Tuesday, 9 July 2024

శ్రీ గరుడ పురాణము (230)

 


పృథివీ తేపాత్రం.... అనే మంత్రంతో పాత్రలను అభిమంత్రితం చేసి ఇదం విష్ణుః ... అనే మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ మరింత శ్రద్ధగా గౌరవంగా బ్రాహ్మణుని బొటన వ్రేలి నందుకొని పితరులకుద్దేశింపబడిన అన్నంలో దానిని పెట్టాలి. గాయత్రి మంత్రాన్నీ మధువాతా.... అనే మంత్రాన్ని పఠిస్తూ మధ్యలో ఆపి బ్రాహ్మణులను భోజనానికి కూర్చుని మౌనంగా భోంచేయమని ప్రార్థించి మరల ఆ మంత్రాలనే చదువుతుండాలి. మరల బ్రాహ్మణులను మొగమాటపడవద్దని ప్రార్థించాలి. క్రోధాది మనోవికారాలను మనసులోకి రానీకుండా ప్రశాంతమనస్కుడై శ్రద్ధనిండిన గుండెతో వారికి వడ్డిస్తూ తొందరపెట్టకుండా, మంత్రాన్ని జపిస్తూ ఓపికగా భోజనాలు పెట్టాలి. హవిష్యాన్నము (హోమగుండంలో వండబడిన అన్నం) ను వారికి సమర్పించి వారు తృప్తిగా భోజనం చేసే దాకా పురుష సూక్తాన్నీ, పవమాన సూక్తాదులనూ జపిస్తుండాలి. వారు తృప్తిగా భుజించాక మరల మధువాతా... మంత్రాన్ని పఠించాలి. 'మేము తృప్తిగా సుష్టుగా భోంచేశాము' అని వారి చేత అనిపించుకొని వారు భుజించగా మిగిలిన అన్నాన్ని దక్షిణం వైపు తీసుకుపోయి తిలలను అందులో వేసి బ్రాహ్మణులు అన్నంతిన్న పాత్రలనూ వాటి ప్రక్కనే భక్తి మీరగా తెచ్చి ఆదరంగా వుంచాలి. ఎందుకంటే ఆ క్షణంలో వారు మనవూరి సామాన్య మానవులు కారు; పితృలోకం నుండి దిగివచ్చిన మన తండ్రులూ, తాతలూనూ. వారికి వేరువేరుగా ప్రక్షాళన జలాల నిచ్చి వెంటనే తుండుగుడ్డలను కూడా భక్తిగా ఇవ్వాలి.


ఉచ్ఛిష్టానికి సమీపంలోనే పితరాదులకూ మాతా మహాదులకూ పిండ ప్రదానం చేయాలి. తరువాత బ్రాహ్మణులను ఆచమనం చేయవలసిందిగా ప్రార్థించాలి. తరువాత బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను చదువగా శ్రాద్ధకర్త అక్షయమస్తు అంటూ బ్రాహ్మణుల చేతులలో నీరుపోసి తన సామర్థ్యానికి తగినట్లుగా దక్షిణలిచ్చి స్వధాంవాచయిష్యే అనాలి. వాచ్యతాం అంటూ వారు అనుమతి నివ్వాలి. అపుడు శ్రాద్దకర్త తన పితృదేవతలనుద్దేశించి స్వధా అనువాక్యాన్ని పలుకగా పితృదేవతల ప్రతిరూపమైన బ్రాహ్మణులు కూడా అదే వాక్యం ద్వారా అతనిని దీవిస్తారు. అప్పుడు శ్రాద్ధకర్త నీటిని భూమిపై వదలాలి. తరువాత విశ్వేదేవాః ప్రియంతాం అంటూ మరికొంత నీటిని వదిలి పితృదేవతలను ఇలా ప్రార్థించాలి.


దాతారో నో భి వర్ధంతాం వేదాః సంతతిరేవ చ ॥

శ్రద్ధా చనోమా వ్యగమద్ బహుదేయంచనో స్త్వితి | (ఆచార 99 / 26,27)


తరువాత వాజే వాజే.... అనే మంత్రాన్నుచ్ఛరిస్తూ శ్రాద్ధకర్త ప్రసన్నంగా పితరులను యథాక్రమంలో విసర్జించాలి. మొదట్లో బోర్లించి పెట్టిన, సంస్రవజలాలుండిన పాత్రను సరిచేసి చేత బట్టుకొని బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేసి వారిని వీడ్కొల్పాలి. వారితో బాటు కొంత దూరం నడచి వెళ్ళి సాదరంగా సాగనంపాలి. తరువాత శ్రాద్ధ కర్మలో మిగిలిన భోజనాన్ని స్వీకరించి ఆ రాత్రి బ్రహ్మ చర్యాన్నవలంబించాలి.


వివాహాది శుభకార్యాలు చేసేటపుడు పితరులకు నందీ ముఖశ్రాద్ధాన్ని పెట్టాలి. వారికి పెరుగు, బదరీ ఫలం, యవమిశ్రిత అన్నంలతో పిండదానం చేయాలి.


ఏకోద్దిష్టశ్రాద్ధం (ఎవరో ఒకే ఒక వ్యక్తి నుద్దేశించి పెట్టేది) విశ్వేదేవరహితం, ఏకాన్న, ఏక పవిత్రకయుక్తం అయివుంటే చాలు. ఈ శ్రాద్ధానికి ఆవాహనం, అగ్నైకరణం కూడా అవసరంలేదు. జంధ్యాన్ని అపసవ్యం చేస్తే చాలు. బ్రాహ్మణులను పవిత్ర భూమిపై ఉపతిష్ఠతాం అంటూ కూర్చోమని ప్రార్థించాలి. అలాగే అభిరమ్యతాం అంటూ విసర్జన చేయాలి. బ్రాహ్మణులు అభిరతాః స్మ అనే వచనాన్ని చెప్పాలి.


No comments:

Post a Comment