భూమి, దీపం, అన్నం, వస్త్రాలు, నెయ్యి, వీటిని దానం చేసిన వానికి లక్ష్మి ప్రాప్తిస్తుంది. ఇల్లు, ధాన్యం, గొడుగు, మాల, వాహనం, నెయ్యి, నీరు, శయ్య, కుంకుమ, చందనాదులను దానమిచ్చినవారు స్వర్గలోకంలో ప్రతిష్ఠితులౌతారు.
సత్పాత్రునికి విద్యాదానమొనర్చిన వానికి దేవ దుర్లభమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. వేదార్థాన్నీ, యజ్ఞాల విభిన్న విధులనూ సంపాదితం చేసి, శాస్త్రాలనూ విభిన్న ధర్మశాస్త్రాలనూ తరువాతి తరం వారికోసం కొంత మూల్యాన్ని స్వీకరించియైనా సరే, వ్రాసిన వానికి బ్రహ్మలోక ప్రాప్తి ఫలంగా వస్తుంది. ఈ ప్రపంచానికి మూలం వేద, శాస్త్రాలే. అందుకే భగవంతుడు ముందుగా వాటినే సృజించాడు. కాబట్టి ఎంతగట్టి ప్రయత్నాలు చేసైనా వేదాల తాత్పర్యాన్ని తరువాతి తరాల వారి కందించాలి. ఇతిహాస పురాణాలను కూడా ఇలాగే వ్రాసివుంచిన వారికి, దానం చేసినవారికి బ్రహ్మదానానికి సమానమైన పుణ్యానికి రెండింతల పుణ్యం లభిస్తుంది.
నాస్తికుల వచనాలూ, కుతర్కాలూ ద్విజుడైన వాడు వినరాదు. ఎందుకంటే ఒకనిని అధోగతి పాలుజేయడానికా శబ్దమే చాలు.
దానం పుచ్చుకొనే అర్హత, అవకాశం వుండీ కూడా తమ వద్ద పుష్కలంగా వున్న దానిని వేరొకరికి ఇప్పించిన వారికీ, తమ వద్దలేకపోయినా ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికిప్పించిన వారికీ దాతకు లభించినంత పుణ్యమే లభిస్తుంది.
కులత, పతితులు, నపుంసకులు, శత్రువులు దానమిచ్చినా స్వీకరించరాదు. పెద్దగా సచ్చరిత్రులు కానివారు కుశ, శాక, దుగ్ధ, గంధ, జలాది సామాన్య వస్తువులను అడగకుండానే ఇచ్చినా పుచ్చుకోవచ్చును. తల్లిదండ్రులను పోషించడానికై గాని దేవతలను అతిథులను పూజించుటకు గాని, తనకు ప్రాణం మీదికి వచ్చినపుడు గాని పతితులు కుత్సితులు కానివారెవరు దానమిచ్చినా స్వీకరించవచ్చును; అదీ అవసరం మేరకే.
(అధ్యాయం - 98)
No comments:
Post a Comment