Monday 29 December 2014

హిందూ ధర్మం - 122 (బ్రాహ్మణాలు)

బ్రాహ్మణాలు మంత్రాలకు, ఆయా కర్మలకు మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. అంతా సులువుగా అర్దమైనప్పుడు కొత్తగా వివరించే ప్రయత్నం చేయవు. కానీ ఎక్కడైన సరైన వివరణలు లేకపోతే, అక్కడ బ్రాహ్మణాలు రకరకాల పద్ధతులను ఉపయోగించి, మంత్రాలకు, కర్మలకు మధ్య గల బంధాన్ని వివరిస్తాయి. అందులో ఒక ముఖ్యమైన పద్ధతికి పేరు బంధూతం. అంటే రెండు, లేక అనేకమైన విషయాలను ఒక చోటికి చేర్చి, వాటి మధ్య సంబంధాన్ని ఏర్పరచడం.

ఉదాహరణకు సోమాన్ని యాగాన్ని తీసుకువచ్చే సమయంలో దాన్ని ఒక వస్త్రంలో కట్టి, వరుణుడి మంత్రాలను చదవాలని బ్రాహ్మణాలలో ఋషులు చెప్పారు. దానికి కారణం అలా సోమలతలను వస్త్రంలో కట్టినప్పుడు/బంధించినప్పుడు, ఆ బంధనానికి ఆధిపత్యం వరుణుడు వహిస్తాడు. ఆ సోమలతలపై అధికారం ఆ సమయంలో వరుణుడికి ఉంటుంది.

పండితుల అభిప్రాయం ప్రకారం బంధూతపద్ధతిని చాలా అరుదుగానూ, తార్కికంగానూ (logical) వాడుతారు. బంధూతపద్దతితో పాటు మంత్రాలు, కర్మల మధ్యనున్న సంబంధాన్ని ఏర్పరచడం కోసం వివరణలు, శబ్దవ్యుత్పత్తి, ఐతిహ్యాలను, కధలను వివరించారు.

B. అర్ధవాదం - ఇది వివరణాత్మకమైన భాగం. ఇంతకముందు భాగం విహితకర్మలు (చేయదగిన పనులు), నిషిద్ధకర్మలు (చేయకూడని పనులు) గురించి చెప్తే, ఈ భాగం విధులను (విహితకర్మలను) ప్రశంశిస్తూ, నిషిద్ధకర్మలను ఖండిస్తుంది. प्राशस्त्यनिन्दापरं वाक्यम् अर्थवाद:।

బ్రాహ్మణాలలో అర్దవాదం చాలా పెద్దది, ముఖ్యమైనది. అర్దవాదాన్ని విధిపుచ్చం అని కూడా ఉంటారు. పుచ్చం అంటే తోక. విధి తర్వాత వస్తుంది కనుక దీనికి ఈ పేరు. ఇది విధుల గురించి, వాటి నుంచి వచ్చే ఫలితాల గురించి, నిషిద్ధర్మలను ఆచరించడం వలన కలిగే అనర్ధాలను గురించి చెప్తూ, వాటికి కారణాలను కూడా వివిధ కధల రూపంలో వివరిస్తుంది. అర్ధవాదంలో చిన్న చిన్న ఇతిహాసాలు, పురాణాలు, కధలు, ఆఖ్యానాలు, సంభాషణలు చాలా చాలా కనిపిస్తాయి. ఇందులో చాలా భాగం గద్యరూపంలో చెప్పబడింది. ఈ అర్ధవాదం వైదిక కర్మలు చేయుటకు అవశ్యతకతను చెప్తూ, వాటి ఆచరణను బలపరుస్తుంది.

To be continued .......................

No comments:

Post a Comment