Tuesday 11 August 2020

ఏమి చేసైనా ధర్మాన్ని గెలిపించాలని మహాభారతంలో శ్రీ కృష్ణుడు బోధించలేదు

 


ధర్మాన్ని గెలిపించడానికి అధర్మంగా ప్రవర్తించినా ఫర్వాలేదు, ఏమి చేసైనా ధర్మాన్ని గెలిపించాలని మహాభారతంలో శ్రీ కృష్ణుడు బోధించాడని ఒకాయన అన్నారు. ఆయనే కాదు చాలామందికి అదే అభిప్రాయం ఉంది. 


కాని దయ చేసి ఆ అభిప్రాయాన్ని మార్చుకోండి. ధర్మాధర్మాలకు అతీతుడైనప్పటికి, ధర్మ స్వరూపునిగా చెప్పబడుతున్న భగవంతునికి అధర్మం బాట పట్టాల్సిన అవసరంలేదు. ఆయనే సాక్షాత్తు ధర్మస్వరూపుడు. సినిమాలు చూసి, లేదంటే ఎవరో ఎక్కడో చెప్పిన మాటలు విని, అవి నిజమనుకుని దాన్నే ప్రచారం చేస్తున్నారు కొందరు హిందువులు. ఇలా చెప్పినవారిలో ఏ ఒక్కరూ ఏనాడూ శ్రీ రామాయణం, మహాభారతం యొక్క సంస్కృత గ్రంథాలను చదివి ఉండరు. చదివినా సద్గురువు నోటి ద్వారా వాటిలోని ధర్మసూక్ష్మాలను విని ఉండరు. విన్నా అర్ధమై ఉండదు. అందుకే అలాంటి అభిప్రాయానికి వస్తున్నారు.


మహాభారతం విషయానికి వస్తే అందులో కొన్ని సందర్భాల్లో ధర్మం అధర్మంగానూ, అధర్మం ధర్మంగానూ కనిపిస్తుందని పెద్దలు వందల ఏళ్ళ క్రితమే చెప్పారు. ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో ధర్మం క్షణం నుంచి క్షణానికి మారిపోతూ ఉంటుంది. సాధారణ సమయంలో ధర్మంగా చెప్పబడేది అక్కడ అధర్మం కావచ్చు, నిత్యవ్యవహారంలో అధర్మంగా కనిపించేది అక్కడ ధర్మం (కర్తవ్యం) అయిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే మహాభారతాన్ని అర్ధం చేసుకునేందుకు సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. లక్ష శ్లోకాల మహాభారతాన్ని అర్ధం చేసుకునేందుకు అంతే పెద్ద సిద్ధాంత గ్రంథాలను విజ్ఞులైన మన పూర్వులు అందించారు. 


కనుక ఏ విధమైన అవగాహన లేకుండా శ్రీ కృష్ణుడు, శ్రీ రాముని మీద మన అభిప్రాయాలు చెప్పవద్దు. సర్వశక్తిమంతుడైన పరమాత్మకు ధర్మంసంస్థాపన కొరకు ధర్మం విడిచి అధర్మాన్ని ఆశ్రయించాల్సిన అఘత్యం పట్టదని గ్రహించండి. మహాభారతం, రామాయణ రహస్యాలు సొంతంగా చదివితే అర్ధమయ్యేవి కావు, అందుకోసం సద్గురువును ఆశ్రయించాలి, ఉపాసన, చిత్తశుద్ధి, సూక్ష్మబుద్ధి, ధర్మనిరతి, దైవభక్తి తప్పనిసరిగా ఉండాలి. అన్నిటికి మించి ఈశ్వరానుగ్రహం ఉండాలి. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు మానవాళికి మార్గదర్శనం చేయడానికి వచ్చారు, అటువంటి వారు ఎందుకు అధర్మంగా నడుస్తారు ? కనీసం ఈ చిన్న విషయం మీకు అర్ధమవ్వట్లేదా?


కనుక మిత్రులు గమనిస్తారని ప్రార్థన. 

No comments:

Post a Comment