Thursday 27 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (6)



గజముఖుడని, గజరాజనే నామాలు ఏనుగు ముఖం కలవాడగుటచేత వచ్చాయి. 

ఏనుగునకు చాలా బలం. అంత మాత్రంచే ఒక్క జంతువునూ బాధ పెట్టదు. బర్మా కేరళ ప్రాంతాలలో పెద్ద పెద్ద దుంగల్ని మోస్తుంది. అట్లాగే వినాయకుడు బలవంతుడే. ఇతడూ హాని చేయడు, మంచినే చేస్తాడు. అది బాగా తెలివైన జంతువు, దాని స్మరణ శక్తి కూడా గొప్పదే. అట్లాగే వినాయకుడుకి కూడా.

ఏనుగు ఏ పని చేసినా అందంతో తొణికిసలాడుతూ ఉంది. దాని నడకే అందంగా ఉంటుంది. అది తినే పద్ధతి, చెవుల నాడించడం, తుండాన్ని మధ్య మధ్యలో ఎత్తడం, - ఇట్లా ఏది చూసినా ముచ్చటగా ఉంటుంది. శాంతమైన ముఖం. చిన్న ఏనుగులు చూడ ముచ్చటగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే జంతువు ఏనుగు.


అట్లాగే చిన్న పిల్లవాణ్ణి తరచూ చూస్తూ ఉంటాం. ఎన్నిసార్లు చూసినా తృప్తి ఉండదు కదా! అట్లాగే ఏనుగుల లక్షణాలు, పిల్లవాని లక్షణాలు కలబోసిన మూర్తి మన స్వామి. పిల్లవాని అమాయక ప్రవృత్తి, మంచి మనస్సు, ఏనుగుకున్న బలం, బుద్ధి, అందం అన్నీ కలబోసిన మూర్తి మన స్వామి. 

కంఠం దిగువున నరరూపం. పైన జంతు రూపం. అట్టివాడు దేవతలందరికంటే ముందుగా పూజలందుకుంటున్నాడు.

ఈ నర జంతు రూపంలోనూ, విరుద్ధ రూపాలలోనూ అందం దాగియుంది. మంచి చెడులు కలబోసిన మూర్తి. విరుద్ధ గుణాలు సంగమించిన మూర్తి. ఒక చేత్తో మోదకం, మరొక చేతిలో విరిగిన దంతం. ఒక చేతిలో పూర్ణ స్వరూపమైన మోదకం ఒక చేతిలో అపూర్ణమైన దంతం. ఉండ్రాళ్ళని మోదకాలని అంటారు. అంటే సంతోషాన్ని కలిగించింది.

No comments:

Post a Comment