Saturday 10 February 2024

శ్రీ గరుడ పురాణము (86)

 


విష్ణు పవిత్రారోపణ విధి


భోగ, మోక్షాలు రెండింటినీ ప్రసాదిస్తూ విజయాన్ని కూడా కలిగించేది విష్ణు పవిత్రారోపణ. ఒకప్పుడు దానవులతో పోరాడి పరాజితులైన దేవతలు బ్రహ్మతో సహా వచ్చి విష్ణువును శరణు వేడగా ఆయన(చెప్తున్నది విష్ణువే అయినా ఈ పురాణంలో నన్ను, నేను అనే పదాలను వాడకపోవడానికి కారణం సూతుడు శౌనకాదులకు వివరిస్తుండడం. సర్వనామాలు వాడితే అర్థం బోధపడకపోవచ్చు అను) వారి కడగండ్లను చూసి, విని కరిగిపోయి తన మెడలోని హారాన్నీ, పవిత్రయను పేరు గల గ్రీవాభరణాన్నీ, ఒక ధ్వజాన్నీ, వారికి ప్రసాదించి 'దానిని చూస్తూనే దానవులు ధైర్యాన్ని కోల్పోవాల'ని దీవించాడు. ఆ తరువాత దేవతలు ఘనవిజయాన్ని సాధించారు. అప్పటినుండి ఈ పవిత్రకాలను అందరూ పూజిస్తున్నారు.


సదాశివా! పాడ్యమి నుండి పున్నమ దాకా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవత పూజకు నిర్దేశింపబడింది. ఆయా దేవతలకు ఆయా తిథులలో పవిత్రారోపణ పూజను గావింపవలసి యుంటుంది. విష్ణువుకు ద్వాదశినాడు చేయాలి. వ్యతీపాతయోగ, ఉత్తరాయణ, దక్షిణాయన, చంద్ర సూర్యగ్రహణ, వివాహ, వృద్ధికార్య, గురుజన ఆగమన సందర్భాలలో కూడా ఈ పూజను చేయవచ్చును.


బ్రాహ్మణులకు పట్టుదారాలనూ, పత్తినీ, లతలనూ, క్షత్రియులకు పట్టునూ వైశ్యులకు క్షేమ, భోజపత్రదారాలనూ పవిత్రక నిర్మాణాలకై ఋషులు నిర్దేశించారు. పత్తి లేదా కమల నిర్మిత పవిత్రకాన్ని అన్ని వర్ణాల వారూ వాడవచ్చును.


ఈ పవిత్రక నవతంతువులలో ఓంకార, శివ, చంద్ర, అగ్ని, బ్రహ్మ, శేష, సూర్య, గణేశ, విష్ణు దేవతలుంటారు.


బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పవిత్రకంలోని మూడు సూత్రాలకుఅధిష్ఠాన దేవతలు. ఈ సూత్రాలను బంగారం, వెండి, రాగి, వెదురు లేదా మట్టిపాత్రలలో వుంచాలి. నూట యెనిమిది, యాభై ఒకటి, లేదా ఇరవై యేడు తంతువులతో పవిత్రకాన్ని నిర్మించవచ్చు.


No comments:

Post a Comment