Sunday 28 December 2014

హిందూ ధర్మం - 121 (బ్రాహ్మణాలు)

c. మంత్రాలు
యజ్ఞయాగాది క్రతువులలో, వైదిక కర్మలలో మంత్రం ప్రధానం. వైదికకర్మకు మంత్రం ఎంత ముఖ్యం, మంత్రం తగిన ఫలితం ఇవ్వడానికి చెప్పబడిన కర్మను అనుసరించడం కూడా అంతే ముఖ్యం. ఆ మంత్రాల గురించి, వాటిని ఎప్పుడు, ఎలా చదవాలో చెప్తుందీ భాగం.

एतद् वै यज्ञस्य रूपसमृद्धं यत् क्रियमाणं कर्म ऋग् अनुवदति।
మంత్రము, కర్మ రెండు ఒకేసారి, చెప్పబడినట్లుగానే జరగాలి. అప్పుడే ఫలితం వస్తుంది అని పై శ్లోకం అర్దం.

d.  నామధేయః - యజ్ఞయాగాది క్రతువుల యొక్క పేర్లను చెప్తుందీ భాగం. వివిధ రకాల యజ్ఞకర్మలను అనుసరించి 3 భాగాలుగా ఇది పునర్విభజించబడింది

1. కాలాన్ని అనుసరించి చేయబడు యజ్ఞకర్మలు
a. కొన్ని యాగాలు ఒకే రోజులో ముగుస్తాయి, వాటిని ఏకాహం అంటారు. ఆరు రోజులలో పూర్తయ్యేవాటిని షడాహాలు అని, పన్నెండు రోజులలో చేసేవాటిని ద్వాదశాహాలని అనాలి.
b. కొన్ని ప్రత్యేక తిధులలో చేస్తారు. ఉదాహరణకు దర్శపూర్ణమాసం ప్రతి పూర్ణిమ, అమావాస్యకు చేస్తారు.
c. కొన్ని యాగాలు 12 ఏళ్ళ పాటు చేస్తారు, వాటిని సత్రయాగం అంటారు

2. యాగంలో వేయబడు హవిస్సును అనుసరించి 3 రకాలా యాగాలు ఉంటాయి
a. హవిర్ యజ్ఞాలు - ఆవునెయ్యిని హవిస్సుగా వేసేవి - దర్శపూణ్నమాసాలు, అగ్నిహోత్రం మొదలైనవి
b. సోమ యజ్ఞాలు - సోమరసం (సోమలతలు ఆయుర్వేద మూలికల నుంచి సేకరించిన ఔషధగుణాలు కలిగిన రసం) తో చేసే యజ్ఞకర్మలు - అగ్నిష్టోమం, అతిరాత్రం, వాజపేయం
c. పాక యజ్ఞాలు - వండిన పదార్ధాలను హవిస్సుగా సమర్పిస్తూ చేసేవి - శ్రద్ధకర్మ, శ్రావణి, చైత్రి మొదలైనవి

3. అగ్నిహోత్రం, వైశ్వదేవం వంటివి రోజు చేయాలి, దర్శపూర్ణమాసలు, చైత్రి, శ్రావణి ప్రత్యేకమైన తిధులలో చేయబడేవి, కొన్ని యాగాలు ప్రత్యేకించి కోరికలు తీరడం కోసమే చేస్తారు - పుత్రకామేష్టి, అశ్వమేధం మొదలైనవి

To be continued ..................

No comments:

Post a Comment