Sunday 24 August 2014

నియమాలు పాటించండి

ఓం గం గణపతయే నమః

కలౌ కపి వినాయకౌ, కలౌ చండి వినాయకౌ - కలియుగంలో త్వరగా ప్రసన్నమయ్యే దేవతా మూర్తులలో గణపతి మొదటివాడు.  అటువంటు గణపతిని విశేషంగా పూజించే ఈ గణేశ నవరాత్రులలో పాల్గొనే భక్తులు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి, కొన్ని నియమాలు పాటించండి.

ఎంత పెద్ద విగ్రహం నిలబెట్టామన్నది కాదు, ఎంత భక్తితో చేశామన్నది ముఖ్యం. ఈ రోజున చాలామంది తమ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం, తమ దర్పాన్ని ప్రదర్శించడం కోసం, ఇతరులకు పోటిగానూ, అందరు చేస్తున్నారు కనుక మనం కూడా చేయాలి, ఇలా చేయడం ఒక ఫ్యాషన్ అనే భావనతో గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. ఇలా చేసేవారు ఎంత పెద్ద విగ్రహం ప్రతిష్టించినా అది వ్యర్ధమే అని గ్రహించాలి. విగ్రహం సైజు ప్రధానం కాదు, ఎంతో భక్తితో చేశామన్నది ప్రధానం. చందా ఇచ్చినంతే తీసుకోండి. అధికంగా ఇమ్మని బలవంతం చేయకండి.


మనముందున్న విగ్రహంలో గణపతి ఉన్నాడు అన్నది నిజం. అసలు అక్కడ గణపతి ఉన్నాడన్న భావన లేకపోవడం వలననే కొంతమంది వినాయక మండపం దగ్గర మందుతాగుతారు, పిచ్చి పిచ్చి సినిమాపాటలు పెడతారు, వచ్చేపోయే వాళ్ళని ఏడిపిస్తుంటారు. మనం పూజిస్తున్నది విగ్రహాన్ని కాదు, విగ్రహంలో ఉన్న గణనాధుడిని అన్న భావన మనకు కలగాలి. వినాయకుడి మండపంలో పిచ్చిపిచ్చి సినిమాపాటలు వద్దు, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లూ వద్దు. అర్దరాత్రులవరకు లౌడ్ స్పీకర్లు పెట్టకండి. విపరీతమైన పసిపిల్లలకు, ముసలివారికి, అనారోగ్యవంతులు ఇబ్బంది పడతారు.

భావన ప్రధానం. ఫలానిచ్చేది కేవలం కర్మ కాదు, దాని వెనుకనున్న భావన. ఏ భావనతో చేశామన్నదాన్ని అనుసరించే భగవంతుడు ఫలితానిస్తాడు.

గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గోనేవారు మద్యపానానికి, ధూమపానానికి (సిగిరెట్టు, బీడీ) మొదలైనవాటికి దూరంగా ఉండండి. అసభ్యపదజాలం వాడకండి, అవేశపడకండి, ఎవరిని దూషించకండి.

వినాయకచవితికి ఒక రోజు ముందు నుంచి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేరోజు వరకు మాంసాహారం వదిలిపెట్టండి. సాధ్యమైనంతవరకు ఉల్లిపాయలు, వెల్లిపాయలు (వెల్లుల్లి), మసాల వంటకాలకు, చిరుతిళ్ళు, ఫాస్ట్‌ఫుడ్లకు దూరంగా ఉండండి.

శారీరికంగానూ, మానసికంగానూ బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఈ ఉత్సవాలలో ప్రతి రోజు ఉదయమే నిద్రలేవండి. గణపతి నవరాత్రులలో మీకు వీలైనన్నిసార్లు గణపతి నామాన్ని స్మరించండి.

'ఓం గం గణపతయే నమః' అనేది గణపతి మహామంత్రం. దీనిని వీలైనన్నిమార్లు జపించండి.

ఎంతపెద్ద విగ్రహం ప్రతిష్టించాం, ఎన్ని నైవేధ్యాలు సమర్పినామన్నది కాదు, ఎంత వరకు గణపతికి శారీరికంగా, మానసికంగా సేవ చేశామన్నది ముఖ్యమని గ్రహించండి.

మనం పూజించే విగ్రహంలో గణపతిని చూడగలిగితే మళ్ళీ వచ్చే గణపతి చవితికి మన జీవితంలో బోలేడు మార్పు కనిపిస్తుంది. అలా కాక, అసలు అది ఒక బొమ్మగానే, పేరు కోసం, స్టైల్ కోసం, ఫ్యాషన్ కోసం పూజించేవారికి, అశాస్త్రీయమైన రూపాలను తయారుచేసి పూజించేవారికి జీవితంలో ఎన్నో గణపతి చవితిలు వస్తాయి, పోతాయి. కానీ గణపతి అనుగ్రహం కలుగుతుందన్నది మాత్రం అనుమానమే. నమ్మినవారికి నమ్మినంత.

ఓం గం గణపతయే నమః  

2 comments:

  1. 100% ఖచ్చితంగా సత్యం చెప్పారు.
    ఈరోజుల్లో యూత్ కి ఆదర్శంగా ఉండాల్సిన చాలా మంది పెద్దలకు కూడా ఈ విషయంలో అవగాహన లేదు.

    ReplyDelete