Saturday 27 July 2024

శ్రీ గరుడ పురాణము (247)

 


ఆ రోజు భోజనం మానకూడదు గానీ వారు పెట్టినదేతినాలి. అడగకూడదు. పరిజనులంతా విడివిడిగా మూడు రాత్రులు నేలపైనే శయనించాలి. పిండయజ్ఞానంతరం మృతవ్యక్తినుద్దేశించి విహిత పిండదాన ప్రక్రియానుసారము దంజెమునపసవ్యం చేసుకొని మూడు రోజుల దాకా పిండరూప అన్నాన్ని మౌనంగా భూమిపై పెడుతుండాలి. శ్రాద్ధం పెట్టే అధికారమున్న వ్యక్తి నీలాకాశం క్రింద నిలబడి ఒక శిక్య మట్టి పాత్రతో నీటినీ మరొక మట్టిపాత్రతో పాలనీ ఆ ప్రేతాత్మకు సమర్పించాలి. ఆ సమయానికి ఆ అధికారికి ఏదైనా అశౌచంవుంటే దానిని శ్రౌతాగ్నిలో స్మార్తాగ్నిలో చేసే నిత్యకర్మ (అగ్నిహోత్రం, దర్శ పూర్ణ మాసం, విహిత స్మార్తాగ్నిలో సాయం-ప్రాతః హోమం) అనుష్ఠానం ద్వారా శ్రుతిలో ఆజ్ఞాపింపబడిన పద్ధతి ద్వారా శుద్ధి చేసుకొని శ్రాద్ధకర్మను తప్పనిసరిగా చేయాలి. 


దంతములు మొలవకముందే పిల్లలు మరణిస్తే వారి బంధువులకు ఖననం జరిగిన వెంటనే శుద్ధి లభిస్తుంది. దంతాలు మొలిచాక పుట్టుజుత్తులు తీయించక ముందు మృతి చెందిన పిల్లల బంధువులకు ఒక రాత్రి, ఒక పగలు అశౌచముంటుంది. చూడాకరణమై ఉపనయనం కాక చనిపోయిన బాలల బంధువులకు మూడు రాత్రులు గడిచేదాకా అశౌచం వుంటుంది. ఉపనయనమైన తరువాత మృతి చెందిన వాని బంధువులలో సపిండకులకు పదిరాత్రుల దాకానూ సమానోదకులకు మూడు రాత్రుల దాకానూ అశౌచముంటుంది.


రెండు సంవత్సరాల వయసు రాకుండానే మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులకు పది రాత్రులు గడిచేదాకా అశౌచముంటుంది. పరివారంలో జననమో మృతియో జరిగినా ఈ పదిరాత్రుల మైల పట్టింపులో తేడా వుండదు.


సపిండులు మరణిస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు పది, పన్నెండు, పదిహేను, ముప్పది దినాల మైల వుంటుంది. పెండ్లికి, నిశ్చితార్థానికి ముందు చూడాకరణ తరువాత మృతి చెందిన కన్య బంధువులకు ఒక పగలు, ఒక రాత్రి గడిచాక శుద్ధి అవుతుంది. దంతాలు మొలిచేలోగానే మృతి చెందిన బాలకుని ఖననం బదులు అగ్ని సంస్కారం చేస్తే ఒక రోజు దాటగానే శుద్ధి జరిగిపోతుంది*.


*ఈ విషయం యాజ్ఞవల్క్య స్మృతి - మితాక్షర - 24వ శ్లోకంలో చెప్పబడింది.


No comments:

Post a Comment