Thursday, 18 July 2024

శ్రీ గరుడ పురాణము (238)

 


ప్రాయశ్చిత్తాలు - కృచ్ఛ, పరాక, చాంద్రాయణాది వ్రతాల స్వరూపాలు


విహితస్యాననుష్ఠానాన్నింది తస్యచసేవనాత్ |

అనిగ్రహాచ్చేంద్రియాణాం నరః పతన మృచ్ఛతి ॥


(ఆచార - 105/1)


చేయవలసిన పనులను చేయకపోవడం, చేయకూడని పనులను చేసేయడం, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం- ఈ మూడిటిలో ప్రతీది మానవుని అధోగతి పాల్చేసే శక్తిని కలిగి వుంటుంది. కాబట్టి ఆత్మశుద్ధికై ప్రతి ఒక్కరూ తాను తెలిసోతెలియకో చేసిన దుష్కర్మకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవలసిందే. అలా చేసుకున్న వారి అంతరాత్మా ప్రసన్నమవుతుంది. లోకం వారిని ప్రసన్నతాదృక్కులతో చూడడమూ జరుగుతుంది. ప్రాయశ్చిత్తం వల్ల పాపాలునశిస్తాయి. పశ్చాత్తాపం నరకాన్ని దూరం చేస్తుంది.


అలాకాకుండా 'నేను ప్రాయశ్చిత్తం చేసుకోను. నాకు పశ్చాత్తపింపవలసిన అగత్యం లేదు' అని మొండికేసిన వాని కోసం, ఇదిగో, ఈ క్రింద చెప్పబడిన నరకాలన్నీ సిద్ధంగా వుంటాయి.


మహారౌరవం, దాని కన్నను మహాభయంకరములైన తామిస్ర, లోహశంకు, పూతిగంధ, హంసాభ, లోహితోద, సంజీవన, నదీపథ, మహా నిలయ, కాకోల, అంధతామిస్ర, తాపన నరకాలే అవి.


బ్రాహ్మణ హంతకుడు, తాగుబోతు, బ్రాహ్మణుని బంగారాన్ని దొంగిలించినవాడు, గురుపత్నిని కామించినవాడు, వీరితో తిరిగేవారు ఈ మహాపాపులంతా అవీచి, కుంభీపాకమను పేరుగల నరకాలలో పడతారు. అవే అత్యంత భయంకర నరకాలు.


గురువునీ వేదాన్నీ నిందించడం కూడా బ్రహ్మహత్యతో సమానమైన పాతకమే. నిషిద్ధ పదార్థాలను తినుట, కుటిలతతో నిండిన ప్రవర్తన, రజస్వలయగు స్త్రీని పెదవులపై చుంబించుట, మద్యపానం ఒకే రకమైన పాపాలు. అశ్వ, రత్న, స్వర్ణ చౌర్యాలు సమానపాపాలు. మిత్రపత్ని, తనదికాని ఉత్తమ జాతి స్త్రీ, చండాలి, సోదరి, కోడలు వంటి స్త్రీలతో రమించుట కూడ గురుపత్నీ గమనంతో సమానమైన మహాపాపాలే. అలాగే పిన్ని, అత్త, ఆచార్యపుత్రి, ఆచార్యపత్నీ కూతురు వరుస స్త్రీలతోడి రమింపు కూడ గురుపత్నీ గమనంతో సమానమైన మహాపాతకాలే.


ఇలాంటి మహాపాపులకు ముందుగా లింగభేదనం చేసి కొంతకాలమాగి అప్పుడు వారిని వధించాలి. ఇటువంటి పాపంలో పాలు పంచుకుని ఇష్టపూర్వకంగా వ్యభిచరించిన స్త్రీని కూడ క్రమక్రమంగా వధించాలి.


గోహత్య, వ్రాత్యత (వడుగు చేసుకోక పోవడం) బ్రాహ్మణ స్వర్ణ లేదా తత్సమానద్రవ్యాపహరణ, అప్పునెగ్గొట్టుట, దేవపితృఋషి ఋణాలను తీర్చకుండుట, అధికారి అయివుండీ అగ్నికార్యం చేయకుండుట, అమ్మకూడని లవణాదులను అమ్ముకొనుట, పెద్దన్నకు పెళ్ళికాకుండానే తాను చేసుకొనుట, అధ్యయనాధ్యాపనములకు డబ్బును వాడుట, తమ్మునికి వివాహం చేసి తాను పెండ్లిని మానుకొనుట, పరస్త్రీ గమనము, చక్రవడ్డీలను గుంజుకొనుట, లవణం తయారీ, స్త్రీ వధ, శూద్రవధ, నిందితధనంతో జీవనం గడుపుట, నాస్తికత, వ్రతలోపం, కొడుకును అమ్ముకొనుట, మాతాపితలను పరిత్యజించుట, చెఱవులనూ తోటలనూ అమ్ముకొనుట, కన్యపై అపవాదు వేసి దూషించుట, తనకోసం మాత్రమే భోజనమును వండుకొనుట, మద్యపానం చేసే స్త్రీతో సంబంధం పెట్టుకొనుట, స్వాధ్యాయ, అగ్ని, పుత్ర బంధు ఈ నాల్గింటినీ పరిత్యజించుట, అసత్ శాస్త్రాలను చదువుట, భార్యనూ తననూ అమ్ముకొనుట - ఇవన్నీ ఉపపాతకాలు.


No comments:

Post a Comment