Saturday 27 February 2016

హిందూ ధర్మం - 196 (వేదంలో గోసంరక్షణ - 1)

గోవుకు, ఎద్దుకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకున్నాం కదా. అసలు నిజంగా వేదంలో గోవధ ఉందా లేదా అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

వెజిటెరీయనిజం (Vegetarianism)  అనేది ఈ రోజు ప్రపంచంలో బాగా ప్రజాదరణ పొందింది. భూతాపాన్ని నివారించటం కోసం, కాలుష్యాన్ని అరికట్టడం కోసం, సంపదల దుర్వినియోగాన్ని, అతివినియోగాన్ని తగ్గించటం, ఆరోగ్యం కోసం అందరూ వెజిటెరీయనిజం వైపు మళ్ళాలని ఐరాస (ఐక్య రాజ సమితి) సహా అనేక అంతర్జాతీయ సంస్థలు, అనేక దేశాల ప్రభుత్వాలు, పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమంగా ప్రచారం చేస్తున్నాయి. జంతువులకు కూడా మనుష్యుల వలే హక్కులుంటాయాని, వాటిని చంపడం నేరమని అనేకమంది జంతుప్రేమికులు వాదిస్తున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని వేదం కూడా చెప్పింది. వేదం శాఖాహారాన్నే తీసుకోమని చెప్పింది. ఒక జీవికి ప్రాణం పోయలేని మానవుడికి, ప్రాణం తీసే హక్కు లేదని వేదం చెప్పింది. అనాదికాలం నుంచి ఈ విషయాన్ని అనేక గురువులు నిరంతరం ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణ శ్రీ త్రైలింగ స్వామి వారు.

ఒకసారి ఉత్తరభారతదేశంలోని అడవులలో ఒక పులిని వేటాడటం కోసం కొందరు రాజభటులు వెంబడిస్తున్నారు. ఆ పులి తప్పించుకుని వెళ్ళి, అక్కడికి దగ్గర్లోనే మౌనంగా తపస్సు చేసుకుంటున్న గణపతి స్వామి వద్దకు వెళ్ళి, ఆయన ఒళ్ళో పిల్లిపిల్లలా భయంతో బిక్కుబిక్కుమంటూ చేరింది. అది చూసి ఆశ్చర్యంతో రాజభటులు నిశ్చేష్టులవ్వగా, అక్కడున్న గణపతి స్వామి ఆ భటులతో, 'ఒక జీవికి ప్రాణం పోయలేని మనకు ప్రాణం తీసే హక్కులేదు. ఏ జీవిని చంపరాదు. జీవులను చంపటం పాపం' అని వారికి ఉపదేశం చేస్తారు. అది విన్న ఆ రాజభటులు స్వామికి సాష్టాంగ ప్రణమిల్లి వెళ్ళిపోతారు. ఆ గణపతి స్వామి ఎవరో కాదు, 250 ఎళ్ళకు పైగా జీవించిన యోగి, సిద్ధపురుషులు, శ్రీ త్రైలింగ స్వామి వారు.

భౌద్ధం రాకముందు నుంచే 'అహింస' అనేది ధర్మంలో ముఖ్యమైన లక్షణంగా, వ్రతంగా చెప్పబడి ఉంది. వేరొక విధంగా చెప్పాలంటే వేదంలో ఉన్న అహింసావాదాన్నే భౌద్ధజైనాలు స్వీకరించాయి. కానీ వాటి వాదానికి, ధార్మిక వాదనకు కొంత వ్యత్యాసం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల, కొన్ని కుతంత్రాలను పారించడానికి మార్కిస్టు మేధావులు, అధర్మ ప్రచారకులు వేదంలో గోవధ ఉందని ప్రచారం చేస్తున్నారు.

ముందు ఒక విషయం గ్రహించాలి. వేదంలో గో అన్న మాట అనేక సందర్భాల్లో అనేక అర్దాలను కలిగి ఉంది. ఆవు, జలం, సూర్యకిరణాలు, విద్యావంతులు, వైదిక సూక్తాలు, భూమాత ........ వీటన్నిటికి గో అన్న శబ్దాన్నే వాడారు.

To be continued ................

No comments:

Post a Comment