Tuesday 13 February 2024

శ్రీ గరుడ పురాణము (89)

 


మానవుడు తన శరీరాన్ని రథంగానూ, ఆత్మను రథిగానూ ఊహించుకోవాలి. బుద్ధి సారథి, మనస్సు త్రాడు; ఇంద్రియాలు గుఱ్ఱాలు.


ఇంద్రియాలు, మనసు, ఆత్మలను కలిపి 'భోక్త' అనే మాటతో గుర్తించారు మనీషులు. ఇంద్రియాలను జ్ఞానసహాయంతో అదుపులో పెట్టుకొనేవారే పరమపదాన్ని చేరుకోగలరు. స్వర్ధుని (అజ్ఞాన ప్రవాహం)ని దాటి విష్ణువు లేదా పరబ్రహ్మనందుకోగలరు*.


(* 'శబ్దకల్పద్రుమంలో ఈ పదానికి' విగతంమానం ఉపమాయస్య' అనియూ 'విమాన ఏనేవ వైమానికః' అనియూ వ్యుత్పత్తులీయబడ్డాయి. అనగా నిరుపమేయుడు, ఉపమారహితుడు, సాటిలేనివాడు, మొత్తంగా సర్వోత్కృష్టుడు అని భావం.)


అహింసాది ధర్మాలూ, యమ శౌచాది కర్మ నియమాలూ ఈ పరమ యోగ సాధనానికి సోపానాలు. పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. ప్రాణాయామం చేయాలి. ప్రాణ, అపానాది వాయువులపై విజయాన్ని పొందడమే ప్రాణాయామమనబడుతుంది. ధారణ చేయాలి. మనస్సును నియంత్రితం చేసుకోవడమే ధారణమనబడుతుంది. సమాధిగతులు కావాలి.. మనస్సును బ్రహ్మపై లగ్నం చేయడమే కాక ఆయనలో కేంద్రీకృతం చేయాలి. ఇది సమాధి అనబడుతుంది. ఈ సమాధి కుదరకపోతే బ్రహ్మమూర్తి (ఆకారం)ని ఈ రకంగా ఊహించుకొని ప్రార్థించాలి.


హృదయకమల కర్ణికా మధ్యంలో వెలిగేవాడు, శంఖ, చక్ర, గదా, పద్మములచే సుశోభితుడు, శ్రీవత్స చిహ్నుడు, కౌస్తుభ, వనమాల, లక్ష్మీ (కళ)లచే అలంకృతుడు, నిత్య శుద్ధుడు, ఐశ్వర్య సంపన్నుడు, సత్య, పరమానంద స్వరూపుడు, ఆత్మ, జ్యోతి స్స్వరూపుడు, ఇరవై నాలుగు విభిన్న ఆకారాలలో అవతరించినవాడు, శాలగ్రామాలలో ద్వారకా శిలలలో నివసించేవాడు, పరమేశ్వరుడు అయిన పరమాత్మయే ధ్యాన యోగ్యుడు. బ్రహ్మ నేనూ బ్రహ్మనే. అహం బ్రహ్మాస్మి.


ఈ రకంగా సర్వయమనియమాలనూ పాటిస్తూ ఏకాగ్రచిత్తంతో యోగసాధనతో ధ్యానం చేసి పరమాత్మను తనలోనే చూడగలిగేవాడు కోరుకుంటే ఏదైనా దొరుకుతుంది. అతడు *వైమానిక దేవుడై పోతాడు. నిష్కాముడై ఈ బ్రహ్మమూర్తిని ధ్యానిస్తూ ముక్తినొందుతాడు. 


(అధ్యాయం -44)


* ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ |

బుద్ధించ సారథిం విద్ధి మనం ప్రగ్రహమేవచ ॥

................................

తద్విష్ణోః పరమం పదం ||


(ఆచార 44/6-9)


No comments:

Post a Comment