కొన్ని పాపాలకు శాస్త్రంలో ప్రాయశ్చిత్తాలు చెప్పబడలేదు. అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వల్ల నశిస్తాయి. ఏదో పాప ప్రక్షాళన కోసం కాకుండా, పుణ్యుడు మరింత పుణ్య సముపార్జన కోసం చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే వాని పుణ్యము పండి దేహాంతంలో చంద్రలోకాన్ని చేరుకుంటాడు. అలాగే ప్రాయశ్చిత్తం కోసం కాకుండా పుణ్యం కోసం కృచ్ఛవ్రతం చేసేవాడు గొప్ప ఐశ్వర్యవంతుడౌతాడు. (అధ్యాయం - 105)
అశౌచం, ఆపద్వృత్తి
మునులారా! ఇపుడు మృత్యువు ఆవరించాక మనిషికి కలిగే మరణశౌచాన్ని వర్ణిస్తాను వినండి.
రెండేళ్ళలోపు వయసున్న బాలకుడు మృతి చెందితే వానిని పాతిపెట్టాలి. జలాంజలి నీయకూడదు. ఈ పాతిపెట్టవలసిన చోటు నగరానికైనా గ్రామానికైనా వెలుపలవుండాలి. శ్మశానం కారాదు. శవాన్ని గంధ, మాల్య, అనులేపనాదులతో బాగా అలంకరించాలి. (మనుస్మృతి 5/68,69). రెండేళ్ళు దాటి, ఉపనయనమయ్యేలోగా మరణించిన బాలకుని బంధుగణమంతా కలసి శ్మశానానికి గొనిపోయి లౌకికాగ్నితో, యమసూక్త, పారాయణ చేస్తూ చితిపై దహనం చేయాలి.
వడుగై, మరణించిన బాలునికి అన్ని క్రియలనూ ఆహితాగ్నితో సమానంగా చేయాలి. మరణతిథికి ఏడవ లేదా పదవరోజున ముందుగా, అతని వర్ణంలో గోత్రంలో నుండు పరిజనులు (సమాన గోత్ర, సమాన పిండ, సమానోదక జనులు) అపనః శోశుచదఘం అనే ఋగ్వేద (1/97/1-8) మంత్రాలతో దక్షిణం వైపు తిరిగి యథాసంభవంగా అంటే వీలైనంతగా ఇంటికి దూరంగా నున్న జలాశయానికి పోయి జలాంజలులివ్వాలి. ఇలాగే మాతామహునికీ ఆచార్యపత్నికీ ఇతరులకు కూడా ఇవ్వాలి. ఉపనయనమైనాక మరణించిన వానికి కూడా సంపూర్ణకర్మకాండను నడిపించాలి.
మిత్రుడు, వివాహితస్త్రీ (సోదరి మొదలైనవారు) వదిన, మామగారు, ఋత్విక్కు మరణించినపుడాయా ఆత్మల అభ్యున్నతికై జలాంజలులిస్తూ పేరునీ గోత్రాన్ని చెప్పి ఒకేసారి జలాంజలి నివ్వాలి. ఈ జలాంజలులనే ధర్మోదకాలని కూడా అంటారు) పాఖండులూ, పతితులూ పోయినపుడు ధర్మోదకాల తంతువుండదు. బ్రహ్మచారి (ఆశ్రమంలో వుండి పోయిన యువసన్యాసి) వ్రాత్యుడు, వ్యభిచారిణియగు స్త్రీకి కూడా ధర్మోదకాలివ్వరు. తాగుబోతుకీ ఆత్మహత్య చేసుకున్నవారికీ కూడా అశౌచముంటుంది కాబట్టి వారు జలాంజలులకర్హులు కారు.
వ్యక్తి మరణించినపుడు పెద్దపెట్టున ధ్వనులు చేస్తూ రోదించడం నిషిద్ధం. జీవుల స్థితి అనిత్యమనే జ్ఞానం కనీసం అప్పుడైనా వుండాలి. యథాశక్తిగా శ్మశానానికి గొనిపోయి దహనక్రియను గావించి స్వజనులంతా ఆ వ్యక్తి ఇంటికి రావాలి. ద్వారంలో ప్రవేశిస్తూనే వేపాకును నమలి, ఆచమనం చేసి అగ్ని, జలం, పేడ, తెల్ల ఆవాలు ఈ నాల్గింటినీ ముట్టుకొని రాతిపై పాదాలను ఒక్క క్షణం వుంచి అప్పుడు నెమ్మదిగా ఇంటిలోనికి రావాలి. ఎవరి ప్రేతాన్ని ముట్టుకొని శ్మశానం కెళ్ళకుండా ఇంటికి వచ్చినా ఇంటిలోకి ప్రవేశిస్తూ ఈ విహిత కర్మనంతటినీ ఆచరించాలి. దహనం పూర్తయ్యేదాకా గానీ దహనక్రియకు గానీ మరుభూమిలోవుండి వచ్చిన సపిండులు అక్కడే స్నానం చేసి ప్రాణాయామం చేస్తే శుద్దులవుతారు. పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. (ప్రేతానుగమనమే పుణ్యము).
No comments:
Post a Comment