Saturday, 13 July 2024

శ్రీ గరుడ పురాణము (233)

 


రెండవ కలశాన్ని ఈ క్రింది మంత్రయుక్త శ్లోకాన్ని పఠిస్తూ ఆ వ్యక్తి తలపై వంచి అభిషేకించాలి.


భగంతే వరుణోరాజా భగం సూర్యో బృహస్పతిః ॥

భగమింద్రశ్చవాయుశ్చ భగం సప్తర్షయో దదుః | ( ఆచార 100 / 7,8)


మూడవ కలశలోని నీటితో వ్యక్తిని అభిషేకిస్తూ ఈ మంత్ర పూత శ్లోకాన్ని చదవాలి.


యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్ధని ॥

లలాటే కర్ణయోరక్ష్ణో రాపస్తద్రఘ్నంతు తే సదా ॥ ( ఆచార 100 / 8,9)


నీ సర్వాంగాలనూ పట్టిన దరిద్రం నేటితో ఈ నీటి పవిత్రత వల్ల కడుక్కుపోవాలి గాక అని ఈ శ్లోకభావం.


అనంతరం నాల్గవ కుండలోని నీటిని పోస్తూ పై మూడు శ్లోకాలనూ పఠించాలి. ఎడమ చేతిలో కుశదర్భలను తీసుకొని, బ్రాహ్మణుడు, ఆ వ్యక్తి యొక్క తలను స్పృశిస్తూ మేడి కర్రనుండి చేసిన స్రువ (చెంచాలాటిదేకాని కర్రచివరి గోయి వుంటుంది. యజ్ఞాలలో వాడతారు) తో ఆవనూనెను కుడి చేతితో తీసుకొని అగ్నిలో ఆహుతులను సమర్పించాలి.


ఈ ఆహుతులను ఈ క్రింది మంత్రాలు చదువుతూ వేయాలి.


మితాయస్వాహా, సమ్మితాయ స్వాహా, శాలాయ స్వాహా, కటంకటాయ స్వాహా, కూష్మాండాయ స్వాహా, రాజపుత్రాయ స్వాహా*


(*యాజ్ఞవల్క్యమితాక్షర గ.ప్ర. అధ్యాయంలో 285వ శ్లోకంలో మాత్రం పై మంత్రాలలో 'స్వాహా' కు ముందు ప్రయుక్తమైన నామాలన్నీ వినాయకునివే అని చెప్పబడింది.)


తరువాత లౌకిక అగ్నిలో గిన్నెలో, బియ్యంతో, అన్నాన్ని వండి చరు (హోమగుండంలో వండినలేదా వేసెడి అన్నం) ని తయారు చేసి దానిని ఇంతకు ముందు చెప్పబడిన ఆరు స్వాహా మంత్రాలతో ఆ లౌకికాగ్నిలోనే హవనం చేసి మిగిలిన దానిని ఇంద్రాగ్నియమాది దేవతలకు బలుల కింద సమర్పించాలి. ఆపై ఒక అరుగుపై దర్భలను పఱచి, దానిపై పుష్ప, గంధ, ఉండేరకమాల, పక్వాన్న, పాయసాలూ, నేయి కలిపిన పులావు, ముల్లంగి (ప్రత్యేకం) గడ్డి, అప్పాలు, పెరుగు, బెల్లంవుండలు, లడ్లు, చెఱకుముక్కలు ఈ ద్రవ్యాలన్నిటినీ చేర్చివుంచాలి.


వినాయక జననియైన దుర్గాదేవిని ప్రతిష్ఠించి చేతులు జోడించి నమస్కరించి, అర్ఘ్యమివ్వాలి. పుత్ర సంతానం కావలసిన స్త్రీ దూర్వా, సరసపుష్పాలతో భగవతి పార్వతీ దేవి నర్చించి స్వస్తివచనాలతో బాటు ఈ క్రింది ప్రార్థనా శ్లోకాన్ని చదవాలి.


రూపందేహియశోదేహి భగం భగవతి దేహి మే । 

పుత్రాందేహి శ్రియందేహి సర్వాన్ కామాంశ్చదేహి మే ॥ ( ఆచార 100 /16)


తరువాత బ్రాహ్మణులను భోజనాలతో తృప్తి పఱచాలి. గురువుగారికి రెండు వస్త్రాలనిచ్చి (అంటే గురు గ్రహానికి) అన్యగ్రహాలను పూజించి మరల ప్రత్యేకంగా సూర్యార్చన చేయాలి. ఈ విధంగా వినాయకునీ గ్రహాలనూ, పూజించిన వ్యక్తులు సర్వకార్యాల్లోనూ సాఫల్యము నందగలరు. ( అధ్యాయం - 100) 


No comments:

Post a Comment