Wednesday, 24 July 2024

శ్రీ గరుడ పురాణము (244)

 


మద్యపానం తెలియక చేసి తెలిశాక పశ్చాత్తాపము నొందినవాడు జలమధ్యంలో నిలబడి రుద్రదేవ మంత్రాన్ని జపిస్తూ మూడు రోజులు ఉపవాసంతో గడిపి ఆ మరునాడు గుమ్మిడి ముక్కలను (కుష్మాండీబుచా) నేతిలోముంచి అగ్నికి ఆహుతులనిస్తే ఆత్మశుద్ధి కలుగుతుంది. గురుపత్నీగమనం చేసిన పాపి ఇలాగే చేస్తూ రుద్రదేవమంత్రానికి బదులు సహస్ర శీర్షా... మంత్రాన్ని జపించాలి.


మిగిలిన పాపాలకు నూరుమార్లు ప్రాణాయామం చేయడం లేదా త్రైకాలిక సంధ్యో పాసన, బ్రాహ్మణునిచే పదకొండాహుతులనిప్పించి రుద్రానువాకములు జపించుట మున్నగునవి ప్రాయశ్చిత్త విధానాలు. బ్రహ్మహత్య తప్ప మిగతా పాపాలన్నీ వాయుభక్షణం మాత్రమే చేస్తూ దినమంతా సూర్యరశ్మి పడే చోట జలంలోవుండి రాత్రంతా కూడా అక్కడే వుండి వేయిమార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే నశిస్తాయి.


వేదాభ్యాసం చేసే శాంతి పరాయణుడైన పంచయజ్ఞానుష్ఠాత నుండి పాపమే దూరంగా పారిపోతుంది. యమ నియమాలున్న వానికి పాపపుటాలోచనలే రావు. బ్రహ్మచర్యం, దయ, క్షమ, భగవద్ధ్యానం, సత్యం, నిష్కాపట్యం, అహింస, అస్తేయం, మాధుర్యం దమం అనే పదీ యమములు. స్నానం, మౌనం, ఉపవాసం, యజ్ఞం, స్వాధ్యాయము, ఇంద్రియనిగ్రహం, తపస్సు, అక్రోధం, గురుభక్తి, పవిత్రత- ఈ పదీ నియమాలు. (మౌనం అంటే శాశ్వతంగా మూగబోవడమని కాదు; కొంతకాలం పాటు కొన్ని వ్రతాలలో 

భాగంగా మాట్లాడకుండా వుండడం).


ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మయం పంచగవ్యాలు. వీటిని కుశోదకంతో కలిపి దానినే అన్నానికి బదులు తినడం కృచ్ఛవ్రతమవుతుంది. ఒకరోజంతా దీనిని మాత్రమే స్వీకరించి మరునాడు పగలంతా ఉపవాసముండి రెండవరోజు రాత్రంతా పంచగవ్యాలనే స్వీకరిస్తూ వుంటే దానిని కృచ్ఛసాంతపన వ్రతమంటారు.


తొలిరోజు ఆవుపాలు, మరునాడు ఆవు పెరుగు, మూడవనాడు ఆవునెయ్యి, నాల్గవదినం గో మూత్రం, ఐదవ రోజు గోమయం, ఆరో రోజు కుశోదకం మాత్రమే స్వీకరించి ఏడవరోజు ఏమీ తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తే ఈ మొత్తమంతా కలిపి పరమ పవిత్రమైన 'మహాసాంతపన' వ్రతమనబడుతుంది.


No comments:

Post a Comment