించాయి. మేము గంధర్వులం. అమంత్రకమైన గాంధర్వ వివాహం మాకు పరిపాటి. ఈ దివ్యాశ్వం మీద అధిరోహింపజేసి మదాలసను మీ రాజ్యానికి తీసుకెళ్ళు. కావలసివస్తే అక్కడ మీ పద్దతిలో వివాహం జరిపించుకో.


Thursday, 9 March 2023

శ్రీదత్త పురాణము (73)

 


కువలయాశ్వుడు ఆశ్చర్యంతో నివ్వెరపోయాడు. ఇంతటి సౌందర్యరాశికి దుఃఖమా? ఇన్ని సంపదలు వుండి కన్నీరా? కారణం ఏమిటో తెలుసుకోవలసిందే అనుకొని మృదువుగా ఇలా పలకరించాడు. సుందరీ నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు? నా రాక నీకు ఇష్టం లేదా? ఇంత అందంవుండి సంపద వుండీ నీకు కన్నీరేమిటి? ఇంతకీ అసలు నువ్వు ఎవరు? పేరేమిటి? నీ తల్లితండ్రులు ఎవరు? ఈ పాతాళ నివాసం ఏమిటి? ఋతధ్వజుడు ప్రశ్నిస్తున్నాడే తప్ప ఆమె మాత్రం సమాధానం చెప్పడంలేదు. ఇంతలో ఇంతకు ముందు సింహద్వారం దగ్గర కనిపించిన సుందరాంగి వచ్చింది. ఆ యువతులు ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. ఇంతకు ముందు కనిపించిన సుందరి కువలయాశ్వుడి దగ్గరగా వచ్చి ఇలా అంది. మహావీరా, నీకు స్వాగతం అతిధి మర్యాదలు జరుపని మా అజ్ఞానాన్ని క్షమించు. ఇంతకీ మీరు ఎవరు? కిన్నెర కింపురుష, గంధర్వులలో ఏ జాతివాడవు? మమ్మల్ని ఈ నరక యాతన నుండి తప్పించడానికి వచ్చిన దేవతవా? ఎవరు మీరు? తెలియజెప్పి మా సందేహసంకటాలను తొలగించండి. అప్పుడు మాత్రమే నేను గాని మా రాకుమారి గాని నీతో ధైర్యంగా మాట్లాడుతాం.


ఈ ప్రశ్నలకు కువలయాశ్వుడు బదులు ఇలా చెప్పాడు. సుందరీ సింహద్వారంలో కనిపించి నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇక్కడికి పరుగుపరుగున వచ్చావు మీకు వచ్చిన ఆపద ఏమిటి? మీరిద్దరూ అసలు ఎవరు? భయపడకండి నేను రాక్షసుణ్ని కాదు, దేవతనూ కాను. సామాన్య మానవుణ్ని రాజకుమారుణ్ని. శత్రుజిత్తుపాలుడి కుమారుణ్ని మీ విషయాలు తెలియజెయ్యండి. చేతనయినంత సహాయం చేస్తాను.


మళ్ళీ సుందరాంగులిద్దరూ చెవులు కొరుక్కున్నారు. పరిచారక లాగ కన్పిస్తున్న సుందరి ఇవతలకి వచ్చి ఇలా అంది. రాకుమారా విశ్వాసువు అనే పేరు వినే వుంటావు. గంధర్వరాజు. వారి గారాల కూతురు ఆమె. పేరు మదాలస. నేను ఈమె ఇష్టసఖిని. నన్ను కుండల అంటారు. ఇది పాతాళలోకం. ఇది ఒక రాక్షసుడి భవనం. వాడిపేరు పాతాళ కేతువు, వీడి తండ్రి పేరు చంద్రకేతువు. వాడూ రాక్షసుడే. గంధర్వలోకంలో ఉద్యానవనంలో హాయిగా విహరిస్తున్న ఈ మదాలసను నన్నూ పాతాళ కేతువు తన తమో విద్యను ప్రయోగించి అపహరించి తెచ్చి ఇక్కడ బంధించాడు. మదాలస తనను వివాహం చేసుకోవాలట. ఎంతగానో ఒత్తిడి చేస్తున్నాడు. అన్ని ఉపాయాలు పన్నుతున్నాడు. ఈమె తిరస్కరిస్తూంది. అయినా ఆ మూర్ఖుడు పట్టువదలడంలేదు. రేపు త్రయోదశినాడు బలవంతంగానైనా పెళ్ళి చేసుకొని తీరతానని విన్ననే బెదిరించి వెళ్ళాడు. మదాలస భయపడి ప్రాణత్యాగానికి సిద్ధం అయ్యింది. ఇంతలో కామదేనువు ప్రత్యక్షమై ఆమెను వారించింది. మదాలసా తొందరపడకు ఈ రక్కసుడు నిన్ను వివాహం చేసుకోలేడు. ఈ రోజే వీడికి మరణం నిశ్చయం అయ్యింది. కాసేపట్లో వీడు భూలోకానికి వెళ్తాడు. అక్కడ ఒక ముని ఆశ్రమంలో అలజడి సృష్టిస్తాడు. అప్పుడొక రాజకుమారుడు వీణ్ని బాణంతో కొడతాడు. ఆ మహావీరుడే నిన్ను వివాహం చేసుకుంటాడు. ఎక్కడి పాతాళం ఎక్కడి భూలోకం అని ఆశ్చర్యపడకు రేపటికి అంతా నీకే తెలుస్తుంది. ఇలా కామధేనువు ధైర్యంచెబితే మా రాకుమారి ఆత్మ హత్యా ప్రయత్నం నుండి విరమించుకుంది.


Wednesday, 8 March 2023

శ్రీదత్త పురాణము (72)

 


ఒకనాటి సాయంకాలం గాలవాదులు సంధ్యోపాసన చేస్తూ వుండగా రాక్షసుడు పంది రూపంలో వచ్చి ఆశమ్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఋతధ్వజుడు కువలయాశ్వాన్ని అధిరోహించి ఆ మాయా పందిని వెంబడించాడు. బాణం దెబ్బలు తప్పించుకుంటూ శరవేగంగా పరుగు తీస్తోంది ఆ పంది. కువలయాశ్వుడు వెంటబడి తరుముతున్నాడు. ఎట్టకేలకు ఒక బాణం దాని డొక్కలో గ్రుచ్చుకుపోయింది. అయినా అది లెక్క చేయకుండా పరుగెడుతూ చివరకు అది పాతాళానికి చేరింది. రాకుమారుడు దాని వెంట పాతాళలోకానికి చేరుకున్నాడు. అది ఒక దివ్య భవనంలోకి ప్రవేశించి అదృశ్యమయ్యింది. కువలయాశ్వుడు ఆ భవనం అంతా వెదికాడు. కానీ ఆ మాయా పంది జాడ కనిపించలేదు. కాని ఒక ద్వారం వద్ద ఒక కాంతామణి కనిపించింది. కువలయాశ్వుడికి సందేహం వచ్చింది. రాక్షసుడే ఆ రూపం ధరించాడేమోనని, ఆమె రాక్షసుడేనని సంహరిస్తే ఒక వేళ కాని పక్షంలో స్త్రీ హత్యా పాతకం చుట్టుకుంటుందేమో అడిగి చూద్దామని గంభీరస్వరంతో ఇలా అన్నాడు. నారీ ఎవరు నీవు? ఈ దివ్య మందిరం ఎవరిది? నువ్వు ఇక్కడ ఎందుకువున్నావు? ఆ అమ్మాయి నోట ఏ ఉలుకూ లేదు పలుకూ లేదు. ఒకసారి కువలయాశ్వున్ని ఎగా దిగా చూసి కనురెప్పలు టపటప ఆర్పి భవనం పైభాగానికి మెట్ల మీదుగా తుర్రుమని జారుకుంది. కువలుడు కూడా సౌధాగ్రం చేరుకున్నాడు. గుర్రం దిగాడు. ఆ సుందరి వెంట తాను కూడా సౌధాగ్ర మందిరంలోకి ప్రవేశించాడు పరుగు పరుగున.


అది ఒక పాలరాతి మందిరం. విశాలంగా వుంది. స్తంభాల మీద అపూర్వ శిల్ప సంపద ఉట్టి పడుతోంది. ఆ మందిరంలో ఎక్కడ వాలిన చూపు అక్కడే నిలిచిపోతోంది. మందిర మధ్యభాగంలో బంగారు వేదిక, దాని మీద హంసతూలికా తల్పము. దాని చుట్లూ ఉల్లిపారల్లాంటి తెల్లని దివ్యాంబరం గొడుగులా వేలాడుతోంది. ఆ తెరలోపల వేదికపై ఒక సుందరి. తెలిమబ్బుల్లో చందమామలా దోబూచులాడుతోంది. పరికించి చూసాడు. కళ్ళు చెదిరిపోయే సౌందర్యం ఆమెది. మన్మధుణ్ని విడిచి వచ్చిన రతీదేవిలావుంది. పాతాళలోకాధి దేవత కాబోలు అనుకున్నాడు ఋతధ్వజుడు. ఆమె కువలయాశ్వుణ్ని చూడగానే తల్పందిగి తలవంచుకొని ఒయ్యారంగా నిలబడింది. కుడికాలిపై బరువు ఆనించి ఎడమకాలి బొటన వ్రేలితో నేలను రాస్తోంది. ఎడమ చేతిలో కమలాన్ని కుడి చేతితో సుతారంగా పొదివిపట్టుకొని పావురం వీపు నిమిరినట్లుగా కమలం రేకులు ముడుచుకొనేలా కలుపుతోంది. కడగంటి చూపులు విసురుతోంది. అతడు చూస్తుంటే కన్నులు దించుకుంటోంది. చూపులు కలిస్తే కలవరంతో కన్నులు దించుకుంటుంది. ఆమెకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వులు విరుస్తున్నాయి. బుగ్గల్లో గులాబీలు రేకులు విప్పుకుంటున్నాయి. ఋతధ్వజునిలో అభిలాష మొదలయింది. రెండడుగులు ముందుకేశాడు. ఆ సుందరాంగి చేరువలో నిలబడ్డాడు. పలకరించాలని తహతహ బయలుదేరింది. అతిధి మర్యాదలు చేయదా? కనీసం పలుకదా? రండి కూర్చోండి అనదా? అని ఎదురు చూపులు మొదలయ్యాయి. అతడు చేరువకు వస్తున్నకొద్దీ ఆ లావణ్యవతిలో కళవరం బయలుదేరింది. కువలయాశ్వుడి ముఖంలోకి ఒక్కసారిగా చూసి వెంటనే చూపులు దించుకుంటోంది. ఆమె కన్నుల నుండి రెండు అశ్రుబిందువులు హఠాత్తుగా రాలి ఆమె గుండెల మీదకు జారాయి.


Tuesday, 7 March 2023

శ్రీదత్త పురాణము (71)



కాకపోతే అతనికి తీరని దిగులు మాత్రం వుంది. దాన్ని మరచిపోవడానికే అతను మాతో ఆటపాటలతో మునిగిపోతూంటాడు. ఆ దిగులు తీర్చగలిగితే అదే నిజమైన ప్రత్యుపకారం. నాయనలారా మీ మిత్రుడి దిగులు ఒకటి, మీ దిగులు ఒకటీనా! తప్పక తీరుద్దాం శక్తివంచన లేకుండా ప్రయత్నిద్దాం అసలు ఆ దిగులేమిటో చెప్పండి.


జనకా మా మిత్రుడు వివాహితుడు. మదాలస అతని భార్య ఒక గంధర్వరాజకుమారి. సౌందర్యరాశి. ఒక రాక్షసుడి వంచనకు గురి అయి హఠాత్తుగా మరణించింది. అప్పటినుండీ ఋతవ్వజుడు ఆమెనే తల్చుకుంటూ పునర్వివాహమునకు మనసొప్పక కఠిన బ్రహ్మచర్యంతో గడుపుతున్నాడు. మాతోడిదేలోకంగా మెలుగుతున్నాడు. దిగులు మర్చిపోతున్నాడు. తండ్రి ఆ దిగులు తీర్చగలమా?


పుత్రులారా తప్పక తీర్చగలం ముందు ఆ రాక్షసుడు ఎవరు? ఎలా వంచించాడు? ఆ వివరాలు చెప్పండి. తండ్రీ మాకు తెలిసింది చెబుతాము ఆలకించండి. గాలవుడు అనే మహర్షి పేరు మీరు వినే వుంటారు. అతడు మహా తపస్వి. ఎక్కడో ఆశ్రమంలో శిష్య బృందంతో ఇతర మునిగణాలతో కలసి తపస్సు చేసుకుంటూ వుండే వాడు, ఒక రోజున ఒక దివ్యాసం అధిరోహించి శత్రుజిత్తు మహారాజు దగ్గరికి ఆకాశమార్గంలో వచ్చాడు. శత్రుజిత్తు మహారాజు ఆశ్చర్యంతో అతిధి మర్యాదలు చేసాడు. గాలవుడు సంతోషించి మహారాజా మా ఆశ్రమంలో తపస్వులకు రాక్షసపీడ ఎక్కువగా వుంది. మా తపశ్శక్తిని ఉపయోగించి ఆ రాక్షసుల్ని శాపాగ్నికి గురిచేద్దామంటే వెనుకటికి విశ్వామిత్రుడు వలె తపస్సును వృధా చేసుకోవడం ఇష్టంలేదు. ఆ రాక్షస పీడను భరిస్తూ మాలో మేమే కుమిలి పోతూవున్నాము. ఒకనాటి మధ్యాహ్నం ఈ దివ్యమైన అశ్వం నాముందు నిలచింది. సూర్యుడి రధాశ్వంలాగా మెరిసిపోతున్న దీన్ని చూసి ఆశ్చర్యంగా నిలబడ్డాను. అంతలోనే అశరీరవాణి వినిపించింది. గాలవా ఇది దివ్యాశ్వం. దీని పేరు కువలయ. సూర్యుడు పంపాడు. దీని గమనానికి అడ్డులేదు. ఇది ఆకాశంలో ఎగురుతుంది. నేల మీద పరుగెడుతుంది. పర్వతాల మీద దూకుతుంది. సముద్రాల్లో ఈదుతుంది. నీటిపై నడుస్తుంది. ఇది పాతాళాలలో చుట్టివస్తుంది. ఈ ఉత్తమజాతి గుర్రాన్ని శత్రుజిత్తు మహారాజు కుమారుడైన ఋతధ్వజునికి ఇచ్చి రాక్షస సంహారం చేయించుకో అని చెప్పింది. కాబట్టి శత్రుజిన్మహారాజా నీ దగ్గరకు వచ్చాను. నీ పుత్రుణ్ని నాతో పంపు మునిజన సంరక్షణ చేసి వస్తాడు. ఈ దివ్యాశ్వంని అధిరోహించడం వల్ల నీ కుమారుడికి కువలయాశ్వుడు అనే పేరు స్థిరపడుతుంది.


గాలవ ముని అభ్యర్ధనను శత్రుజిత్తు మహారాజు ఆజ్ఞగా అంగీకరించి ధశరధ మహారాజు విశ్వామిత్ర మహర్షి వెంట రాముణ్ని పంపినట్లు నేను కూడా మీ వెంట మా చిరంజీవిని పంపిస్తున్నాను అన్నాడు. వెంటనే ఋతుధ్వజుడు. తండ్రి పాదములకు నమస్కరించి దివ్యాశ్వముకు మ్రొక్కి దాని సకిలింపును అనుమతిగా గ్రహించి అధిరోహించి గాలవుడుతో సహా ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ వున్న ముని బృందానికి నమస్కరించి ఆశీస్సులు పొందాడు. ఆ నిమిషం నుండీ జాగరూకుడై ఆశ్రమ సంరక్షణ బాధ్యతలను స్వీకరించాడు.

Monday, 6 March 2023

శ్రీదత్త పురాణము (70)

 

తండ్రీ! దత్తాత్రేయుణ్ని ఉపాసించి కార్తవీర్యుడు పొందిన దివ్యశక్తుల గురించి క్లుప్తంగా తెలియజేసాను. ఇంక అలర్క జన్మ కర్మాదులు వివరిస్తాను ఆలకించు అని సుమతి తన కధనం కొనసాగించాడు.


కువలయాశ్యుడి కథ


పూర్వకాలంలో శత్రుజిత్తు అనే రాజు వుండేవాడు. మహావీరుడు అనేక యజ్ఞాలుచేసి ఇంద్రుడ్ని సంతృప్తి పరచాడు. ఆ పుణ్య ఫలం వల్ల పుత్రుడ్ని పొందాడు. ఋతుధ్వజుడు అని పేరు పెట్టుకున్నాడు. తండ్రికి తగిన పుత్రుడు, బుద్ధిలో ఆ బృహస్పతి సమానుడు. విక్రమ లావణ్యాలలో ఇంద్ర అశ్వనీ కుమారులతో సమానుడు. తన ఈడు రాకుమారులతో కలసి ఆడుకుంటూవుంటే ఒక రోజున నాగలోకం నుండి ఇద్దరు రాకుమారులు వచ్చారు. వారిద్దరూ అశ్వతరుడు అనే నాగరాజు కుమారులు. వారు బ్రాహ్మణ బాలకులుగా వచ్చి ఋతధ్వజునితో కలసి మెలసి తిరుగుతూ ఆటపాటల్లో భాగస్వాములయ్యారు. ఋతర్వజనితో వీరికి గాఢమైన స్నేహం ఏర్పడింది. రోజూ వీరు నాగలోకం నుండి వచ్చి వెళుతూవుండేవారు. చివరికి వీరి స్నేహం ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అందువలన ఒక్కొక్కసారి వారిని తిరిగి వెళ్ళనివ్వడంలేదు. తనతోనే స్నానపానాదులు ఏర్పరచి ఉంచుకుంటున్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి.


అశ్వతరుడు ఒక రోజున తన పుత్రుల్ని పిలచి తరుచుగా మీరు మన లోకంలో వుంటున్నట్లుగా కన్పించడంలేదు. కారణం ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నారు. ఇటీవల రాత్రుళ్ళు కూడా ఇంటికి రావడంలేదు. ఏం చేస్తున్నారు అని గద్దించి ప్రశ్నించాడు. నాగకుమారులు తమకు భూలోకంలో ఋతర్వజునితో కలిగిన స్నేహబంధం గురించి చెప్పారు. అప్పుడా నాగరాజు మానవులతో మనకు స్నేహం ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడా నాగకుమారులు ఆ రాజకుమారుడి గుణగణాలను ఆత్మీయతలను ఏకరువుపెట్టారు. మా కోసం ప్రాణాలు సహితం త్యజిస్తాడు. మేములేనిదే బ్రతుకలేదు. మాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తుంటాడు. మేము ఏది అంటే అది జరిపిస్తాడు. అతడు వయస్సులో పెద్ద అయినా మాతో కలసి వుంటాడు. నిండు యౌవనంలో వున్నాడు. అయినా మాలో ఒకడుగా ప్రాణంలో ప్రాణంలా కలిసిపోయాడు. మాతో వున్నప్పుడు సమస్త లోకాల్ని మరిచిపోతాడు. తాను ఆనందిస్తాడు మమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాడు. తండ్రీ మానవుడు కదా అని శంకించవలసిన పనిలేదు. అతడితో మైత్రికి మేము ఎంతగానో గర్వపడుతున్నాము.


పుత్రులిద్దరూ ఏకకంఠంతో చెప్పేసరికి అశ్వతరుడు మరింక ప్రశ్నించలేదు. నాయనలారా సత్సాంగత్యం సకల శ్రేయోదాయకం. మీ స్నేహాన్ని కొనసాగించండి. అతడికి ప్రత్యుపకారంగా ఏమైన బహుమతులు మీరు కూడా ఇవ్వండి. అని ప్రోత్సహించాడు.


తండ్రీ ఋతద్వజుడుకి మనం ఇవ్వగలిగిన బహుమతులు ఏమీ లేవు. అన్నింటా అతడు మనకన్నా సంపన్నుడు.


Sunday, 5 March 2023

శ్రీదత్త పురాణము (69)

 

దత్తస్వామి తనకు వరాలు ఇచ్చిన రోజు ఏటేటా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ప్రత్యేకంగా దత్త పూజా మహోత్సవాలు జరుపుతూవున్నాడు. వీటిలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనేటట్లుగా చేస్తున్నాడు. అతడి చేష్టలు చిత్రాతి చిత్రంగా వుంటున్నాయి. ఉన్నట్లుండి ఒక్కొక్క రోజున దత్త దర్శనమున కెళ్లాడు. నమస్కరించి వెంటనే తిరిగి వస్తూ వుంటాడు. ఒక్కొ రోజున అక్కడే ఉండిపోతూ వుంటాడు. ధర్మ శాస్త్రాలు యోగవిద్యలూ పండితులతో చెప్పించుకొని వింటూ వుంటాడు. వారిని బహుదా సేవిస్తూ వుంటాడు. వారిని అనేక విషయాలు అడిగి తెలుసుకుంటూ వుంటాడు. దత్తుడి గురించి తానేమి విన్నాడో అన్నీ తన ప్రజలకు వివరిస్తూ వుంటాడు. అతడికి దాచవలసింది ఏమీ లేదు.


ఒక రోజు కార్తవీర్యుడు తన అంతఃపుర కాంతలతో కలసి రేవానదిలో క్రీడిస్తూ వున్నాడు. ఉన్నట్లుండి అతడికి వింత ఆలోచన వచ్చింది, తనలో నుండి సహస్ర బాహువులను ఆవిర్భవింపజేసాడు. రేవానదిని అడ్డగించాడు. ఒకప్రక్క అయిదువందల చేతులు ఇంకొక ప్రక్క అయిదువందల చేతులు వేసి మధ్యలో తాను వుండి రేవానదికి ఆనకట్ట వేశాడు. ప్రవాహం ఆగిపోయింది. ఒక్క చుక్క నీరు కూడా ముందుకు సాగలేదు. నీరంతా ఎగదన్నింది. వెనుకవైపున దూరంగా ఎక్కడో విడిది చేసిన రావణాసురుని సేనా శిబిరాలను రేవానది ముంచివేసింది. రావణుడికి కోపం వచ్చింది. మేఘంలేని వానలాగ వర్షంలేని ఈ వరద ఏమిటని హుంకరించి విషయం ఏమిటో తెలుసుకొనిరమ్మని భటులను పంపాడు. వాళ్ళు వచ్చి చూసి సంగతి తెలియజేసారు. ఆడవాళ్ళతో జలకాలాటకు వచ్చిన కార్తవీర్యుడు ఒంటరిగా దొరికాడు కనుక తేలికగా జయింపవచ్చునని భావించాడు రావణుడు. సైన్యంతో వచ్చి చుట్టుముట్టాడు. అర్జునుడు చిద్విలాసంగా నవ్వుతూ నదిలో నుండి లేచి వచ్చాడు. తనకున్న సిద్దులతో ఎంతమంది రాక్షసులు వున్నారో అన్ని రూపాలను ధరించి అందర్ని క్షణంలో మట్టుబెట్టాడు. రావణాసురుణ్ని వెయ్యి చేతులతో పట్టుకొని బంధించి వాడి ఇరవై చేతులను విరిచికట్టేసి తన రాజ్యానికి తీసికెళ్ళి చెరసాలలో బంధించాడు.


కొన్ని రోజులకు ఈ వార్త లంకాపట్టణమంతా తెలిసి పోయింది. దశకంఠుడి తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చి కార్తవీర్యుణ్ణి అభ్యర్ధించి మనవణ్ణి విడిపించుకుపోయాడు.


కార్తవీర్యార్జునుడికి ఇలాంటి దివ్యశక్తులూ మహిమలు దత్తస్వామి అనుగ్రహం వల్ల లభించాయి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే శంక చక్ర గదాధారి. అతడే పరాత్పరుడు అతడే వాసుదేవుడు. అతడే మహా మాయతో కలసి ఈ చరాచర జగత్తుకి సృష్టి, స్థితి, లయాలు జరుపుతూ వుంటాడు. ఇతడికన్నా అన్వేషింపదగిన వస్తువులేదు. ధ్యానింపదగిన శక్తిలేదు. కర్మబంధనాలు త్రెంచి ముక్తిని ప్రసాదించే హృషీకేశుడు ఇతడే. శ్రీహరికి దత్తరూపమే ఉత్తమోత్తమం. త్రికరణశుద్ధిగా చేస్తే చాలు అనుగ్రహం కురిపిస్తాడు. నేను భక్తికి దాసుణ్ని భక్తితో పత్రంగాని, పుష్పంగాని, ఫలంగాని, చివరకు కాసిన్ని మంచినీళ్ళుగాని నాకు సమర్పించండి నేను మిమ్మల్ని కాపాడుతాను అనేది స్వామి వారి ప్రతిజ్ఞ. ధర్మ సంస్థాపనకు అధర్మ నిర్మూలనకు శిష్ట రక్షణకూ దుష్ట శిక్షణకూ బద్ధ కంకణుడై శ్రీహరి దత్తావతారం ధరించాడు.


Saturday, 4 March 2023

శ్రీదత్త పురాణము (68)



దత్త దేవా నా జన్మ ధన్యమైయ్యింది. నీ అనుగ్రహానికి నేను పాత్రుణ్ని అయ్యాను. ఇంతకన్నా నేను కోరుకోవలసింది ఏముంది. అయినా నీ ఆజ్ఞను కాదనలేక, నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వరాలు అడుగుతున్నాను. నేను చేసే ప్రజాపాలనలో ధర్మార్ధాలు వృద్ధిపొందేటట్లు, ఎదుటివారి ఆలోచనలు నాకు తెలిసిపోయేటట్లు, పుణ్య పాప సుఖ దుఃఖాల ద్వంద్వాలను తెలుసుకునే ప్రసిద్ధి కలిగేటట్లు, నేను కోరుకున్నప్పుడు నాకు వేయి బాహువులు (చేతులు) వచ్చేటట్లు, అణిమాది అష్టసిద్ధులు నాకు వశం అయ్యేటట్లు పర్వతాలపై ఆకాశం పై, సముద్రంపై, సృధివిలో పాతాళంలో నిరాటంకంగా సంచరించే శక్తి కలిగేటట్లు నా కన్నా గొప్పవాడు ప్రసిద్ధుడు అయిన వ్యక్తిచేతిలోనే మరణించేటట్లు, నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించే వారు లభించేటట్లు, గొప్ప గొప్ప అతిధులు నిత్యము దొరికేటట్లు, సంపదలు అక్షయంగా వుంటేటట్లు నన్ను స్మరిస్తేచాలు ప్రజలకు పోయిన వస్తువులు దొరికేటట్లు, నీ పట్ల నిశ్చలమైన భక్తి నిలచేటట్లు అనుగ్రహించుదేవా అని అడిగాడు.


కార్తవీర్యుడు కోరికలన్నీ దత్తుడు అంగీకరించాడు. తధాస్తు అని పలికాడు. నా అనుగ్రహంవల్ల నీవు చక్రవర్తిని అవుతావు వెళ్ళు అన్నాడు. అర్జునుడు పరమానందంతో తన చేతుల్ని చూసుకున్నాడు. చొట్ట చేతుల స్థానంలో బలమైన దృఢమైన చేతులు వచ్చాయి. సంవత్సరముల తరబడి సేవ చేసి అలసిన శరీరం వింతకాంతితో వెలిగిపోయింది. తృప్తిగా శరీరం అంతా చూసుకొని ఆనందంతో మరోసారి సాష్టాంగ నమస్కారంచేసి దత్తస్వామి వద్ద సెలవు తీసికొని బయలుదేరాడు. రాజధాని మహిష్మతీపురం చేరుకున్నాడు. పౌర జానపద సామంత దండనాయక మంత్రి కవి పండితావళి సాక్షిగా పట్టాభిషేకం జరిపించుకున్నాడు. అమరులూ, గంధర్వులూ, అప్సరసలూ వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆశీర్వదించి వెళ్ళారు. గురువర మహిమ వల్ల సామ్రాజ్యంలో సకల సంపదలూ వృద్ధి చెందాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అర్జునుడు అత్యంత బలిష్ఠుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్యంలో తాను తప్ప ఎవరూ ఏ ఆయుధమూ చేపట్టరాదని అలా పడితే అతణ్ని పరహింసా పరాయణుడిగా గుర్తించి శిక్షిస్తామని దీనికి శిక్ష శిరచ్ఛేదమని శాసనం అమలుచేసాడు. అంతే ఆ క్షణం నుండి అతని రాజ్యంలో ఎవ్వడైనా ఆయుధం ముట్టుకుంటే ఒట్టు గ్రామ పాలన, క్షేత్రపాలన, పశుపాలన, గోబ్రాహ్మణ సంరక్షణ సమస్తమూ తానే చూసుకుంటున్నాడు. ప్రజలకు చోర, సర్ప, అగ్ని, శత్రు భయాదులు లేకుండా చేసాడు. ఒకవేళ ఎవరికైన ఏదైనా ఆపద వస్తే కార్తవీర్యార్జునుడ్ని తలుచుకుంటే చాలు స్వయంగా ప్రత్యక్షమై వారి వారి ఆపదలు తొలగిస్తున్నాడు. అతడి స్మరణతో పోయిన వస్తువులు కూడా దొరుకుతున్నాయి. ప్రజలు హాయిగా సుఖశాంతులతో భోగభాగ్యములతో వర్ధిల్లుతున్నారు అతడి పాలనలో, భూరి దక్షిణలతో యజ్ఞ యాగాది క్రతువులను మహావైభవంగా జరిపిస్తున్నాడు. చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటిని జయిస్తున్నాడు. ఇతడి ధర్మానురక్తిని, శౌర్య పరాక్రమాలను ఆత్మాభిమానాన్ని కళ్ళారా చూసిన అంగీరసుడు ఆనందం పట్టలేక కార్తవీర్యార్జునుడు అంతటి రాజు మరొకడు లేడని ఘంటాపధంగా ప్రకటించాడు.


Friday, 3 March 2023

శ్రీదత్త పురాణము (67)


 కార్తవీర్యుడికి గర్గముని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దత్తుడు ఇంద్రాది దేవతల్ని పరీక్షించిన కధ గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది తనకు కఠిన పరీక్ష. అంటే స్వామి అనుగ్రహించబోతున్నాడన్న మాట. ఇందులో నెగ్గితే తన కోరిక నెరవేరుతుంది. ఈ ఆలోచనలతో ధైర్యం వచ్చింది. దత్త స్వామితో ఇలా అన్నాడు. దత్త యోగీంద్రా నువ్వు సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడవని నా విశ్వాసం. ఈ తల్లి కలుముల కల్పవల్లి మహాలక్ష్మి. ఇక్కడ మీకు సేవచేస్తున్న పరిచారక గణం అంతా గంధర్వులు. వీరితో సహవాసము నీ సేవా భాగ్యము నాకు బహుజన్మ తపఃఫలం. ఏ రాజభోగాలు దీనికి సాటి రావు. స్వామి నీ కఠిన పరీక్షలు గురించి విన్నాను. నీ మాయలు కళ్ళారా చూసాను. ఇంద్రాది దేవతలకే అర్ధంకాదు నీ మాయలు. వాటిని అర్ధం చేసుకోవడం నువ్వు పెట్టే పరీక్షల్లో నెగ్గడం నా బోటి సామాన్య మానవుడికి అయ్యేపనా. స్వామి నువ్వు కరుణా మూర్తివని వేదాలు శాస్త్రాలు పొగుడుతున్నాయి. అలాంటి నీవు ఒక సామాన్య మానవుణ్ని ఇంతగా కఠిన పరీక్షలకు గురి చెయ్యడం భావ్యమా? నువ్వే వంచిస్తే మాకు దిక్కు ఎవరు? రక్షకుడెవరు? పోనీలే పరీక్షించు నీకు సంతృప్తి కలిగే దాకా పరీక్షించు. రెండు చేతులే కాదు రెండు కాళ్ళు పోయినా ఫరవాలేదు. చివరకు ప్రాణాలు పోయినా ఇబ్బంది లేదు. నీ సేవ వదలను. నీ సన్నిధిని విడిచిపెట్టను.


అవతలకి పొమ్మని మాత్రం ఆజ్ఞాపించకు. అదే పదివేలు అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలేని దుఃఖంతో సాష్టాంగపడ్డాడు. కన్నీళ్ళతో కాళ్ళు కడిగాడు. దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు.


కార్తవీర్యా, లే నీ భక్తికి సంతోషించాను. నీ జ్ఞానానికి ఆనందించాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. లే లేచి వరం కోరుకో నీకు కావలసింది ప్రసాదిస్తాను. లక్ష్మీ సమేతుడుగా (అనఘ) నన్ను సేవించిన వారికి మృష్టాన్న మద్యమాంసాదులు నాకు నివేదనలు చేసిన వారికి, వీణా వేణు శంఖాదులు మ్రోగిస్తూ సంగీత సాహిత్య నృత్యాలతో నన్ను ఆరాధించిన వారికి, వేద శాస్త్ర పండితులను సత్కరించే వారికి, నేను కోరికలన్నీ తీరుస్తాను. పుత్ర పౌత్రాభి వృద్ధిని ధన ధాన్య భోగభాగ్య సమృద్ధిని ఆయురారోగ్యములను తనివితీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించే వారిని అవమానించే వారిని నిర్ధాక్షిణ్యంగా అణిచిపారేస్తాను. కార్తవీర్యార్జునా ఇది నా దీక్ష నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. నీకు ఏమేమి కావాలో నిస్సంసయంగా కోరుకో వెంటనే తీరుస్తాను అన్నారు దత్తస్వామి.


కార్తవీర్యుడు మనస్సులో కళ్ళల్లో ఆనదం వెల్లివిరిసింది. కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలాయి. మెల్లగా లేచి నిలబడ్డాడు స్వామి వైపు సవినయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న స్వరంతో ఇలా అన్నాడు.

Thursday, 2 March 2023

శ్రీదత్త పురాణము (66)

 


ఉదయం ఫలపుష్పాదులు సమకూర్చడం మధ్యాహ్నం చందనాదులు సిద్ధం చెయ్యడం సాయంకాలం మండపాలను వివిధ రకాల పూల మాలలతో మండపాలు అలంకరించడం, మిగతా పనులన్నింటిని చెయ్యడం, వగైరా పనులన్నింటిని తనే చేస్తున్నాడు. స్వామి వేళ తప్పకుండా భోజనం చేసేటట్లు సిద్ధం చేసి తానే దగ్గరుండి వడ్డిస్తూ కొసరి కొసరి తినిపిస్తూవున్నాడు. స్వామి భుక్తశేషాన్ని కళ్ళకద్దుకొని భక్తితో తాను భుజిస్తున్నారు. అవిటి చేతులతో ఇంత చేస్తుంటేస్వామి యొక్క పరిచారక గణం చూచి ఆశ్చర్యపోతున్నారు. స్వామి భక్తి అంటే ఇది అని కొందరు మెచ్చుకుంటున్నారు. మనం ఏనాటి నుండో సేవ చేస్తున్నా నిన్న మొన్న దగ్గరయిన ఇతడు దత్తస్వామికి సన్నిహితుడూ అంతరంగికుడు అవుతున్నాడే అని మరి కొందరు లోలోపల అసూయపడుతున్నారు. సూటిపోటి మాటలు అంటున్నారు. కార్తవీర్యార్జునుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నిజమైన భక్తితో రేయింబవళ్ళు స్వామిని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవచేస్తున్నాడు. నెలలూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి.


ఒక రోజున దత్త స్వామి కూర్చున్న మణిశిలపై వున్న మెత్తని పరుపులను అతడు సర్దుతున్నాడు. దత్తస్వామి పృష్టభాగం బాధ కలుగకుండా వుండేందుకు వీలుగా సుఖంగా కూర్చునేందుకు వీలుగా సౌకర్యంగా వుండేందుకు పడకను సర్దుతున్నాడు. ఆ సమయంలో దత్తస్వామి పృష్ట భాగం నుండి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు నుండి పుట్టిన వేడికి కార్తవీర్యుడి రెండు లొట్ట చేతులు మాడిపోయాయి. ఓర్చుకోలేనంత బాధ కలిగింది. నొప్పి మంట కలగడంతో గట్టిగా మూలిగాడు కార్తవీర్యుడు. భాధతో మెలికలు తిరుగుతూ కూర్చుండిపోయాడు.


దత్తస్వామి కంగారుగా అయ్యయ్యో ఎంత ప్రమాదం జరిగింది. కొండ నాలికకు మందు వేస్తే వున్న నాలిక పోయినట్లు అయ్యింది. ఎవరో ఏదో చెబితే నన్ను సేవిస్తున్నావు. లొట్ట చేతులు బాగుపడతాయి అనుకున్నావు చూసావా ఏమయ్యిందో వున్న చేతులు కూడా పూడిపోయాయి. ఇకనైనా కళ్ళు తెరువు నువ్వు ఆశించినట్లు, లేదా నీకు చెప్పినవారు. అన్నట్లుగా 'నేనేమి మహాదివ్యశక్తులు కలిగిన వాణ్ణి కాదు. సాధారణ తపశ్విని. నిజానికి అది కూడా కాదు. నువ్వే చూస్తున్నావుగా నా దినచర్య. స్త్రీలోలుణ్ణి ఎవరికీ అందనివాణ్ణి. నన్ను నమ్మి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో. చూడు. రాజకుమారుడవి. నీవు భోగ భాగ్యములకు దూరమై ఇన్ని అవస్థలు పడుతున్నావు. వెర్రి వాడా తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని సేవిస్తే లొట్ట చేతులు బాగుపడతాయా, అయ్యిందేదో అయిపోయింది. ఇకనైనా వెళ్ళు ఎవరినైనా శక్తి మంతుణ్ని ఆశ్రయించు అన్నారు దత్తస్వామి.