అలర్కుడికి దత్తుడు ఉపదేశించిన యోగమార్గం దర్శనం -
దత్తాత్రేయుడు కరుణించాడు. రాజా! నీ దుఃఖాన్ని ఇప్పుడే తొలగిస్తాను. నిజం చెప్పు. నీకసలు ఈ దుఃఖం ఎందువల్ల కలిగింది? నువ్వు ఎవరివి? ఈ దుఃఖం ఎవరిది? 'నువ్వు' అంటే ఈ అవయవాలా? వీటి సంపుటియైన దేహమా? లేక అందులో దాగి ఉన్న ఆత్మయా? వీటిలో ఏది నువ్వు? ఈ దుఃఖం ఎవరిది? ఇది కొంచెం ఆలోచించి చెప్పు, దుఃఖం ఎవరిదో దుఃఖకారణమేమిటో, దుఃఖం ఎక్కడ ఉన్నదో తెలిశాక దాన్ని తొలగించటం ఏ పాటి చిటికెలో పని.
అలర్కుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే నేనెవణ్ని? నేను అంటే అవయవాలా? దేహమా? ఇవి రెండూ జడపదార్థాలుగదా! అవి "నేను" అని ఎలా అనుకుంటాము? అలా అనుకునేదేదో తెలిస్తే అదే దుఃఖానికి స్థానమవుతుంది. నేను అంటే శరీరం కాదు. అది పంచభూతాలతో నిర్మితమయ్యింది. కనుక నేను అనేది పంచభూతాలలో ఏ ఒక్కటీకాదు. మొత్తం వీటి కలయిక అయిన ఈ దేహాన్ని నేనుగా భ్రమపడుతున్నాను. ఈ భ్రాంతి వల్లనే సుఖదుఃఖాలు రెండూ కలుగుతున్నాయి. దీనికి సంభవించే సుఖదుఃఖాలకూ, ఈ దేహానికి అతీతుడనైన నాకూ ఏమిటి సంబంధం? నేను నవ్వడమేమిటి. నేను ఎడ్వడమేమిటి? నేను నిరంజనుణ్ని, నేను నిస్సంగుణ్ని. నేను నిత్యుణ్ని. నేను నిర్మలుణ్ని. ఎక్కువలూ, తక్కువలూ, పడటాలూ, లేవడాలు నాకు లేవు. మరి నాకు దుఃఖమేమిటి సుఖమేమిటి? ఏదీ లేదు.
ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలూ, ఐదు ప్రాణాలు, మనస్సు, అహంకారమూ అనే ఈ పదిహేడు తత్వాలతో కూడిన సూక్ష్మశరీరం ఒకటి ఉంది. ఈ రెండింటికి అతీతంగా నిలబడి వాటిని విడివిడిగా చూడగల్గుతున్న నాకు సుఖమేమిటి? దుఃఖమేమిటి? అంతా వట్టి భ్రాంతిగాక.
సుఖదుఃఖాలకు ఉనికి పట్టు మనస్సు. కనుక అవిదానివే తప్ప నావికాదు. నాకు వాటితో ఏ సంబంధమూ లేదు. నేను మనస్సును కాదుగదా! బుద్ధినీకాను. అహంకారమునూ కాను. స్థూలసూక్ష్మ శరీరాలు రెండూ కాను. వీటికి అతీతుణ్ని, వీటికన్నా విలక్షణుణ్ని. నాకు అత్యంత సమీపంలో ఉండి భ్రాంతి మూలకమే అయినప్పటికీ ఏదో కొంత సంబంధమే ఉన్న ఈ శరీరమే నేను కానప్పుడు, దీనికున్న అంతర్బహిరవయవాలలో ఏదీ నేను కానప్పుడు, ఎక్కడో దూరంగా ఏ సంబంధమ లేకుండా ఉన్న చతురంగ బలాలూ, కోశాగారాలూ, అంతఃపురాలూ, సింహాసనాలు - ఇవి "నేను" ఎలా అవుతాయి? వాటికీ నాకు సంబంధం ఏమిటి? అంతా భ్రమ. నాకు ఏమీ లేవు. రాజ్యం లేదు. కోశం లేదు. శత్రువు లేడు. మిత్రుడు లేడు. ఒక్కటే ఆకాశం అనేక పాత్రలలో విభిన్న రూపాలతో కన్పిస్తున్నట్టు ఒక్కటే ఆత్మ-ఉపాధి భేదాలను బట్టి అనేకంగా కనబడుతోంది. ఆలోచించి చూస్తే అందరిలోనూ ఉన్నది ఒక్కటే ఆత్మ, సుబాహువులో, కాశీపతిలో, ఈ ఆలర్కుడిలో ఉన్న 'నేను' అనబడే పదార్థం ఒక్కటే. మరి మేము ముగ్గురం విభిన్నులం ఎలా అవుతాం? ఉపాధులు వేరు. ఆ ఉపాధి 'నేను' కాదు. నేనైనది ముగ్గురిలోనూ ఒక్కటే. అంచేత మాకు శత్రుత్వమేమిటి? మిత్రత్వమేమిటి? అంతా ఒక్కటే ఆత్మ! పరమాత్మ! లేదు.
No comments:
Post a Comment