దానధర్మమహిమ
ఋషులారా! దానధర్మం చాలా గొప్పది, అన్ని వర్ణాలలోకి అధ్యాయనాధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్గం గొప్పది, వారిలో సత్క్రియానిష్ఠుడు అనగా కర్మనిష్టగలవాడు శ్రేష్ఠుడు. వారిలో విద్య, తపస్సు గల బ్రహ్మతత్త్వ వేత్త వరిష్ఠుడు. దానమిచ్చువాడు సత్పాత్రుని కీయదలచుకున్నపుడు ఇది చూడాలి, భోజనం పెట్టడానికీ అన్నదానం చేసేటప్పుడూ, ఆకలీ, పేదరికమూ మాత్రమే కొలబద్దలు. అలా కాకుండా గృహాస్థైనవాడు గో, భూ, ధాన్య, ధన, సువర్ణాది దానాలు చేసేటపుడు సత్పాత్రునికే చేయాలి.
విద్యా, తపస్సూలేని బ్రాహ్మణుడు దానం పుచ్చుకోకూడదు. అపాత్రదానం వల్ల దాతా, ప్రతిగ్రహీతా కూడా అధోగతి పాలవుతారు. దానం అర్హులకు ప్రతిరోజూ చేయాలి. నిమిత్తకాలాల్లో - అనగా సూర్యచంద్రాదిగ్రహణాల వంటి ప్రత్యేక దినాల్లో విశిష్ట దానాలను చెయ్యాలి. యాచకులు వస్తే ఎవరికి తగిన దానాన్ని వారికి చేయాలి. విశిష్టమైన గోదానాన్ని చేసినపుడు మాత్రం దాని కొమ్ములకు బంగారు బొడిపెలనూ గిట్టలకు వెండి చుట్లనూ అలంకరించి ఒక కాంస్యపాత్రతో సహా ఇవ్వాలి. కొమ్ములకుండే బంగారం పది సౌవర్ణికాలు (నూటయెనిమిది మాశలు) గిట్టలకు పెట్టే వెండి ఏడు పళంలు వుండాలి.
గోదానాన్ని దూడతో సహా చేయాలి. ఆ దూడనీ అలంకరించాలి. ఆవు రోగరహితమై వత్స సహితమై వుండాలి. దూడ దొరకకపోతే బంగారంతో కాని పిప్పల కఱ్ఱతో గాని చేసిన కొయ్యదూడనీయవలెను. ఇలా దానం చేసిన వానికి ఆవు లేదా దూడపై ఎన్ని రోమాలున్నవో అన్నేళ్ళు స్వర్గ సుఖములు సంప్రాప్తమౌతాయి. అదే కపిల గోవైతే దాత యొక్క ఏడు తరాలు ఉద్దరింపబడతాయి.
గర్భము నుండి దూడ బయల్వెడలుతున్నప్పటి ఆవును పృథ్వీ సమానముగా పూజిస్తారు. స్వర్ణంతో గోదానం చేసే స్తోమతులేనివారు పాలిచ్చే ధేనువును గానీ గర్భముతోనున్న ధేనువును గాని దానం చేసినా స్వర్గ ప్రాప్తి వుంటుంది.
అలసిన మనిషికి ఆసనాదికములను దానమిచ్చి అలసటను దూరం చేయడం, రోగికి సేవచేయడం, దేవపూజనం, బ్రాహ్మణుని పాదాలను కడగడం, ఆయన వాడే జాగానూ, వస్తువులనూ శుభ్రం చేయడం - ఇవన్నీ గోదానాన్ని శాస్త్రోక్తంగా చేసిన దానికి సమానమైన ఫలాన్నిస్తాయి. అలాగే బ్రాహ్మణుడు మిక్కిలిగా ఇష్టపడే వస్తువులను దానం చేసిన వానికి స్వర్గ ప్రాప్తి వుంటుంది.
No comments:
Post a Comment