Tuesday 26 February 2013

అడ్డంకులైనా ఎదురుకుని లక్ష్యాన్ని చేధించండి

ఆరంభశూరత్వానికీ, సంకల్పాన్ని సడలించుకోవటానికీ సంబంధించిన నీతికధల్లోని చక్కని ఉదాహరణను స్వామి వివేకానంద ఈ విధంగా గుర్తుచేస్తారు.

" అడవిలో ఉండే ఒక దుప్పి, తన పిల్లదుప్పిని తీసుకుని ఓ చెరువు వద్దకు వెళుతుంది. అందులో తన ప్రతిబింబాన్ని బిడ్డకు చూపిస్తూ, 'చూశావా! నా శరీరం ఎంత బలిష్ఠంగా ఉందో, నా తల బలంగా, కాళ్ళూ ఎంత దృఢంగా ఉన్నాయో గమనిస్తున్నావా? నేనెంత దైర్యవంతురాలనో తెలుసా!' అంటూ ప్రగల్భాలు పలకసాగింది. ఇంతలో దూరాన ఒక కుక్క అరుపు వినిపించింది. అప్పటివరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న దుప్పి, ఒక్కసారిగా కాళ్ళకు పనిచెప్పింది; పరుగు లంఘించుకుంది. చాలా సేపటికి రొప్పుతూ తిరిగి యధాస్థానానికి వచ్చింది. పిల్లదుప్పి అంతా ఆశ్చర్యంగా ఉంది; వెంటనే 'ఎంతో శక్తి ఉందన్నావు! మరి కుక్క అరుపు వినగానే ఎందుకలా పరిగెత్తావు?' అంది. అప్పుడు ఆ పెద్దదుప్పి 'నిజమే! నాకు చాలా శక్తి ఉంది. కానీ ఆ శునకం అరుపు వినపడటంతోనే నా దైర్యం సడలిపోతుందీ అని అసలు విషయం బయటపెట్టింది.

ఈ ఉదాహరణ చెబుతూ స్వామి వివేకానంద 'మనమూ అంతే! లక్ష్యాలను సాధించాలని తీర్మానాలు చేసుకుంటాము. కానీ చిన్న ప్రతికూలతలనే కుక్క అరుపులు వినగానే, దుప్పిలాగ భయపడి లక్ష్యం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు ఎన్ని సంకల్పాలు పెట్టుకుని, ఎన్ని తీర్మానాలు చేసుకుని ఏ లాభం' అని ప్రశ్నిస్తారు.

లక్ష్యం చేరవరకు నిద్రించకండి. ఎన్ని అడ్డంకులైనా ఎదురుకుని లక్ష్యాన్ని చేధించండి.

సేకరణ - శ్రీ రామకృష్ణ ప్రభ 

No comments:

Post a Comment