Sunday, 28 April 2024

శ్రీ గరుడ పురాణము (162)

 


ఏ దోషమూ లేకుండా, ఇరవై బియ్యపుగింజల బరువుండే వజ్రం మిగతా వజ్రాల కంటె రెట్టింపు ధర పలుకుతుందని మణిశాస్త్ర పండితులంటారు. పరిమాణం, మూడోవంతు, సగభాగం, నాలుగోవంతు, పదమూడవ వంతు, ముప్పదవ, అరువడవ, సూరవ, వెయ్యవ వంతున్న వజ్రాలు అలాగే పైన చెప్పిన వజ్రం కంటే అధిక భారమున్న వజ్రాలు కూడా వుంటాయి. వాటి విలువ వాటి బరువును బట్టే వుంటుంది. ఇక్కడ బియ్యపుగింజ కూడా ప్రత్యేకమైనది వుంటుంది. దాని బరువు ఎనిమిది ఎఱ్ఱ ఆవగింజల బరువుతో సమానమై వుండాలి.


ఏ దోషమూ లేని వజ్రాన్ని నీటిలో వేస్తే మునగదు, పైగా ఈతకొడుతున్నట్లుగా తేలుతూ అడుతుంది. అది రత్నాలన్నిటిలో సర్వశ్రేష్టము. దానిని ధరించుట శుభకరము.


దోషాలు దొరుకుతున్న కొద్దీ దానికి విలువ తగ్గిపోతుంటుంది. వాటిని కొని ధరించడం వల్ల నష్టం జరగవచ్చు. కొన్ని వజ్రాలు కాలక్రమాన దోషయుక్తాలవుతాయి. రాజు వాటిని వెంటనే ధరించడం మానివేయాలి. ఇతరులు ధరించవచ్చని కాదు కానీ ఆ వజ్రానికున్న శక్తి తగ్గిపోతుంది. రాజు అలాంటి వాటిని పెట్టుకోవడం కొనసాగిస్తే రాజ్యానికి మంచిది కాదు.


పుత్రాపేక్షతో వజ్రాన్ని ధరించే స్త్రీ ఇతరుల వలె రత్న శాస్త్రపారంగతుని మాత్రమే కాక తనకు అలవాటైన జాతకరత్నను కూడా సంప్రదించి ఆ పని చేయాలి. దోషయుక్తమైన రత్నాలను ధరించుటే దోషము. ఇక దాని వలన మంచి జరగాలనుకోవడం మృగతృష్ణలో నీరు త్రాగాలనుకోవడమే. వజ్రాల విషయంలో మోసం జరిగే అవకాశాలెక్కువ కాబట్టి కూలంకష పరీక్ష మిక్కిలిగా అవసరమౌతుంది. నకిలీలు ఎక్కువ మెరుపును కలిగి వుంటాయి. కాని ఆ మెరుపు ఎంతో కాలముండదు కాని అప్పటికే ఆలస్యమైపోయి జరగవలసిన కీడు జరిగిపోతుంది.


క్షారద్రవ్యం ద్వారా, శాస్త్రోల్లేఖిత పద్ధతుల ద్వారా, శాణ ప్రయోగంతో వజ్రాలను పరీక్షించాలి. ఈ భూమిపై నున్న అన్ని రత్నాలపై లోహాది ఇతర ధాతువులపై వజ్రం గీత పెట్టగలదు. కాని వజ్రంపై గీతను పెట్టడం దేనికీ సాధ్యం కాదు, ఒక్క వజ్రానికి తప్ప.


No comments:

Post a Comment