Friday 7 August 2015

మగ్గం మురిసేలా.. చేనేతకు దక్కిన గౌరవం

ఈరోజు అనగా 7, ఆగస్ట్  జాతీయ చేనేత దినం

మగ్గం మురిసేలా.. చేనేతకు దక్కిన గౌరవం

అగ్గిపెట్టెలో అమరిన ఆరు గజాల చీరలు నేసిన మగ్గం. ఆ మగ్గంపై విరిసిన పూల తరంగాలు. పురివిప్పి ఆడిన నెమళ్లు, విరగాసిన మామిడి పిందెలు. ఈ ఫ్యాషన్ ఏళ్లుగా కొనసాగుతోంది. నూలు బట్టల మెతకతనం, పట్టువస్ర్తాల మేళవం.. జలతారు చీరల సోయగం, దోతుల ఆర్భాటం.. ఆ సొగబు, సోయగం, సౌందర్యం.. అన్నింటినీ కలనేసిన హస్తకళా వైభవం వర్ణనాతీతం. చేనేతలోనే ఇమిడిన వారసత్వమిది.
మగువల అందానికి మరింత శోభనిచ్చే సంప్రదాయ పట్టు, నూలు వస్ర్తాలు భారత సంస్కృతికి చిహ్నాలు. సంప్రదాయ డిజైన్లను అద్భుతంగా తీర్చిదిద్దిన కళా వైభవం చేనేత కళాకారులదే, కార్మికులదే! ఆ కార్మికులూ వేడుక చేసుకునేందుకు జాతీయ చేనేత దినోత్సవం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు ఏడోతేదీన దేశ వ్యాప్తంగా చేనేత రంగ నిపుణులు, కళాకారులు, కార్మికులంతా వేడుకలు జరుపుకుంటున్నారు. శుక్రవారం చెన్నైలో జరిగే ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో వేడుకలను నిర్వహిస్తోంది. కానీ ఈ వేడుకల వెనుక 9 వసంతాల పోరాటం ఇమిడి ఉన్నది. ఒకరి ఆలోచనకు ప్రతిరూపంగా నిలిచిన ఈ రోజుకు మన తెలుగు నేలైన తెలంగాణ నుంచే ప్రస్థానం మొదలైంది. ఇక్కడ మొదలైన పోరాటం, వేడుకల స్ఫూర్తితోనే జాతీయస్థాయికి ఎదిగింది.

నాటి పోరాట ఘట్టం నుంచి ఆలోచన..
బ్రిటిష్ సామ్రాజ్యపు దురహంకారాన్ని ఎదిరించినందుకు చేతివేళ్లను నరికించుకోగలిగిన త్యాగనిరతి భారతీయులది. స్వాతంత్య్ర ఉద్యమంలో స్వదేశీ వస్తు వినియోగం ఓ ఆయుధంగా మారింది. అందులో భాగంగానే మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1905 ఆగస్టు ఏడోతేదీన అప్పటి కలకత్తాలో విదేశీ వస్ర్తాలను పెద్దఎత్తున దహనం చేశారు. నాటి స్ఫూర్తి దినాన్ని చేనేత దినోత్సవంగా జరుపుకోవాలని చేనేత ప్రోత్సాహక మండలి చైర్మన్ యర్రమాద వెంకన్ననేతకు వచ్చిన ఆలోచన 2006లో పురుడు పోసుకుంది. నాటి నుంచి ప్రచారంలోకి వచ్చింది. 2012లో విదేశీ వస్త్ర దహనానికి సంబంధించిన చారిత్రక ఘట్టాన్ని స్వదేశీయం పేరుతో రూపొందించి రవీంద్రభారతిలో ప్రదర్శించారు.

నాటి ప్రదర్శన దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. నాటి నుంచి అధికారికంగా నిర్వహించాలన్న పోరాటం ఉధృతమైంది. వెంకన్న నేతతో పాటు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తదితరుల ప్రయత్నాలు ఫలించాయి. ప్రధాని నరేంద్రమోడీ అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆలోచనకు రూపాన్నిచ్చిన వెంకన్ననేతను కేంద్ర ప్రభుత్వం చెన్నైకి ప్రత్యేకంగా ఆహ్వానించింది. అక్కడ సన్మానిస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే ఈ ఏడాది ఇవ్వనున్న సంత్ కబీర్, నేషనల్ అవార్డులను కూడా అందించనున్నారు.

అంతులేని వ్యధ నుంచి..
ముంబయిలో లక్మే ఫ్యాషన్ వీక్.. అందాలొలికే ముద్దుగుమ్మలు నయనతారకంగా క్యాట్ వాక్. మేనికి తగ్గట్లుగా రంగురంగుల వస్ర్తాలు కనువిందు చేస్తాయి. అవార్డుల పంపిణీ.. అందరి నోటా ఒక్కటేమాట.. అదే హ్యాండ్లూం ఫ్యాబ్రిక్ మంత్రమిది! ఫ్యాషన్ డిజైనర్లందరిదీ ఒక్కటే అభిప్రాయం. దాంతో లక్షలు, కోట్ల టర్నోవర్ వ్యాపారం వారి సొంతం. కానీ వారి ఆర్భాటం వెనుక, వ్యాపార సూత్రం ఎవరూ గుర్తించని కళాకారుల, కార్మికుల శ్రమ దాగి ఉన్నది. ఇక్కడ విజేతలు ఫ్యాషన్ డిజైనర్లు.

*రూ.వేలు.. రూ.లక్షలు విలువజేసే చీరలు, వస్ర్తాలు కొలువుదీరే కార్పొరేట్ షోరూములు ఉన్నాయి. దేశ విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. వారి రూ. వేల కోట్ల టర్నోవర్ వెనుక చేనేత కార్మికుల శ్రమ అనిర్వచనీయమైనది.

రోజంతా మగ్గం నేసినా రెండు పూటలా వేళ్లు నోట్లోకి వెళ్లని దుస్థితితో ఉన్న కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవంతోనైనా ప్రయోజనం కలుగుతుందని నిపుణులు, మాస్టర్ వీవర్లు, ప్రజాసంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

సేకరణ: http://namasthetelangaana.com/telangana-news/recognition-and-honor-given-to-the-handloom-1-1-447707.html

No comments:

Post a Comment