Tuesday, 31 December 2024

శ్రీ గరుడ పురాణము (338)

 


హృదయ తృషారోగము


హృద్రోగం - అనగా గుండె జబ్బు. క్రిముల వల్ల వాత, పిత్త, కఫ, ప్రకోపాల వల్ల లేదా మూడిటి కలయిక వల్ల మొత్తం అయిదు కారణాలలోనేదో ఒక దాని వల్ల గుండె చెడవచ్చును.


వాతం వల్లే వచ్చే హృద్రోగంలో గుండె, కడుపుభాగం అంతా ఖాళీ అయిపోయినట్లుంటుంది. రోగి తెగతింటూ వుంటాడు. ఈ తిన్నదంతా ఎక్కడికి పోయిందని ఏడుస్తుంటాడు. గుండె భాగం తిమ్మిరెక్కినట్లవుతుంది. తడుముకుంటే లోపలేదో విరిగిపోయినట్లుంటుంది. గుండె తడారిపోతుంది. రోగికి మత్తుగా వుంటుంది. ఉన్నట్లుండి రోగి నిరాశ చెందుతాడు. దుఃఖభారం పెరుగుతుంది. తీవ్రంగా భయపడతాడు. ధ్వని ద్వేషం కలుగుతుంది. చిన్న ధ్వనికి కూడా చిరాకు పడిపోతాడు. నిద్ర సరిగా పట్టదు, శ్వాస కష్టం మీద ఆడుతుంది.


పిత్తం వల్ల వచ్చే హృద్రోగంలో రోగికి విపరీతమైన దాహం, నీరసం, నిస్సత్తువ, మంట, చెమట, త్రేన్పులు (పుల్లటివి) అరగనివి, ఆమ్లం, వాంతి, జ్వరం, కనులు మబ్బు వేయుట జరుగుతాయి.


ఇదే రోగం కఫం వల్ల వస్తే గుండె తిమ్మిరెక్కిపోతుంది. జీర్ణకోశం చెడుతుంది. ముఖంలోతుకి పోయినట్లవుతుంది. లేదా ఉబ్బుతుంది. వెక్కుళ్ళు, ఒంటి నొప్పులు, ఉమ్ములో చీము పడుట, మత్తుగా వుండుట, ఆయాసము, తిండిపట్ల విముఖత దీని ఇతర లక్షణాలు.


వాత, కఫ, పిత్త, మూడిటి దోషాల కారణంగా గుండె సమస్య వస్తే పై విభిన్న లక్షణాలన్నీ కనబడతాయి. క్రిముల వల్ల వచ్చే హృదయ తుషారోగంలో నల్లని పచ్చని కలగలుపు రంగు కనులలో కనబడుట, మత్తుగా వుండుట, కళ్ళు చీకట్లు కమ్ముట, గుండె రసాల నిల్వ, అశాంతి, అంగాలలో దురద, దగ్గున్నా లేకున్నా కఫం నోటి నుండి రాలుట అనే లక్షణాలు బయటపడతాయి. 


గుండెనెవరో అంపంతో కోస్తున్నట్లుంటుంది. కత్తెరతో కత్తిరిస్తున్నట్లుంటుంది. ఈ రోగమునకు తొలి దశలోనే మందు పడకపోతే ప్రాణాంతకమే.


త్రిదోషాలలో దేనివల్లనైనా పిపాస హెచ్చు మీరుతుందిగానీ గుండె నీరసం మాత్రం మూడూ కలిసి వస్తేనే వుంటుంది.


హృద్రోగాలలో అంటువ్యాధి కూడా ఒకటుంది. అది సోకినా వాత, పిత్త దోషాలుం టేనే శరీరం లో వర్ధిల్లుతుంది (ఇది ఆరవ హృద్రోగం)


హృదయరోగం లేదా హృద్రోగం ఏదైనా మరొక దోష ప్రోద్భలం ఉంటేనే ఉద్రేకిస్తుంది. కుదుపు, గుండెదడ, మనోద్రేకము, గుండెలోమంట, ధాతు బలహైన్యము వల్ల మూర్ఛ - ఇవన్నీ కనిపిస్తాయి. నాలుక అంగిలి భాగం ఎండిపోయి దాహం వేయుట, అన్ని జలభాగాలూ పొడిబారుట, పరాకుమాటలు, స్పృహ తప్పుట, నోరు బీటలు వారినట్లగుట, అన్నద్వేషం, గొంతులో దైన్యం, మనసు ఒకరీతిలో నుండక పోవుట, జలాంగాలన్నీ ఎండుట వల్ల నాలుకను బయటకు తీయలేకపోవుట, త్రేనుపులు కూడా హృద్రోగికి ఉంటాయి.


వాత దోషం వల్ల వచ్చే గుండెజబ్బు అతి బలహైన్యము, నిరాశ, తలలో మత్తు, కణతల నొప్పి, వాసన చూసే శక్తి తగ్గుట, (నాలుకకి) నునుపు జిడ్డుతగ్గుట, నిద్రపట్టక పోవుట, మొత్తంగా నీరసం - లను కలిగివుంటుంది.

Monday, 30 December 2024

శ్రీ గరుడ పురాణము (337)

 


అరోచకం


సుశ్రుతా! ఇపుడు అరోచక అనగా అన్నముగాని మరేమిగాని సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని చర్చిద్దాం. నాలుకనుండీ, గుండె నుండీ స్రవించే మూడు గ్రంథుల వల్ల వాత పిత్త కఫప్రకోపాల వల్ల మూడు రకాల అరోచకం కలుగుతుంది. నాలుగవ రకం ఈ మూడు ప్రకోపాలూ కలిస్తే వస్తుంది. అయిదవ దానికి కారణంమానసిక రుగ్మత.


వాతం వల్ల వచ్చే అరోచకంలో నోరంతా వగరు తిన్నట్టుగా వుంటుంది. పిత్త ప్రకోపంలో చేదు కఫం కారణమైతే తీపి రుచులు నోటిని కమ్మేస్తాయి.


కోపంగాని దుఃఖం కాని కమ్ముకున్నపుడు మనిషికి ఏ రుచీ పట్టదు. అరోచక రోగికి ఏది తిన్నా నోటిలో రోగ ప్రకోపం వల్ల వున్న రుచితప్ప ఇంకేరుచీ తెలియదు. దీనికి కారణం వాంతి వస్తున్నట్లుండడం ఈ కఫ ప్రకోపానికి మూల కారణమేమిటంటే ఉదాన వాయువు నాలుక అడుగున చేరిన ప్రకోపాలను ఎగురుగొట్టడానికి ప్రయత్నం చేసినపుడు పిచ్చి పిచ్చి రసాలేవో ఊరిపోయి నోరంతటా చిమ్మబడడం. అది నాభి ప్రాంతాన్ని, వీపుని బాధిస్తుంది. తిన్నదేదైనా లోనికి పోగానే పక్కలోకి దిగబడుతుంది. కొంచెం కొంచెం వాంతి రూపంలో బయటికొస్తుంది. మొత్తం నోరంతా వగరైపోతుంది. వాత చర్యల వల్ల పెద్ద ధ్వనులతో త్రేన్పులు వచ్చి నాలుక తడారిపోతుంది. వెక్కుళ్ళు, గొంతు బిరుసెక్కుట వుంటాయి. 


ఈ రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చినదైతే ఉప్పు నీరు లాటిది రక్తంతో కలిసి వాంతిలో పడుతుంది. అది హరిత, పీత వర్ణాలు కలిసిన రంగులో ఉంటుంది. వాంతి వస్తున్నపుడు నోరంతా చేదుగా, ఘాటుగా వుంటుంది. దాహం, తెలివితప్పుట, శరీరమంతా మండుతున్నట్లుండుట దీని ఇతర లక్షణాలు. కఫం వల్ల వచ్చే రోగంలో చిక్కగా తేనెలా జిగటగా నున్న పసుపు పచ్చటి చీము నీటితో కలిసి వాంతి అవుతుంది. నోరు ఉప్పగా అయిపోతుంది. రోమాంచమూ కలుగుతుంది.


ఇది తీవ్రతరమైతే నోరు వాచిపోయి తీయగా అయిపోగా, మనిషిలో స్థిరతపోయి, నాడిలో అశాంతి బయలుదేరి, అక్కడ నొప్పి వచ్చి, వెక్కుళ్ళు తరుచుగా వస్తుంటాయి. ఈ దశలో కుదుర్చడం అసాధ్యం.


ఈ రోగికి ఏది విన్నా, ఏమికన్నా అసహ్యతే కలుగుతుంటుంది. ఈ బాధలన్నీ ఆహారంలో కల్తీ వల్ల కలిగినవైతే (పురుగులున్నవైతే) శూల లక్షణాలన్నీ వస్తాయి. ప్రకంపనం వుంటుంది. వాతం కూడా చెడుతుంది.


(అధ్యాయం -153)

Sunday, 29 December 2024

శ్రీ గరుడ పురాణము (336)

 


గోళ్ళూ, ఎముకలూ, జుట్టూ అసహజమైన వేగంతో పెరిగిపోతుంటాయి.


శ్వాసకోశానికి సంబంధించి ఈ రోగరాజంలో పదకొండు రుగ్మతలు బయట పడతాయి. పడిశము, శ్వాసకృచ్ఛము, దగ్గు, గొంతు నీరసించుట, తలనొప్పి, అన్నద్వేషం, ఎగవూపిరి, అంగముల్లో అతి నీరసం (చీపురుపుల్లల వలె అయిపోవుట) వాంతులు, జ్వరం, ఛాతీనొప్పి ఇవి వచ్చిన తరువాత గొంతులో భరించలేని బాధ, ఉమ్ములో చీము, నెత్తురు, అంగాలు నొక్కుకుపోతున్న బాధ కలుగుతాయి.


వాత ప్రకోపంవల్ల తల, కణతలు అంగాలు నొప్పెడతాయి. అన్నీ ఒత్తిడికి లోనౌతాయి. గొంతు నొక్కుకుపోతున్నట్లుంటుంది. పిత్త ప్రకోపం వల్ల భుజాలలో మంట, అరికాళ్ళలో, చేతుల్లో మంట, నులుగడుపు, నెత్తుటి వాంతులు, మలంలో దారుణ దుర్వాసన, నోటి దగ్గర దుర్వాసన, జ్వరం, పేలాపన వస్తాయి. కఫం ప్రకోపిస్తే అరుచి, వాంతులు, సగం శరీరం బరువెక్కిన భీతి కలుగుతాయి.


నోటినుండి చొంగకారుట, జలుబు, అజీర్ణం, శ్వాసకృచ్ఛం, గొంతు బొంగురు కూడా కఫం వల్లనే వస్తాయి. జీర్ణకోశం సరిగా పనిచేయకపోవడం వల్ల మామూలుగా స్రవించే ద్రవాలు పెరిగి కఫం రసాలు అతిగా ఊరి నిలవైపోయి నిల్చిపోయి అన్ని నాళాలపై పూతలాగేర్పడి వాటి ద్వారాలను మూసేస్తాయి. అప్పుడు శరీరంలో ధాతునిర్మాణం ఆగిపోయి మొత్తం అంతటా మంటలు చెలరేగుతున్నట్లుండి మతి చెదరిపోతుంది. మరికొన్ని దారుణ బాధలు కూడా వుంటాయి. క్షయరోగి తీసుకునే ఆహారం హానికర ఆమ్లాలతో తడిసిపోయి ఇతర ద్రవాలతో కలిసి ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అతనికి బలం చేకూరదు. రసాలేవీ అతని శరీరంలో రక్తాన్నుత్పత్తి చేయవు. దాంతో రోగి క్షీణించి పోయి కాళ్ళూ చేతులూ చీపురుపుల్లల్లాగా అయిపోతాయి. ఈ చీపురుపుల్ల లక్షణం కనిపించే లోపల ఎన్ని రుగ్మతలు బయటపడినా మందుల ద్వారా చికిత్స ద్వారా రోగాన్ని కుదర్చవచ్చు.


దేహంలో జఠరాదిరసాలు పాడైతే కొవ్వు చేరక మనిషి నీరసించిపోతాడు. గొంతు బొంగురు వచ్చి గొంతు బలహీనమై బొంగురువోయి వణుకుతుంది.


వాత ప్రకోపంలో శరీర కాంతినాశనమగుట, నునుపు పోవుట, వెచ్చదనం మాయమగుట జరిగి గొంతుభాగం బార్లీగింజ రూపంలో రంగులోకి వచ్చేస్తుంది. కఫ ప్రకోపానికి ఈ జబ్బులో ఒక వింతైన గురక, గొంతులో నిరంతరం జిగటగా చీము కదులుతుండడం సూచనలు. పిత్త ప్రకోపం వున్న క్షయ రోగికి గొంతు, తాలువు మండుతున్నట్లుంటాయి. కఫలక్షణాలైన తలతిప్పు, కనులముందు చీకటి తెరలు కూడా కనిపించవచ్చు.


ఏది యేమైనా కాలుసేతులు చీపురు పుల్లలవలె కాక ముందైతే చికిత్స చేయవచ్చు.


(అధ్యాయాలు 148-152)

Saturday, 28 December 2024

శ్రీ గరుడ పురాణము (335)

 



* హిక్కా (హిక్కా అంటే వెక్కిళ్ళు) ముందుగా 'గాలి అరటి' (ఊపిరాడక గట్టిగా ప్రయత్నించి నీరసం తెచ్చుకోవడం) తో సోకుతుంది. ఇందులో భక్ష్మోద్భవ, క్షుద్ర, యమలా, మహతీ, గంభీరా అనే రకాలున్నాయి. మొదటి రకం తొందర తొందరగా గట్టి, ఘాటు పదార్ధాలను ముందూ వెనకా చూసుకోకుండా మేసెయ్యడం వల్ల వస్తుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వాతం ఆందోళితంగా వున్నపుడు నోట్లోకి త్రోయబడే గట్టి తిండి ద్రవాలు దీనికి ఉత్పాదకాలు, వాయువు రెచ్చగొట్టబడగానే చిన్నచిన్న ధ్వనులు వస్తాయి. రోగి ఏ కాస్త కష్టించినా వాతం ప్రకోపించి క్షుద్ర హిక్కా వస్తుంది. బోరయెముక నుండి పుట్టే ఈ రోగంలో కొన్నాళ్ళు దాకా వ్యాప్తి, తీవ్రతా వుండవు. తరువాతి రకమైన యమలా జంటలలో కనిపిస్తుంది. అది కూడా తీవ్రంగా వుండదు. అయితే ఈ దశలో ముఖం వణుకుతుంటుంది. తల, మెడ తిరుగుతుంటాయి. ఇది ముదిరితే తెలివిలేని వాగుడు, వాంతులు, విరేచనాలు, కనుగ్రుడ్లు తిరుగుట, కళ్ళు తేలవేయుట, ఆవులింతలు ఇవన్నీ గోచరిస్తాయి. ఇవన్నీ ఎక్కువ కాలం పాటు వుంటే రోగం ముదురుతోందని గ్రహించాలి.


మహతీ వెక్కిళ్ళలో అన్నీ తీవ్రంగానే ఉంటాయి. కనుబొమ్మలు క్రిందికి జారిపోతాయి. కణతలు లోతుకిపోతాయి, కళ్ళు చెవులకి దగ్గరగా జరుగుతుంటాయి. ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోతుంది. మాటలో స్పష్టత పోతుంది. జ్ఞాపకశక్తి నశిస్తుంది. తెలివి తప్పిపోతుంది. సంధులన్నీ విడిపోతాయి. వెన్నెముక వంగిపోతుంది.


గంభీర అంటేనే తీవ్రత. ఇది నడుము, నాభిలలో మొదలవుతుంది. తీవ్రమైన నొప్పి, పెద్ద ధ్వనులు, పరమహింస, మిక్కిలి బలం (అంటే మందుకి లొంగకపోవడం) దీని లక్షణాలు. పెద్ద పెద్ద ఆవులింతలూ, అంగాల కుదుపూ వుంటాయి. జాగ్రత్తగా, ఓపిగ్గా చికిత్స చేస్తే దీన్ని రూపుమాపవచ్చు, హిక్కా, క్షయలు ప్రాణాంతకాలు, ఇతర (ఈ అధ్యాయంలో వున్న) రోగాలు కూడా బలహీనుల, త్రాగుబోతుల, అతి తిండిపోతుల, వృద్ధుల, అతి నీరస జీవుల, మలబద్ధక రోగుల విషయంలో ఒక రోజు నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకాలవుతాయి.


రాజయక్ష్మ, క్షయ రోగాలలో తొలి జబ్బు పాతరోజుల్లో నక్షత్రాలకీ, చంద్రునికీ, రాజులకీ, బ్రాహ్మణులకీ ఎక్కువగా సోకేది కాబట్టి దానికాపేరు పెట్టబడింది. దీనికే క్షయ అనీ రోగరాట్ అనీ శోష అనీ కూడా పేర్లున్నాయి. దీనికి కారణాలు 1) సాహసం అనగా తెగింపు, అతి వ్యాయామం, అతి బలం 2) వేగ సంరోధం అనగా మలమూత్రాలను బలవంతంగా అణచిపెట్టుట 3) శుభ్రజ స్నేహ సంక్షయం అంటే వీర్యాన్ని, శక్తినీ, బలాన్నీ వృథా చేయడం 4) అన్నపాన విధి త్యాగం అనగా ఒక నియమమూ, అదుపూ లేకుండా తినడం, త్రాగడం.


పైన చెప్పిన కారణాల వల్ల వాతం ప్రకోపిస్తుంది. పిత్తం చెదరిపోతుంది. అనవసరాలూ హానికరాలునైన పదార్థాలు గడ్డకట్టిపోయి కఫం ఉద్రేకానికి లోనై అది నాళాలలో పేరుకుపోతుంది. సంధులలో చేరుతుంది. కాలువలను అడ్డుతుంది. అపుడు ఈ రోగం కవాటాలను మూసిగాని, వాచేలా చేసి గాని నరాలను చెడగొడుతుంది. అప్పుడు గుండె దానిప్రక్క క్రింది భాగాల్లో తీవ్రమైన నొప్పి పుడుతుంది.


ఈ రోగ లక్షణాలు (వచ్చిందని సంకేతాలు) పడిశం, ఉష్ణోగ్రత పెరుగుదల, చొంగ కారుట, నోటిలో తీపి రుచి, శరీరం నున్నబడుట, తిండి సహించకపోవుట, నడవాలనే తీవ్రవాంఛ, తినాలనే గట్టి కోరిక, ఆ రెండూ చేయలేకపోవడం, స్వచ్ఛతలో అతివ్యగ్రత, ఎంత శుభ్రంగా వున్నదైనా అపరిశుభ్రంగా వుందని అరవడం, తన భోజనపాత్రలో తాగే వాటిలో లేని ఈగలను, తలవెంట్రుకలను గడ్డి పరకలను ఉన్నాయని అనుమానించి ఏరుతుండడం, వెక్కుళ్ళు, అశాంతి, వాంతులు, ఎంత రుచికరమైనవి పెట్టినాబాగు లేవనడం.


ఈ రోగిలో కొన్ని సందర్భాల్లో శరీరమంతటా కనులతో సహా తెల్లటి మెరుపు రంగు వచ్చి చేరుతుంది. నాలుక, బాహువు తీవ్రంగా నొప్పెడతాయి. స్త్రీ సుఖం కావాలని పిస్తుంది. మద్యమాంసాలూ కావాలనిపిస్తుంది. తీరా వాటిని చూస్తే చిరాకు కలుగుతుంది. విచిత్రమైన కలలు వస్తుంటాయి. నిర్మానుష్యగ్రామాలూ, ఎండిన చెరువులు, దొరువులు, చాలా కాంతివంతమైన తోకచుక్కలు, చెట్లతో సహా తగలబడిపోతున్న అడవులు, తనపైకి ఉరుకుతున్న ఊసరవెల్లులు, పాములు, కోతులు, పక్షులు- ఇలాటివన్నీ కలలోకి వస్తుంటాయి.

Friday, 27 December 2024

శ్రీ గరుడ పురాణము (334)

 


ఈ రుగ్మతలో కనిపించే తొలి బాధలు ఛాతీలో నొప్పి, శ్వాసలో తేడా, మలబద్దకం, కణతల వద్ద పగుళ్ళు వేస్తున్నంత నొప్పి, అతిగా తినడం వల్ల ఆయాసం. లోలోన ఉద్రేకించిన వాయువులు శ్వాస నాళాలలో వెనుకకూ ముందుకూ పరుగిడుతూ కఫాన్ని రెచ్చగొడతాయి. దానివల్ల కలిగే శ్వాసలో శ్రమను, క్షుద్ర శ్వాస రుగ్మత అంటారు. అది తలను, మెడను, గుండెను పిడికిట బట్టి వాటి పక్కలలో అతి నొప్పిని కలిగిస్తుంది. గొంతులో పిల్లికూతలు, వెక్కిళ్ళు, పడిశము, ముక్కు వాపు వస్తాయి. కఫం పైకి పోయినపుడు ఒళ్ళంతా నొప్పెడుతుంది. కాని అది పోగానే కాసింతసేపు ఊపిరాడుతుంది. 


పడుకుని వుంటే ఊపిరాడదు. కూర్చుంటే కాస్త నయం. నిలబడితే బాగా ఊపిరాడుతుంది. దీనివల్ల రాత్రిళ్లు కాళరాత్రులవుతాయి. తల పైకెత్తితే ముదురంతటా చెమట్లు పట్టి కణతల వద్ద నొప్పి పుడుతుంది. ఊపిరి తీయడం కోసం అవస్థ పడుతున్న రోగి వణకుతుంటాడు. వేడిగా ఏదైనా తాగాలనుకుంటాడు. ఇది తమక దశ బలమైన అంగాలు కలవారిలో ఈ రుగ్మతను చికిత్స ద్వారా కుదర్చవచ్చును. తీక్షణమైన జ్వరం, కంపనం వున్నవారిని చలవద్వారా రోగముక్తులను చేయలేము.


మహాశ్వాస రోగంలో బాధితులకు ఊపిరందదు. దానికై గట్టిగా ప్రయత్నిస్తే సర్వాంగాలూ బద్ధలైనంత నొప్పి పుట్టుకొస్తుంది. చెమటలు పడతాయి. తెలివి తప్పు తుంటుంది. నడుముకి లోపలంతా మండుతుంటుంది. కళ్ళుపైకెత్తి చూడలేరు. అవి గిరగిర తిరిగిపోతున్నట్లనిపిస్తాయి. ఒక కన్ను బాగా ఎఱ్ఱబడిపోతుంది. మలబద్దకముంటుంది. నోరంతా పొడిగా వుంటుంది. అతి వాగుడు, పలవరింతలు, తెలివితప్పుట ఒక దాని వెంట నౌకటి వస్తుంటాయి. ముఖం పాలిపోతుంది. లేసి కూర్చోబెడితే శ్వాస తీసుకున్నప్పుడు శబ్దాలు వస్తుంటాయి. అవి ఎద్దు అంకెల్లా వుంటాయి.


తరువాతి దశలో రోగికి స్పర్శ కూడా తెలియదు. కనులలో ముఖంలో ఏదీ అర్ధం దానప్పుడు కలిగే గాబరా కనిపిస్తుంది. మలమూత్రాలాగిపోతాయి. మాట పడిపోతుంది.


ఊర్ధ్వ శ్వాసరోగికి నిశ్వాసం ఉండదు. ఊపిరి పీలుస్తున్నట్టే వుంటాడు. అదీ లోపలికి గాలి వెళుతున్నట్టే వుంటుంది. పైకి రాదు కణతలు, తల తీవ్రమైన నొప్పికి లోనవుతాయి. గొంతు తడారిపోతుంది. నోరు, చెవులు కఫాన్నీ చీమునీ కలిగి నిండిపోయినట్లుంటాయి. వాయు ప్రకోపం వల్ల రోగి అటూ ఇటూ ఏదో, ఎటో తెలియనట్లుగా తిరుగుతుంటాడు. సంధులు నొప్పెడుతున్నాయని మూలుగుతాడు. అరుస్తాడు. కాని ధ్వని బయటకు రాదు. ఈ బాధలన్నిటినీ రోగాన్ని కుదర్చడం ద్వారా తొలగించవచ్చు. అదీ మరీ ముదిరిపోకుండా వుంటేనే. ఈ రోగం శీఘ్ర ప్రాణాంతకం.

Tuesday, 24 December 2024

శ్రీ గరుడ పురాణము (333)

 


వాతదోషం వల్ల వచ్చే దగ్గు రుగ్మతలో గొంతు నోరులు బీటలు వేసినట్లవుతాయి. చెవి పొరలు పొడిదేరిపోతాయి. శరీరం లోపల వుండే వాయువులు పైకెగసి ఛాతీలోకి దూసుకుపోయి కంఠనాళమును ఒత్తుతుంటాయి. అన్ని అంగాలలోకి ఆ వాయువు దూరడంతో ఒళ్ళంతా బూరటిల్లినట్టుంటుంది. కనుగ్రుడ్డు పైకి ఉబికి వచ్చినట్లుంటాయి. గొంతులోంచి ఇనుప రేకులను విరిచిన ధ్వని వస్తుంది. ఛాతీ, పక్కలు, తల, తొడలు నొప్పెడతాయి. ఉద్రేకము, మూర్ఛ వస్తాయి. రోగి మాట్లాడలేక పోతుంటాడు. పొడిదగ్గు బాధిస్తుంది. దగ్గినపుడు శరీరమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది. ఆ దగ్గు ధ్వని పెద్దదిగా వుంటుంది. ఒళ్ళంతా గగుర్పాటులకు లోనవుతుంది. అతి కష్టం మీద ఎంతో కొంత పొడి కఫాన్ని ఉమ్మితే కాస్త తేలికగా అనిపిస్తుంది.


పిత్త ద్రవ ప్రకోపం వల్ల వచ్చే దగ్గుకి ఈ లక్షణాలుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. నోరు చేదుగా వుంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తల తిప్పుతుంది. వాంతిలో రక్తం పడుతుంది. దాహం వుంటుంది, గొంతు పెగలదు. చూపు మబ్బేసినట్లుంటుంది, మత్తు ఆవరిస్తుంది, దగ్గినపుడు గొంతుపై అగ్నివృత్తాలు కనిపించి, పోతుంటాయి. కఫదోషం వల్ల వచ్చే ఛాతినొప్పి, తలనొప్పి, తిమ్మిరి, గుండె బరువు వుంటాయి. గొంతునిరంతరం కఫం ముద్దలతో గరగరమంటూనే వుంటుంది. ముక్కు దిబ్బడ, వాంతి వస్తున్నట్లుండడం, తిండి అంటే చిరాకు, ఒళ్ళు గగుర్పాటు కలుగుతాయి.


పోరాటాలలో వ్యాయామాలలో అజాగ్రత్తగా, శక్తికి మించి పాల్గొంటే ఛాతి లోపలి భాగంలో గాయాలై వాత, పిత్త,కఫాలు మూడూ ప్రకోపిస్తాయి. కఫం రక్తంతో కలసి ముడులు కడుతుంది. అది పసుపు పచ్చ లేదా మలిన రంగులో వుంటుంది. రోగి దగ్గుతూ కఫాన్ని ఉమ్ముతున్నపుడు ఛాతీ విరిగిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది. శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్లుంటుంది. తరువాత బల్లెంతో పొడుస్తున్నట్లుంటుంది. మోచేతుల, మోకాళ్ళ (సంధుల) నొప్పులు, జ్వరపు వేడితో బాటు పెరుగుతుంటాయి. దాహం, ఊపిరాడక ఆయాసపడుతుండడం, గొంతు క్షీణించడం, వణుకు, పావురం వలె గుడగుడ ధ్వనులు, ఉమ్మినా వాంతి చేసుకున్నా బోలెడు కఫం రావడం, జ్వరం కాస్త ముదిరితే మూత్రంలో రక్తం పోవడం, వెన్నునొప్పి ఇవన్నీ వుంటాయి. ఇవన్నీ క్షతకాస లక్షణాలు. ఈ దశలో వాతం ప్రకోపించి శరీర ధాతువులన్నీ తీవ్రంగా దెబ్బతింటే రాజయక్ష్మ జ్వరం ప్రవేశిస్తుంది.


అప్పుడు రోగి దగ్గినపుడు పడే కఫం ఆకుపచ్చగా, పసుపుపచ్చగా, ఎఱ్ఱని చారలతో నిండి బహిర్భూమి సందర్భంలోని దుర్వాసన వేస్తుంటుంది. చీము కూడా పడుతుంటుంది. నిద్ర పోవడానికి ఎంత ప్రయత్నించినా నొప్పి వల్ల కుదరదు. గుండెను ఎవరో మూకుడులో పెట్టి వేయిస్తున్నట్లుంటుంది. అకస్మాత్తుగా వేడిగా ఒకమారు చల్లటిదొక మారు తినాలని పిస్తుంది. ఎంత తిన్నా చాలదనిపిస్తుంది. నీరసం ఎక్కువవుతుంది.


ఉన్నట్టుంటి ముఖం కాంతివంతంగా, గాజువలె నున్నగా అవుతుంది. కనులలో మెరుపు కనబడుతుంది. అయినా రోగబాధలన్నీ పెరుగుతుంటాయి. బలహీనులను ఈ జ్వరం పూర్తిగా వంచివేస్తుంది. బలవంతులలో గాయాల వల్ల వచ్చిన దగ్గు అయితే చికిత్స ప్రారంభ దశలో వుండగానే తగ్గిపోతుంది. జాగ్రత్తగా చికిత్స చేస్తే వృద్దులను కూడా తొలిదశలలోనైతే రోగవిముక్తులను చేయవచ్చు. దగ్గు, మందాగ్ని, క్షయ, కడుపులో తిప్పు, వాంతి మున్నగు రోగలక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకుని సంప్రదించాలి. లేకుంటే అవి చాలా వేగం ముదిరి పోతాయి.


శ్వాసనిరోధక రోగం దగ్గు బాగా ముదిరితే వస్తుంది. శరీరంలోని ద్రవాలను ఉద్రిక్తపఱచడం వల్ల కూడా ఇది రావచ్చు. ఆమాతిసారం (చీము విరేచనం) వమనం, పచ్చకామెర్లు, ధూళి అసహ్యత, పొగ, గాలి తెరలలో చిక్కుకొనుట, మంచు కరిగిన నీరు, విషతుల్యరసాలు, సంధులపై హింస్రకదాడులు కూడా శ్వాస నిరోధక జ్వరాలను కలిగిస్తాయి. ఇందులో క్షుద్రక, తమక, ఛిన్న, మహా, ఊర్ధ్వ అని ఐదు రకాలున్నాయి. కఫం పేరుకుపోవడం వల్ల గాలికి అడ్డంకి ఏర్పడుతుంది. శరీరంలో నిరంతరం పరిభ్రమించే వాయువులు ఒకచోట నిరోధింపబడితే చుట్టూ తిరుగుతూ మెత్తటి ప్రధాన కణజాలాలపై నాళాలపై గుండెపై, బలమైన ఒత్తిడిని కలుగజేసి ఆయా భాగాలను పాడు చేస్తాయి. నడుము లోపలి అంగాలను కూడా ప్రభావితం చేస్తాయి.

Monday, 23 December 2024

శ్రీ గరుడ పురాణము (332)

 


రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్కా, రాజయక్ష్మ రోగ నిదానాలు


రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధానకారణం విపరీతమైన, బలమైన తిండి (ఉదా॥ కోద్రవ, ఉద్దాలకాది ధాన్యాలు) మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనలు, రుచులుగల పదార్థాలను తినుట వల్ల పిత్తం పాడవుతుంది. ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలూ, రసాలూ ఎఱ్ఱగా రక్తపు వాసననే కలిగియుండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్త పిత్త రోగమని పేరు పెట్టబడింది. ఈ ద్రవాలూ, రసాలూ, రక్త నాళాల్లోంచి, కాలేయం నుండీ, క్లోమం ద్వారాను స్రవిస్తాయి.


ఈ జ్వరం చేసే రక్త స్రావక దురాక్రమణ, చాలా లక్షణాల ద్వారా సూచించబడుతుంది. తల బరువు, ఆకలి లేకపోవడం, చల్లని వస్తువులు తినాలనిపించడం, దృష్టి పొగలు గ్రమ్మడం, పుల్లవాసనలతో వాంతులు, అసహ్యత, వెక్కుళ్ళు, ఊపిరందకపోవడం, తల తిరగడం, గ్లాని, ఎఱ్ఱరంగుని భరించ లేకపోవటం, జ్వరం తగ్గినపుడల్లా, నోటిలోంచి చేపల వాసన రావడం, కనులలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ ఛాయలు ఏర్పడడం, బయట కనిపించే రంగులలో తేడా తెలియకపోవడం, పిచ్చెక్కిపోయినట్లు కలలు రావడం ఈ లక్షణాలు.


తారుమారైన, కలుషితమైన రక్తం శరీరంపైకి ప్రవహించినపుడు ముక్కు, కన్ను, నోరు, చెవుల ద్వారానూ, క్రిందికి వచ్చినపుడు లింగ, యోని, గుదాల ద్వారానూ బయటికి వస్తుంది. శరీరమంతటా వున్న రోమకూపాల నుండి కూడా చిమ్ముతుంది.


ఈ రోగ చికిత్సలో రక్తాన్ని నిరోధించడం కంటే ప్రక్షాళన చేయడమే మంచిది. కఫం ఉన్నచోట ప్రక్షాళన చికిత్స ద్వారా మొత్తం శరీరమంతా స్వచ్ఛమై పోతుంది. వగరైన తియ్యనైన ఓషధుల ద్వారా కఫమును ఉత్పత్తి చేయవచ్చును. పులుపు, ఘాటు, వగరు గల మందులలో కఫాన్ని ఉత్పత్తి చేసే వాటిని కూడ వాడవచ్చును. రక్తస్రావం శరీరపు క్రింది భాగాలలో వుంటే రోగి పరిస్థితి ప్రమాదకరంగా వుంటే మంగకాయను వాడాలి. ముందు కొంచెంగా పిత్త పీడక ఔషధాన్ని కూడా వాడితే రోగికి బలం చేకూరుతుంది. అటువంటి రోగికి వగరుగా, తియ్యగా వుండే పదార్థాలను తినిపించడం అవసరం. అయితే పాడైపోయిన పిత్తంతో బాటు వాత, కఫ దోషాలు కూడా కలిసి వున్న రోగిని కాపాడడం అసాధ్యం. ఊర్ధ్వకాయంలో అత్యధిక రక్తస్రావం కలిగిన వారిని ప్రక్షాళించినా ప్రయోజన ముండదు. అసలు ప్రక్షాళనే జరుగదు.


రక్త పిత్త రోగుల్లో ప్రతిలోమ (పైకి) రక్తస్రావమున్న వారికి మంగకాయ (నక్స్వా మికా), ప్రక్షాళన మాత్రమే చికిత్స మార్గములు. అన్ని శారీరక ద్రవాలూ పాడయినపుడు మంగకాయ చికిత్స ఒక్కటే అనుసరింపబడాలి. సాధారణంగా ఈ రోగులకు తొలిరోజు నుండే తీవ్రస్థాయికి చెందిన బాధలు బయటపడుతుంటాయి. కాబట్టి రోగం కచ్చితంగా కుదురుతుందని మాత్రం చెప్పలేము.


కాస (దగ్గు) లోపల్లోపల వేగంగా వ్యాపించే రోగానికి సంకేతం. ఇది వాత, పిత్త, కఫ దోషాలతో బాటు శరీరంలోపల చేయబడిన గాయాల వల్ల లోనికి పోయిన ద్రవ్యాలవల్ల కూడా సోకుతుంది. వాత దోషం వల్ల తీవ్రంగానూ క్రమంగా ఇతరాలలో కాస్త తక్కువ గానూ దగ్గు కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే శరీరం పూర్తిగా వేగంగా పాడవుతుంది. ఈ రోగం సోకిందనడానికి గొంతు దురద, మంట, అన్నద్వేషం సంకేతాలు.

Sunday, 22 December 2024

శ్రీ గరుడ పురాణము (331)

 


ఈ అయిదు రకాల చతుర్దక విపర్యయ జ్వరాలనూ వాటి దశలు పెరిగేకొద్దీ తగ్గించడం కష్టమవుతూ వుంటుంది. ప్రలేపక రకానికి చెందిన జ్వరానికి లక్షణాలు స్పృహ తప్పుట, పలవరింతలు, చలి, వేడి తగ్గిపోవడం, అంగాలన్నీ బరువెక్కడం, శరీర మంతటా కఫం ఒక పొరలాగా ఏర్పడినట్లు భయం కలగడం.


అంగ బలాశక (అంగాలబలాన్ని తినివేయు) జ్వరంలో ఉష్ణోగ్రత పడిపోవడం, ఒళ్ళంతా గరుకుగా కొయ్యబారినట్టుండడం, నడక కష్టం కావడం, అంగాలు తిమ్మిరెక్కడం, నిరంతరం కఫం బయటికి వస్తుండడం జరుగుతాయి. ఈ సమయంలో శరీరం నుండి స్రవించే ద్రవం చింతపండు ముక్కల రంగులో వుంటే దానిని హారిద్రక జ్వరమంటారు. ఈ పసుపు పచ్చ జ్వరం ప్రాణాంతకమే.


రాత్రిజ్వర లేదా పౌర్వరాత్రిక జ్వరంలో మూడు రకాల దోషాలుంటాయి. రోగి బలహీనుడైపోతాడు. ఇది రాత్రి మాత్రమే కాస్తుంటుంది. పగటివేళ ఇది కనబడకనే పోవడానికి కారణం కఫంలో తేమపోగా వాతం పొడిగా అయిపోవడం. కఫమూ, పిత్తమూ రోగి మొండెంలో చెడినపుడు శరీరంలో పైభాగాలన్ని వెచ్చగా, వేడిగా తగులుతుండగా బొడ్డు కింద అన్ని భాగాలూ మంచు ముద్దల్లా తగుల్తాయి.


శరీర ద్రవాల్లో రసాల్లో, రక్తనాళాల్లో వున్న జ్వరాన్ని చికిత్స ద్వారా తరిమేయవచ్చును. కొవ్వులో మాంసంలో చేరిన జ్వరాన్ని మాన్పవచ్చు. ఎముకల్లో మూలుగలో దూరిన జ్వరం తగ్గదు. (అస్థిగతరోగం) ఇందులో అపస్మారకం, కోపదారి తనం ప్రధాన లక్షణాలు.


జ్వరం తగ్గినట్లు ఎలా తెలుస్తుందంటే రోగికి శరీరం తేలికైనట్లుంటుంది. అలసట తీరుతుంది. ఉష్ణోగ్రత వుండదు. కనులు తేటగా వుంటాయి. చిన్న చిన్న చెమరింపులుండి వెంటనే ఆరిపోతుంటాయి. నోరు ఎగుడు దిగుడుగా వున్నట్లనిపిస్తుంది. ఏదైనా తినాలని పిస్తుంది. మనసు ప్రశాంతంగా వుంటుంది. తుమ్ములు వస్తాయి. తుమ్మినపుడల్లా హాయిగా వుంటుంది. బుఱ్ఱ గోక్కోవాలనిపిస్తుంటుంది.


(అధ్యాయం -147)

Thursday, 19 December 2024

శ్రీ గరుడ పురాణము (330)

 


శరీరగత ద్రవాల విషమత సాధారణంగా సతత జ్వరానికి కారణమవుతుంది. ఇది మొదట్లో వచ్చిపోతుంటుంది. పోయింది కదాని ఆలసిస్తే పీకపట్టుకుంది. రాత్రిళ్ళు ఎక్కువగా బాధపెడుతుంది. అన్యెద్యు జ్వరం సంధ్య (పగటికీ, రాత్రికీ మధ్య) లో ఎక్కువ ఉగ్రమవుతుంది. ఇందుల మాంస పుష్టిగల శారీరక ప్రదేశాలు ప్రభావితమవుతాయి. తలనొప్పి ఎక్కువగా వుంటే ఇది పిత్తవాత దోషమనీ (త్రిక) వెన్నునొప్పిగా వుంటే అది కఫ, పిత్త, దోష జనితమనీ గ్రహించాలి. వాత, కఫ దోష జనితమైన జ్వరంలో వీపంతా నొప్పెడుతుంది. ఈ జ్వరం ఒకరోజు మధ్యలో పూర్తిగా ఆగిపోతుంది. మరల ఒకరోజు తరువాత మొదలవుతుంది.


చతుర్థక జ్వరానికి కొవ్వు, మూలుగ, ఎముకలు గురవుతాయి. మూలుగకు మాత్రమే అంటే దోషం రోజులో రెండు మార్లు విజృంభిస్తుంది. కఫ దోషముంటే మోకాళ్ళు నొప్పెడుతాయి. తొడనొప్పి వుంటుంది. వాత దోషముంటే తల నొప్పి కూడా వుంటుంది. ఈ చతుర్దక విపర్యయజ్వరం సరైన మందుపడితే నాలుగవ రోజు కల్లా తగ్గుముఖం పడుతుంది. ద్రవాలు ఊరడంలో తేడా గలవారు వారం పాటు లంఖణాలు చెయ్యాలి. అయితే ఈ జ్వరదోషాలు మెదడులోనికి ప్రవేశిస్తే మాత్రం దానిని ఆపడం అసాధ్యం.


జ్వరం దోషప్రవేశానికి సంకేతం - రోగం శరీర ద్రవాలతో కలిసి నెమ్మదిగా ప్రవహిస్తూ రక్తనాళాలను కలుషితం చేసి వ్యాపిస్తుంది. మందు ప్రవేశించని మనిషి బలహీనుడవుతున్న కొద్దీ రోగం తీవ్రతరమై విషపు స్థాయిని చేరుకొంటుంది. కాబట్టి జ్వరం కనబడినా 'అదే పోతుందిలే' అనుకొని ఒక లంఖణం చేసేసి ఊరుకోకూడదు.


విషమ, సతత జ్వరాలు దేహ రసాలలోకి ప్రవేశించి ఆగగానే కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవి సముద్ర ప్రయాణం తొలిసారి చేసే వారికి వచ్చే రుగ్మతలను పోలివుంటాయి. తరువాత ఒళ్ళు బరువు, నిస్త్రాణ, కాలుసేతులను పొడుస్తున్నట్టుగా నొప్పులు, ఆవులింతలు, అరుచి, వాంతి వస్తున్నట్లుండడం, శ్వాసలో శ్రమ. జ్వరం రక్తంలో చేరితే మరిన్ని లక్షణాలు బయటపడతాయి. అవి ఉమ్మితే రక్తం పడడం, తీవ్ర పిపాస, చర్మంపై వేడి పగుళ్ళు, ఎఱ్ఱమచ్చలు, మంట, తల తిరుగుడు, మత్తు, అతి పలవరింతలు.


జ్వరం మాంసంలోనే వుంటే దాహం, అలసట, అపనమ్మకం, లోపలంతా మండు తున్నట్టుండడం, కళ్ళు తిరగడం, చీకట్లు కమ్మడం, దుర్వాసన, అంగాలలో వణకు కనిపిస్తాయి. జ్వరం కొవ్వులోనికి చేరినపుడు చెమట, అతిపిపాస, వాంతులు, పుల్లవాసన, చిరాకు వుంటాయి. ఇక జ్వరము ఎముకలలోనికి దూరినపుడు కనిపించే లక్షణాలు తెలివితప్పడం, పలవరింతలు, అలసట, అరుచి, ఆకలి బాగా మందగించుట, ఎముకలలో నొప్పి, జ్వరం వీర్యంలోనికి ప్రవేశిస్తే చీకట్లు కమ్ముతాయి. సంధులు వీడిపోతున్న ట్లవుతాయి. లింగం మొద్దుబారిపోతుంది. వీర్యం కారితే మరణమే సంభవిస్తుంది. 


*రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర అనేవి సప్తధాతువులు

Wednesday, 18 December 2024

శ్రీ గరుడ పురాణము (329)

 



గ్రహదోష జ్వరంలో సన్నిపాత లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా వాయుసమస్య, జీర్ణసమస్య ఉంటాయి. శాప, రక్త జ్వరాల్లో అన్ని బాధలూ భరించలేనంతగా వస్తూ పోతుంటాయి. మంత్రోచ్చాటన జరుగుతున్నపుడల్లా రోగులు ఎగిరెగిరిపడుతుంటారు. శరీరం పగుళ్ళు వేస్తుంటుంది. మత్తు ఆవహిస్తుంది. ప్రతిభాగం మండుతున్నట్లుగా వుంటుంది. మూర్ఛవస్తుంది. ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంటుంది. 


జ్వరాలలో ఎనిమిది రకాలుంటాయి. ముందుగా శారీరక, మానసిక విధాలుగా వాటిని విభజించారు. అలాగే మంద, తీవ్ర, ఆంతర, బాహ్య, ప్రాకృత, వైకృత, కుదిరేవి, కుదరనివి, పక్వాలు, అపక్వాలు. వీటిలో మొదటివి శారీరకం. రెండోవి మానసికం.


కఫ, వాత, మిశ్రిత రోగాలలో చలి, వణుకు వుంటాయి. పిత్తలోపం వుంటే ఒళ్ళంతా మంటలు పుడుతున్న బాధ వుంటుంది. మూడిటి సన్నిపాతమూ వుంటే ఒక మారు చలీ ఒకమారు వేడీ బాధిస్తాయి. (ఈ వేడినే ఉడుకు అంటారు) ఈ జ్వరం లోజ్వరమైతే (ఆంతరమైతే) అన్ని బాధలు లోపలే వుండి మలబద్దకం కూడా పుట్టుకొస్తుంది. బాహిర జ్వరానికి ప్రత్యేక లక్షణం విరేచనాలు. ఈ జ్వరాలను కుదర్చవచ్చును.


ప్రాకృత, వాత, వర్షాకాల జ్వరాన్నీ, వైకృత వర్షకాల జ్వరాన్నీ కుదుర్చుట దాదాపు అసాధ్యం.


* (మరో వర్గీకరణ ప్రకారమైతే శారీర- మానస, సౌమ్య - తీక్ష, అంతర్- బహిరాశ్రయ, ప్రాకృత- వైకృత, సాధ్య- అధ్యాయ, సామ- నిరామయ జ్వరాలు పైన చెప్పిన వాటికి అదనంగా కనిపిస్తాయి.)


ఆకురాలు కాలంలో పిత్తదోషంవల్ల వచ్చేది ప్రాకృత జ్వరం, వాత, కఫ దోషం వల్ల వచ్చేది వైకృతం. కాలంలో కఫదోష జ్వరాన్ని ప్రాకృతమనీ ఇతరాలని వైకృతమనీ అంటారు. వైకృతరోగాలేవీ కుదిరేరోగాలు కావు (జ్వరాలు మాత్రం) వాత దోషం వల్ల వానల కాలంలో వచ్చే జ్వరానికి పిత్త, కఫాలు కూడా లోనవుతాయి. ఆకురాలు కాలంలో పాడయిన పిత్తం కఫాన్ని కలుపుకొని జ్వరాన్నేర్పాటు చేస్తుంది. ఈ జ్వరాలకు లంఖణం మంచి నిరోధక మార్గమే. వసంతంలో వన్నె చెడిన కఫం వాతంతో కలిసి తెచ్చే జ్వరాలుంటాయి. పిత్త దోషం కూడా కలుస్తుంది. బలంగా వున్న మనుష్యులు జ్వరాన్ని మందులనే ఆయుధాలతో జయిస్తారు కానీ జన్మతః బలహీనులను జ్వరం బలిగొంటుంది.


మలబద్దకం వల్ల వచ్చేదీ, మూడు దోషాలు కలిపి వుండేదీ ఆమజ్వరం. జఠరాగ్ని మందం, అతిమూత్రం, జీర్ణమండల వ్యవస్థ మందగించడం (ఆకలి నశించడం) దీని లక్షణాలు.


పచ్యమాన జ్వరలక్షణాలు ఉష్ణోగ్రతతో సహా దాహం, వాగుడు, పలవరింతలు అన్నీ తక్కువ కాలంలోనే పెరిగిపోవడం, ఊపిరి తీవ్రంగా వేగవంతమవుతుంది. తల తిరుగుతుంది. నీళ్ళ విరేచనాలవుతాయి. నొప్పులుంటాయి. జీర్ణకోశాన్ని ఖాళీగా వుంచితే ఆమ వ్యర్థాలు పోతాయి కాబట్టి ఈ జ్వరానికి వారం రోజుల ఉపవాసాన్ని (లంఖణాలని) గట్టిగా సూచించవచ్చును. జఠర రసాల్లో లోపాలను బట్టి అయిదు రకాల జ్వరాలను పోల్చవచ్చును.


సంతత, సతత, అన్యెద్యు, త్రిత్యక, చతుర్థక సప్తధాతువులలోనూ, మలమూత్ర కోశాలలోనూ, నాళాలలోనూ పేరుకుపోయిన జ్వరం ఏడు, పది లేదా పన్నెండు రోజుల్లో వాత, పిత్త, కఫ దోషాలతో బాటు తగ్గించబడవచ్చు. తగ్గుతుంది కూడా. తగ్గకపోతే మాత్రం ప్రాణాపాయమే. ఇలా అగ్నివేశుడన్నాడు. పదునాల్గు, తొమ్మిది, పదకొండు రోజులని హారితుడన్నాడు.


శుభ్రత, పరిశుభ్రత, అశుభ్రతల ప్రభావం కూడా దోషనివారణకు పట్టే కాలంపై ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఒళ్ళు బరువుకూడా. దోషం పూర్తిగా మందులు, ఆహారపు మార్పుల వల్ల, నశించాకనే జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం తగ్గుతున్న కొద్దీ బాధితుల మలమూత్ర విసర్జన ప్రక్రియలు మెరుగు పడుతుంటాయి. అలాగే ముఖంలో తేటదనం, మెరుపు, శరీరంలో చురుకుదనం కూడా పెరుగుతుంటాయి.

Tuesday, 17 December 2024

శ్రీ గరుడ పురాణము (328)

 


రోగి నోటినుండి రక్త పిత్త మిశ్రితమైన ఉమ్మి పడుతుంటుంది. తట్టుకోలేనంత దాహం వేస్తుంటుంది. కోష్ట (పొట్ట) ప్రదేశాలన్నీ నల్లగా ఎఱ్ఱగా అయిపోతాయి. గుండ్రటి దద్దుర్లు పొట్టపై ఏర్పడతాయి. గుండెలో బాధ కలుగుతుంది. అన్ని ద్వారాల నుండీ అత్యధికం గానో, అత్యల్పంగానో విసర్జనాలు వస్తుంటాయి. ముఖంలో జిడ్డు, నీరసం, హీనస్వరం, తేజస్సు మందగించడం, ప్రలాపం పుట్టుకొస్తాయి. ఈ జ్వరం బయటపడకుండా లోపల్లోపలే శరీరంలో పెరుగుతుంటుంది. గొంతునుండి గురక, కంఠం నుండి అవ్యక్త శబ్దాలు, శరీరాన్ని కదపాలనే కోరిక నశించడం అనే లక్షణాలు కనిపిస్తే రోగవ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని అర్థం. దానిని బలవీర్య - వినాశక అభిన్యాస సన్నిపాత జ్వరంగా వ్యవహరిస్తారు.


ఈ సన్నిపాత జ్వరం యొక్క వాయు వికారం వల్ల గొంతులో అడ్డు ఏర్పడి పిత్తం లోపలి భాగంలో నొప్పి పుట్టుకొచ్చి నాసికాదులు కారుతుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. మూడు రకాల జ్వరమూ ఒకేసారి తగిలినపుడు శరీరంలోని అగ్నితత్త్వం నశించిపోవడం మొదలౌతుంది. అది పూర్తిగా నశిస్తే మాత్రం రోగం మానడం అసాధ్యం.


ఈ సన్నిపాత జ్వరానికి మరోరూపం కూడా ఉంటుంది. పిత్తం వేరైపోయినట్లుంటుంది. పొట్టలో మంట పుడుతుంది. జ్వరం రాకముందే ఒక విధమైన గాబరా వుంటుంది. వాత - పిత్త ప్రవృత్తులు శరీరంలో పెరుగుతుంటే ఈ జ్వరం కమ్ముతుంది. చలీ, వేడీ రెండూ వుంటాయి. వాటి నుండి రక్షింపబడడం మిక్కిలి కష్టం. శీత ప్రభావం వల్ల నోటినుండి కఫం వస్తుంటుంది. నోరు ఎండిపోతుంది. పిత్తం పనితగ్గడం వల్ల మూర్ఛ, మదం, దాహం ఏర్పడతాయి. బద్దకం, కదలలేనితనం వచ్చి పుల్లవాంతులవుతాయి.


ఆగంతు జ్వరలక్షణాలు: బాహిర కారణాల ద్వారా తగిలే ఈ తాత్కాలిక జ్వరం దెబ్బ తగలడం వల్ల కానీ, సంయోగం వల్ల కానీ, శాపం లేదా రక్తం తగలడం వల్ల గానీ చిల్లంగి దిష్టి వంటి ప్రయోగాల వల్ల గానీ వచ్చే జ్వరాన్ని ఆగంతు జ్వరం అంటారు. వీటిలో మొదటిది అభిఘాతజం అనబడుతుంది.


కాలిన గాయాల వల్ల గాని ఒళ్ళు చురికిపోవడం వల్ల గానీ వచ్చేది అభిఘాతజ జ్వరం. అత్యధిక శ్రమ వల్ల వచ్చే జ్వరంలో వాతం రక్తాన్ని పాడుచేస్తుంది. చర్మం పేలిపోయినట్లవుతుంది. ఒళ్ళు నొప్పులు వాపులు వుండి ఉష్ణత పెరుగుతుంది.


దుష్ట గ్రహపీడ, మత్తు పదార్థాలు, విషాలు, కోపం, భయం, దుఃఖం, ప్రేమ కూడా జ్వరాన్ని కలిగిస్తాయి. ఇది సామాన్య జ్వరంలాగే వుంటుంది కానీ తెరలు తెరలుగా వచ్చే నవ్వూ, ఏడుపూ దీని ఉదృతిని తెలియజేస్తాయి. మత్తుమందులనీ, పొగనీపీల్చడం వల్ల వచ్చే జ్వరానికి స్పృహతప్పుట. తలనొప్పి, వాంతులు, తుమ్ములు లక్షణాలు, విషం వల్ల వచ్చే జ్వరంలో తెలివి తప్పుట, విరేచనాలు, కనులు చీకట్లు కమ్ముట, చర్మం రంగు మారుట, మంట, తలతిరుగుట, కనిపిస్తాయి. కోపం వల్ల వచ్చే జ్వరంలో ప్రత్యేకంగా వణుకు, దడ, తలనొప్పి పుట్టుకొస్తాయి. క్రోధ జ్వరంలో లేదా భయ జ్వరంలోనైతే ఆగకుండా వెలువడే వాగుడు ప్రత్యేక లక్షణం. ప్రేమ, కామం వల్ల జ్వరం వచ్చినపుడు మత్తుగా వుంటుంది. ఏం తిన్నా రుచి తెలియదు, ఒళ్ళంతా మండుతున్నట్లుంటుంది. సిగ్గుగా వుంటుంది, నిద్రపట్టదు, బుఱ్ఱ సరిగా పనిచేయదు, ధైర్యం పోతుంది.

Wednesday, 11 December 2024

శ్రీ గరుడ పురాణము (327)

 


కఫ-వాత జనిత జ్వరానికి ఉష్ణోగ్రత పెద్దగా వుండదు. తలనొప్పి, అరుచి(అంటే నాలుకకి ఏదైనా చేదుగా గానీ రుచి హీనంగా గాని తగలడం) సంధులలో నొప్పి, మాటి మాటికీ ఉమ్మి రావడం, ఊపిరి భారం కావడం, దగ్గు, ముఖం పాలిపోవటం, చలి, పగటిపూట కూడా కనులు చీకట్లు కమ్మడం, నిద్రపట్టకపోవడం ఇవన్నీ వుంటాయి.


బయట వేడిగా వున్నా చలివేస్తున్నట్లు అనిపించడం, ఒళ్ళు కొయ్యబారి నట్లుండడం, చెమట, దాహం, మంట, దగ్గు, శ్లేష్మ పిత్తాల జోరు, మూర్ఛ, అనాసక్తి, బద్దకం, నోరు చేదుగా అనిపించడం, ఇవన్నీ శ్లేష్మ పిత్త జన్యమైన జ్వరాన్ని సూచిస్తాయి.


వాత- పిత్త- శ్లేష్మ అన్ని లక్షణాలూ కనిపిస్తే సర్వజ (సన్నిపాత) జ్వరంగా భావించాలి. దానికైతే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క మారు ఒక్కొక్కటిగా బయల్పడుతుంటాయి. సన్నిపాతంలో చలి, పగటి మహానిద్ర, రాత్రి నిద్రలేమి గాని దినరాత్రులు మొత్తంగా నిద్ర గాని వుంటాయి. ఆ నిద్రలేమి సమయంలో రోగి పాటలు పాడతాడు. నాట్యం చేస్తాడు. లేదా హాస్యాలాడతాడు. అతని సామాన్య స్థితి పోలిక లేనంతగా మారిపోతుంది. కనులు మలినమవుతాయి. అశ్రువులను వర్షిస్తాయి. కనుల చివరలు ఎఱ్ఱబడతాయి. పూర్తిగా మూతబడవు. శరీరంలో పిక్కలు, పక్కలు, తల సంధులతో సహా ప్రతి ఎముకా నొప్పెడుతుంది. చిత్త భ్రమ కూడా ఉంటుంది. రెండు చెవుల నుండీ శబ్దాలు, హోరు వస్తుంటాయి. పోటు కూడా వుంటుంది. నాలిక కొంత ఎఱ్ఱగా, కొంత నల్లగా వుండి దురదేస్తుంటుంది. తడి ఆరిపోతూ పొడిగా వుంటుంది. ఎముకలు, సంధులు సడలిపోయినట్లుగా వుంటాయి. 

Tuesday, 10 December 2024

శ్రీ గరుడ పురాణము (326)

 


కఫ- ప్రకోపదానం: తీపిరసాలు, ఆమ్లాలు, లవణాలు, స్నిగ్ధ, గురు, అభిష్యంది, శీతల భోజనాల వల్లనూ, ఎక్కువకాలం కూర్చొనుట, నిద్రపోవుట, సుఖపడుట, అజీర్ణం, పగటినిద్ర, బలకారక పదార్థాలను అతిగా తినుట, కష్టపడకపోవుట మొదలగు కారణాల వల్ల అన్నం అరిగే ప్రారంభకాలంలోనూ, రాత్రి పగలు ప్రారంభ కాలాల్లోనూ కఫం ప్రకోపిస్తుంది. దీన్నే శ్లేష్మమని కూడా అంటారు.


త్రిదోష సామాన్య సంప్రాప్తి : ఈ మూడు ప్రకోపాల మిశ్రిత స్వభావంతో సన్నిపాతం పుట్టుకొస్తుంది. సంకీర్ణ భోజనం, అజీర్ణం కలిగించే భోజనం, విషమ, విరుద్ధ భోజనం (మొత్తం మీద వంటికి పడని తిండి) మద్యపానం, పచ్చిముల్లంగి, ఎండినకూరలు, గానుగపిండి, మృత్యువత్సరమని పేరుగాంచిన పేలపిండి, మాంసం, చేపలు ఇవన్నీ సన్నిపాతాన్ని తెచ్చే ఆహారాలే. దూషితాన్నమూ, గ్రహప్రభావమూ కూడా ఈ వికారాన్ని తెచ్చిపెడతాయి. ఇంకా చాలా చాలా కారణాలే వున్నాయి. రసవాహినుల ద్వారా శరీరం లోపలకి చేరుకొని రోగాలను కలిగించే పదార్థాలుకూడా ఉన్నాయి. (అధ్యాయం-146)


జ్వర నిదానం


జ్వరాలలో చాలా రకాలే వున్నాయి. కొన్నిటి పేర్లు ఇలా వుంటాయి. ఇవి శివుని కంటిమంట నుండి పుట్టినవని అంటారు. రోగపతి, పాప్మ, మృత్యురాజ, అశన, అంతక, ఓజోఽశన, మోహమయ, సంతాపాత్మ, సంతాప, అపచారజ జ్వరాలు ఎక్కువగా బాధిస్తాయి.


ఏనుగు కొచ్చే జ్వరాన్ని పాకలమనీ, గుఱ్ఱానికొచ్చేదాన్ని అభితాపమనీ, కుక్కకైతే అలర్కమనీ అంటారు. మేఘాలకీ, నీటికీ, మందులకీ, నేలకీ కూడా జ్వరాలొస్తాయి. వాటి పేర్లు క్రమంగా ఇంద్రమదం, నీలిక, జ్యోతి, ఊషర.


కఫజ్వర లక్షణాలు : గుండెగాబరా, వాంతి, దగ్గు, చలి, వాపు, కఫం ద్వారా వచ్చే జ్వరలక్షణాలు. తరువాత ఒళ్ళు నొప్పులు వుంటాయి. చికిత్స ఆలస్యమైనా సరైన మందు పడకపోయినా ఈ బాధలు రోజురోజుకీ పెరిగిపోతుంటాయి. ఏ సమయంలో ఏ లక్షణం ఎక్కువవుతోందో చూసి మందువెయ్యాలి. ఉపశయ (ఎక్కువ కావడం) అనుపశయ (కాకపోవడం) ములను బట్టి రోగాలే మారుతుంటాయి. అనగా మందు, విహారం, అన్నం, దేశకాలాదులలో మార్పు ఒక మనిషికి సుఖాన్ని కలిగిస్తే అది ఉపశయం. వీటిలో నేదైనా ఒక వ్యక్తి సుఖాన్ని హరిస్తే లేదా హాని కలిగిస్తే అది అనుపశయం.


అరుచి, అజీర్ణం, స్తంభనం, బద్దకం, గుండెలో మంట, విపాకం, నిద్ర వస్తున్నట్లుండడం, చొంగ కారడం, గుండె బరువెక్కడం, ఆకలి వేయకపోవడం, ముఖం బిరుసుగా తగలడం, ఒళ్ళు పాలిపోవడం, ఒళ్ళు బరువెక్కడం, మూత్రం మాటి మాటికీ రావడం, శరీరకాంతి తగ్గడం, ఇవన్నీ ఆమ (కఫంలో ఒక) జ్వర లక్షణాలు.


ఆకలి మందగించడం, ఒళ్ళు తేలిపోతున్నట్లుండడం, సామాన్య జ్వరలక్షణాలు. జ్వరంలో వాత, పిత్త, కఫ రోగాల మూడు లక్షణాలు కనిపిస్తే దానిని పరిపక్వ అష్టాహ మంటారు. రెండింటి లక్షణాలుంటే ద్వంద్వజమంటారు.


వాత- పిత్త- జ్వరలక్షణాలు: తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఒళ్ళు వేడెక్కడం, మోహం, గొంతు బలహీనంగా వుండడం, ముఖం డోక్కుపోవడం, అరుచి, ఒంట్లో ప్రతి భాగంలో విరగదీసినంత నొప్పి, అనిద్ర, చిత్తభ్రమ, రోమాంచం, చలి- ఇవన్నీ వాత, పిత్త జ్వరం తగిలిన శరీరంలో కనిపించే లక్షణాలు.

Monday, 9 December 2024

శ్రీ గరుడ పురాణము (325)

 


స్వతంత్రత లేదా పరతంత్రతల ద్వారా దోషాలయొక్క ప్రాధాన్యాన్ని గానీ, అప్రాధాన్యాన్ని గానీ వివేచన చేయడం ప్రాధాన్య సంప్రాప్తి.


హేతు - పూర్వరూపం, రూపముల సంపూర్ణత లేదా అల్పతల ద్వారా రోగబలం, అబలములను వివేచించడం బలసంప్రాప్తి. దోషానుసారం రాత్రి, పగలు, ఋతువు, భోజనాల పరిపాక అంశాలు (ఆది, అంత, మధ్య) చూసి వాటి ద్వారా రోగకాలాన్ని తెలుసుకోవడం కాలసంప్రాప్తి.


ఈ విధంగా నిదానం యొక్క అభిధేయాలు (నిదాన, పూర్వరూప, రూప, ఉపశయ, సంప్రాప్తి) నిర్వచింపబడడం జరిగింది. ఇపుడు వాటిని మరింత విస్తారంగా చూద్దాం. అన్ని రోగాలకూ మూలకారణం శరీరస్థితమైన కుపిత దోషమే. అయితే దోష- ప్రకోపానికి ఒంటికి పడని తిండి ఎక్కువగా దోహదం చేస్తుంది. దీనిని అహిత సేవనమంటారు. ఇది మూడు రకాలు.


వాత ప్రకోప నిదానం : చేదు, వేడి, కషాయ, ఆమ్ల, గట్టి పదార్థాలతో అన్నమును అతిగా తినడం, పరుగులు పెట్టడం గబగబా మాట్లాడడం, రాత్రి జాగరం, ఎక్కువ ధ్వనిచేస్తూ మాట్లాడడం, అన్ని పనులనూ అతిగా చేస్తుండడం, భయం, శోకం, చింత, అతి వ్యాయామం, శృంగారంలో మితిలేకుండా పాల్గొనడం, వీటివల్ల శరీరంలోని వాయువు ప్రకోపానికి లోనవుతుంది. ఈ వాయువికారం విశేషించి గ్రీష్మఋతువులో పగటి, రాత్రి భోజనాల తరువాత ఎక్కువగా బాధిస్తుంది.


పిత్త ప్రకోప నిదానం: చేదు, గట్టి, గరుకు, వేడి, ఉప్పటి పదార్థాలనూ కోపాన్నీ, దాహాన్నీ పెంచే తిళ్ళనూ తినడం వల్లం పిత్తం ప్రకోపిస్తుంంది. ఇది శరదృతువులో మధ్యాహ్నం అర్ధరాత్రి వంటి మంటను పుట్టించే క్షణాలలో ఎక్కువగా బాధిస్తుంది. 

Sunday, 8 December 2024

శ్రీ గరుడ పురాణము (324)

 


మహాభారతయుద్ధంలో అసురశక్తులు తొంబది శాతం నశించినా ఇంకను కొందరు దానవులు మిగిలిపోయారు. వారు శరవేగంతో అభివృద్ధి చెందడాన్ని గమనించి శ్రీమహా విష్ణువే బుద్ధుడై అవతరించి వారిని సమ్మోహితులను చేసి వారిలోని దానవత్వాన్ని రూపుమాపి ఉత్తమ మానవులనుగా తీర్చిదిద్దాడు.


అధర్మం ప్రస్తుతానికి అదుపులో వుంది. అది గాడి తప్పి విజృంభిస్తుంది. అపుడు శ్రీమహావిష్ణువు సంభల గ్రామంలో కల్కినామంతో అవతరిస్తాడు. అశ్వాన్నధిరోహించి జగమంతటా కలయదిరిగి ఎక్కడెక్కడి అధర్మపరులనూ వెదకి పట్టుకొని వధిస్తాడు.


రుద్రదేవా! అధర్మాన్ని అంతమొందించడానికీ, సత్త్వగుణ ప్రధాన దేవతల శక్తులను పెంచడానికీ, పుడమిపై పెచ్చరిల్లు అశాంతిని త్రుంచడానికి శ్రీమన్నారాయణుడేదో ఒక రూపంలో దిగి వస్తూనే ఉంటాడు. లోకుల ఆరోగ్య రక్షణ కోసం పాల సముద్రంలో అమృత భాండాన్ని పట్టుకొని ధన్వంతరిగా అవతరించిన ఆయనే విశ్వామిత్ర పుత్రుడైన సుశ్రుతుడను మహాత్మునికి ఆయుర్వేదాన్ని స్వయంగా ఉపదేశించాడు. (అధ్యాయం - 145)


ఆయుర్వేద ప్రకరణం


గరుడ పురాణంలోని ఆయుర్వేద ప్రకరణానికి గొప్ప ప్రసిద్ధి ఉంది. ఇందులోని మొదటి ఇరవై అధ్యాయాలలో నిదాన- స్థాన విషయాలు వర్ణింపబడ్డాయి రోగ కారణాలనూ లక్షణాలనూ బట్టి రోగనిర్ణయాన్ని చేయడాన్నే రోగ నిదానమంటారు. తరువాతి నలభై అధ్యాయాలలో రోగచికిత్స, ఔషధాలు - వాటి నిర్మాణ విధి చెప్పబడ్డాయి. అంతేగాక మందుకి తగిన అనుపానం, వాడవలసిన తీరు కూడా చేర్చబడ్డాయి. ఒకే రోగానికి అనేకములైన మందులు సూచించబడ్డాయి. కాని వీటిని సుయోగ్యుడైన వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి.


ఈ ప్రకరణంలో (పురాణంలో) అక్కడక్కడ గల ఖండితాలనూ, అస్పష్టతనూ ఆర్ష సంస్కృతికి చెందిన ఆయుర్వేద గ్రంథాలనాశ్రయించి సరిచేయడం జరిగింది.


రోగనిదానం


ధన్వంతరి సుశ్రుతునికి చెప్పిన శాస్త్రమిది.


ప్రాచీన కాలంలో ఆత్రేయాది మహామునులు రోగనిదానానికి సంబంధించి గొప్ప కృషి చేశారు. దానికి స్వయంకృషినీ ప్రతిభనూ జోడించి ధన్వంతరి ఇలా ఉపదేశించాడు.


"సుశ్రుతా! పాప, జ్వర, వ్యాధి, వికార, దుఃఖ, ఆమయ, యక్ష్మ, ఆతంక, గద, ఆబాధ - ఇవన్నీ పర్యాయవాచ్యములైన శబ్దములు.


రోగాన్ని తెలుసుకోవడానికి అయిదు ఉపాయాలుంటాయి. అవి నిదానం, పూర్వరూపం, రూపం, ఉపశయం, సంప్రాప్తి, నిమిత్తం, హేతువు, ఆయతనం, ప్రత్యయం, ఉత్థానం, కారణం - అనే వాటిని బట్టి రోగాన్ని పోల్చడమే రోగనిదానం. దోషవిశేషాలు తెలియకుండానే రోగాన్ని పోల్చగలిగితే దానిని పూర్వరూపమంటారు. ఇది సామాన్యమనీ, విశిష్టమనీ రెండు విధాలు. ఈ పూర్వరూపం పూర్తిగా వ్యక్తమైతే రూపం అనబడుతుంది. సంస్థాన, వ్యంజన, లింగ, లక్షణ, చిహ్న, ఆకృతి, ఇవి రూపానికి పర్యాయ వాచ్యములైన శబ్దాలు. హేతు-విపరీతం, వ్యాధి- విపరీతం, హేతు-వ్యాధి- ఉభయ- విపరీతం, హేతు విపరీతార్థకారి, వ్యాధి విపరీతార్థకారి, హేతు వ్యాధి ఉభయ విపరీత అర్థకారి ఔషధాలుంటాయి. ఇవి అన్న, విహారాలను సుఖదాయకంగా ఉపయోగపడేలా చేస్తాయి.


దీనిని సాత్మ్యమంటారు. ఉపశయమని కూడా అంటారు. దీనికి విపరీతం అనుపశయం. అనుపశయానికి మరోపేరు వ్యాధ్య సాత్మ్యము. దోషం శరీరంలో పైకి గాని ఇతర దిశల్లో గాని వ్యాపిస్తున్న పద్ధతి, దానివల్ల వచ్చేరోగం సంప్రాప్తి అనబడుతుంది. దానికి పర్యాయ పదాలు జాతి, ఆగతి.


సంప్రాప్తిలో సంఖ్య, వికల్పం, ప్రాధాన్యం, బలం, వ్యాధి కాల విశేషతలు ఆధారంగా విభిన్న విధాలు నిర్ణయింపబడివున్నాయి. ఈ శాస్త్రంలోనే జ్వరభేదాలు ఎనిమిది చెప్పబడ్డాయి. ఇది సంఖ్యాసంప్రాప్తి.


రోగోత్పత్తికి కారణభూతమైన దోషముల అంశాంశ కల్పన అంటే ఎక్కువ, తక్కువల వివేచన వికల్ప సంప్రాప్తి.

Saturday, 7 December 2024

శ్రీ గరుడ పురాణము (323)

 


స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు హస్తినాపురానికి సమర్థమైన స్థిరమైన పాలన వచ్చేదాకా మరణించదలచుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చేదాకా అలాగే అంపశయ్యపై వుండి యుద్ధాగ్ని ఆరగానే అప్పటికి మిగిలిన ధర్మరాజుకి (విష్ణుసహస్రంతోసహా) సర్వ ధర్మ సంబంధిత విభిన్న ఉపదేశాలనిచ్చి, పితృతర్పణలిచ్చి, శ్రీకృష్ణభగవానుని తదేకంగా తిలకిస్తూ ప్రాణం విడిచాడు. ఆయనకు నిర్మలాత్ములకు లభించే పరమానంద పదమైన మోక్షం లభించింది.


తరువాత కౌరవ సైన్యాధ్యక్ష పదవిపై ద్రోణాచార్యుడాసీనుడైనాడు. ఆయన పాండవ సేనాపతియైన ధృష్టద్యుమ్నునితో తలపడ్డాడు. వీరి సేనలమధ్య భయంకరమైన యుద్ధం అయిదురోజులపాటు సాగింది. కౌరవుల పక్షాన పోరాటం చేస్తున్న వందల కొలది రాజులు అర్జునుని బాణాగ్నిలో భస్మమైపోయారు. అశ్వత్థామ మృతి చెందాడనే అసత్యపు వార్త విని హతాశుడై ద్రోణాచార్యుడు మరణించాడు. (ఆయనను ధృష్టద్యుమ్నుడు చంపినట్టు ఇక్కడ చెప్పబడలేదు)


తరువాత కర్ణుడు కౌరవ సేనాపతిగా రెండురోజులు ప్రచండంగా యుద్ధాన్ని కొనసాగించాడు కానీ అతడు మహావీరుడైన అర్జునుని నిశితాస్త్రాల దెబ్బకు నేలకొరిగాడు. అప్పుడు సేనాపతిగా నియుక్తుడైన శల్యుడు అపరాహానికి ముందే ధర్మరాజు తోడి యుద్ధంలో మరణించాడు. కాలాంతకుని వలె కాల సర్పంవలె క్రోధంతోబుసలుకొడుతూ యమదండము వంటి గదను తిప్పుతూ భీమునిపైకి పోయిన, దుర్యోధనుడు తన అధర్మమే భీముని రూపంలో తననోడించగా నేలకొరిగాడు. 'యతో ధర్మస్తతో జయః' అనే సూక్తికి నిలువెత్తు ఆదర్శంగా, ఉదాహరణగా భారతయుద్ధం చరిత్రలో నిలచి వుంది. 


యుద్ధం ముగిసిపోయినా హత్యాకాండ ఆగలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ అర్ధరాత్రి వేళ పాండవ శిబిరంపై దాడిచేసి తన తండ్రి వధను స్మరిస్తూ ఎందరో పాండవ వీరులను సంహరించాడు. అలా చంపబడిన వారిలో ధృష్టద్యుమ్నుడూ, ద్రౌపది పుత్రులైన పంచపాండవులూ ఉన్నారు. అర్జునుడు అశ్వత్థామను వెంబడించిపోయి అతనిని నిలువరించి యుద్ధంలో ఓడించి ఐషికమను పేరు గల అస్త్రంతో అతని సర్వశక్తులకూ, అహంకారానికీ కారణమైన శిరోమణిని పెకిలించి వేశాడు. గురు పుత్రుడనీ బ్రాహ్మణుడనీ అశ్వత్థామను అర్జునుడు చంపలేదు.


ధర్మరాజు అత్యంత శోక సంతప్తలైన స్త్రీల నందరినీ ఓదార్చి తాను పవిత్రక స్నానమాచరించి దేవతలకూ పితృజనులకూ తర్పణాలిచ్చాడు. తరువాత రాజ్యాభిషిక్తుడై ప్రజాశ్రేయస్సు కోసం అశ్వమేధయాగాన్ని చేసి విష్ణువును పూజించాడు. బ్రాహ్మణులను దక్షిణాదులతో తృప్తిపఱచాడు. ఈలోగా శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. ఆ వార్తను వినగానే ధర్మరాజు అభిమన్యు పుత్రునికి రాజ్యాభిషిక్తుని చేసి తన సోదరులతో పత్నితో సహా విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ స్వర్గం వైపు సాగిపోయాడు.

Sunday, 17 November 2024

శ్రీ గరుడ పురాణము (322)

 


తరువాత భీష్మ ద్రోణుల ప్రోద్భలం వల్ల, విదురుని మంత్రాంగం వల్ల ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యాన్నిచ్చేశాడు. వారు ఇంద్ర ప్రస్థమనే గొప్ప సుందరమైన రాజధానిని కట్టుకొని ఒక అద్భుతమైన సభామండపాన్ని కూడా నిర్మింపజేసుకుని రాజసూయ యజ్ఞాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చారు.


వాసుదేవుని అనుమతితోనే అర్జునుడు ద్వారకాపురికి పోయి కృష్ణసోదరి సుభద్రను పెండ్లాడాడు. అగ్నిదేవునికి ఖాండవ వన దహనంలో సహాయపడి నంది ఘోషమను దివ్యరథాన్ని, ముల్లోకాలలో శ్రేష్ఠతమమైనదిగా పేరు గాంచిన గాండీవమను ధనుస్సునూ, అవినాశములైన బాణములనూ, అభేద్య దివ్య కవచాన్నీ ఆయన నుండి అర్జునుడు పొందాడు. రాజసూయ సందర్భంగా దేశ- దేశాంతరాలలో దిగ్విజయయాత్రను చేసి అసంఖ్యాకములుగా యుద్ధాలను చేసి అనేకులైన రాజులనోడించి వారి నుండి కప్పములుగా గొన్న కొండలంతేసి రత్నరాశులను అర్జునుడు తన అన్నయుధిష్ఠిరునకు (ధర్మరాజుకి) సమర్పించాడు.


పాండవుల మొత్తం శ్రీని అపహరించడానికి శకుని ధర్మరాజుని ద్యూతక్రీడకు ఆహ్వానించి దుర్యోధనుని ప్రతినిధిగా తాను పాచికలు వేసి మాయచేసి గెలిచాడు. తత్ఫలితంగా పాండవులు ద్రౌపదితో సహా పన్నెండేళ్ళు వనవాసమూ, ఒక యేడు అజ్ఞాత వాసమూ చేయవలసి వచ్చింది. కుంజరయూధము దోమకుత్తుక జొచ్చినట్లు పాండవులు విరాటరాజు కొలువులో పనిచేసి అజ్ఞాతవాస నియమాన్ని పూర్తిచేశారు.


అజ్ఞాతవాస కాలంలో పాండవులలో ఏ ఒక్కరు బయటపడిపోయినా మరల వారందరూ పన్నెండేళ్ళు వనవాసమూ ఒక యేడు అజ్ఞాతవాసమూ చేయాలనే నియమం పెట్టారు. కాబట్టి పాండవుల ఉనికిని కనిపెట్టడానికి విశ్వప్రయత్నం చేసిన దుష్టచతుష్టయానికి అనగా దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులకు చివరి దశలో పాండవులు విరాట రాజ్యంలో వున్నారేమోననే అనుమానం వచ్చి పెద్ద సైన్యంతో దాడిచేసి గోవులను అపహరించడానికి ప్రయత్నించారు. అర్జునుడు వచ్చి అవక్రవిక్రమ ప్రతాపాన్ని మెరిపించి మొత్తం కౌరవసేనను చిత్తుచిత్తుగా ఓడించాడు. కర్ణుడు పడిపోయాడు. దుర్యోధనుడు మూర్ఛపోయాడు. తెలివివచ్చి సంతోషించబోయిన దుర్యోధనునికి అజ్ఞాతవాసకాలం నాటికి ముందలిరోజే సమాప్తమైపోయిందని చావు కబురు చల్లగా చెప్పి వెనుకకు మరలించు కుపోయారు గురువులు.


జూదపు నియమాలను దిగ్విజయంగా పాటించారు. కాబట్టి తమ అర్ధరాజ్యాన్ని తమకివ్వాలనీ అలాకాని పక్షంలో కనీసం అయిదూళ్ళయినా ఇమ్మని పాండవులు శ్రీకృష్ణుని ద్వారా రాయబారం చేశారు. సూదిమోపినంత స్థలమైనా ఇవ్వబోనని దుర్యోధనుడు చెప్పడంతో అసలు రాజుకు గుడ్డితనంతోబాటు మూగరోగం కూడా కలగడంతో యుద్ధమూ, బంధునాశమూ తప్పలేదు. (ముసలిరాజుకి అంధత్వం పుట్టుకతోనే వచ్చింది. ఈ మూగతనం పుత్ర వ్యామోహం నుండి ఇప్పుడు పుట్టుకొచ్చింది)


(అయిదువేల యేళ్ళ క్రిందట)


ఆ ముందుగానీ ఆ తరువాత గానీ ఏ ఒక్కజాతీ కనీవినీ యెఱుగని మహాయుద్ధం కౌరవపాండవుల బాహ్యనాయకత్వాన కురుక్షేత్రంలో జరిగింది. పాండవుల తరపున ఏడు అక్షౌహిణుల సైన్యమూ, కౌరవులవైపున పదకొండ క్షౌహిణుల సైన్యమూ ఈ మహాసంగ్రామంలో పాల్గొన్నారు. ధృష్టద్యుమ్నుని పాండవులూ భీష్ముని కౌరవులూ తమ తమ సర్వ సైన్యాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పాండవ సేనాపతి యుద్ధం ముగిసేదాకా ఆ పదవిలోనే ఉన్నాడు కానీ కౌరవ సేనాపతులు మారవలసి వచ్చింది.


(ఈ క్రింది పేరా గరుడపురాణానికే ప్రత్యేకం....)


పాండవ సేనాపతిగా శిఖండీ, కౌరవసేనాపతిగా భీష్ముడూ యుద్ధాన్ని ప్రారంభించారు. రెండు సేనల మధ్యా అస్త్రశస్త్రాలతో బ్రహ్మాండమైన యుద్ధం భయంకరంగా పదిరోజులపాటు జరిగింది. పదవరోజు శిఖండి, అర్జునుడు ప్రయోగించిన వందలాది బాణాలు తన తనువును భేదించడంతో భీష్ముడు నేలకొరిగాడు. 


* (శిఖండి అని గరుడ పురాణంలో వుంది)

Saturday, 16 November 2024

శ్రీ గరుడ పురాణము (321)

 


శ్రీకృష్ణుడు నూట పాతిక సంవత్సరాలు ఈ పుడమిపై జీవించాడు. అన్నేళ్ళలో ఏ ఒక్క నిముషమూ కూడ తన కోసం తాను బ్రతకలేదు. ఆయన వైకుంఠానికేగిన పిమ్మట అనిరుద్ధపుత్రుడైన వజ్రుడు ఈ వంశాన్ని నిలబెట్టాడు.


అన్నిటికన్నా గొప్ప విశేషం శ్రీకృష్ణుడిచ్చిన గురుదక్షిణ ఇక లేడనుకున్న సాందీపని పుత్రుని సముద్రశోధనం, రాక్షస సంహారం గావించి వెనక్కి తెచ్చాడు. (అధ్యాయం -144)


మహాభారతం - బుద్ధాది అవతారాలు


భూభారాన్ని తగ్గించడానికీ వీలైనంత ఎక్కువమంది దుష్టుల్ని సంహరింప డానికీ భగవానునిచే కల్పింపబడిన మహాభారత యుద్ధమును యుధిష్ఠిరాది పాండవులను శ్రీకృష్ణుడు రక్షించిన తీరును ఒకపరి తలుద్దాం.


విష్ణు భగవానుని నాభి కమలం నుండి నేను (అనగా బ్రహ్మ) పుట్టాను కదా! నానుండి అత్రి, అతడి నుండి చంద్రుడు, అతడి నుండి బుధుడు ఉద్భవించారు. బుధునికి ఇలాదేవియను పత్ని ద్వారా పురూరవుడు జనించాడు. అతనికి ఆయువను పుత్రుడు అతనికి యయాతి అను కొడుకు పుట్టారు. యయాతి వంశంలో భరతుడు, కురుడు, శంతనుడు కలిగారు. శంతనునికి గంగ ద్వారా సర్వ సద్గుణ సంపన్నుడు, బ్రహ్మ విద్యలో పారంగతుడునగు దేవవ్రతుడు జనించాడు. ఏ యుగంలోనూ ఎవరూ చేయలేనంత గొప్ప ప్రతిజ్ఞను చేసి బ్రహ్మచారిగానే చివరిదాకా జీవించి రాజ్య సింహాసనాన్ని కూడా తండ్రిగారి రెండవ పెళ్ళి ముచ్చట తీర్చడం కోసం త్యజించిన దేవవ్రతునే ఆ ప్రతిజ్ఞ యొక్క భీషణత్వానికి అచ్చెరువొంది ఈ లోకం అత్యంతాదరంతో భీష్ముడని పిలుచుకొంది.


శంతనునికి భీష్ముని దయ వల్ల ప్రాప్తించిన పత్ని సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అను కొడుకులు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు అదే పేరుగల గంధర్వునితోడి యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యుని కోసం భీష్ముడు కాశీరాజ పుత్రికలైన అంబికను అంబాలికను తెచ్చి అతనికిచ్చి వివాహం చేశాడు. విచిత్రమైన వీరత్వం ఏమాత్రమూ లేని విచిత్ర వీర్యుడు పిల్లలు పుట్టకముందే మరణించాడు.


అప్పుడు సత్యవతి శంతనుని వంశాన్ని నిలబెట్టడం కోసం తన పెద్ద కొడుకైన వ్యాస దేవుని ఆజ్ఞాపించి దేవర న్యాయం ద్వారా తన కోడళ్ళను పుత్రవతులను చేయించింది. అంబికకు ధ్రుతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు పుట్టారు. అంబిక పనుపున పోయిన ఆమె దాసి వ్యాసమహర్షి ద్వారా విదురుని కన్నది. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా నూరుగురు కొడుకులు, ఒక కూతురు కలుగగా పాండురాజునకు కుంతి ద్వారా యుధిష్ఠిర భీమార్జునులు, మాద్రి ద్వారా నకుల సహదేవులు కలిగారు. గాంధారి పుత్రులను కౌరవులనీ కుంతీ మాద్రుల కొడుకులను పాండవులనీ లోకం పిలుచుకోసాగింది. ఈ నూటైదుగురు వంశాంకురాలూ మహాబలశాలులే గాని గాంధారి పెద్దకొడుకైన సుయోధనుడు, పాండవులూ సాహస పరాక్రమాలూ కూడా వుండడం వల్ల మహావీరులుగా ప్రఖ్యాతి చెందారు.


దైవవశాత్తూ కౌరవ పాండవుల మధ్య వైరభావాలు జనించాయి. దుర్యోధనుడు పాండవులనెన్నో బాధలకు గురిచేశాడు. లక్కయింటిని వారికి విడిదిగా చూపించి దానిని దహనం చేయించాడు. ముందే పసిగట్టిన విదురుడు సొరంగమార్గాన్ని తవ్వించి పాండవులను రక్షించాడు. విదురుని సలహా మేరకు పాండవులు కొన్నాళ్ళు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో నివసించారు. అక్కడ భీముడు బకాసురుడను రాక్షసుని చంపి ఆ పుర నివాసులకు శాశ్వతంగా వాని పీడను వదిలించాడు. అక్కడినుండి పాంచాల దేశానికి వెళ్ళి ద్రౌపదీ స్వయంవరంలో పాల్గొన్నారు పాండవులు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకోగా విధివశాన ఆమె పాండవ పత్నియైనది. 

Friday, 15 November 2024

శ్రీ గరుడ పురాణము (321)

 


హరివంశ వర్ణన (శ్రీకృష్ణకథ)


భగవానుడైన శ్రీకృష్ణుని మాహాత్మ్యముచే పరిపూర్ణమైన కారణంగా శ్రేష్ఠతమంగా నిలచిన హరివంశాన్నొకమారు తలచుకుందాం.


పృథ్విపై పెచ్చుమీరిన అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పూర్వవైభవాన్ని తెచ్చి నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు బలరామునితో సహా దేవకీ వసుదేవులకు జన్మించాడు. పుట్టిన కొన్ని దినాలకే కృష్ణుడు పూతనను స్తన్యంతో బాటు ప్రాణాలను కూడా పీల్చి సంహరించాడు. తరువాత శకటాసురుని తన చిరుకాలి తాపుతో మట్టు బెట్టాడు. బోటి నీడ్చుకుంటూ పోయి మద్దిచెట్లను కూల్చి సంపూర్ణ దేవ మానవగణాలన్నీ విస్మయపడగా నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచనాన్ని కలిగించాడు. కాళింది మడుగున విషమును కలిపే కాళియ నాగుని తలలపై తాండవమాడి గోకులవాసుల కాతని పీడ విరగడజేశాడు. గోవర్ధన గిరినెత్తి ఇంద్రుని బారిన పడిన ప్రాణులను రక్షించి ఇంద్రునికి గర్వభంగం చేశాడు. ఇలా శ్రీకృష్ణ లీలలెన్నో విశ్వవిఖ్యాతమై యున్నవి. వాటిని తెలియని వారుండరు. తాను స్వయంగా అరిష్టాసుర కేశి (కంస) చాణూరాది బలశాలురైన దైత్యులను సంహరించుటయే గాక పాండవులకు సాయపడి కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాదిగా ఆసుర శక్తులకు మరణశాసనాన్ని వ్రాసి భూభారాన్ని తగ్గించాడు.


పురాకృత సుకృతాల వల్లనో, వరదానాల ఫలరూపంగానో రుక్మిణీ, సత్యభామాది ఎనమండుగురు రమణీలలామలూ, నరకాసురునిచే చెఱపట్టబడిన పదహారుమంది క్షత్రియ కన్యలూ శ్రీకృష్ణుని భార్యలైనారు. ఆయన ద్వారా యాదవ వంశం పుత్ర పౌత్రాభివృద్ధిని గాంచింది. రుక్మిణీ కృష్ణుల నందనుడైన ప్రద్యుమ్నుడు శంబరాసురుని వధించడం ద్వారా లోక రక్షకుడైనాడు. ఆతని పుత్రుడైన అనిరుద్ధుని బాణాసురుని కూతురైన ఉష వలచి వలపించుకొని వివాహానికి సిద్ధపడగా బాణుడు కుపితుడై అనిరుద్ధుని పట్టి బంధించాడు. మనుమని కొఱకై శ్రీకృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేయవలసి వచ్చింది. అతడు కూడా సామాన్యుడేమీ కాడు. వేయి భుజాలు గలవాడు, గొప్ప శివభక్తుడు. అయినా అతని అధర్మమే శ్రీకృష్ణుని చేతిలో అతనిని పరాజితుని చేసింది. శ్రీకృష్ణుడు బాణాసురుని సంహరించలేదు గాని అతనికి రెండు భుజాలను మాత్రమే మిగిల్చి మిగతా అన్నిటినీ నరికివేసి అతని అహంకారాన్ని సంహరించాడు.


ఇంద్రుని జయించి దేవతల నందనవనంలోని పారిజాతాన్ని భూలోకానికి గొనివచ్చిన శ్రీకృష్ణుడు బలదైత్యునీ శిశుపాలునీ వధించి ద్వివిదనామక వానరాసురుని సంహరించి లోకులను కాపాడాడు.



Tuesday, 12 November 2024

శ్రీ గరుడ పురాణము (320)

 

జు ఆ - పేలపిండం

నీల వృక్షం - నల్లగోరింట 

కర్కంధ - రేగు 

పీనస - పడిశం 

వమ్కణ - తొడసంధి, గజ్జ 

విసర్ఫరోగ - దురద 

ఆంత్ర - ప్రేగు 

తంద్ర - కునికిపాటు  

గుడూచి - తిప్పతీగ

చిత్రక - ఆముదం, గుమ్మడి

త్రికుట - సొంటి, పిప్పలి, మిరియాలు

బృహతి - వాకుడు, ములక

కాకాదని - పెద్దమాచి

నిర్గుండకి - వావిలి

మేఢకి,వ్యోశ - సొంటి + రావి + నల్లమిరప

భృంగరాజ - గుంటగలిజేరు

శ్యామాక - గడ్డి, చామ

వాసక - అడ్డసర

కటుక - త్రికుట

మధుక - తిప్పతీగ

కశేరుక -వెన్నెముక, కమ్మరేగు చెట్టు

రాజాదనం - మోదుగు పాలచెట్టు

కచ్ఛుర - రేగడిదూల, వాకుడు, గంట్లకచోర చెట్లు

లకుచ - గజనిమ్మ

కపిత్థ - వెలగ

కంటకారిక - వాకుడు చెట్టు

కేశర(కేసర)- పొన్న, పొగడ

కుష్ఠ, కుశ్ధ- చెంగల్వ కోష్టు చెట్టు

మాతులుంగ- మాదీఫలం

క్వాథ - బాధ

హరీతకి - కరకచెట్టు

విడంగ - వంట ఉప్పు, ఒక చెట్టు

త్రిపుట - బంగిచెట్టు

బల - ముత్తవ పులగ చెట్టు

వాస్తుక - దినుసుకూరాకు

నీవార - విత్తక పండే గడ్డి ధాన్యము

ఎ (ఏ)రండ - ఆముదం చెట్టు

నిర్గుండి - నల్లవావిలి

కాకమాచి - కాచి

శష్కులి - చక్కిలం (కూడా)

వర్షభూ - గలిజేరు


Monday, 11 November 2024

శ్రీ గరుడ పురాణము (319)

 

కేతకి - మొగలి

అలక్త - లక్క

సందంశ - పటకారు

వటక - వడియం

శోథ - వాపు

ముద్గల, ముద్గాన్నం - పెసరఅన్నం

శాల్యన్నం - వరి అన్నం

యవాగు - జావ

కుబ్జక - పొట్ల

శాల్మలి - పత్తి

శాలిహోత్ర - గుఱ్ఱం

కోద్రవ - గడ్డిపఱక

రౌప్య - నాణెం

కంకత - దువ్వెన

కరజ - కానుగ చెట్టు

కంకోల - గుమ్మడి గుజ్జు

వసా - కొవ్వు

ద్రోణపుష్టి - కాయగూర

ముర - కప్పనది

జటామాంసి - ఆకుపచ్చని పూలుండే ఒక వాసన చెట్టు

కుటజ - కొండమల్లె, అడవిమల్లె 

పిటారీ - చిన్నబుట్ట

ముస్తా - జీర్ణకోశమందు

శతావరి - తోటకూర

హల్దీ - కుంకం

ప్రియంగు - నల్ల ఆవాలు

మోంగర - కొండమల్లె, మాలతి

గిరి కర్ణిక - దింటెన అపరాజిత నీలవృక్ష

మహువా - సోమలత

బదరీ - రేగు

ఖయిర - కాచు

కదంబ - కడిమి

అతిముక్తక - నెమ్మి, నల్లతుమికి

గులర - ముతక చక్కెర

గంధనాడి - ఎఱ్ఱపూల తులసి

అగస్తి, అగస్త్య- అగిసె

సిహ్లిక - బెంజాయిన్

కింశుక - మోదుగ

గిరికర్ణిక - దింటెన

రురు - నల్లచారల దుప్పి

నేమి - కమ్మి

Sunday, 10 November 2024

శ్రీ గరుడ పురాణము (318)

 


ధతురా - ఉమ్మెత్త

భటుకటైయా - దురదగొండి

తుంబాజడం- ఉసిరి మూలం

తాండవనృత్య- గడ్డి, ఒక ధాన్యం

ఆలాత - మండుతున్న కఱ్ఱ

బహువార - విరిగి చెట్టు

వృషలీపతి - వినాయకుడు

లోధ - లొద్దుగు

సావా - కత్తి ఒరలను ఈ మొక్క నుండి చేస్తారు.

శోణ - ఎఱ్ఱదుండిగ మొక్క

ప్రియాల - ద్రాక్ష, మోరటి

మధూక - జీర్ణం కోసం వాడే మొక్క

గజపీపల - రావి

ఉపస్థ - భారంగి కేబేజి వంటిదే

కరవా - ఈక

వచా - వస

కేతకి -గొజ్జంకి

ఖస - గసగసాలు

బాలుకామయ- కోవెల చెట్టు

మార్జార - తెల్లగసి చెట్టు

తగర కసింద చెట్టు (+)

కసమర్ద -కసివెంద (పచ్చనిపూలు)

కకడీ - దోస

మాతులుంగ - జామి

శుకరవృత్తి - మద్యశాలను శుభ్రపఱచు

విదారి - తెల్లనేలగుమ్ముడు

చండ్ర - ముడుగు దామర

జృంభక - ఆవులింత

దాడిమ - దానిమ్మ

శ్రీఫల - మారేడు

బహువార - విరిగిచెట్టు

ధాత్రీఫల - ఉసిరిక

శోణ - ఎఱ్ఱ దుండిగ

జంబూఫల - నేరేడు

పువా - అరిసె

దంతి - నేరేడు

కుసుంభ - కుంకుంపువ్వు

వికంకత - కానరేగు చెట్టు

బాలూ - ఇసుక

వృషలీ - శూద్ర స్త్రీ

అజరూషక - తెల్లసందిడి

పీపల - రావి

న్యగ్రోధ - జువ్వి

సా(వా( - నూకలు

అగహనీ - మార్గశిరంలో కోసిన ధాన్యపు బియ్యం

మూంజ - జనుము

మూర్వా - అవిసె

ఛాగ - మేక, మేకపాలు

సన - గొఱ్ఱె 

ముశల - రోకలి 

Saturday, 9 November 2024

శ్రీ గరుడ పురాణము (317)

 


మేద - కడుపు

తగర - నందివర్ధనం

యవక్షారము - యవల వల్ల కలిగిన ఉప్పు

ప్రసారణి - గొంతెమ గోరుచెట్టు

కలింద - తాడెచెట్టు

హరీతకి - కరక

ఉత్సర్గ - దానం, విడుపు

బరగద - మఱ్ఱి

హయమారక - గన్నేరు

తిందుక - తుమ్మికి చెట్టు

యవాని - ఓమము (ద్రవ్యము, అంగడి దినుసు)

ప్లక్ష - జువ్వి

గణిక - అడవి మొల్ల, నెల్లి చెట్లు

పలాశ - మోదుగు

కసార - నీటి చెలమ

సప్తపర్ణి - ఏడాకుల అరటి లేదా పొన్న

కనేర - గన్నేరు

వ్యోష (వ్యోశ) - సొంటి, రావి, నల్లమిరపల మిశ్రమం

భోజపురి - జామ

లాజా - అక్షతలు

అగ్నిమంధ - శ్రీపర్ణం, నెల్లి

కుట్మల - మొగ్గ

కర్షఫలము - తాండ్ర

కృశర - నువ్వులు + అన్నం

శతపుష్పి - సదాపచెట్టు

ఉడద - గుఱ్ఱపు చిక్కుడు

ఉదుంబర - మేడిచెట్టు

పౌంసలా - చలివేంద్రం

శిగ్రు - మునగచెట్టు

అధివాసన - సుగంధ ద్రవ్యాలతో పూజ

అగురు - ఇరుగుడు చెట్టు

బలి, వస్తి - పొత్తి కడుపు

జీవనీయ - పాలకూర

ఖండహరం - తీపి పూలచెట్టు

శైలేయ - ఇందుప్పు, ఱపువ్వు చెట్టు

అపామార్గ - ఉత్తరేను మొక్క

లోధ్ర - లొద్దుగు చెట్టు

తగర - నందివర్ధనం

పాథస్సు - జలము, అన్నము

ప్రియంగు - ప్రేంకణపు చెట్టు

పర్పట, పర్ప- పాపట చెట్టు

సిందువార - వావిలి చెట్టు

ఛిన్న - తిప్పతీగ


Friday, 8 November 2024

శ్రీ గరుడ పురాణము (316)

 


ప్రత్యేకానుబంధం


(కొన్ని కఠిన పదాలకి అర్థాలు)


మాశ - మినుములు, ఒక కొలత

కాకమాచి - కాచి

రాజమాశ - అలసందెలు

వర్షభూ - గలిజేరు

కరక - కరక్కాయ, పుట్టగొడుగు

రాజిక - నల్లావాలు

త్రికుట - సొంటి+పిప్పలి+ మిరియాలు

చిత్రక - గుమ్మడి, ఆముదం

శిగ్రు - మునగచెట్టు

భృంగరాజ - గుంటగలిజేరు.

చవ్య - వస చెట్టు

వాసక -అడ్డసరము

చరణ - వేరు

శతావరి - పిల్లపీచర

తర్కారి - తక్కిలిచెట్టు

గుడూచి - తిప్పతీగ

కాశమర్దకం - గుగ్గిలం వంటిదే

కాకాదని - పెద్దమాచి

చణక - సెనగలు

మధుక - తిప్పతీగ

షష్టిక - అరవై దినాల్లో పండే ధాన్యం

పిప్పలి -రావి

గౌరషష్టిక - ఎఱ్ఱని షష్టికం

తిందుకం - తుమ్మికి

శ్యామక - చామ, గడ్డి

ప్రియాలం - మోరటి

ప్రియంగు - కొఱ్ఱలు, నల్లావాలు

రాజాదనం - మోదుగు, పాలచెట్టు

కర్కంధు - రేగు

లకుచం - గజనిమ్మ

పీనసం - పడిశం

కపిత్థం - వెలగ

వంక్షణ - గజ్జ

కేశ(స) ర - పొన్న, పొగడ

విసర్పరోగ - దురదలు

మాతులుంగ - మాదీఫలం

విషూచి(క) - కలరా

హరీతకి - కరకచెట్టు

విరసతా - రసహీనత

త్రిపుట - బంగిచెట్టు

ఆంత్రకూజనం- ప్రేగు కూత

వాస్తుక - ఒకదినుసు కూరాకు

తంద్ర - కునికిపాటు

ఏరండ - ఆముదపు చెట్టు

బృహతి - వాకుడు, ములక

పునర్నవ - గోరు, గలిజేరు

నీలి - నల్లగోరింట

నిర్గుండకి - వావిలి చెట్టు

మండూర - ఇనుపచిట్టెము, దానితో చేసిన సింధూరము

Monday, 4 November 2024

శ్రీ గరుడ పురాణము (315)

 


తరువాత సుగ్రీవ, అంజనాసుత, అంగద, లక్ష్మణాది పరివార సమేతంగా శ్రీరాముడు సాగరతీరాన్ని చేరుకొని నలుని ద్వారా సముద్రంపై సేతువును నిర్మించి ఆవలి ఒడ్డును చేరుకొని అక్కడి సువేల పర్వతం పై విడిది చేసి అక్కడినుండి లంకాపురాన్ని వీక్షించాడు. విభీషణుడు రాముని శరణుజొచ్చాడు.


తరువాత నీల, అంగద, నలాది ముఖ్య వానరులతో, ధూమ్రాక్ష, వీరేంద్ర, ఋక్షపతి జాంబవంతాది ముఖ్య వీరులతో, సుగ్రీవ, ఆంజనేయాది వర పరాక్రములతో కలసి రామలక్ష్మణులు లంకా సైన్యమును సర్వనాశనం చేయసాగారు. విశాల శరీరులై నల్లని పెనుగొండలవల నున్న ఎందరో రాక్షసులు వీరి చేతిలో మట్టి కరిపించారు. దేవతలనే గడగడ వణకించిన, బలవీరపరాక్రమ సాహస సంపన్నులైన విద్యుజ్జిహ్వ, ధూమ్రాక్ష, దేవాంతక, నరాంతక, మహోదర, మహాపార్శ్వ, మహాబల, అతికాయ, కుంభ, నికుంభ, మత్త, మకరాక్ష, అకంపన, ప్రహస్త, ఉన్మత్త, కుంభకర్ణ, మేఘనాథులతో కూడిన మొత్తం రావణ పరివారాన్ని కారణజన్ములైన రామలక్ష్మణులు తమ దివ్య శస్త్రాస్త్ర విద్యా నైపుణి మీరగా యమపురికి పంపించారు.


చివరగా శ్రీరాముడు ద్వంద్వయుద్ధంలో లోకకంటకుడైన రావణుని సంహరించాడు. తరువాత సీత పాతివ్రత్యాన్ని అగ్నిదేవుని సాక్షిగా లోకానికి నిరూపించి పుష్పక విమానంపై అయోధ్యకు మరలివచ్చి పట్టాభిరాముడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డలను వలె చూసుకున్నాడు. పది అశ్వమేధయాగాలు చేసి, గయతీర్థంలో పితరులకు తర్పణాలిచ్చి బ్రాహ్మణులను విభిన్న ప్రకారాల దానాలిచ్చి దేవతలను, పితరులను, ప్రజలను సంప్రీతులను చేస్తూ పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు.


ఏకాదశ సహస్రాణి

రామో రాజ్యమ కారయత్ |


(ఆచార ... 143/50)


రామునికి తగిన పత్నిగా కొన్నిచోట్ల ఆయనకన్న గొప్ప శీల స్వభావాన్ని కనబఱచిన మహాదేవిగా సీత ఈనాటికీ పతివ్రతా తిలకంగా లోకులచేత పూజలందుకుంటోంది.


భరతుడు శైలూష నామకుడు, లోక కంటకుడునైన గంధర్వుని సంహరించాడు. శత్రుఘ్నుడు లవణాసురుని చంపి ప్రజలను కాపాడాడు.


తరువాత ఈ నలుగురు సోదరులూ అగస్త్యాది మునుల తపోవనాలకుపోయి వారిని తృప్తిగా సేవించుకొని వారి ద్వారా ధర్మాలనూ, రాక్షస చరిత్రలనూ తెలుసుకొని, తమ వారసులను కూడా తమంత వారినిగా చేసి అవతారం చాలించారు. (అధ్యాయం - 143)

Sunday, 3 November 2024

శ్రీ గరుడ పురాణము (314)

 


రామలక్ష్మణులు వెనుకకు వచ్చేసరికి పర్ణశాల శూన్యంగా వుంది. అత్యంత దుఃఖితుడై కూడా రాముడు కర్తవ్యాన్ని మరువలేదు. సీతాన్వేషణలో పడ్డాడు. రావణుని జాడలను, నేలపై బడినంత మేర, వెతుకుతూ పోగా వానిచే నేలకూల్చబడిన జటాయువు కొన వూపిరి మీద వుండి కనిపించాడు. అతడు సీత నెవరో దానవుడపహరించి దక్షిణదిశ వైపు సాగిపోయాడని చెప్పి శ్రీరాముని చేతుల్లోనే మరణించాడు. రాముడు తనకు పితృ సమానుడైన జటాయువుకి అంత్యక్రియలు గావించి దక్షిణదిశవైపు సీతను వెతుకుతూ వెళ్ళాడు. దారిలో ఆయనకి సుగ్రీవునితో సంధి కుదిరింది. వాలిని చంపి సుగ్రీవుని రాజును చేశాడు. వానలకాలం రావడంతో ఆ కాలమంతా ఋష్యమూకంపైనే గడిపాడు.


వానలు కడముట్టగానే సుగ్రీవుడు పర్వతాకారులైన అంతే ఉత్సాహం కూడా కలవారైన తన వానరయోధులను సీతను వెదకుటకై నలుదిశలకూ పంపించాడు. దక్షిణ దిశవైపు అంగదుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు మున్నగు మహాయోధులు వెళ్ళారు. చివరికి సాగరతీరాన్ని చేరి ఆశలన్నీ ఆవిరైపోయాయనీ తాము వెనుకకు మరలి శ్రీరాముని మరింత బాధించుట కన్నా జటాయువు వలె ఆయన కార్య సాధనలో మరణించుటే మేలని నిరాశాపూరిత వాక్కులను వెలార్చుచుండగా జటాయువు సోదరుడైన సంపాతి వీరి మాటలను విని బాధలను గని విషయం కనుగొని సీత జాడను తెలిపాడు. కడలికి ఆవల గల లంకలో సీత రావణుని చెఱలో వున్నదని చెప్పాడు.


కపి శ్రేష్ఠుడైన వీరాంజనేయుడు వెంటనే లంఘించి శతయోజన విస్తృతి గల సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో వున్న సీతను దర్శించాడు. స్వయంగా రావణుడే వచ్చి ఆమెపై తనకు గల అవ్యాజ ప్రేమను ప్రకటించడం, ముల్లోకాలకే సమ్రాజ్ఞిని చేస్తానని ప్రలోభపెట్టడం, తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తానని భయపెట్టడం చూశాడు. సీత దేనికీ లొంగక స్థిరంగా తాను రాముని తప్ప మరొక పురుషుని వరించనని చెప్పడం, అంతటి లంకేశ్వరునీ గడ్డిపోచకన్న హీనంగా చూసి మాట్లాడడం కూడా చూశాడు. ఈ విశ్వంలోనే సీతను మించిన పరమపతివ్రత లేదని గ్రహించాడు.


నోటికి వచ్చిన దెల్ల పలికి రావణుడు పోయిన వెనుక అశోకవనంలో శోక సంతప్తయై నిలచిన సీతను ఆంజనేయుడు మెల్లగా సమీపించి శ్రీరామస్తుతిని గానం చేసి ఆమె కాస్త కుదుటపడగానే శ్రీరాముని వ్రేలి ఉంగరాన్ని ఆమె కిచ్చి తాను రామదూతనని విన్నవించుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి ఆమె ప్రసాదించిన చూడామణిని గైకొని బయలుదేరాడు.


సీత నిలచిన ప్రాంతాన్ని మాత్రం క్షేమంగా వుంచి మిగతా అశోక వనాన్నంతటినీ ధ్వంసం చేయసాగాడు. రావణుని సైనికులు తనను పట్టబోతే రావణపుత్రుడు అక్షకుమారునితో సహా కొన్ని వేల మందిని సంహరించిన ఆంజనేయుడు ఇంద్రజిత్ బిరుదాంకితుడైన మేఘనాథుని బ్రహ్మాస్త్రానికి మాత్రం కట్టుబడ్డాడు. (అదీ బ్రహ్మదేవుని కిచ్చిన మాటను నిలబెట్టుకొనుటకే) రావణుని కొలువులో ఏమాత్రమూ భయపడకుండా అతనికెదురుగా నిలచి సీతమ్మను సాదరంగా గొనిపోయి రామయ్య కర్పించి ఆయన శరణుజొచ్చుమని హితవు చెప్పాడు. రావణుడా వేదము వంటి వాక్యమును పాటింపకపోగా పరమ కుపితుడై ఆంజనేయుని తోకకి నిప్పటించి చంపాలనుకున్నాడు. కాని మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామి ఆ వాలాగ్ని తోనే లంకకు నిప్పంటించి మరల జలధిని లంఘించి రాముని పాదాల కడ వాలిపోయాడు. (ఈ విధంగా శ్రీరామబంటు సీతను చూచి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడు) సీత చూడామణిని రామునికి సమర్పించాడు.

Saturday, 2 November 2024

శ్రీ గరుడ పురాణము (313)

 


భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మేనమామల రాజ్యానికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలోనే దశరథుడు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయ సంకల్పించాడు. (అనుబంధం -13లో చూడండి) కైక దీని కంగీకరింపకపోగా తనకాయన ఇచ్చిన వరాలను ఇపుడు కోరుకుంది. రాముని పదునాలుగేడులు అడవికి పంపమంది. భరతునికి పట్టాభిషేకం చేయమంది. దశరథుడు మాట తప్పలేక మ్రాన్పడిపోగా శ్రీరాముడు వచ్చి విషయం తెలుసుకుని తండ్రి పాదాలకు నమస్కరించి అడవులవైపు వెడలిపోగా మహాపతివ్రత సీత, జోడు విడని సైదోడు లక్ష్మణుడు ఆయన వెంట నంటి వెళ్ళారు. చిత్రకూటంలో ఉండసాగారు.


అయోధ్యలో శ్రీరామ వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు మరణించాడు. మేనమామ యుథాజిత్తు నింటినుండి మరలి వచ్చిన భరతుడు మిక్కిలిగా దుఃఖించి తన తల్లిని అభిశంసించి రాముని మరల్చుకొని రావడానికి అడవికి వెళ్ళాడు కాని రాముడు రాలేదు. అపుడు భరతుడు అన్నగారికి బదులు ఆయన పాదుకలను సింహాసనంపై పెట్టుకుని తాను కూడ వనవాసిలాగే జీవిస్తూ రాజ్యవ్యవహారాలను చక్కబెడుతూ అన్నగారి ఆగమనం కోసం ఎదురుచూస్తూ వుండిపోయాడు. అతడు అయోధ్యలో అడుగుపెట్టలేదు. నందిగ్రామంలోనే వుండిపోయాడు.


శ్రీరాముడు చిత్రకూటాన్ని వదిలి మున్యాశ్రమాలను దర్శించుకుంటూ అత్రి, సుతీక్ష, అగస్త్య మహర్షులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను గైకొని దండ కారణ్యంలో పర్ణశాలను నిర్మించుకుని నివసించసాగాడు. అక్కడికి నరభక్షకియైన శూర్పణఖయను రాక్షసి రాగా శ్రీరాముడామె ముక్కుచెవులను కోయించాడు. ఆమె గొల్లున యేడుస్తూ వెళ్ళి తన బంధువులైన ఖరదూషణ, త్రిశిరాది పదునాలుగు వేల మంది రాక్షసులను రెచ్చగొట్టి శ్రీరామునిపైకి ఉసికొల్పింది. వారంతా పెల్లున గొప్ప హడావుడి చేస్తూ ఆయనపై పడ్డారు. కాని రామబాగాగ్ని శిఖల్లో శలభాల్లాగ మాడి పోయారు. ఒక్కడూ మిగలలేదు. దాంతో శూర్పణఖ తన యన్నయు, లంకేశ్వరుడు నైన రావణాసురునికి తన బడ్డ పన్నములనూ, ఖరదూషణాదులను మృతినీ విలపిస్తూ వివరిస్తూనే సీత యొక్క అతిలోక సౌందర్యాన్ని కూడా వర్ణించి చెప్పింది. అతడొక పథకం ప్రకారం సీతాపహరణాని కొడిగట్టాడు. ముందుగా మాయలమారి మారీచుడు బంగారు లేడిగా మారి సీతనా కర్షించగా ఆమె కోరిక మేరకు శ్రీరాముడు దానిని పట్టి తెచ్చుటకు బయలుదేరాడు కాని కొంతసేపటికి ఓపిక నశించి దానిపై బాణప్రయోగం గావించగా ఆ దెబ్బ తగలగానే మారీచుడు రాముని గొంతుతో పరమబాధాకరంగా 'హా సీతా హా లక్ష్మణా' అని చావుకేక పెట్టిపోయాడు. సీత భయపడిపోయి లక్ష్మణుని పంపించగా అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరించి లంకకు గొనిపోయాడు. దారిలో దశరథ మిత్రుడైన జటాయువు అడ్డుపడగా అతనిని నేలకూల్చాడు.