ఇక అనధ్యయన సందర్భాలను అనగా ఎట్టి సందర్భాలలో వేదాలనూ శాస్త్రాదులనూ చదువుకోకూడదో చర్చిద్దాం.
వేదం చదువుకోవడాన్ని ధర్మశాస్త్రాలు చెప్పుకోవడాన్ని శ్రవణ నక్షత్రయుక్త శ్రావణ పూర్ణిమనాడు గాని హస్త నక్షత్రయుక్త పంచమి నాడుగాని లేదా పుష్యమాసంలో రోహిణీ నక్షత్రం వున్నరోజున గానీ గ్రామానికి వెలుపల జలాశయ సమీపాన గృహ్యసూత్రాను సారం ప్రారంభించాలి. ('యాజ్ఞవల్క్యమితాక్షర, ఆచారాధ్యాయం, 146)
శిష్య, ఋత్విజ, గురు, బంధు బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆ క్షణం నుండి మూడురోజుల పాటు అనధ్యయనమే. అలాగే స్వశాఖ శ్రోత్రియ బ్రాహ్మణుడు మరణించినా మూడురోజుల పాటు చదవకూడదు. సంధ్యా సమయంలో ఉరుములు వినబడినపుడు, ఆకాశంలో మెరుపులు కనబడినపుడు, భూకంప, ఉల్కాపాత సమయాలలోనూ అధ్యయనాన్ని ఆపివేయాలి. వేద, ఆరణ్యక అధ్యయన సమాప్తి జరిగిన తరువాత పూర్తిగా ఒక పగలూ ఒక రాత్రి సెలవిచ్చెయ్యాలి.
అష్టమి, చతుర్దశి, అమావాస్య, పున్నం, చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధులలో పాడ్యమి, శ్రాద్ధ భోజనాలు - ఈ వేళల్లో చదువుకి సెలవు... పూర్తిగా ఒక రోజు. అయితే ఏకోద్దిష్ట శ్రాద్ధానికి భోజనం లేదా ప్రతిగ్రహ సమయాల్లో మూడురాత్రులు గడిచేదాకా అనధ్యయనాన్ని పాటించాలి.
ఉత్సవాలకీ, శక్రధ్వజందిగినపుడూ, ఏడుపులూ పెడబొబ్బలూ దగ్గర్లోనే వినబడు తున్నపుడూ, శవం లేచినపుడూ తాత్కాలిక అనధ్యయనముంటుంది. అపవిత్ర దేశంలో, అపవిత్రావస్థలో, మాటిమాటికీ నింగి మెరుస్తుంటేనూ, మధ్యాహ్నం పన్నెండు గంటలలోపల పలుమార్లు ఉరుములు వినబడినపుడూ జలమధ్యంలో, అర్ధరాత్రి వేదశాస్త్రాలను చదువరాదు. ఎవరైనా విశిష్టవ్యక్తి వచ్చినప్పుడు అధ్యయనాన్ని ఆపాలి.
పరుగెడుతూ కానీ మద్యం వాసనవస్తున్న వ్యక్తి పక్కనే వున్నపుడుగానీ, గాడిద, ఒంటె, గుఱ్ఱం, నౌక,చెట్టు, పర్వతంమున్నగు వానిపై కూర్చున్నపుడుగానీ ప్రయాణిస్తున్నపుడు గానీ, దొంగలు రాజులు గ్రామానికి ఉపద్రవాన్ని తెచ్చినపుడు గానీ వేదశాస్త్రాలను చదువరాదు.
No comments:
Post a Comment