ఇదే క్రమంలో అన్నదానం కూడా ప్రతి గ్రహం పేరు పేరునా చేయాలి. తరువాత ప్రతి గ్రహం పేరుతో రకమంగా ధేనువు, శంఖం, ఎద్దు, బంగారం, బట్టలు, గుఱ్ఱం, నల్లావు, ఆయుధాలు, మేకలను దానంచేయాలి. గ్రహాలు శాంతించి అనుగ్రహిస్తే జాతకాలను మార్చగలవు. సిరులను కురిపించగలవు; రాజ్యాలనే ఇవ్వగలవు; రోగిని సంపూర్ణారోగ్యవంతునిగా చేయగలవు.
(అధ్యాయం 101)
వానప్రస్థ ధర్మ నిరూపణం
మునులారా! వానప్రస్థాశ్రమాన్ని వర్ణిస్తాను. అవధరించండి. వానప్రస్థాశ్రమంలో ప్రవేశించదలచుకొన్నవాడు తన భార్యను తీసుకొని వెళ్ళవచ్చు, లేదా, సమర్థుడైన కొడుకుపై ఆమె సంరక్షణ భారాన్ని మోపి వెళ్ళవచ్చు. అంతేగాని ఆమె సంగతి చూడకుండా వెళ్ళరాదు.
వానప్రస్థికి బ్రహ్మచర్యం విధాయకం. శృంగారానికి సంబంధించిన ఆలోచన కూడా మదిలో మెదలరాదు. శ్రౌతాగ్నినీ గృహాగ్నినీ తనతోబాటు వనంలోకి తీసుకుపోవాలి. ఎందుకంటే వనమంటే అడవి. అడవిలోకిపోయి ఆశ్రమాన్నీ ఆశ్రయాన్నీ ఏర్పాటు చేసుకొని శాంతంగా క్షమసహితంగా మనస్సునుంచుకొని అహర్నిశలూ దేవోపాసన చేస్తూ జీవించడాన్నే వానప్రస్థాశ్రమం అని వ్యవహరిస్తారు. అక్కడ దున్నని భూమి నుండి పుట్టిన అన్నం ద్వారా అగ్నిదేవునికీ, పితరులకూ, దేవతలకూ, అతిథులకూ, సేవకులకూ తృప్తి కలిగించాలి. ఆత్మజ్ఞాన తత్పరులైవుండాలి. శరీరానికి స్నానం అంగవస్త్రధారణ తప్ప ఏ సంస్కారమూ వుండరాదు. జటలూ, గడ్డమూ ఎంతగా పెరిగినా పట్టించుకోరాదు. ఇంద్రియ దమనం, త్రికాలస్నానం తప్పనిసరి. ఎవరి నుండీ ఎటువంటి దానాన్నీ స్వీకరింపరాదు. స్వాధ్యాయం, భగవద్ధ్యానం, లోకకల్యాణం- ఇవే వానప్రస్థికి నిత్యకృత్యాలు. తప్పనిసరైతే అన్నం కోసం మాత్రమే ధన సంపాదన చేయవచ్చు.
వ్రతాల ద్వారా ఆత్మశుద్ధిని గావించుకోవాలి. వారానికొకమారు, తరువాత పక్షంలో నొకమారు, ఆపై మాసాంతమందే భోజనం చేసే వ్రతం పట్టాలి. చాంద్రాయణం చేస్తూ, భూమిపై శయనిస్తూ వీలైనన్ని ధార్మిక కృత్యాలను (అన్నంతో కాకుండా) ఫలాలతో సంకల్పించి నెరవేర్చాలి. గ్రీష్మర్తువు (గ్రీష్మఋతువు) లో కూడా పంచ- అగ్ని మధ్యంలో (నాలుగు దిక్కులా అగ్నిని రగిల్చి సూర్యుని అయిదవ అగ్నిగా భావిస్తారు. ఈ పంచాగ్నుల మధ్యమే పంచ-అగ్ని మధ్యం). వర్షాలు పడుతున్నా, మంచు కురుస్తున్నా అరుగుపైనే పడుకోగలగాలి. హేమంతరువులో తడిబట్టలు కట్టుకొని, జపం, యోగాభ్యాసం చేయాలి.
పడకమీద తుమ్మముళ్ళు పఱచిన వానిపై క్రోధంగాని, పాదముల క్రింద ఎఱ్ఱ ముఖమలు తివాచీ పఱచిన వానిపై ప్రసన్నతగాని, సర్వాంగాలనూ చందన చర్చతో నెఱపిన వానిపై ప్రేమగాని కలుగరాదు. అప్పుడే అతడు / ఆమె శుద్ధవానప్రస్థి అయినట్లు భావించవచ్చు. సుఖదుఃఖాల కతీతులై సర్వసంగపరిత్యాగులై భగవంతుని వైపు చేసే ప్రయాణంలో చివరిదానికి ముందలి మజిలీ వానప్రస్థం. (అధ్యాయం - 102)
No comments:
Post a Comment