Tuesday, 2 July 2024

శ్రీ గరుడ పురాణము (223)

 


ఇక విద్యార్థులు, గురువులు, బ్రాహ్మణాది ద్విజులు సంఘంలో పాటించవలసిన నియమాలను చూద్దాం. దేవతామూర్తి, ఋత్విజుడు, స్నాతకుడు, ఆచార్యుల, రాజుల, పరస్త్రీల నీడలు, రక్తం, మూత్రాది విసర్జకాలు దారిలో వున్నపుడు దాటుకొనిపోరాదు. ఆగిగాని, పక్కకి తొలగిగాని వెళ్ళాలి. మంచి పేరుగల బ్రాహ్మణుని, రాజుని, సర్పాన్ని అవమానించకూడదు. అలాగే తనను తాను అవమానించుకోరాదు. విసర్జనాలను, ఇతరులు కాళ్ళుకడుక్కున్న నీళ్ళను దూరంనుండే చూసి తప్పుకోవాలి.


శ్రుతులలో, స్మృతులలో బోధింపబడిన సదాచారాన్ని పూర్తిగా పాటించాలి. ఒకరి రహస్యాన్ని బట్టబయలు చేసి వారిని బాధించరాదు. ఎవరినీ నిందించుటగాని కొట్టుటకాని దోషము. పుత్రునీ శిష్యునీ అవసరం మేరకు దండించవచ్చు. స్వధర్మాచరణ విషయంలో ఎటువంటి వెసులుబాటు కోసమూ చూడరాదు. దాన్ని తప్పనిసరిగా పూర్తిగా చేయవలసినదే. ధర్మ విరుద్ధమైన పనులను చేయరాదు. గృహస్థు తన తల్లిదండ్రులతో, అతిథితో, ధనికులతో వాదించరాదు.


నది, సెలయేరు, పుష్కరిణి, చెఱువులలో స్నానం చేయాలి. ఇతరుల సరోవరంలో స్నానంచేయడానికి ముందు అనుమతిని పొంది, అయిదు మట్టి ముద్దలను బయటికి తీసి ఒడ్డున పెట్టి వెళ్ళాలి.


ఇతరుల శయ్యపై పడుకొనరాదు. దేశం ఆపదలో నున్నపుడు మనం మాత్రం ప్రసన్నం గా భోంచెయ్యరాదు. ఏదో తినాలి కాబట్టి తినాలి.


కృపణుడు, బందీ, దొంగ, అగ్నిహోత్రం చెయ్యని బాపడు, వెదురుతో పని చేయువాడు, న్యాయస్థానంలో నేరం ఋజువైనవాడు (దోషిగా నిరూపింపబడినవాడు), వడ్డీ వ్యాపారి, వేశ్య, సామూహిక దీక్షలనిచ్చేవాడు, చికిత్సకుడు, రోగి, క్రోధి, నపుంసకుడు, నటన - నాట్యాల ద్వారా వేదికలపై పొట్టపోసుకొనే వాడు, ఉగ్రుడు, నిర్దయుడు, పతితుడు, డాబులు కొట్టేవాడు, శాస్త్రవిక్రేత, స్త్రీ వశుడు, గ్రామంలో దేవతలకు శాంతి పూజలు చేయించేవాడు, నిర్దయుడైన రాజు, అబద్ధాల కోరు, మద్యవిక్రేత, బంగారం పనివాడు, వంది వీరి యింటిభోజనమును చేయరాదు.


No comments:

Post a Comment