Saturday 27 April 2024

శ్రీ గరుడ పురాణము (161)

 


వర్ణసాంకర్యం రత్నాల విషయంలో కూడా మంచిది కాదు. పైగా దుఃఖదాయిని. రంగును చూసి అంతమాత్రాననే తృప్తిపడిపోయి రత్న సంచయాన్ని చేయరాదు. అంటే అటగా ఇంటికి తెచ్చేసుకోకూడదు. ఎందుకంటే దోషయుక్త రత్నాలు ఇంటికి హానిని చేస్తాయి. మంచి గుణాలున్న రత్నాలైతేనే ఇంటికీ అందులోని వ్యక్తుల వంటికీ ఆరోగ్యాన్నీ ధనాన్నీ తేగలవు. వజ్రాన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడా పగులుగాని, కొమ్ముల వద్ద విరుగుగానీ, బీటలుగాని లేకుండా వుంటేనే తేవాలనే ఆలోచన పెట్టుకొని తదుపరి గుణాలను పరీక్షించాలి.


కోణాలు సూదిగా మొనదేలినట్లుండాలి, అగ్గిలో పుటం పెట్టి అప్పుడే తీసినట్లే ఎప్పుడు చూసినా వుండాలి, మరకలుండకూడదు. ఒకవైపు గాని, మొనల్లో గాని దెబ్బతిని పోయి, పొడిరాలుతున్న వజ్రాన్ని ధరిస్తే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడైనా సరే శీఘ్రం మృత్యువు నోట పడిపోతాడు. మధ్యలో బిందు చిహ్నాలు, నీటి చుక్కల వంటి ఆకారాలు కనబడే వజ్రాన్ని ధరిస్తే ఇంద్రుడంతటి వాడైనా దరిద్రుడైపోతాడు.


ఖానిక అనగా గని నుండి వచ్చిన షట్కోణ, అష్టకోణ, ద్వాదశకోణ, షట్పార్శ్వ, పార్శ్వ, ద్వాదశపార్య, షడ్ధారా, అష్టధారా, ద్వాదశధారా, ఉత్తుంగ, సమ, తీక్ష్ణాగ్ర- వంటి గుణాలు వజ్రాల సహణగుణాలు.


షట్కోణ, విశుద్ధ, నిర్మల, తీక్ష ధారగల, లఘు, సుందర పాఠ్య భాగములున్న నిర్దోష (నిర్దుష్ట)మైన ఇంద్రుని వజ్రాయుధ లక్షణాలున్న వజ్రమొకటి అంతరిక్షంలో నున్నదని, అది సర్వోత్కృష్టమని దానిని భూమిపైకి తేవడం కష్టసాధ్యమని విద్వాంసులు చెబుతుంటారు.


తీక్ష, నిర్మల, దోష శూన్య వజ్రాన్ని ధరించేవాడు తన జీవనపర్యంతమూ ప్రతిదినమూ స్త్రీతో భోగించగలడు; సంపద, పుత్ర, ధన-ధాన్య, పశుసంపదలు నిత్యం వృద్ధి చెందుతుండగా బహుకాలం సుఖంగా జీవిస్తారు. వానిపై ఎవరైనా సర్ప, విష, వ్యాధి, అగ్ని, జల, తస్కరాది ఆయుధాలను పంపినా, అభిచారమంత్రోచ్చాటనాది ప్రయోగాలను చేసినా అవి వానిని చూసి దూరం నుండే పారిపోతాయి. వానినేమీ చేయలేవు. కొన్ని ప్రత్యాగమితాలై పోతాయి. అంటే ప్రయోగించిన వాని పని పడతాయి.


No comments:

Post a Comment