Friday, 19 July 2024

శ్రీ గరుడ పురాణము (239)

 


మునులారా! ఇక వీటికి ప్రాయశ్చిత్తాలను వినండి.


తెలియక బ్రహ్మహత్యచేసినవాడు ఒక కపాలాన్ని చేత బట్టుకొని మరొక కపాలాన్ని కర్రకు గుచ్చి ధ్వజాన్ని వలె మోస్తూ భిక్షాటన చేస్తూ యమ నియమాలు పాటిస్తూ పన్నెండేళ్ళపాటు తిరుగుతునే వుండాలి. తెలిసి చేసినవాడు (బ్రహ్మ హత్యయని) లోమభ్యః స్వాహా ఇత్యాది మంత్రాలతో తన శరీరాంగాలకు ప్రతీకలుగా విభిన్న శాస్త్ర విహిత ద్రవ్యాలను అగ్నికి ఆహుతి చేసి చివరగా తన శరీరాన్ని కూడా నిర్దిష్ట విధానం ద్వారా అగ్నికి ఆహుతి చేయాలి. బ్రాహ్మణుని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అర్పించినా కూడా బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి కలుగుతుంది. ఇవే కాకుండా ప్రాణత్యాగమక్కరలేని ప్రాయశ్చిత్తాలున్నాయి. అవి ఇంచు మించు ప్రాణం పోయడమంత కష్టం.


అత్యధికంగా కష్టపెడుతున్న, దుస్సహమైన, బహుకాల వ్యాపితమైన రోగంతో గాని అంతకన్న ప్రాణములనార్పివేసేటంత భయంవల్ల గాని చెప్పలేనంత బాధపడుతున్న బ్రాహ్మణుని గాని గోవుని గాని, చేరదీసి ఆదరించి సేవచేసి సంరక్షణ చూసి, సంపూర్ణారోగ్యవంతులను గావించినచో కూడా బ్రహ్మ హత్యాపాతకం పోతుంది.


బ్రాహ్మణుల కడుపున పుట్టాడన్న మాటే గాని ఏ గుణమూ వీడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి వీలులేకుండా వున్న వానిని పొరపాటున చంపినా కూడా అది బ్రహ్మ హత్యే అవుతుంది దానికి ప్రాయశ్చిత్తం ఇది :


అడవిలోనికి పోయి మంత్రాలతో ఐతరేయ బ్రాహ్మణాది అంగాలతో సహా వేదాన్ని పూర్తిగా మూడుమార్లు పారాయణ చేయాలి లేదా వేదవిద్యకై తన జీవితాన్ని ధారపోస్తూ తన ధనాన్నంతటినీ యోగ్య పాత్రులకు సమర్పించి వేయాలి. సోమయాగం చేసిన లేదా చేస్తున్న క్షత్రియుని గానీ వైశ్యునిగానీ చంపినా బ్రహ్మ హత్యకు విధింపబడిన ప్రాయశ్చిత్తాన్నే చేసుకోవాలి.

No comments:

Post a Comment