Monday 4 August 2014

గౌరీ గణేశుడు ప్రకృతి ప్రేమికుడు

ఓం గం గణపతయే నమః

వినాయకుడు ప్రకృతి ప్రేమికుడు. అందుకు సంబంధించిన కధ ఒకటుంది.

బాలవినాయకుడు మహాగడుగ్గాయి, బోలెడు అల్లరి చేస్తాడు. ఒకప్పుడు వినాయకుడు ఆడుకోవడానికి కైలాస పర్వతాల్లో ఉన్న అడవిలోకి వెళ్ళగా, పిల్లి కనిపించింది. కాసేపు ఆ పిల్లిని ఏడిపిద్దామనుకున్న గణపతి, దాని మీదకు బాణాలు సంధించాడు. అది బయపడి ఒక చెటు వెనుక దాక్కునగా, దాన్ని పట్టుకుని, చాలాసమయం ఆడుకున్నాడు, పిల్లి తోక పట్టుకుని గిరగిరా తిప్పాడు, మట్టిలో పొర్లించాడు. ఆట ముగిసాకా, ఇంటికి తిరిగివచ్చేసరికి పార్వతి దేవి శరీరమంతా మట్టి, దుమ్ము, ధూళి కనిపించింది. చేతులు, కాళ్ళ మీద ఎవరో గోర్లతో గీసినట్టుగా బాగా గీరుకుపోయింది. వినాయకుడికి అమ్మ అంటే మహా ఇష్టం. అందువల్ల ఏమైందమ్మా అని అడిగాడు. అంతా నువ్వే చేశావ్ కన్నా అన్నారు. నేనా!? నేనేం చేయలేదమ్మా! అన్నాడు గణపయ్య. అప్పుడు పార్వతీ దేవి గణపతిని ఎత్తుకుని, "బంగారు! అన్ని జీవుల యందు అంతర్లీనంగా నేనే  ఉన్నాను. ప్రకృతి మొత్తం వ్యాపించి ఉన్నాను. నా శరీరమే భూమి. అంతటా నేనే ఉన్నాను. నువ్వు ఎప్పుడు దేన్ని బాధించినా, నన్ను బాధించినట్టే రా. నువ్వు ఆడుకున్న పిల్లిలో కూడా నేనే ఉన్నాను. నువ్వు దానికి పెట్టిన ఇబ్బంది వల్ల నాకు ఇలా అయ్యింది" అన్నది. క్షమించమ్మా! ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు గణపతి.అప్పుడు వినాయకుడికి అన్ని దిశలయందు పార్వతీ దేవి దర్శనమిచ్చింది. కాబట్టి తన పూజకు ప్రత్యేకంగా ఒక దిక్కు కూడా అవసరం లేదని సెలవిచ్చాడట గణపతి.

ఈ కధను నుంచి మన గమనించవలసినది 'ఎవరు ప్రకృతిని ప్రేమిస్తారో, పర్యావరణాన్ని రక్షిస్తారో, వారిని దీవిస్తాడు విఘ్ననాయకుడు'. వినాయకపూజ ప్రకృతికి (పార్వతీ దేవి) హాని కలిగిచని రీతలో, వినాయకుడికి నచ్చే రీతిలో, గణపతి మెచ్చే రీతిలో జరుపుకోవాలి. భూమి/మట్టి శివస్వరూపం. ప్రకృతి పార్వతీ స్వరూపం. మట్టితో చేసిన గణపతిని పూజించడమే శ్రేష్టం. అందుకే గణపతి సంకటహర చవితి పూజకు తదియతో కూడిన చవితే చాలా శ్రేష్టం అని చెప్తారు. తదియ అంటే పార్వతీ దేవి/ గౌరీమాత. చవితి అంటే గణపతి. గౌరీగణేశుడికి ప్రతీక సంకటహర చవితి. అలాగే మట్టి గణపతి కూడా గౌరీగణపతికి ప్రతీక.

వినాయకచవితికి మట్టిగణపతులనే పూజించండి. మనం ప్రకృతిని పేమిస్తే, గణపతి మనల్ని ప్రేమిస్తాడు. మనం ప్రకృతిని రక్షిస్తే, గణపతి మనల్ని రక్షిస్తాడు.         

No comments:

Post a Comment