Sunday 18 February 2024

శ్రీ గరుడ పురాణము (94)

 


తరువాత దుర్ధర రేఖ మొదట్లో అగ్నికోణంపై 'నాయిక' నీ చివరల్లో కాళికాదేవినీ పూజించాలి. తరువాత ఇంద్రాది దిక్పాలకులను పూజించి ఇతర దేవతలందరినీ మరల పూజించిన పిమ్మటనే భవన నిర్మాణ కార్యాన్ని ప్రారంభించాలి.


భవనానికెదురు భాగంలో దేవాలయం, ఆగ్నేయంలో పాకశాల, తూర్పులో యజ్ఞ మండపం, ఈశాన్యంలో సుగంధ ద్రవ్యాలనూ, పూలనూ దాచుకొనే చోటు, ఉత్తరంలో భాండాగారం, వాయవ్యంలో గోశాల, పశ్చిమం వైపు కిటికీలూ, జలాశయం, నైరృత్య కోణంలో సమిధ, కుశ, ఇంధన, అస్త్ర శస్త్రాదులకు చోటు, దక్షిణం వైపు సుందరమైన శయ్య, ఆసనం, పాదుకలు, జల, అగ్ని, దీపములు, భృత్యులు, అతిథి గృహం వుండాలి.


ఇంటిమధ్యలో, అంటే నడివాకిట్లో గల ఖాళీ జాగా నిత్యం నీటితో చెమ్మగా వుండాలి. అందులో నొక నుయ్యి, అరటి చెట్టు, అయిదు రకాలు పూల చెట్లు వుండాలి. భవన బాహ్యభాగంలో నాలుగు వైపులా అయిదేసి హస్తాల పిట్టగోడలను కట్టి వీలైనంత ఎక్కువ స్థలంలో వన, ఉపవనాల మధ్య విష్ణుమందిరాన్ని నిర్మించాలి.


ఈ మందిర నిర్మాణ ప్రారంభంలో అరవై నాలుగు అడుగుల వాస్తు మండలాన్ని నిర్మింపజేసి అందులో వాస్తు దేవతను విధ్యుక్తంగా పూజించాలి. అందులో మధ్యభాగంలో నాలుగడగుల మేర బ్రహ్మనూ ఆయన సమీపంలో రెండడుగుల జాగాలో ప్రత్యేకంగా అర్యమాది ఎనమండుగురు దేవులను పూజించాలి.


తరువాత కర్ణ భాగంపై కార్తికేయాదులకు పూజను గావించి, రెండు వైపులా పార్శ్వ బిందువులపై రెండేసి అడుగుల దూరంలో అన్య పార్శ్వ దేవతలనూ అర్చించాలి. తరువాత వాస్తుమండల ఈశానాది కోణాలలో క్రమంగా చరకీ, విదారీ, పూతనా, పాపరాక్షసీ అను పేళ్ళు గల దేవశక్తులను పూజించాలి. పిమ్మట వెలుపలి భాగంలో హైతుకాది దేవతలను పూజించాలి. హేతుక, త్రిపురాంతక, అగ్ని, వైతాల, యమ, అగ్నిజిహ్వ, కాలక, కరాల, ఏకపాదులను దేవతలనే హైతుకాది దేవతలంటారు. ఆపై ఈశాన కోణంలో భీమరూప, పాతాళం వైపు ప్రేతనాయక, ఆకాశం వైపు గంధమాలి ఆపై క్షేత్ర పాల దేవతలకూ పూజ చేయాలి. పొడవును వెడల్పు చేత భాగిస్తే వచ్చే సంఖ్యని వాస్తురాశి అంటారు. ఎనిమది చేత వాస్తురాశిని భాగిస్తే వచ్చేది 'ఆయ'. ఎనిమిదితో దీన్ని గుణించి ఏడుతో భాగిస్తే వచ్చేది ఋక్షభాగం. దీనిని నాలుగు చేత గుణించి తొమ్మిదితో భాగిస్తే మిగిలేది 'వ్యయం'. దీనిని ఎనిమిదితో గుణిస్తే వచ్చేదాన్ని 'పిండ' అంటారు. దాన్ని అరవై చేత భాగిస్తే 'జీవ' మిగులుతుంది. శేషాన్ని 'మరణ'మంటారు.


No comments:

Post a Comment