Sunday 4 February 2024

శ్రీ గరుడ పురాణము (80)

 


రజస్తమోగుణాల వల్లనూ, అజ్ఞానం వల్లనూ, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలలోనూ మనం చేసుకున్న పాపాలూ, కాయిక, వాచిక, మానసిక పాపాలూ ఈ మంత్రాల వల్ల నశిస్తాయి.


కుడిచేతిలో నీటిని తీసుకొని దానిని ద్రుపదాం అనే మంత్రం ద్వారా అభిమంత్రితం చేసి తలపై పోసుకోవాలి. అఘమర్షణ మంత్రాలతో మూడు, ఆరు, ఎనిమిది లేదా పన్నెండు ఆవృతులను చేసి అఘమర్షణం చేసుకోవాలి. ఈ మంత్రాలేవనగా 

ఋతుంచ చాభీద్దాత్త పసోమఽధ్యజాయత । 

తతో రాత్ర్య జాయత | తతః సముద్రో 

అర్ణవః సముద్రాదర్ల వాదధి సంవత్సరో 

అజాయత। అహోరాత్రాణి విదధద్విశ్వస్య 

మిషతోవశీ | సూర్యచంద్ర మసౌధాతా 

యథాపూర్వమకల్పయత్ | దివంచ 

పృథివీం చాంతరిక్ష మథో స్వః ॥


(ఋగ్వేదం- 10/190/1)


వీటిని పఠించిన తరువాత చేతులను కడుక్కొని తుడుచుకొని మరల ఉదుత్యం, చిత్రమ్ అనే మంత్రాలను చదివి సూర్యోపస్థానం చేయాలి. దాని వల్ల దిన, రాత్రులలో చేసే పాపాలన్నీ నాశనమైపోతాయి.


ప్రాతఃకాలీనసంధ్యను నిలబడి వార్చాలి. ఇతర సంధ్యావందనాలను కూర్చుని చేయాలి. గాయత్రీమంత్రాన్ని పదిమార్లు జపిస్తే ఈ జన్మలో చేసిన పాపాలూ, వందమార్లు జపిస్తే పూర్వ జన్మపాపాలూ, వెయ్యిమార్లు జపిస్తే యుగంలో చేసిన పాపాలూ నశిస్తాయి.


(ఆచార 36/10)


గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే మూడు మహాశక్తులు ఈ మంత్రం ద్వారా లభిస్తాయి. అవి క్రమంగా పొద్దున్న రక్తవర్ణంలోనూ, మధ్యాహ్నం శుక్లవర్ణంలోనూ, సాయంత్రం కృష్ణ వర్ణంలోనూ వుంటాయని పెద్దలు చెప్తారు.


ఇక వ్యాహృతి పూర్వక అంగన్యాసం ఇలా చేయాలి. గాయత్రి మంత్ర ప్రథమ వ్యాహృతియైన భూః ను 'ఓం భూః హృదయాయ నమః అంటూ గుండెలోనూ, ద్వితీయ వ్యాహృతియైన భువః ను ఓం భువః శిరసే స్వాహా అంటూ తలపైనా, తృతీయ వ్యాహృతి స్వః ను ఓం స్వః శిఖాయైవషట్ అంటూ శిఖలోనూ న్యాసము చేయాలి.


No comments:

Post a Comment