Wednesday 8 March 2023

శ్రీదత్త పురాణము (72)

 


ఒకనాటి సాయంకాలం గాలవాదులు సంధ్యోపాసన చేస్తూ వుండగా రాక్షసుడు పంది రూపంలో వచ్చి ఆశమ్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఋతధ్వజుడు కువలయాశ్వాన్ని అధిరోహించి ఆ మాయా పందిని వెంబడించాడు. బాణం దెబ్బలు తప్పించుకుంటూ శరవేగంగా పరుగు తీస్తోంది ఆ పంది. కువలయాశ్వుడు వెంటబడి తరుముతున్నాడు. ఎట్టకేలకు ఒక బాణం దాని డొక్కలో గ్రుచ్చుకుపోయింది. అయినా అది లెక్క చేయకుండా పరుగెడుతూ చివరకు అది పాతాళానికి చేరింది. రాకుమారుడు దాని వెంట పాతాళలోకానికి చేరుకున్నాడు. అది ఒక దివ్య భవనంలోకి ప్రవేశించి అదృశ్యమయ్యింది. కువలయాశ్వుడు ఆ భవనం అంతా వెదికాడు. కానీ ఆ మాయా పంది జాడ కనిపించలేదు. కాని ఒక ద్వారం వద్ద ఒక కాంతామణి కనిపించింది. కువలయాశ్వుడికి సందేహం వచ్చింది. రాక్షసుడే ఆ రూపం ధరించాడేమోనని, ఆమె రాక్షసుడేనని సంహరిస్తే ఒక వేళ కాని పక్షంలో స్త్రీ హత్యా పాతకం చుట్టుకుంటుందేమో అడిగి చూద్దామని గంభీరస్వరంతో ఇలా అన్నాడు. నారీ ఎవరు నీవు? ఈ దివ్య మందిరం ఎవరిది? నువ్వు ఇక్కడ ఎందుకువున్నావు? ఆ అమ్మాయి నోట ఏ ఉలుకూ లేదు పలుకూ లేదు. ఒకసారి కువలయాశ్వున్ని ఎగా దిగా చూసి కనురెప్పలు టపటప ఆర్పి భవనం పైభాగానికి మెట్ల మీదుగా తుర్రుమని జారుకుంది. కువలుడు కూడా సౌధాగ్రం చేరుకున్నాడు. గుర్రం దిగాడు. ఆ సుందరి వెంట తాను కూడా సౌధాగ్ర మందిరంలోకి ప్రవేశించాడు పరుగు పరుగున.


అది ఒక పాలరాతి మందిరం. విశాలంగా వుంది. స్తంభాల మీద అపూర్వ శిల్ప సంపద ఉట్టి పడుతోంది. ఆ మందిరంలో ఎక్కడ వాలిన చూపు అక్కడే నిలిచిపోతోంది. మందిర మధ్యభాగంలో బంగారు వేదిక, దాని మీద హంసతూలికా తల్పము. దాని చుట్లూ ఉల్లిపారల్లాంటి తెల్లని దివ్యాంబరం గొడుగులా వేలాడుతోంది. ఆ తెరలోపల వేదికపై ఒక సుందరి. తెలిమబ్బుల్లో చందమామలా దోబూచులాడుతోంది. పరికించి చూసాడు. కళ్ళు చెదిరిపోయే సౌందర్యం ఆమెది. మన్మధుణ్ని విడిచి వచ్చిన రతీదేవిలావుంది. పాతాళలోకాధి దేవత కాబోలు అనుకున్నాడు ఋతధ్వజుడు. ఆమె కువలయాశ్వుణ్ని చూడగానే తల్పందిగి తలవంచుకొని ఒయ్యారంగా నిలబడింది. కుడికాలిపై బరువు ఆనించి ఎడమకాలి బొటన వ్రేలితో నేలను రాస్తోంది. ఎడమ చేతిలో కమలాన్ని కుడి చేతితో సుతారంగా పొదివిపట్టుకొని పావురం వీపు నిమిరినట్లుగా కమలం రేకులు ముడుచుకొనేలా కలుపుతోంది. కడగంటి చూపులు విసురుతోంది. అతడు చూస్తుంటే కన్నులు దించుకుంటోంది. చూపులు కలిస్తే కలవరంతో కన్నులు దించుకుంటుంది. ఆమెకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వులు విరుస్తున్నాయి. బుగ్గల్లో గులాబీలు రేకులు విప్పుకుంటున్నాయి. ఋతధ్వజునిలో అభిలాష మొదలయింది. రెండడుగులు ముందుకేశాడు. ఆ సుందరాంగి చేరువలో నిలబడ్డాడు. పలకరించాలని తహతహ బయలుదేరింది. అతిధి మర్యాదలు చేయదా? కనీసం పలుకదా? రండి కూర్చోండి అనదా? అని ఎదురు చూపులు మొదలయ్యాయి. అతడు చేరువకు వస్తున్నకొద్దీ ఆ లావణ్యవతిలో కళవరం బయలుదేరింది. కువలయాశ్వుడి ముఖంలోకి ఒక్కసారిగా చూసి వెంటనే చూపులు దించుకుంటోంది. ఆమె కన్నుల నుండి రెండు అశ్రుబిందువులు హఠాత్తుగా రాలి ఆమె గుండెల మీదకు జారాయి.


No comments:

Post a Comment