Saturday 8 February 2014

హిందూ ధర్మం - 13

1- ధృతిః : ఎంతటి ఆపద వచ్చినా, మానసిక స్థైర్యాన్ని, దైర్యాన్ని కోల్పోకపోవడం, ధృడ నిశ్చయం కలిగి ఉండడం ధృతిః. ప్రారంభించిన పనిని, ఎన్ని ఆపదలు, విఘ్నాలు వచ్చినా, తట్టుకుని, ఎదురించి, పోరాడి, పూర్తి చేయడం ధృతిః. నిత్యం సంతోషంగా ఉండడం, చావు తన్నుకు వస్తున్నా, ఆత్మవిశ్వాసం సడలకుండా, మృత్యువుకు సైతం ఎదురు నిలబడి పోరాటం చేయడం ధృతిః..

చిన్నప్పుడు భర్తృహరి సుభాషితాల్లో ఒక పద్యం చదివాం. గుర్తుందా?

ఆరంభించరు నీచమానవులు విఘ్నాయససంత్రస్తులై
యారభించి పరిత్యజింతురు విఘ్నాయాత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమాను లగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

ఏదైన ఒక పని మొదలుపెడితే, ఆపదలు, అడంకులు, కష్టాలు వస్తాయని భయపడి, అసలు చేయాల్సిన పనిని చేయకుండా తప్పించుకుంటారు కొందరు. వాళ్ళను నీచులు/అధములు అన్నాడు శతకకర్త. ఇక రెండవ రకంవారు, పని మొదలుపెట్టినా, ఆటంకాలు వచ్చాయని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు, ఇక మావల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు, వీరు మధ్యములు. మూడవ రకంవారు, కష్టాలే రానీ, కన్నీళ్ళే రానీ, వచ్చిన ప్రతి ఆటంకాన్ని తొలగించుకుంటూ, ప్రతి ఆపదను ఎదురుకుంటూ, ఎప్పుడో ఏదో వస్తుందని భయపడకుండా, దిగులు చెందకుండా, 'ధృతి'తో, ఉత్సాహం కలిగినవారై, పనిని పూర్తి చేస్తారు, వీళ్ళు ధీరులు అనగా బుద్ధిమంతులు. ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణం కూడా అదే అంటున్నది మనుస్మృతి. అందరూ కర్తవ్య నిర్వహణలో ధీరులు కావాలి. ధృతితో ఆఖరివరకు పోరాడి విజయం సాధించాలి. అదే ధర్మానికున్న మొదటి లక్షణం.

To be continued...................

No comments:

Post a Comment