పలాశ, గూలర, కమల, బిల్వ పత్రాలలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క దాన్ని నీటిలో వేసి ఉడికించి ఆ రోజంతా ఆ నీటినే త్రాగాలి. అలా నాలుగు రోజులు నాలుగాకుల నీరు తరువాత అయిదవ రోజున కుశోదకం మాత్రం త్రాగాలి. అంటే ఈ అయిదు రోజులూ ఇంకేదీ తినకుండా తాగకుండా కృశించాలి. ఈ వ్రతాన్ని పర్ణకృచ్ఛవ్రతమంటారు. తొలిరోజు వేడి ఆవుపాలనూ, మలిరోజు వేడి నేతినీ, మూడవరోజు వేడినీటినీ మాత్రమే ప్రాశ్నచేసి (అనగా నోట్లో వేసుకొని) నాలుగవ రోజు పూర్తిగా ఉపవాసముండి పోవాలి. ఈ వ్రతాన్ని మహాతప్తకృచ్ఛవ్రతమంటారు. ఈ కృచ్ఛవ్రతాలు పరమశుద్ధికరాలు, పవిత్రాలు.
కృచ్ఛవ్రతాలలో మరొకటి పాదకృచ్ఛవ్రతం. మొదటి రోజు ఏకభుక్తం (మధ్యాహ్నం పన్నెండుకి భోజనంచేసి మరేమీ తీనకుండా రాత్రి శయనించడం) రెండవ రోజు నక్తవ్రతం (అనగా రోజంతా ఏమీ తినకుండా రాత్రి మాత్రం భోంచేయడం) మూడవ రోజు అయాచితం (ఎవరినీ యాచించకుండా ఇంట్లో వండుకోకుండా ఎవరైనా వచ్చి పెడితే, అదీ ఒకపూట తినడం) నాలుగవ రోజు కటిక ఉపవాసం. ఇదంతా కలిపి పాదకృచ్ఛవ్రతం అవుతుంది. ఇదే వ్రతాన్ని ఒకే నెలలో మూడుమార్లు చేస్తే దానిని ప్రాజాపత్యవ్రతమంటారు. ఈ వ్రతంలో కూడా భోజనం చేయునపుడు ఒకమారు చేతినిండా పట్టు అన్నాన్ని మాత్రమే రోజంతటిలో తిని నాలుగు రోజులుండగలిగితే దానిని అతికృచ్ఛవ్రతమంటారు. పన్నెండు రోజులు పూర్ణ ఉపవాసం చేయడాన్ని పరాకవ్రతమంటారు. ఇరవై ఒక్క రోజుల పాటు నీరు లేదా పాలు మాత్రమే తీసుకొని అతి కృచ్ఛవ్రతపాలనం చేయడాన్ని కృచ్ఛాతి కృచ్ఛవ్రతమని వ్యవహరిస్తారు.
ఆరు రోజుల కృచ్ఛవ్రతమొకటుంది. నూనెను బాగా పిండి చేసిన పిమ్మట మిగిలిన నూల పిప్పిని తొలిరోజూ, గంజిని రెండవరోజూ, మజ్జిగను మాత్రమే మూడవదినమూ, కేవలం జలాన్ని నాలుగవనాడూ పేలపిండిని అయిదవరోజూ ఆహారంగా స్వీకరించి ఆరవరోజు కటిక ఉపవాసం చేయడాన్ని సౌమ్యకృచ్ఛవ్రతమంటారు. ఈ వ్రతాన్నే కొంచెం అతిశయింపజేసి ఒకరోజు తినే పదార్థాన్ని మూడు రోజులపాటు తింటూ మొత్తం పదిహేను రోజులు చేసి పదహారవనాడు పూర్ణోపవాసం చేస్తే దాన్ని తులాపురుష (సంజ్ఞక) కృచ్ఛవ్రతమంటారు.
చాంద్రాయణ వ్రతమనగా చంద్రుని కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్యనాడు ఒక నెమలిగుడ్డంత అన్నాన్ని తిని రోజుకొక గుడ్డు ప్రమాణాన్ని పెంచుకుంటూ పూర్ణిమనాడు సంపూర్ణ భోజనం చేసి, మరునాటి నుండి అదే కొలతలో తగ్గించుకుంటూ పోయి అమావాస్యనాడు మరల నెమలిగుడ్డంత ద్రవ్యాన్నే తిని చేసే వ్రతానికి చాంద్రాయణ వ్రతమని పేరు. మొత్తం నెలలో రెండు వందల నలభై గ్రాసాల హవిష్యాన్నమును పైన చెప్పిన క్రమంలో తిని వుండి పోవడానికి విశేష వ్రతమని పేరు. పైన చెప్పిన వ్రతాలను అనుష్టిస్తున్న అన్ని రోజుల్లోనూ ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలీన స్నానాలు చేసి పవిత్ర సంజ్ఞక విశేషమంత్రాలను జపిస్తూ గ్రాస పరిమాణంలో అన్నం తినడానికి ముందు ప్రతి గ్రాసాన్నీ గాయత్రితో అభిమంత్రితం చేస్తూ ఒక విధమైన నిరాసక్త, ఆధ్యాత్మిక, ప్రశాంత జీవనాన్ని గడపాలి.
No comments:
Post a Comment